పన్నెండు నిమిషాల్లో ఆసుపత్రి ఏర్పాటవ్వడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ! అవునండీ. అసాధ్యం అనిపించే ఈ విషయాన్ని 14 మే 2024న ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ప్రయోగాత్మకంగా చేపట్టి విజయం సాధించింది భారత వైమానిక దళం (ఇండియన్ అయిర్ ఫోర్స్). మరింత ఆశ్చర్యానికి గురి చేసే విషయమేమిటంటే “భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత మరియు మైత్రి” (BHISHM) కోసం అత్యవసర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మొహరించే పోర్టబుల్ ఆసుపత్రుల సామర్థ్యాన్ని పరీక్షించే లక్ష్యంతో ఆగ్రాలోని ఎయిర్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎడిఆర్‌డిఇ) ప్రత్యేకంగా రూపొందించిన పారాచూట్‌లను ఉపయోగించి సుమారు 720 కిలోల బరువుతో పోర్టబుల్ ఆసుపత్రిని 1,500 అడుగుల ఎత్తు నుండి IAF C-130 విమానం ద్వారా కిందికి జారవిడిచింది. ఎయిర్ బెలున్ లా ఉండే ప్రత్యేక నిర్మాణంలో అత్యవసరంగా ఉపయోగపడే వైద్యపరికరాల కిట్ ఉంటుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఆపన్న హస్తం:
నేటి ప్రపంచీకరణ, పట్టణీకరణ నేపథ్యంలో అంతరించిపోతున్న అడవులు, పెరిగిపోతున్న భూతాపం, పర్యావరణ అసమతుల్యత, వాతావరణ మరియు భూగర్భ జలాల కాలుష్యం తదితర అంశాల కారణంగా వివిధ ప్రాంతాలలో అతివృష్టి మరియు అనావృష్టి ఏర్పడడంతో పాటు అకాల వరదలు, భూకంపాలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఇందుకు ఉదాహరణగా ఎడారి దేశం దుబాయిలో ఇటీవల సంభవించిన వరదలను పేర్కొనవచ్చు. విపత్తు నివారణలో భాగంగా ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు, ప్రభుత్వాలు ప్రజల ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించడానికి ఎన్నో ముందస్తు చర్యలు చేపడుతుంటాయి. అయితే పలు సందర్భాలలో వైద్యసహాయం కోసం క్షతగాత్రుల తరలింపు కష్టసాధ్యంగా మారి ఘటనా స్థలంలోనే వారికి అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ‘భీష్మ్’ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా మోహరించే పోర్టబుల్ ఆసుపత్రుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఎయిర్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎడిఆర్‌డిఇ) ప్రత్యేకంగా రూపొందించిన పారాచూట్‌ల సహాయంతో సుమారు 720 కిలోల బరువుతో తరలించే ఆసుపత్రిని (Portable Hospital) 1,500 అడుగుల నుండి IAF C-130 విమానం ద్వారా కిందికి జారవిడిచారు. ఆర్మీ పారా ఫీల్డ్ హాస్పిటల్ సమన్వయంతో ఆరోగ్య మైత్రి టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ ఎయిర్ ఎంఎస్ఎల్ రాజేష్ వైద్య, డిజిఎంఎస్ (ఎయిర్) నేతృత్వంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. దాదాపు 200 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్య చికిత్స అందించడానికి అవసరమైన ఆసుపత్రి నిర్మాణ సామాగ్రి, మందులు, శస్త్రచికిత్స మరియు ఇతర పరికరాలను సుమారు 720 కిలోల బరువు గల రెండు పెట్టెలలో (Aid Cubes) భద్రపరచి అత్యంత ఖచ్చితత్వంతో 1500 అడుగుల ఎత్తులో విమానం నుండి పారాచూట్ ల సహాయంతో ఎటువంటి నష్టం వాటిల్లకుండా విజయవంతంగా జారవిడవడం హర్షించదగ్గ విషయం.
ప్రాజెక్ట్ ‘భీష్మ్’:
కేంద్ర ప్రభుత్వం తొలిసారి 2022 ఫిబ్రవరి లో ప్రాజెక్ట్ భీష్మ ను ప్రకటించింది. దీని తరువాత రక్షణ మంత్రిత్వ శాఖ దీని కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2023 జనవరిలో జరిగిన గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో, ప్రకృతి వైపరీత్యాలు, మానవతా సంక్షోభం వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో అవసరమైన వైద్య సామాగ్రిని అందించేందుకు ‘ఆరోగ్య మైత్రి’ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ భద్రతా మండలి సంయుక్తంగా అభివృద్ధి చేసిన, ప్రపంచంలోని మొట్టమొదటి తరలించే విపత్తు ఆసుపత్రి (పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్) 72 ఎయిడ్ క్యూబ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. దేశం లోని ఏ ప్రాంతానికైనా సునాయాసంగా తరలించడానికి అనువుగా ఉండే ఈ ఆసుపత్రి సామూహిక ప్రాణనష్ట సంఘటనలలో రెండు వందల మందికి చికిత్స అందించడానికి మోహరింపబడుతుంది. ప్రాజెక్ట్ ‘భీష్మ్’ (BHISHM – భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత మరియు మైత్రి) కింద పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది. ఈ తరలించే ఆసుపత్రి లోని ఇతర సానుకూల అంశాలు ఏమిటంటే, ప్రతి క్యూబ్ యొక్క బరువు 15 కిలోల కంటే తక్కువ ఉండడంతో పాటు జలనిరోధితంగా ఉండడం మరియు గగనతలం నుండి విమానం, హెలికాప్టర్ లేదా డ్రోన్ ద్వారా జారవిడవడానికి (ఎయిర్ డ్రాప్) లేదా రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా విపత్తులు సంభవించిన సందర్భాలలో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి విపత్తు నివారణ ప్రమాద స్థలికి వెంటనే చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అలాంటి సందర్భాలలో ‘భీష్మ్’ సహాయంతో వీలైనంత త్వరితగతిన ప్రమాద స్థలికి చేరుకొని బాధితులకు అవసరమైన వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చు. ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మరియు డేటా అనలిటిక్స్‌ను సమీకృతం చేయడం ద్వారా సమర్థవంతమైన సమన్వయం, నిజ-సమయ (రియల్ టైం) పర్యవేక్షణ మరియు క్షేత్రస్థాయిలో వైద్య సేవల సమర్థవంతమైన నిర్వహణను సులభతరం చేస్తుంది. విపత్తు సమయాలలో ఇతర మార్గాల ద్వారా చేరుకోలేని ప్రదేశాలకు ఇది అత్యంత అనుకూలమైన పరిష్కారం. ఈ ప్రాజెక్ గురించి నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు, వింగ్ కమాండర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, “మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైన ఈ క్యూబ్‌లతో, గోల్డెన్ అవర్‌లో (అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తినప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించే అమూల్యమైన సమయం) విపత్తులు సంభవించే ప్రాంతంలో బాధిత ప్రజలను రక్షించగలమని, కేవలం పన్నెండు నిమిషాల్లో మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోగలగడం ఈ ప్రాజెక్ట్ యొక్క అత్యంత ఆశ్చర్యం కలిగించే అంశం” అని తెలిపారు. ‘భీష్మ్’ రూపకల్పనలో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) నుండి కూడా సలహాలు మరియు సూచనలు తీసుకోవడం గమనార్హం. మారుమూల గ్రామాలలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం అక్కడి స్థానిక ప్రత్యేక అవసరాలను పరిగణనలోకి తీసుకుని 72 క్యూబ్‌లలో, 12 క్యూబ్‌లకు అవసరమైన మార్పులు చేపట్టవచ్చు. పోర్టబుల్ ఆసుపత్రిని సాయుధ దళాలు మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) లోకి చేర్చాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది.
అందుబాటులో ఉండే సేవలు:
ఇది భూకంపం, వరదలు, అడవి మంటలు లేదా యుద్ధం అయినా ఏదైనా అత్యవసర వైద్య సేవలు అవసరమయ్యే సందర్భాలలో లేదా విపత్తు ప్రభావిత ప్రాంతాలలో ‘భిష్మ్’ సేవలను ఉపయోగించవచ్చు. ఈ వ్యవస్థ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో 200 మంది వరకు గాయపడిన వారికి అత్యవసరంగా ప్రాథమిక చికిత్స నుండి శస్త్ర చికిత్సలు మరియు వివిధ పరీక్షలు నిర్వహించేలా రూపొందించబడింది. ఈ వ్యవస్థలో 20 శస్త్ర చికిత్సలు, 72 రకాల వివిధ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలు కల్పించబడ్డాయి. బుల్లెట్, కాలిన గాయాలు, తల, వెన్నెముక మరియు ఛాతీ గాయాలు, పగుళ్లు మరియు అత్యధిక రక్తస్రావం లాంటి సందర్భాలలో అవసరమైన వైద్య చికిత్సను అందించడానికి ఒక ఆపరేషన్ థియేటర్, ఒక మినీ ఐసియు, వెంటిలేటర్లు, రక్త పరీక్ష పరికరాలు, ఎక్స్-రే యంత్రం, వంట గది, ఆహారం, నీరు, అత్యవసర వసతి ఏర్పాటు, పవర్ జనరేటర్ లాంటి అన్ని ఏర్పాట్లు ఈ వ్యవస్థలో సర్వసన్నద్ధంగా ఉంటాయి. ప్రతి క్యూబ్ లో నిర్దిష్టమైన అత్యవసర వైద్య పరిస్థితులను పరిష్కరించడానికి, ప్రత్యేకించి విపత్తు సమయాలలో అందించాల్సిన సహాయ, పునరావాస, మానవతా చర్యలకు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. క్యూబ్స్‌తో పాటు అత్యాధునిక ‘భీష్మ్’ సాఫ్ట్‌వేర్ పొందుపరిచిన టాబ్లెట్ వస్తువులను త్వరగా గుర్తించడానికి, వాటి వినియోగం మరియు గడువును పర్యవేక్షించడానికి మరియు తదుపరి విస్తరణ కోసం సంసిద్ధతను నిర్ధారించడానికి సిబ్బందికి సహాయపడుతుంది. ఇవి సుస్థిరంగా పని చేయడం కోసం సౌరశక్తి మరియు బ్యాటరీలను ఉపయోగిస్తుందని ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చవుతుందని భారత వైమానిక దళ సీనియర్ అధికారి ఇండియా టుడేతో మాట్లాడుతూ చెప్పారు.
అయోధ్యలో భక్తుడి ప్రాణం కాపాడిన ‘భీష్మ్’:
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం అనంతరం జనవరి 22, 2024న నిర్వహించిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన ఒక భక్తుడు 65 సంవత్సరాల శ్రీ శ్రీవాస్తవ కొంత భావోద్వేగానికి గురికావడంతో, అధిక రక్తపోటుతో గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి మొదటి గంట లోపు తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. వెంటనే స్పందించిన వింగ్ కమాండర్ మనీశ్ గుప్తా నేతృత్వంలోని భారత వాయు సేన రాపిడ్ రెస్పాన్స్ టీం అత్యవర పరిస్థితిలో వైద్య సౌకర్యం అందించడానికి “ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి” లో భాగంగా అత్యంత ఆధునిక వైద్య సౌకర్యాలతో ఏర్పాటు చేసిన “క్యూబ్ భీష్మ్” లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి నిండు ప్రాణాన్ని రక్షించింది. తదుపరి చికిత్స కోసం ఆయను సివిల్ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.
పొరుగు దేశాలకు సాయం:
రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు జాతీయ భద్రతా మండలితో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ మన దేశ అవసరాలతో పాటు పొరుగు దేశాలకు సైతం ఆపన్న హస్తం అందించాలన్న లక్ష్యంతో రూపొందించబడింది. ఇప్పటికీ ‘భీష్మ్’ ను మయన్మార్ కు విరాళంగా అందించిన భారత్, త్వరలో శ్రీలంకకు కూడా అందించనుంది. ‘భీష్మ్’ దళం అధిపతి అయిన విశ్రాంత ఎయిర్ వైస్ మార్షల్ తన్మోయ్ రాయ్ మాట్లాడుతూ ఏదైనా విపత్తులు సంభవించిన సందర్భాలలో అధికారిక ఉత్తర్వులు వెలువడిన పదిహేను నిమిషాలలో సర్జికల్ స్టేషన్ ను ఏర్పాటు చేయవచ్చని అన్నారు.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822
Thanks & Regards,
A Chandra Shekar
Mobile: +91-888-505-0822
+91-986-665-6907