పార్టీలోని సీనియర్ నాయకులే కాదు, మేధావులు సైతం మార్క్సిస్టు పార్టీ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే కాకుండా ఇప్పటికీ దేశానికి అవసరమైన మార్క్సిస్టు పార్టీ దేశ కాలపరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికైనా మారకపోవడం వారిని తీవ్రస్థాయి ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ జాతీయ
స్థాయి సభ్యత్వం, వ్యాప్తి కలిగిన ఈ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండడం, ఎన్నికలు దగ్గర పడుతున్నా నిబ్బరంగా ఉండడం మేధావులను, సామాన్య ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. ఎం.టి. నాయర్ వంటి మేధావులు గళం ఎత్తుతున్నా ఎవరికీ పట్టడం లేదు. సాధారణంగా ఎం.టి. వాసుదేవ నాయర్ అనవసర విషయాలు మాట్లాడరు. ఎంతో అవసరమైతే తప్ప పెదవి విప్పరు. అయితే, తన
అభిప్రాయాలు చెప్పదలచుకుంటే మాత్రం ఆయన ధాటిని తట్టుకోవడం చాలా కష్టం. నిక్కచ్చిగా, నిష్కర్షగా, నిర్మొహమాటంగా మనసులోని మాటలు చెప్పేస్తారు. గత గురువారం కేరళలోని కోళికోడ్ పట్టణంలో వామపక్షాల సాహిత్య సమావేశం ఒకటి జరిగినప్పుడు ఈ వామపక్షవాది ఏ మాటా దాచుకోలేదు. సాధారణంగా ఆశువుగా మాట్లాడే ఈ జ్ఞానపీఠ విజేత ఈసారి మాత్రం లిఖిత ప్రసంగాన్నే చదవడం ప్రారంభించారు. దేశంలో ఇతర పార్టీలన్నిటిలో మాదిరిగానే వామపక్షాలలో కూడా నాయకత్వ ఆరాధన, వ్యక్తిపూజ పేట్రేగిపోతున్నాయని, సామాజిక, రాజకీయ రంగాలలో ఆధిపత్య ధోరణి హద్దులు దాటిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాలలో రాజకీయ నియంతృత్వం పెరిగిపోతోందంటూ ఆయన సోదాహరణంగా విమర్శలు సాగిస్తున్నప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా అదే వేదిక మీద ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు.
వాసుదేవన్ నాయర్ కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ గొప్పతనం గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఆయనతో ప్రస్తుత ముఖ్యమంత్రులకు పోలిక కూడా తీసుకువచ్చారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోలిక తీసుకువస్తున్నారో అందరికీ అర్థమైపోయింది. నంబూద్రిపాద్ ఎటువంటి రాజకీయ భజనల్లోనూ, ఆరాధనల్లోనూ పాల్గొనలేదని, ఆయన ఉన్నంత వరకూ పార్టీలో
వ్యక్తిపూజ అనేదే కనిపించలేదని నాయర్ అన్నారు. కొందరు అధికారంలోనూ, మరికొందరు పాలితులుగానూ కొనసాగడమనేది వామపక్ష భావజాలంలో లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. నాయర్ చేస్తున్న వ్యాఖ్యానాలు విజయన్ ను ఉద్దేశించి చేస్తున్నవేనన్న విషయం అందరికీ పూర్తిగా అర్థమైపోయింది.
కేరళలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నాయర్ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. అనేక సందర్భాలలో విజయన్ అహంకారం, ఆధిపత్య ధోరణి ప్రస్ఫుటమవుతూనే ఉన్నాయి. ఆయన పాలనా వ్యవహారాల్లో కూడా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇటీవలి కాలంలో ఆయన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యక్తి ఆరాధనను బాగా ప్రోత్సహిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఒక సభలో ఒక మంత్రి ఆయనను ఏకంగా దేవుడిచ్చిన వరంగా అభివర్ణించగా, మరొక సి.పి.ఎం నాయకుడు ఆయనను సూర్యభగవానుడితో పోల్చారు.
ఇటీవల కేరళలో సి.పి.ఎం తిరువతిరక్కళి పేరుతో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్నినిర్వహించింది. ఈ కార్యక్రమంలో మొత్తం మీద 502 మంది నృత్యకారిణులు పాల్గొన్నారు. వారంతా కొన్ని పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేయడం జరిగింది. ఆ పాటలన్నీ విజయన్ ను కీర్తిస్తూ రాసినవే. ఆ కార్యక్రమానికి విజయన్ కూడా హాజరయ్యారు. ఒకప్పుడు సి.పి.ఎం నాయకత్వం ఇటువంటి వ్యక్తి ఆరాధనను ఏ మాత్రం ప్రోత్సహించేది కాదు. పార్టీ కంటే ఎక్కువ అనే భావం పార్టీ ఆదర్శాలకు, సిద్ధాంతాలకు ఏమాత్రం సరిపడవని గట్టిగా మందలించడం జరిగేది. అదంతా గత చరిత్ర. ఇప్పుడు దాదాపు ఇతర పార్టీలతో సమానంగా వామపక్షాల్లో కూడా వ్యక్తి ఆరాధన బాగా పెరిగిపోయింది. పార్టీలో కొందరు నాయకులను ఆకాశానికి ఎత్తేయడం ఏ కొందరు నాయకులకో, కార్యకర్తలకో, సభ్యులకో పరిమితం కాలేదు. దాదాపు ప్రతి సీనియర్ నాయకుడు, మంత్రి కూడా ఇందులో భాగస్వాములే. ఇతర పార్టీలతో సమానంగా వామపక్షాల్లో, అందులోనూ మార్క్సిస్టు పార్టీలో కొన్ని పార్టీ వ్యతిరేక ధోరణులు పెరిగిపోతుండడాన్ని ఇప్పటికైనా తుంచివేయడం పార్టీ మనుగడకు అత్యంత అవసరమని ఆయన హెచ్చరించారు. పార్లమెంటులో సభ్యుడు కావడం లేదా శాసనసభలో సభ్యుడు కావడం అనేది ఆధిపత్యం కోసం కాదనే విషయాన్ని ప్రతి నాయకుడూ అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ, సిద్ధాంత వ్యతిరేక ధోరణులను ఎంతో కాలంగా గమనిస్తున్న వాసుదేవన్ నాయర్ చాలాకాలం తర్వాత మొదటి సారిగా నోరు విప్పారు. ఆయన మాటలు పార్టీలో ఏ కొద్ది మార్పు తీసుకువచ్చినా, ఆత్మ విమర్శకు, అంతర్మథనానికి అవకాశం కల్పించినా నాయర్ మాటలకు విలువ ఇచ్చినట్టు అర్థమవుతుంది. నాయర్ మళ్లీ ఇప్పట్లో మాట్లాడకపోవచ్చు.