Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Haryana communal tension: పథకం ప్రకారమే హర్యానా అల్లర్లు

Haryana communal tension: పథకం ప్రకారమే హర్యానా అల్లర్లు

ఢిల్లీకి బాగా దగ్గరగా హర్యానాలో ఉన్న గుర్గామ్‌, నూహ్‌, సోహ్నాలో మత కలహాలు

మణిపూర్‌ అల్లర్లు ఒకపక్క కొనసాగుతూనే ఉండగా, హర్యానా అల్లర్లు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దేశ రాజధానికి అతి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మత సంబంధమైన అల్లర్లు, కలహాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు హోంగార్డులు, నలుగురు ప్రాణాలు కోల్పోగా సుమారు 70 మంది గాయపడిఆస్పత్రుల పాలయ్యారు. ఢిల్లీకి బాగా దగ్గరగా హర్యానాలో ఉన్న గుర్గామ్‌, నూహ్‌, సోహ్నాలలో ఈ మత కలహాలు చోటు చేసుకున్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి ధ్వంసం అయింది. వందలాది మంది ఇళ్లూ వాకిళ్లూ ఆఫీసులూ వదిలి పారిపోయారు.జూలై 31న నూహ్‌లో హిందువుల ఊరేగింపుపై ముస్లింలు రాళ్లు రువ్వడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.నిజానికి, ఈ కలహాలు ప్రారంభం కావడానికి చాలా కాలం నుంచి ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నట్టు కనిపిస్తోంది.
నూహ్‌లో రెండు ఆలయాలకు సంబంధించి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల కోసం ఊరేగింపులు జరుగుతాయి. ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉండే నూహ్‌లో ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. సాధారణంగా ఇదొక స్థానిక వ్యవహారంగానే ముగిసిపోతుంటుంది. ఎప్పుడూ ఎటువంటి సంఘటనలూ జరగలేదు. అయితే, కొద్ది కాలంగా ఇక్కడ కొత్తరకం రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ముస్లింలు, హిందువులు ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం మొదలైంది. పైగా ఈ ఏడాది ఈ ఊరేగింపుల్లో పాల్గొనడానికి రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో కొద్దిగా ఉద్రిక్తత ఏర్పడింది. హిందూ భక్తులే కాకుండా, ముస్లింలు సైతం సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనిపించింది. ఇందులో కొందరు ఆయుధాలను కూడా తీసుకు రావడం, అనవసరంగా నినాదాలు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
అకస్మాత్తుగా ముస్లిం యువకులు కొందరు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో ఊరేగింపులు చెల్లాచెదరై, చాలామంది దగ్గరలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోలీసులు వచ్చే వరకూ ఆగి వారంతా బయటికి రావడం జరిగింది. ఈహఠాత్‌ పరిణామాలతో పాలనా యంత్రాంగం కూడా నిర్ఘాంతపోయింది. ఈ రెండు వర్గాల మధ్య రాళ్ల యుద్ధం ప్రారంభం కావడంతో పోలీసులు కల్పించుకుని 176 మందిని అరెస్టు చేసి, ఎఫ్‌.ఐ.ఆర్‌లు నమోదు చేయడంజరిగింది. ఈ కలహాలు, అల్లర్లు ఒక ప్రణాళిక ప్రకారం ప్రారంభం అయ్యాయని హర్యానా ముఖ్యమంత్రి ఎం.ఎల్‌. కట్టర్‌ వ్యాఖ్యానించారు. బహుశా ఇది నిజమే కావచ్చు. చాలా కాలంగా ఈ ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. హిందువుల నాయకులు, ముస్లింల నాయకులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో వీడియోలను పెట్టడం జరుగుతోంది. ఈ ఏడాది జరగబోయే ఊరేగింపుల విషయంపై కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఇద్దరు ముస్లిం యువకులు కిడ్నాప్‌ చేసి, హత్య చేయడం గురించిన ప్రస్తావన కూడా ఈ వీడియోల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ కిడ్నాప్‌నకు ప్రధాన కారకుడైన వ్యక్తి కూడా బెదరింపులకు పాల్పడడంపై ముస్లిం యువకులు రెచ్చిపోవడం జరిగింది. ఇక్కడి ముస్లిం జనాభాలో దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమయింది. ఇరు వర్గాలు హింసా విధ్వంసకాండలకు పాల్పడే ప్రమాదం ఉందంటూ స్థానిక సామాజిక, రాజకీయ నాయకులు జిల్లా అధికారులను, పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. ఊరేగింపులు జరగడానికి ముందు రోజు కూడా బజరంగ్‌ దళ్‌ నాయకుడు, ఓ ముస్లింనాయకుడు రెచ్చగొట్టే విధంగా సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టడం ఆందోళన కలిగించింది. తాము వస్తున్నామని, సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం కూడా జరిగింది.
చివరికి అన్నంత పనీ జరిగింది. నూహ్‌ ప్రాంతంలో ఊరేగింపులపై ముస్లింలు రాళ్లు విసరడం ప్రారంభం అయిన తర్వాత, ఈ అల్లర్లు గుర్గామ్‌ ప్రాంతానికికూడా వ్యాపించాయి. గుర్గామ్‌లో ఒక మసీదును విధ్వంసం చేయడం జరిగింది. ఓ అర్ధరాత్రి ఓ ఇమామ్‌ మీద దాడిచేసి హత్య చేయడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ఒక దేవాలయం మీద దాడిచేసి దాన్ని ధ్వంసం చేశారు. ఒక ఉద్యోగిని తీవ్రంగా కొట్టారు. ఈ ప్రాంతంలో అల్లరి మూకల సంఖ్య కంటే పోలీసుల సంఖ్య బాగా తక్కువగా ఉండడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఈ రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూండ గానే ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం మొదలైంది.
ఇరు వర్గాలు రాజకీయ విమర్శలకు దిగాయి. స్థానిక రాజకీయ నాయకులు కల్పించుకుని, ఈ అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించవలసింది పోయి, పాలక బీజేపీ కారణంగానే హిందువుల రెచ్చిపోయినట్టు ప్రతిపక్షాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. సాధారణంగా ఎవరు లేదా ఏ పార్టీ ఇటువంటి కలహాలను రెచ్చగొట్టినప్పటికీ, వీటికి కారణం అయినప్పటికీ అవి క్రమంగా తెరవెనుకకు వెళ్లి పాలక పక్షం మీద నింద వేయడం దేశంలో పరిపాటి. మణిపూర్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా అదే వ్యవహారం ప్రారంభం అయింది. ఆశించిన ప్రయోజనం నెరవేరగానే స్థానికపార్టీలు, ప్రతిపక్ష నాయకులు ఈ నిందను పాలక పక్షం మీద వేయడం జరిగింది. ఈ సమస్యకు ఎవరు ఏ విధంగా కారణం అయినప్ప టికీ, అల్లర్లను, ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీదా ప్రతి పార్టీ మీదా ఉందనడంలో సందేహంలేదు. హర్యానా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ అల్లర్లను అణచి వేయడమే కాకుండా, ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాల్సి ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News