Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Hijab: ఇరానీ మ‌హిళ‌ల‌కు హిజాబ్ సంకెళ్లు

Hijab: ఇరానీ మ‌హిళ‌ల‌కు హిజాబ్ సంకెళ్లు

టార్చర్ పెట్టే మోరల్ పోలీసింగ్

చ‌మురు స‌మృద్ధిగా ఉత్ప‌త్తి చేస్తూ, అపార సంప‌ద‌ను పోగేసుకుంటున్న దేశాల్లో ఇరాన్ ఒక‌టి. కానీ అక్క‌డ ఇప్ప‌టికీ ఛాంద‌స‌వాద పాల‌న కొన‌సాగుతోంది. యువ‌తులు, మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా హిజాబ్ (బుర‌ఖా లాంటి ముసుగు) ధ‌రించాల‌న్న నిబంధ‌న‌ను గ‌తంలో కొంత‌కాలం కాస్త స‌డ‌లించినా.. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లుపెడుతున్నారు అక్క‌డి పాల‌కులు. హిజాబ్ ధ‌రించ‌కుండా మ‌హిళ‌లు ఎవ‌రైనా ఉద్యోగాల‌కు వెళ్తే అక్క‌డి య‌జ‌మానులకు సైతం భారీగా జ‌రిమానాలు విధిస్తామ‌ని చెబుతున్నారు. ఎవ‌రైనా మ‌హిళ‌లు, యువ‌తులు తాము హిజాబ్ ఎందుకు ధ‌రించాల‌ని ఎదురు ప్ర‌శ్నిస్తే, వాళ్ల‌ను మాన‌సిక వైద్య‌శాల‌ల‌కు పంప‌డం, దానికితోడు దీర్ఘ‌కాలం పాటు జైలుశిక్ష‌లు విధించ‌డం లాంటి క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 1979లో ఇరాన్‌లో విప్ల‌వం వ‌చ్చి, పాల‌నాప‌గ్గాలు మారిన నాలుగేళ్ల‌కు.. అంటే 1983లో హిజాబ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఇరాన్‌లో ఓ చట్టం వ‌చ్చింది. 2013లో హ‌స‌న్ రొహానీ అధ్య‌క్షుడైన త‌ర్వాత దుస్తుల విష‌యంలో కొంత వెసులుబాటు ఇచ్చారు. అప్ప‌టినుంచే ఇరానీ మ‌హిళ‌లు బిగుతు జీన్స్, వ‌దులుగా ఉండే రంగురంగుల హిజాబ్ ధ‌రించ‌డం మొద‌లైంది. కానీ, 2022 జులైలో ఇబ్ర‌హీం రైసీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ హిజాబ్ నిబంధ‌న‌ను అన్ని రాష్ట్రాల్లో క‌ఠినంగా అమ‌లుచేయాల‌ని ఆదేశాలు ఇచ్చారు. వీటిని వ‌ద్ద‌నేవారు ఇరాన్ శ‌త్రువుల‌ని, వాళ్లు ప్ర‌ధానంగా త‌మ సాంస్కృతిక‌, మ‌త‌ప‌ర‌మైన విలువ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని, అవినీతిని ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న వాదించారు. అయితే కొంద‌రు మ‌హిళ‌లు మాత్రం ఈ నిబంధ‌న‌ల‌ను తోసిరాజ‌ని బిగుతు ప్యాంట్లు వేసుకోవ‌డం, హిజాబ్‌ను త‌ల‌మీద నుంచి కాకుండా భుజాల నుంచే వేసుకోవ‌డం లాంటివి మొదలుపెట్టారు.

- Advertisement -

నైతిక పోలీసు పేరుతో ఆగ‌డాలు
హిజాబ్ సంస్కృతి గౌర‌వాన్ని ప్ర‌చారం చేయ‌డానికి 2005లో అతివాద అధ్య‌క్షుడు మ‌హ‌మూద్ అహ్మ‌దీ నెజాద్ గ‌ష్త్-ఎ-ఎర్షాద్ అనే పేరుతో నైతిక పోలీసు విభాగం ఒక‌దాన్ని ఏర్పాటుచేశారు. ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కారం ఏడు సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటిన బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌లు… ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ముఖంతో పాటు జుట్టు మొత్తాన్ని క‌ప్పి ఉంచేలా హిజాబ్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి. అది ఏమాత్రం స‌రిగా లేక‌పోయినా, జుట్టు కొంచెం క‌నిపించినా స‌రే నైతిక పోలీసులు వాళ్ల‌ను అరెస్టు చేసి, జైళ్ల‌లో చిత్ర‌హింస‌లు పెడ‌తారు.

మాషా అమీనీ మ‌ర‌ణంతో..
మాషా అమీనీ అనే 22 ఏళ్ల వ‌యసున్న యువ‌తి హిజాబ్ స‌రిగా ధ‌రించ‌లేద‌ని, ఆమె జుట్టు కనిపిస్తోంద‌ని నైతిక పోలీసులు 2022 సెప్టెంబ‌ర్ 13న అరెస్టు చేసి, జైల్లో చిత్ర హింస‌లు పెట్టారు. దాంతో ఆమె 16న మ‌ర‌ణించింది. సెప్టెంబ‌ర్ 17 నుంచి ఆమె సొంత రాష్ట్రమైన కుర్దిస్థాన్‌లో నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి దేశం మొత్తానికి వ్యాపించాయి. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా మ‌హిళ‌లు పెద్ద ఎత్తున రోడ్ల‌మీద‌కు వ‌చ్చి… హిజాబ్‌, బుర‌ఖాల‌ను బ‌హిరంగంగా త‌గ‌ల‌బెట్టారు. చాలాచోట్ల పురుషులు కూడా వాళ్ల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ ఆందోళ‌నల‌ను అణ‌చివేయ‌డానికి ఇరాన్ ప్ర‌భుత్వం కాస్త గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించింది. ఈ అణ‌చివేత‌లో దాదాపు వెయ్యిమంది వ‌ర‌కు మ‌ర‌ణించార‌న్న‌ది అంత‌ర్జాతీయ మాన‌వ‌హ‌క్కుల సంస్థ‌ల అంచ‌నా. జాతీయ జ‌ట్టు ఓడితే సంబ‌రాలు
ఇరానీల నిర‌స‌న‌లు ఓ ద‌శ‌లో తీవ్ర‌స్థాయికి వెళ్లాయి. ఖతార్‌లో జ‌రిగిన ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పు పోటీల‌లో ఇరాన్ జ‌ట్టు అమెరికా చేతిలో ఓడిపోయింది. అందుకు సొంత దేశం ఇరాన్‌లో పెద్ద ఎత్తున సంబ‌రాలు జ‌రిగాయి. ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో రోడ్ల మీద‌కు వ‌చ్చి కేరింత‌లు, నృత్యాలు, కారు హార‌న్ల మోత‌లు, నాలుగు రోడ్ల కూడ‌ళ్ల‌లో కావాల‌ని బ‌య‌ట‌కు వ‌చ్చి ట్రాఫిక్ జామ్‌లు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇరానీ జ‌ట్టు ఓట‌మిని త‌మ ప్ర‌భుత్వ ఓట‌మిగా ప్ర‌జ‌లు భావించ‌డం వ‌ల్లే ఈ స్థాయిలో సంబ‌రాలు జ‌రిగాయి.

అయాతుల్లా వ‌చ్చాకే అస‌లు స‌మ‌స్య‌
నిజానికి ఇరానీ ప్ర‌జ‌లు త‌మ దేశంలో ఉన్న నిరంకుశ పాల‌న‌ను చాలా కాలం నుంచే నిర‌సిస్తున్నారు. 1978-79లో షా ఆఫ్ ఇరాన్‌ను త‌రిమేశాక ఇరాన్‌లో అయాతుల్లాల ఇస్లామిక్ పాల‌న మొద‌లైంది. షా ఆఫ్ ఇరాన్ నియంతృత్వాన్ని త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు అత‌డిని త‌రిమేశారు. కానీ, అయాతుల్లాలు వ‌చ్చాక ప్ర‌జ‌ల ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్ల‌యంది. ఇస్లామిక్ చ‌ట్టాల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లుచేయ‌డం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా మ‌హిళ‌ల జీవ‌నం దుర్భ‌రం అయిపోయింది. శ‌రీరం ఏ మేర‌కు క‌ప్పుకోవాలి, జుట్టు క‌నిపించ‌కుండా ఎలా ఉంచాల‌న్న నిబంధ‌న‌లు విధించారు. నైతిక పోలీసు వ్య‌వ‌స్థ కూడా అప్పుడే మొద‌లైంది.

మ‌రో క‌ఠిన‌మైన చ‌ట్టం
తాజాగా ఇరాన్ పార్ల‌మెంటు బుధ‌వారం (20వ తేదీన‌) ఒక కొత్త చ‌ట్టాన్ని ఆమోదించింది. దాని ప్ర‌కారం బ‌హిరంగ ప్ర‌దేశాల్లో హిజాబ్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌న్న నిబంధ‌న‌ను పాటించ‌ని మ‌హిళ‌ల‌తోపాటు, వారికి మ‌ద్ద‌తు ప‌లికేవారి మీద భారీగా జ‌రిమానాలు, క‌ఠిన‌మైన శిక్ష‌లు విధించ‌చ్చు. మాషా అమీనీ మ‌ర‌ణించి ఏడాది గ‌డిచిన కొద్ది రోజుల‌కే ఈ క‌ఠిన‌మైన చ‌ట్టాన్ని ఇరాన్ అమ‌లుచేయ‌డం గ‌మ‌నార్హం. ఏదైనా దుకాణానికి త‌ల మీద నుంచి హిజాబ్ లేకుండా ఉన్న మహిళ‌లు వచ్చి ఏవైనా స‌ర‌కులు గానీ, దుస్తులు గానీ, ఇంకేమైనా కొనుగోలు చేసినా… ఆ దుకాణ య‌జమానుల‌కు కూడా శిక్ష‌లు, జరిమానాలు విధించ‌వ‌చ్చ‌న్న‌ది కొత్త చ‌ట్టం సారాంశం. ఇలాంటివారికి ఆయా మ‌హిళ‌ల‌తో పాటు ప‌దేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేందుకు ఈ చ‌ట్టం అవ‌కాశం క‌ల్పిస్తోంది. 290 మంది స‌భ్యులున్న ఇరాన్ పార్ల‌మెంటులో ఈ బిల్లుకు 152 మంది మ‌ద్ద‌తు తెలిపారు. అంటే, 138 మంది దీన్ని వ్య‌తిరేకించారు. అయినా, సాధార‌ణ మెజారిటీతో బిల్లు ఆమోదం పొంది, చ‌ట్టంగా మారిపోయింది. ఇక దీనికి గార్డియ‌న్ కౌన్సిల్ ఆమోద‌ముద్ర వేస్తే చాలు. ప్రాథ‌మికంగా మూడేళ్ల పాటు ఈ చ‌ట్టం అమ‌లులో ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక ఆపైన ఎన్నాళ్ల‌యినా దీన్ని పొడిగించుకుంటూ పోవ‌చ్చు. ఇంకెంత‌మంది మాషా అమీనీలు మ‌ర‌ణిస్తే ఇరానీ పాల‌కుల క‌ఠిన హృద‌యాలు క‌రుగుతాయో చూడాలి.

  • స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News