దాదాపు అన్ని పత్రికల్లోనూ వచ్చే కొన్ని వార్తలు చూడండి:
“ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో, బ్రిక్స్ కూటమి దేశాల మధ్య దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల (478 లక్షల రూపాయల) వర్తకం జరిగింది”/“పాకిస్తానుకు 8 చైనా జలాంతర్గాములు”/“రష్యా సాయంతో ఇరాన్లో 8 అణు విద్యుత్ ప్లాంట్లు”/“దక్షిణ వజీరుస్తాన్లోని పాకిస్తాన్ రాగి గనుల నించీ 22 వేల టన్నుల రాగి చైనాకు”/“ఒప్పందం ప్రకారం, అమెరికా నించీ 41 లక్షల, 50 వేల కోట్ల రూపాయల విలువగలిగిన సరుకులు భారత్ కొనాలి!”
ఇవి సినిమా వార్తల్లాగానో, క్రికెట్ పోటీల వార్తల్లాగానో, అందరికీ అర్ధం కావు. కానీ, వాటి గురించి తెలుసుకోవడం ప్రజలకు చాలా అవసరం. ప్రజలంటే, శారీరక శ్రమలో, మేధా శ్రమలో చేసుకుంటూ, ‘జీతం’ వంటి మితిమీరని ఆదాయాల మీద బ్రతికేవాళ్ళు. ఏ రకమైన శ్రమలూ చేయకుండానే, లాభాలూ, కౌళ్ళూ, వడ్డీలూ, కమిషన్లూ వంటి దోపిడీ ఆదాయాల మీద బ్రతికేవాళ్ళు ప్రజలు కాదు. అలాగే, ప్రజలన్న ప్పుడు భారత దేశంలోని ప్రజలే కాదు, అన్ని దేశాల ప్రజలూ కూడా! వాళ్ళందరినీ కలిపివుంచే ఏకైక లక్షణం ‘శ్రమలు’ చెయ్యడం! అంటే, ఇతరుల శ్రమల్ని దోచకపోవడం!
ఇక, ఈ వ్యాసం ప్రారంభంలో ఇచ్చిన వర్తక ఒప్పందాల్నీ, లావాదేవీల్నీ సరిగా అర్ధం చేసుకోవాలంటే, పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానం గురించి మార్క్సు రాసిన ‘పెట్టుబడి’ అనే పరిశోధనా గ్రంధం దగ్గిరికి వెళ్ళవలిసిందే. ‘పెట్టుబడి’ పుస్త కంలో, మొదటి సంపుటంలో, ‘సరు కులూ, డబ్బూ’ అనే మొదటి భాగంలో, ‘సరుకులు’ అనే మొదటి చాప్టరులో, మొట్టమొదటి వాక్యం ఇలా ఉంటుంది: “పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రబలంగా వున్న సమా జాలలో, సంపద అనేది, అతి పెద్ద సరుకుల కుప్పల రూపంలో కనిపిస్తుంది” -అని! ఇప్పుడున్న ప్రపంచంలో, తరతమ భేదాలతో ఉన్నవి పెట్టుబడిదారీ దేశాలే! కొన్ని దేశాలలో పెట్టుబడిదారీ విధానం పెద్ద స్తాయిలో వుంటే, కొన్ని దేశాలలో మధ్య స్తాయిలోనూ, కొన్ని దేశాలలో కొంచెం తక్కువ స్తాయిలోనూ వుంది.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పుట్టుకతోనే ఉన్న లక్షణం ఏమిటంటే, అది తయారు చేయించే సరుకుల అమ్మకానికి కావలిసిన మార్కెట్టు, ఎప్పటికప్పుడు విస్తరిస్తూ పోవాలి. అందుకే, ముందు దేశంలో అమ్మకాలు ప్రారంభించి, పోనుపోనూ, దేశ సరిహద్దుల్ని దాటి, విదేశాల్లో కూడా, తన సరుకుల్ని అమ్ముకునే స్తాయికి చేరడం పెట్టుబడి దారీ దేశాల లక్షణం.
విదేశీ వర్తకంలో, దేశాల మధ్య సరుకుల వర్తకం సమానంగా జరగదు. దీనిని ‘అసమాన మారకం’ అంటారు. ఆ అసమాన మారకానికి కారణం: పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం బాగా అభివృద్ధి చెందిన దేశాల సరుకులకీ, అంతగా అభివృద్ధి చెందని దేశాల సరుకులకూ మధ్య విలువల్లో తేడాలుండడం. ఎలాగంటే, రెండు రకాల దేశాలలోనూ సరుకులు తయారు కావడానికి పెట్టుబడి కావాలి గదా? పెట్టుబడి అనేది రెండు భాగాలుగా వుంటుంది. ఒకటి: సరుకుల్ని ఉత్పత్తి చెయ్యడానికి కావలిసిన సాధనాల మీద (ఉదా. తక్కువ మంది కార్మికులతో, తక్కువ సమయంలో, ఎక్కువ సరుకుల్ని తయారుచేయడానికి వీలునిచ్చే భారీ యంత్రాలూ, ఆటోమేటిక్ యంత్రాలూ, ముడి పదార్ధాలూ వగైరాల మీద) పెట్టే పెట్టుబడి. ఇది ‘స్తిర’ పెట్టుబడి. ఇంకోటి: ఆ యంత్రాలను ఉపయోగించి శ్రమలు చేసే కార్మికుల జీతాల కోసం పెట్టే పెట్టుబడి. ఇది ‘అస్తిర’ పెట్టుబడి. ‘స్తిర’ అనీ, ‘అస్తిర’ అనీ ఎందుకు అంటామూ అంటే: యంత్రాలమీద పెట్టిన పెట్టుబడి విలువ ఎంత అయితే అంతే తిరిగి వస్తుందేగానీ, అది పెరగదు, మారదు. ఎందుకంటే, అవి కార్మికుల చేతుల్లో పనిముట్లు మాత్రమే గనక! అందుకే అది ‘స్తిర’. అలాగే, కార్మికులకు జీతాల కోసమని పెట్టే పెట్టుబడిని ‘అస్తిర’ అని అనడానికి కారణం: ఉత్పత్తి సాధనాలను చేతుల్లోకి తీసుకుని పనిచేసే కార్మికులు, సజీవమైన వ్యక్తులు. వారు, జీతాలుగా తాము పొందే విలువ కన్నా ఎక్కువ విలువని తయారు చేస్తారు. అంటే, జీతాల కోసం పెట్టిన పెట్టుబడి విలువ, అంతే విలువగా కాకుండా ఎక్కువ విలువగా అవుతుంది కాబట్టి, అది ‘అస్తిర’ పెట్టుబడి. జీతాలకంటే ఎక్కువ విలువని కార్మికులు తయారు చేస్తారూ-అనే విషయం, సరుకులు అమ్మగా వచ్చే డబ్బుని బట్టి తెలుస్తుంది. ఉదాహరణకి, సాధనాల మీద 80 లక్షలు పెట్టి, కార్మికుల జీతాల కోసం 20 లక్షలు పెట్టి తయారు చేయించిన సరుకుల్ని అమ్మగా, కోటీ, 20 లక్షలు వచ్చాయంటే అర్ధం, కార్మికులు జీతాలుగా తీసుకున్న విలువ కంటే, దానికి రెట్టింపు విలువ గల అదనపు శ్రమలు చేసి సరుకుల్ని తయారు చేసిపెట్టారన్న మాట! అంటే, తీవ్రమైన శ్రమ దోపిడీకి గురయ్యారని అర్ధం! ఇలా శ్రమ దోపిడీకి గురయ్యేది ఏదో ఒక్క దేశపు శ్రామికులే కాదు. అన్ని దేశాల శ్రామికులూ కూడా! ఆ దోపిడీ సొమ్మును పంచుకునేది, ప్రపంచ దేశాలలోని పెట్టుబడిదారులు. ఈ విషయాన్ని శ్రామికులు తెలుసుకో వాలనే ఉద్దేశంతో, మార్క్సూ వాళ్ళూ ఇచ్చిన నినాదం: ‘సకల దేశాల కార్మికులారా ఏకం కండి!’ అని.
బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వున్న దేశాలలో, స్తిర చాలా ఎక్కువగానూ, అస్తిర చాలా తక్కువగానూ, వుంటాయి. అభివృద్ధి చెందని పెట్టుబడిదారీ దేశాలలోనేమో, స్తిర తక్కువగానూ, అస్తిర చాలా ఎక్కువగానూ వుంటాయి. స్తిర ఎక్కువగా వున్న చోట, తక్కువమంది కార్మికులు, అతి తక్కువ సమయంలో, చాలా ఎక్కువ సంఖ్యలో సరుకుల్ని తయారు చేస్తారు. అలా ఎక్కువ సరుకులు తయారైనప్పుడు, ఒక్కొక్క సరుకునీ చూస్తే, గతం కంటే తక్కువ విలువని కలిగివుంటాయి. అదే, స్తిర తక్కువగా వున్న చోట, ఎక్కువమంది కార్మికులు, ఎక్కువ సమయంలో, తక్కువ సంఖ్యలో సరుకుల్ని తయారు చేస్తారు. దాని వల్ల, ఒక్కొక్క సరుకు విలువా ఎక్కువగా వుంటుంది. అలాంటప్పుడు, స్తిర ఎక్కువగా వున్న దేశాల వర్తకులు, తక్కువ ధరలకే తమ సరుకుల్ని అమ్మగలగడంతో, స్తిర తక్కువగా వున్న దేశాల వర్తకులు ఆ పోటీకి తట్టుకోలేరు. ఎక్కువ విలువ వున్న తమ సరుకుల్ని, తక్కువ ధరలకే అమ్ముకోవల్సివస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో, దేశాల మధ్య జరిగే సరుకుల అమ్మకాలన్నీ అసమాన మారకాలుగానే వుంటాయి.
అయినా, దేశాధినేతలు తాము ఎంతో తెలివితో, వర్తక ఒప్పందాలు చేసుకున్నామని, తమ దేశాల ప్రజలకు చెపుతూ వుంటారు. ఉదాహ రణకి, అమెరికా అధ్యక్షుడు ట్రంపు, భారత దేశం మీద, ముందు పెంచిన పన్నుల్ని తగ్గించగానే, భారత ప్రధాని అన్నదేమిటీ? ‘ఇది మన దౌత్య నీతికి విజయం. అమెరికా దిగుమతి సుంకాల్ని పెంచినా, మనం తొందర పడకుండా ఓపిక పట్టడం వల్లనే, ఆ సుంకాలు తగ్గాయి” అని ప్రధాని ఆనందం! అటు, అమెరికా అధ్యక్షుడేమో, ‘ఇక ముందు, ఇండియా రష్యా నించీ చమురు కొనడం మానేసి, మన దగ్గిరా, ఇటీవల మన పెత్తనం కిందకి వచ్చిన వెనుజువెలా దగ్గిరా, చమురు కొంటుంది. పైగా, 500 బిలియన్ డాలర్ల విలువ గలిగిన అనేక రకాల సరుకుల్ని మన దగ్గిరనించీ ఇండియా కొనడానికి ఒప్పుకుంది. అది కూడా మన సరుకుల మీద దిగుమతి సుంకాలు లేకుండా!’ అని అతడి ఆనందం! ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసినది ఏమిటీ? రెండు దేశాల పెట్టుబడిదారుల సరుకుల అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్ని చక్కబెట్టడమే! అందుకే, 175 ఏళ్ళ కిందటే, మార్క్సూ, ఎంగెల్సూ అనే ఇద్దరు 30 ఏళ్ళలోపు యువ కులు, అనేక దేశాల కమ్యూనిస్టులతో కలిసి తయారు చేసిన ‘కమ్యూ నిస్టు పార్టీ ప్రణాళిక’లో, “ఆధునిక రాజ్యంలో, ప్రభుత్వం అనేది, పెట్టు బడిదారీ వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే కమిటీ మాత్రమే” -అన్నారు. వాళ్ళనించీ, నేర్చుకున్న ఒక అమెరికా దేశపు ప్రొఫెసరు-మైకేల్ పెరంటీ-‘అమెరికా అధ్యక్షుడు అనేవాడు ఒక సేల్స్ మన్’ అన్నాడు.
‘దౌత్యం’ పేరుతో, ప్రపంచం అంతటా ఇప్పుడు జరుగుతున్నది సరుకుల అమ్మకాల ప్రహసనాలే! సరైన వర్గ చైతన్యం లేని ప్రజలు, వాళ్ళు పెద్ద చదువులు చదివినవారైనా, తమ దేశపు అధినేతల్ని చూసి, మన ప్రధాని లేదా మన దేశ అధ్యక్షుడు ఎంతటి కార్యశూరుడో అని అమాయకంగా మురిసిపోతారు. తీరా చూస్తే, వీళ్ళు చేసేపని, తమ దేశపు పెట్టుబడిదారుల సరుకుల సేల్స్ మేనేజర్లుగా పనిచేయడం!
బి.ఆర్.బాపూజీ

