ప్రభుత్వ ఉద్యోగం గౌరవం, భద్రత, స్థిరత్వాన్ని ఇస్తుందనే ఆశతో యువత ఏళ్ల తరబడి సిద్ధమవుతూ తమ జీవితంలోని విలువైన కాలాన్ని పణంగా పెడుతున్నారు. కొద్దిపాటి పోస్టులతో వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లలో తీవ్ర పోటీని తట్టుకోలేక ఉద్యోగం దక్కక, యువత నిరాశ-నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విషాదం కాదు, ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే స్థానిక యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడిచినా “నియామకాలు” ఇంకా రాజకీయ హామీలకే పరిమితం అవుతున్నాయి. అధికార పార్టీ ఏడాది పాలనలో రెండు లక్షల ఉద్యోగాల ఎన్నికల హామీ, ఉద్యోగ క్యాలెండర్ అమలు అటకెక్కాయి. గత ప్రభుత్వం సైతం ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చి గాలికి వదిలేసింది. ఇప్పుడు టీజీపీఎస్సీ వద్ద ఉద్యోగాల కోసం ఓటిఆర్ చేసుకున్న సుమారు 30 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు రాజకీయ హామీల మధ్య బందీ అయింది. ‘పది వేల ఉద్యోగాలు ఇస్తాం.. ఇరవై వేల పోస్టులు భర్తీ చేస్తాం.. లక్ష, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం’ అని ఎన్నికల ముందు రాజ కీయ పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి. కానీ ఆ మాటలకు, వాస్తవంగా జరిగే నియామకాలకు మధ్య ఉన్న అంతరం నిరుద్యోగ యువత జీవితాలను గందరగోళంలోకి నెట్టుతుంది.
యూట్యూబ్ చానల్స్, కోచింగ్ సెంటర్ల మార్కెట్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఒక నోటిఫికేషన్ వస్తే వేలాది, లక్షలాది మంది యువత పోటీ పడుతున్నారు. పరీక్షలు వాయిదా పడితే మళ్లీ చదువు. ఫలితాలు ఆలస్యమైతే మళ్లీ నిరీక్షణ. కోర్టు కేసులు వస్తే మళ్లీ ఆగిపోవడం. పోస్టుల సంఖ్య తగ్గితే మళ్లీ నిరాశ. ప్రభుత్వాలు ఉద్యోగాల ప్రకటనలను ప్రచారంలో పెద్దదిగా చూపిస్తే, దాని చుట్టూ మరో పెద్ద మార్కెట్ తయారైంది. యూట్యూబ్ ఛానళ్లు, కోచింగ్ సెంటర్లు, టెలిగ్రామ్ గ్రూపులు, ఖరీదైన మెటీరియల్, టెస్టు సిరీస్‌లు, ప్రత్యేక బ్యాచ్‌లు పేరుతో నిరుద్యోగ యువత ఆశలను అతిగా పెంచుతున్నారు. “ఈసారి తప్పకుండా ఉద్యోగం వస్తుంది”, “ఇది గోల్డెన్ ఛాన్స్”, “ఇదే చివరి అవకాశం”, “ఈ మెటీరియల్ చదివితే ఉద్యోగం ఖాయం” వంటి ప్రచారాలతో నిరుద్యోగుల భయాన్ని, ఆశను వ్యాపారంగా మార్చుతున్నారు. విద్యార్థుల్ని ఊహల్లో విహరించే విధంగా చేస్తున్నారు. ఉద్యోగం రాకపోయినా కోచింగ్ సెంటర్‌కు నష్టం లేదు. కానీ పట్టణాల్లో హాస్టళ్లు, కిరాయి గదుల్లో ఉంటూ సంవత్సరాల తరబడి చదివే యువత జీవితంలో అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్నాయి. అందుకే నిరుద్యోగుల ఆశలను వ్యాపారంగా కాకుండా, బాధ్యతాయుతమైన మార్గదర్శ కత్వం అవసరం. ఉద్యోగ ఆశలతో ముఖ్యంగా ఆర్థికంగా వెనుక బడిన బీసీ ఎస్సీ ఎస్టీలు, పేద అగ్రవర్ణ యువత తీవ్రంగా నష్టపోతు న్నారు. వీరికి ఎలాంటి భూములు, వారసత్వ ఆస్తులు ఉండవు. చదువే తమ సామాజిక ఎదుగుదలకు ప్రధాన మార్గంగా భావించి ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు.
వయోపరిమితి పెంపు పరిష్కారమా?
నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా వయోపరిమితిని పెంచుతున్నారు. వయసు పెంచుతున్న కొద్దీ “ఇంకో నోటిఫికేషన్ వస్తుంది.. ఉద్యోగం వస్తుంది” అనే ఆశతో యువత పోటీ పరీక్షల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ నిరీక్షణలో వారి విలువైన సంవత్సరాలు కరిగిపోతాయి. 30 ఏళ్ల వయసులో కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువకుడు 35కి చేరుకునేలోపు తన ప్రత్యామ్నాయ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. 35-40 ఏళ్లు దాటినా ఉద్యోగం రాకపోతే, ప్రైవేట్ రంగంలో నిలదొక్కుకునే నైపుణ్యాలు, అనుభవం, ఆర్థిక భద్రత కోల్పోయి నిరుద్యోగి భవిష్యత్తు సంక్షోభంలో పడుతుంది. అందుకే వయోపరిమితి పెంపు తాత్కాలిక ఉపశ మనంగా ఉండొచ్చు కానీ, నిరుద్యోగానికి పరిష్కారం కాదు.. వారికి కావాల్సింది ప్రతి సంవత్సరం ఖాళీల లెక్క, నియామకాల వార్షిక క్యాలెండర్, నిర్ణీత గడువులో పరీక్షలు, పారదర్శక నియామక ప్రక్రియ. నేడు ఉద్యోగ నోటిఫికేషన్ ఒక రాజకీయ ఈవెంట్‌గా మారింది. ఇది ప్రభుత్వ పరిపాలనా బాధ్యత అని మరిచిపోతు న్నారు. ఉద్యోగాల సంఖ్యను పెంచడం, పోస్టులను సకాలంలో భర్తీ చేయడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడమే ప్రభుత్వాల ముందున్న కర్తవ్యం. కానీ యువత విలువైన సంవత్సరాలను “మరో నోటిఫికేషన్” అనే ఆశతో బందీగా మార్చుతున్నారు. నిరుద్యోగుల లక్ష్యంగా జరుగుతున్న ఈ అగ్రకులాల రాజకీయ మోసాన్ని యువత ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది.
యువత రాజకీయ శక్తిగా మారితేనే..
నిరుద్యోగం, పేదరికాన్ని ఆర్థిక, సామాజిక సమస్యలుగా చూపెడుతూ, వాటి మూల కారణాలను పరిష్కరించాల్సిన బాధ్యత నుంచి పాలకులు తప్పించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆధిపత్య పాలక వ్యవస్థలు సృష్టించిన సమస్యలే. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులే వాటిని రాజకీయ ఎజెండాగా మార్చి, యువత ఆశలను ఓట్ల రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగంపై పాలకుల విధానాలే ప్రధాన కారణమని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. దేశంలో సామాజిక సమస్యలు, నిరుద్యోగం, విద్య-ఉపాధి రంగాల్లోని అసమానతలపై అభిజిత్ దీప్కే యువ నాయకత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటం ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. ప్రభుత్వాల మోసపూరిత హామీలను, వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా జెన్‌జీ ని చైతన్యపరుస్తూ ప్రశ్నించే నాయకత్వాన్ని నిర్మిస్తోంది. నేడు యువత అగ్రకుల పాలకుల హామీలను నమ్మడం కంటే రాజకీయ అవగా హనతో ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిగా ఎదగాలి. ముఖ్యంగా అట్టడుగు కులాల నిరుపేద, నిరుద్యోగ యువత రాజకీయాల్లోకి వచ్చి పాలకు లుగా ఎదగాలి. అప్పుడే విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ప్రజాస్వామీకరించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పాలన సాధ్యమవుతుంది.
సంపతి రమేష్
సామాజిక విశ్లేషకులు
7989579428

