Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Heavy rains: వాతావరణంపై మరింత అధ్యయనం

Heavy rains: వాతావరణంపై మరింత అధ్యయనం

504 శాతం ఎక్కువ వర్షాలు

తమిళనాడు రాష్ట్రానికి ఈశాన్య రుతుపవనాలు ప్రధాన జీవనాధారం. కానీ, ఈసారి ఆ రుతుపవనాలు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఇవి తమిళనాడు ప్రజల తీరని వ్యధను మిగల్చాయి. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు దారుణమైన వరద భీభత్సాన్ని సృష్టించాయి. అవసరమైన వర్షం కన్నా వంద రెట్లు పైగా వర్షాలు పడి, పంట పొలాలన్నీ కొట్టుకుపోయాయి. తిరునల్వేలి జిల్లాలో 504 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా, దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తూత్తుకుడి జిల్లాలో కూడా ఒక్క డిసెంబర్‌ నెలలోనే 454 శాతాన్ని మించిన వర్షాలు పడడం జరిగింది. మొత్తం వర్ష రుతువులో పడాల్సిన వర్షమంతా ఒక్క 24 గంటల్లో పడిపోవడంతో అక్కడి ప్రజలు దుస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇంత వర్షం పడడం అనేది గత వందేళ్ల కాలంలో తమిళనాడులో ఏనాడూ జరగలేదు.
గత వర్షాకాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటువంటి వర్షపాతమే నమోదయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఈసారి వర్షాలు భీభత్సాలను సృష్టించి వెళ్లాయి. పంట నష్టం, ప్రాణ నష్టాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను ఇవి అతలాకుతలం చేశాయి. 2019లో వాతావరణ సంబంధమైన భీభత్సాల కారణంగా దేశానికి 6900 కోట్ల డాలర్ల నష్టం సంభవించినట్టు రిజర్వు బ్యాంకు ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. ఒక్క తమిళనాడులోనే వరదలు, తుపాన్ల కారణంగా 21,692 కోట్ల రూపాయల నష్టం సంభవించడాన్ని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటనలను పరిశీలించిన తర్వాత నిపుణుల ఏకాభిప్రాయం ఏమిటంటే, దేశం వాతావరణ ఫలితాలను, పరిణామాలను మరింత ముందుగా, మరింత సరిగ్గా చెప్పగల పరికరాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
దేశ భౌగోళిక పరిస్థితిని, జనాభా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దేశం డాప్లర్‌ వెదర్‌ రాడార్ల (డి.డబ్ల్యు.ఆర్‌)ను తప్పనిసరిగా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి స్థానికంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఎటువంటి తేడా లేకుండా సరిగ్గా ముందుగానే వెల్లడించగలుగుతాయి. వర్షాలు రావడానికి ముందే ఇవి సరైన వాతావరణ హెచ్చరికలు చేసి, పంట పొలాలను కాపాడుకోవడానికి, ప్రాణాలను రక్షించుకోవడానికి, నష్టాల తగ్గడానికి చాలావరకు సహాయపడతాయి. ఏటా 1200లకు తగ్గకుండా టార్నెడోలు సంభవిస్తూ, కోట్లాది డాలర్ల మేరకు ఆస్తిపాస్తులు నష్టపోతున్న అమెరికా దాదాపు 148 డాప్లర్‌ వెదర్‌ రాడార్లను సమకూర్చుకుని, ఈ కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడగలిగింది. భారతదేశం కూడా 39 డాప్లర్‌ వెదర్‌ రాడార్లను ఏర్పాటు చేసుకోగలిగింది. పదేళ్ల కిందట భారతదేశం వద్ద 15 రాడార్లు కూడా ఉండేవి కావు. ఈ విషయంలో భారతదేశం కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది కానీ, అమెరికా కంటే ఎక్కువగా వీటిని సేకరించుకోలేని పక్షంలో ఇక్కడి నష్టం భారీగానే ఉండే ప్రమాదం ఉంది. 2025 నాటికి 60 రాడార్లను ఏర్పాటు చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది.
గతంలో భారతదేశం చైనా నుంచి ఈ రాడార్లను కొనుగోలు చేస్తుండేది. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల నుంచి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనివల్ల సమయం వృథా కావడం జరుగుతోంది. ఇందుకు బదులు దేశీయంగానే వీటిని ఉత్పత్తి చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించడం మంచిది. దేశీయంగానే ఉత్పత్తి ప్రారంభించాలన్న పక్షంలో దీనికి ప్రైవేట్‌ పెట్టుబడులు కూడా అవసరమవుతాయి. కాగా, కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు మాత్రమే విదేశాల నుంచి ఇందుకు సంబంధించిన పరికరాలను దిగుమతి చేసుకో గల స్థితిలో ఉన్నాయి. కొన్ని పరికరాలను తప్పని సరిగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ శాఖ, అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇందుకు నడుంబిగించాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా, వాతావరణ అధ్యయనాలు, ఫలితాల వెల్లడి, హెచ్చరికల విషయంలో భారతదేశం అగ్రగామిగా మారబోతోందంటూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది జరగాలన్న పక్షంలో భారతదేశం అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడగలిగిన స్థాయిలో దేశీయంగా రాడార్ల ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News