Saturday, November 15, 2025
HomeTop StoriesSpeshway Scam : ఉద్యోగం పేరుతో ఉచ్చు.. 'స్పేష్ వే' కంపెనీపై కురుస్తున్న ఫిర్యాదుల వర్షం!

Speshway Scam : ఉద్యోగం పేరుతో ఉచ్చు.. ‘స్పేష్ వే’ కంపెనీపై కురుస్తున్న ఫిర్యాదుల వర్షం!

Hyderabad software job scam : క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కొలువు రాలేదని దిగులా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలన్న కల కల్లలవుతోందని ఆందోళనా? ఇలాంటి నిరుద్యోగ యువత బలహీనతే పెట్టుబడిగా, హైదరాబాద్ కేంద్రంగా ఓ సంస్థ వందలాది మంది జీవితాలతో చెలగాటమాడుతోంది. ‘స్పేష్ వే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్’.. ఉద్యోగం ఇప్పిస్తామని లక్షలు దండుకుని, శిక్షణ పేరుతో కాలయాపన చేసి, చివరికి నట్టేట ముంచుతోందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘జనం కోసం జర్నలిజం’ పిలుపుతో, ఈ మోసపూరిత సంస్థ బాగోతంపై “తెలుగుప్రభ”కు అందిన ప్రత్యేక కథనం.

- Advertisement -

ఇంజనీరింగ్ చదివారు.. కానీ ఉద్యోగమే లేదు. ఇంటర్వ్యూలకు వెళ్లి అలసిపోయారే తప్ప భరోసా కనిపించడం లేదు. అలాంటి వారికి ఆశాసౌధంగా కనిపిస్తున్నది ‘స్పేష్ వే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్’.. కాదుకాదు.. ఆశాసౌధం పేరిట పట్టపగలు నక్షత్రాలను చూపిస్తున్నది. ఏజెంట్ల ద్వారా సంప్రదింపులు జరిపి, పేరున్న కంపెనీలో, మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నది. అయితే.. దానికి కొంత ఖర్చవుతుందని చెప్పి లక్షల్లో వసూలు చేస్తున్నది. అప్పు చేసి జాబ్‌లో చేరిన వారికి సినిమా కాదుకదా.. స్వయంగా నరకమే కనిపిస్తున్నది. మూడు నెలలు శిక్షణ పేరిట కాలయాపన చేసి, ఆపై పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని పక్కన పెడుతున్నది. ఏడాది గడిచేలోపు వారందరినీ ఇంటికి పంపిస్తున్నది. వసూలు చేసిన మొత్తంలో సగం జీతం రూపంలో చెల్లించి ఆపై చేతులు దులుపుకుంటున్నది. ఇలా స్పేష్ వే బారిన పడి మోసపోయిన వారి సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంటున్నది. సంస్థ యాజమాన్యం, ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిరుద్యోగులు ఈ కంపెనీ వ్యవహారంపై బాధితులు ముందుకు వచ్చి “తెలుగుప్రభ”కు తమ గోడు వెల్లబోసుకున్నారు. 
 
సాఫ్ట్‌వేర్.. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగమిది. కూలీ మొదలుకొని ఉన్నత ఉద్యోగాలు చేసే వారి వరకు..  ప్రతి ఒక్కరి కల తమ పిల్లలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూడాలన్నదే. ఏటా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టభద్రులవుతున్నారు. వీరిలో కొందరికే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు దక్కుతున్నాయి. చాలా మందికి ఉద్యోగాలు రాక హైదరాబాద్, బెంగళూరులో చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని హైదరాబాద్ కేంద్రంగా చాలా నకిలీ కంపెనీలు పుట్టుకొచ్చాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. అలాంటి కంపెనీల్లో ఒకటి ‘స్పేష్ వే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్’. గతంలో మాదాపూర్ కేంద్రంగా.. ప్రస్తుతం రాయదుర్గ్ కేంద్రంగా పనిచేస్తున్నది.  

ఏజెంట్ల ద్వారా నిరుద్యోగులకు ఎర : స్పేష్ వే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ల ద్వారా నిరుద్యోగులను కలుస్తున్నది. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతున్నది. రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టుకుంటే మంచి ప్యాకేజీ ఇప్పిస్తామని చెబుతున్నది. ఒక్కొక్కసారి నిరుద్యోగి అవసరాన్ని బట్టి ఏజెంట్లు ఎక్కువ వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి వేసారిన నిరుద్యోగులు.. తల్లిదండ్రులను ఒప్పించి, అప్పు తెచ్చి మరీ ఈ సంస్థలో చేరుతున్నారు. ఉద్యోగం వస్తే జీవితాలు మారుతాయన్న ఆశే.. వీరిని స్పేష్‌వేలో చేరేలా చేస్తున్నది. తాము ఇప్పించే ఉద్యోగంలో చేరితే నెలనెలా రూ.40 వేలకు పైగా జీతం, ఆపై పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా ఉంటుందని, ప్రతి నెలా సకాలంలో జీతాలు పడతాయని ఏజెంట్లు రకరకాలు చెప్పి నమ్మిస్తున్నారు. త్వరలో తమ కార్యాలయం టీ – హబ్‌లోకి మారుస్తామని, తమ సంస్థకు మరింత డిమాండ్ పెరుగుతుందని నమ్మబలుకుతున్నారు. బడా ఎమ్మెన్సీ కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకున్నామని, అనేక పెద్ద ప్రాజెక్టులు వస్తాయని కూడా చెబుతున్నారు. నిరుద్యోగులను ఆకర్షించేందుకు, ఉద్యోగం ఆశ కల్పించేందుకు వీలైనన్ని మాటలు చెబుతూ ఏజెంట్లు డబ్బులు కట్టించుకుంటున్నారు. 
 
చెప్పేది ఒక్కటి చేసేది మరొక్కటి : ఏజెంట్ల మాటలకు ఆకర్షితులైన నిరుద్యోగులు.. వారు చెప్పినంత మొత్తం కడుతున్నారు. కోటి ఆశలతో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అప్పుడే సినిమా కనిపించడం ప్రారంభమవుతున్నది. నెలకు రూ.40 వేలు జీతం అంటూ ఆఫర్ లెటర్ ఇచ్చి.. తీరా ఉద్యోగంలో చేరాక ప్రొబేషన్ పీరియడ్ పేరుతో రూ.20 వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఒక నిర్ణీత తేదీన కాకుండా.. వారికి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నారు. ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత జీతం పెంచుతారని ఆశిస్తే.. ట్రైనింగ్‌లో మీ ఫర్మార్మెన్స్ బాగాలేదని, మేమే చెప్పి పాస్ చేయించామని, లేదంటే ఉద్యోగం పోయేదని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొంతకాలం పని చేయండి.. జీతం పెంచుతామని చెప్పి కొనసాగిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక ప్రాజెక్టులు ఇవ్వకుండా టాస్క్‌ల పేరుతో కొంత పని అప్పగించి, ఆపై అందులో కూడా ఫర్మారెన్స్ బాగాలేదని నోటీసులిస్తున్నారు. తర్వాత జీతాలు ఎగ్గొట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ ఊసే లేదు.  ఇలా వందలాదిని చేర్పించుకుని కొన్నాళ్లయ్యాక ఇంటికి పంపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 

ఫిర్యాదుకు సిద్ధమవుతున్న బాధితులు : స్పేష్ వే మేనేజర్ సిద్దార్థ్ చేస్తున్న మోసాలపై ఇప్పటికే అనేక మంది ఫేస్‌బుక్ వేదికగా పోస్టులు పెట్టారు. కంపెనీ చేసేందంతా ఫ్రాడ్ అని, నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నదని పేర్కొన్నారు. బాధితుల్లో కొందరు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించగా, మరికొందరు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా తీసుకొని మోసగించే కంపెనీ స్పేష్ వే ఒక్కటే కాదని, హైదరాబాద్‌లో ఇలాంటివి అనేకం ఉన్నట్టు బాధితులు వాపోతున్నారు. ఇలాంటి సంస్థల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో మరిన్న మోసాలు జరగకుండా నిరోధించాలని బాధితులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. స్పేష్ వే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యంపై, ఆ సంస్థ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

స్పేష్ వే సొల్యూషన్ పెద్ద ఫ్రాడ్ : జయంతి, కర్నూలు (పేరు మార్చాం)
నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా హైదరాబాద్‌కు చెందిన అపూర్వ పరిచయం అయ్యింది. మంచి కంపెనీ, మంచి ప్యాకేజీ ఇప్పిస్తానని, రూ.2.60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింది. మా తల్లిదండ్రులకు చెబితే.. ఉద్యోగం వస్తుంది కదా అని అప్పు తెచ్చి మరీ ఇచ్చారు. ఉద్యోగంలో చేరక ముందు రూ.4.2 లక్షలు ప్యాకేజీ అన్నారు. తీరా జాయిన్ అయ్యాక రూ.20 వేలే ఇచ్చారు. ఇదేమిటని అడిగితే తర్వాత పెంచుదామంటూ దాటవేశారు. 3 నెలలు జావా ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ప్రాజెక్టు ఇవ్వలేదు. జీతం పెంచలేదు. అది కూడా టైముకు ఇవ్వలేదు. ప్రతి నెలా జీతం కోసం అడుక్కోవాల్సి వచ్చింది. పీఎఫ్, ఈఎస్ఐ అసలే లేదు. రెండు నెలల క్రితం కొన్ని టాస్క్ లు ఇచ్చి చేయమన్నారు. అప్పటి నుంచి జీతం ఖాతాలో వేయలేదు. మేనేజర్ సిద్దార్థ్, ఏజెంట్ అపూర్వను అడిగితే సమాధానం చెప్పలేదు. చివరకు ఫోన్లు కూడా ఎత్తలేదు. నా నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేశారు.  మోసపోయానని అర్థమయ్యింది. నాలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. 

ఆది నుంచి అనుమానమే : అనిరుధ్, హైదరాబాద్ (పేరు మార్చాం)
ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడ్డాను. ఓ ఫ్రెండ్ ద్వారా రాజేష్ అనే వ్యక్తి నన్ను కలిశాడు. రూ.3 లక్షలిస్తే శిక్షణ ఇప్పించి తర్వాత మంచి కంపెనీలో చేర్పిస్తానని నమ్మించాడు. స్పేష్ వే సొల్యూషన్ సంస్థ డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తున్నదని ఆశ పడ్డాను. మా నాన్నను అడిగి రూ.3లక్షలు తీసుకువచ్చి సంస్థలో జాయిన్ అయ్యాను. తొలుత శిక్షణ ఇచ్చారు. తర్వాత అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగం అంటూ కాలం గడిపారు. తర్వాత నా పర్ఫార్మెన్స్ బాగా లేదని పెండింగ్‌లో పెట్టామన్నారు. ఎనిమిది నెలలు పనిచేశాక.. నేను ఉద్యోగానికి పనికి రానని ఇంటికి పంపించారు. నేను రూ.3లక్షలు చెల్లిస్తే.. నాకు ప్రొబేషన్ పేరిట నెలకు రూ.20వేలు చొప్పున ఏడు నెలలకు రూ.1.40 లక్షలు జీతంగా ఇచ్చారు. చివరి నెల జీతం ఇవ్వనే లేదు. మొత్తంగా రూ.1.60 లక్షలతో పాటు నా ఎనిమిది నెలల కాలాన్ని నష్టపోయాను. పక్కా ప్రణాళిక ప్రకారమే స్పేష్ వే నన్ను మోసగించిందని అర్థమయింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad