Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Hyderabad real estate: భాగ్యనగరానికి రియల్‌ భాగ్యం

Hyderabad real estate: భాగ్యనగరానికి రియల్‌ భాగ్యం

ఇళ్లూ వాకిళ్లు నివసించడానికే గానీ, స్పెక్యులేషన్‌ కోసం కాదు

హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి స్వర్ణయుగం ప్రారంభం అయినట్టుంది. ప్రభుత్వం నుంచి డెవలపర్లు, కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ భూములు, ఇళ్లు, స్థలాల ద్వారా కాసుల పంట పండించుకోవడం జరుగుతోంది. గత పదిరోజుల్లో కేవలం వేలం పాటల ద్వారా హైదరాబాద్‌ మెట్రొపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌.ఎం.డి.ఎ) రూ. 7,000 కోట్లకు పైగా సంపాదించుకుంది. మరో వేలం పాట ద్వారా మరో రూ. 800 కోట్లు సంపాదించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. నిధుల కొరతతో అవస్థలు పడుతున్న రాష్ట్రప్రభుత్వానికి హెచ్‌.ఎం.డి.ఎ ఈ విధంగా నిధులు సమకూర్చడం జరుగుతోంది.
నగరంలోని మోకిలా ప్రాంతంలో వేలం పాట నిర్వహించినప్పుడు, ఇక్కడ చదరపు గజం మార్కెట్‌ ధర రూ. 25,000 ఉండగా, వేలంపాటలోఅది రూ. 1,05 లక్షలకు అమ్ముడుపోయింది. ఇక కోకాపేటలో హెచ్‌.ఎం.డి.ఎ ఒక ఎకరం భూమిని రూ. 100 కోట్లకు విక్రయించింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఇలా భూములు కొనడం జరుగుతోంది. నిజానికి రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ పెరగడమంటే అది రాష్ట్రం, దాంతో పాటు హైదరాబాద్‌ నగరం అద్భుతంగా పురోగతి సాధిస్తున్నాయని అర్థం. కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర పురోగతికి కట్టుబడి ఉండడం వల్లే ఈ రియల్‌ ఎస్టేట్‌ పెరుగుదల సాధ్యమైందని భావించవచ్చు. ఈ విధంగా భూముల ధరలు పెరగడం ప్రభుత్వ విజయంకింద కూడా భావించాల్సి ఉంటుంది.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎకరం అమ్మి, తెలంగాణలో పది ఎకరాలు కొనవచ్చనే అభిప్రాయం ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రప్రదేశ్‌లో పదెకరాలు కొనవచ్చనే పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌. చంద్రబాబు నాయుడు వాపోయారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నగరంలో రిజిస్ట్రేషన్ల పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే, మొదటి ఆరు నెలల్లోనే 15,355 హౌసింగ్‌ యూనిట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగింది. నిరుడు ఇదే సమయంలో 14,693 యూనిట్లు మాత్రమే రిజిస్టర్‌ అయ్యాయి. అయితే, ఇక్కడ ఒక ప్రతికూల వ్యవహారం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం 80 వేల నుంచిలక్ష ఇళ్ల వరకు అమ్ముడు పోకుండా ఉన్నాయని అధికార వర్గాల అంచనా.ఇందులో కొన్ని నిర్మాణంలో ఉన్న ఇళ్లని కూడా వారు చెప్పారు. ముంబై తర్వాత స్థలాలు, ఇళ్ల విషయంలో హైదరాబాద్‌ అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. ఒక్కో చదరపు అడుగు రూ. 10,000 ధర పలుకుతోంది. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజానీకం ఇక్కడ ఇల్లు కొనలేని పరిస్థితిలో ఉంది.
నగరంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రకారం విశ్లేషిస్తే, అత్యధిక సంఖ్యాకులు 20 నుంచి 25 లక్షల రూపాయల స్థాయిలో ఉన్నవారేనని అర్థమవుతోంది.ఇంత ఖరీదు పెట్టి ఇల్లు కొనడం మధ్యతరగతికి ఎలా సాధ్యం అనేది తెలియకుండా ఉంది. ద్రవ్యోల్బణం కారణంగా, ఇంటి నిర్మాణ సామగ్రికి సంబంధించిన ఖర్చులు పెరుగుతున్న కారణంగా,ఇళ్ల ధరలమీదా, స్థలాలు, భూముల ధరలమీదా ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ వర్గాలలో కొందరు దీన్నిప్రోత్సహించడం కూడాజరుగుతోంది. ప్రభుత్వం జీవో 111ను రద్దు చేయడంతో 84 గ్రామాలలోని స్థలాలు, భూములు రియల్‌ ఎస్టేట్‌కు దారులు తెరిచాయి. నిధుల కోసం పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ మీద ఆధారపడడం వల్ల చివరికి వినియోగదారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చైనాలో ఇటువంటి పరిస్థితే ఏర్పడినప్పుడు అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌ ఇళ్లూ వాకిళ్లను ఏర్పాటు చేసుకోవడమనేది నివసించడానికే గానీ, స్పెక్యులేషన్‌ కోసం కాదని అనడం జరిగింది. రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించినంత వరకూ హైదరాబాద్‌ నగరం ప్రస్తుతం పులి మీద స్వారీ చేస్తోంది. ఎవరైనప్పటికీ, నిధులను ఏదో విధంగా సమకూర్చుకోవడం మంచిదే కానీ, స్పెక్యులేషన్‌ను పెంచే ప్రయత్నం చేయకూడదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News