కౌగిలింత… అదో ప్రత్యేకమైన అనుభూతి. మన తల్లిదండ్రులనో, స్నేహితులనో, జీవిత భాగస్వాములనో.. ఇలా ఎవరో ఒకరిని ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు కొంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇలాంటి భావనలన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రతివాళ్లకూ జీవితం మొత్తం హడావుడిగా సాగిపోతోంది. దీంతో ఇప్పుడు కౌగిలింతలు కూడా కమర్షియల్ అయిపోయాయి. అలాగని వీటిని తక్కువగా తీసిపారేయకండి. ఎందుకంటే ఇలా కౌగిలింతలు ఇవ్వడం, అవతలివారికి ఊరట కల్పించడం.. ఇవన్నీ ప్రొఫెషనల్ ఉద్యోగాలుగా మారిపోయాయి. అవును.. మీరు విన్నది అక్షరాలా నిజమే. మన దేశంలో కూడా.. ఇప్పుడు మిమ్మల్ని కౌగిలించుకోవాలంటే ఎవరినైనా నియమించుకోవచ్చు. అందుకు వారికి మీరు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వినడానికి ఇదంతా ఏదో చాలా వింత విషయంలా, కొంతలో కొంత ఇబ్బందిగా కూడా అనిపించొచ్చు. కానీ, అసలు మనకంటూ కుటుంబం, స్నేహితులు, కావల్సినంతమంది సన్నిహితులు ఉండగా ఎవరైనా కేవలం కౌగిలింతల కోసం డబ్బులు వెచ్చిస్తారా అన్న అనుమానం రావచ్చు. కానీ ఇది జరుగుతోంది. ఎందుకంటే టెక్నాలజీ మన జీవితాలను ఆక్రమిస్తోంది. ఐదు నిమిషాలు ఖాళీ దొరికితే వెంటనే ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ తెరుస్తున్నారు. అంతేతప్ప మానవ సంబంధాల మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. దానికితోడు ఉద్యోగ జీవితాల్లోను, వ్యక్తిగత జీవితాలలో కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో మనుషుల మధ్య సంబంధాలు క్రమంగా తెగిపోతున్నాయి. చాలామంది అవతలివారిని ముట్టుకోవడం అంటే కేవలం శృంగార సంబంధం కోసమే అన్నట్లుగా భావిస్తున్నారు తప్ప.. ఒక ఆప్యాయత, అనురాగం లాంటి విషయాలు గానీ, కుటుంబ బంధాలు గానీ గుర్తుకు రావట్లేదు. నిజానికి స్పర్శ అనేది సగటు మానవులందరికీ అవసరం. సొంత కుటుంబంలో గానీ, స్నేహితుల నుంచి గానీ అలాంటి స్పర్శ అనుభూతి లభించనప్పుడు వృత్తిపరంగా అలా ఇచ్చేవారికి డిమాండు పెరుగుతుంది, అది కూడా ఆ స్పర్శతో అవతలివారికి ఊరట, ఆప్యాయత లాంటివి కలిగినప్పుడే.
ఎంత తీసుకుంటున్నారు?
వినడానికి ఇదంతా కొంత విచిత్రంగా అనిపించొచ్చు గానీ.. ఇప్పటికే ఇది ఒక మంచి వృత్తిగా మారిపోతోంది. అవసరంలో ఉన్నవారికి.. ముఖ్యంగా ఒత్తిడి, కుంగుబాటు (డిప్రెషన్) లాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది అత్యంత ప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఇలాంటి వాళ్లు గంటకు రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు తీసుకుంటున్నారు. ఇది కూడా ఆ కౌగిలింత ఇచ్చేవారికి ఉన్న అనుభవం, వాళ్లు ఎంతసేపు మనతో గడుపుతున్నారనే వాటి మీద ఆధారపడుతుంది. ఇందులో భౌతికంగా లభించే సౌఖ్యం కంటే.. ఎమోషనల్ (భావోద్వేగపరమైన) హీలింగ్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గుతాయి. ఈ రకమైన స్పర్శ వల్ల కౌగిలించుకునేవారిలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దానివల్లే మనలో ఒత్తిడి, ఆందోళన స్థాయి తగ్గుతూ వస్తుంది.
భద్రత, సౌఖ్యం, మంచి నిద్ర
ఎప్పుడైనా కూడా కౌగిలింత అనేది భద్రతాభావాన్ని అందిస్తుంది. మానసికంగా తీవ్రంగా గాయపడిన, లేదా భావోద్వేగపరంగా కష్టాలు అనుభవించినవారికి ఊరటనిస్తుంది. ఇలా కాసేపు మనస్ఫూర్తిగా కౌగిలించుకోవడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. ఈ కౌగిలింతల వల్ల మానసికస్థితిని నియంత్రించే సెరోటోనిన్, మెలటోనిన్ లాంటి హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి వల్ల మనసుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. ఒంటరితనం, ఇతరులతో డిస్కనెక్ట్ అవుతున్న భావనలో ఉన్నవారికి.. ఇలాంటి ఆప్యాయతతో కూడిన కౌగిలింతతో వారి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించుకోవడం సాధ్యమవుతుంది. అయితే, ఇందులోనూ కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. ముఖ్యంగా.. అసలు ఇలా వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చి కౌగిలింతలు తీసుకోవడం అంటే సమాజం ఏమనుకుంటుందోనన్న భయం చాలామందికి ఉంటోంది. కానీ, ప్రొఫెషనల్ కౌగిలింతల వల్ల ఉండే ప్రయోజనాలతో పాటు.. ఇందులో మరేమీ ఉండదన్న విషయం కూడా ఎక్కువమందికి ఇంకా తెలియట్లేదు. దానివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిన వాళ్లు, ఒకసారి అనుభవించినవాళ్లు మాత్రం క్రమంగా మళ్లీ మళ్లీ వస్తున్నారు.
పెళ్లయినా ఒంటరితనమే
మన దేశంలో చాలావరకు ఒంటరితనం అనుభవిస్తున్నవారే ఈ కౌగిలింతలకు వస్తున్నారు. పెళ్లికానివారు కొందరైతే, పెళ్లయ్యి.. పిల్లలు పుట్టినా కూడా బాధ్యతల బరువు కారణంగా కొంతమంది పురుషులు ఒంటరితనంలో మగ్గిపోతున్నారు. చాలామంది భార్యలు ఇంట్లో ఏ విషయంలోనైనా తమదే తుది నిర్ణయం కావాలన్న పంతంతో ఉండడమే మగవారిలో ఈ ఒంటరితనానికి దారితీస్తోంది. మరికొంతమందికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా కూడా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఉంటున్నాయి. ఇలాంటివారు వెంటనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలోకి వెళ్లి, తమతో కాసేపు గడిపేందుకు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటున్నారు.
సేవలు.. పలు రకాలు
ఇలాంటివారికి అనేకరకాల సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో స్పూనింగ్ ఒకటి. అంటే, ఇద్దరూ ఎదురెదురుగా ఉండడం కాకుండా ఒకేవైపు తిరిగి పడుకుని కౌగిలించుకోవడం. అంటే, ఒకరకంగా చెప్పాలంటే వెనక నుంచి కౌగిలించుకోవడం. ఇంకా చేతులు పట్టుకుని మాట్లాడడం, ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అవసరం అయినప్పుడల్లా కౌగిలించుకోవడం, స్నగ్లింగ్.. అంటే ఒకరు వెల్లకిలా పడుకుంటే మరొకరు వారివైపు తిరిగి ఒక పక్కగా పడుకుని మీద చేతులు వేయడం లాంటిది.
వృత్తినైపుణ్యం అవసరం
నిజానికి ఇలా మంచి కౌగిలింతతో మొదలై, చేతులు పట్టుకుని మాట్లాడాలంటే చాలా ప్రొఫెషనలిజం ఉండాలి. అవతలి వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. వాటికి తనదైన స్థాయిలో ఎంతోకొంత పరిష్కారం చూపించగలగాలి. అదే సమయంలో మరీ ఎక్కువ చొరవ తీసుకుని వాళ్ల వ్యక్తిగత జీవితాల లోతుల్లోకి దూరకూడదు. ఇలా కడ్లర్లుగా వచ్చేవారిలో థెరపిస్టులు, లైఫ్ కోచ్‌లు, లేదా సామాన్య ప్రజలు ఎవరైనా ఉండొచ్చు. చాలావరకు మానసికంగా పూర్తిస్థాయిల ఊరటనివ్వడానికే ఈ కడ్లర్లు తమ సేవలు అందిస్తారు. ఇలా వచ్చేవారిలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఉంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలలో అయితే ట్రాన్స్ జెండర్లు కూడా ఈ సేవలు అందిస్తున్నారు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.
పెళ్లి చేసుకుందామా అని అడుగుతారు
చాలామందికి ఒత్తిడి అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంటోంది. అది ఎంతగానంటే, చివరకు వారికి భౌతిక స్పర్శ అవసరం అనే విషయం కూడా తెలియడం లేదు. వాళ్లకు ఎవరికి వారికి సొంత సర్కిల్ ఉండచ్చు, జీవితాన్ని బిజీబిజీగా గడిపేయొచ్చు. అయినా కూడా తీవ్రమైన ఒంటరితనంలో మునిగిపోతున్నారు. ఈ గ్యాప్‌ను పూడ్చడానికి కడ్లింగ్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే, కొంతమంది ఇలా అనుబంధాన్ని ఏర్పరుచుకుని, దాన్నే శాశ్వత బంధంగా కూడా పొరపాటు పడే సందర్భాలు చాలానే ఉంటాయి. కానీ, వృత్తిపరంగా మాకంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటికి కట్టుబడి ఉండాలని ముందే అగ్రిమెంట్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే నాలుగైదు సెషన్లు అయిన తర్వాత పెళ్లి చేసుకుందామా అని అడిగేవాళ్లు చాలామంది ఉంటారు. వీరి బారి నుంచి తప్పించుకోవడం తలకు మించిన భారమే. అయినా అదంతా మాకు అలవాటే కాబట్టి చేస్తుంటాం.
– ప్రీతి పాండ్యా, ప్రొఫెషనల్ కడ్లర్/హగ్గర్, నోయి