ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసహనం విపరీతంగా పెరిగిపోతోంది. ఇటు అధికార పక్షం గానీ, అటు ప్రతిపక్షం గానీ.. ఎవ్వరిలోనూ సహనం అన్నది పొరపాటున కూడా కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాలు 2019 వరకు ఓ తీరు, ఆ తర్వాత మరో తీరు అన్నట్లుగా సాగుతు న్నాయి. ఇందులో అసహనం, ప్రశ్నల్ని స్వీకరించలేకపోవడం, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవడం మొదలైంది. దీనికి కారణం, బాధ్యులు ఎవరనేది పక్కన పెడితే.. ఫలానా వాళ్లు మన పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి వారి ప్రశ్నలను పట్టిం చుకోవాల్సిన అవసరం లేదని అధినేతలు నిర్ణయించేలా చుట్టూ ఉన్న వారు ప్రభావితం చేసి ఉండొచ్చు. బహుశా ఇలాంటి పరిణా మాల వల్లనేనేమో.. ఒక్క మాట అన్నా పడకపోవడం, అవతలి వాళ్లను ఒకటికి పది మాటలు అనడం లాంటి పరిణామాలు చాలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి. వరుసగా వారం పది రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు ఈ పరిణామాలకు అద్దం పడుతున్నాయి.
జగన్ ఏదైనా ఒక మాట అన్న వెంటనే దానిమీద సంబంధిత మంత్రులు ఇటీవలి కాలంలో వరుసపెట్టి ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఆయా అంశాల మీద జగన్‌ను చీల్చిచెండాడుతున్నారు. ప్రతిపక్ష నేత అన్న మాటల అర్థం పది పైసలు ఉంటే.. దానికి పది రూపాయ ల అర్థం తీస్తూ అసలు జగన్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, పూర్తిస్థాయిలో ధ్వంసరచనకు మాత్రమే ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. దానికితోడు.. ఇవన్నీ తమకు అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలలో ఎలా రావాలన్నది కూడా ముందునుంచి నిర్దేశించుకుంటున్నారు. పొరపాటున వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమోనని.. ఇప్పటినుంచే ప్రజల్లో ఆయన మీద వీలైనంత ఎక్కువగా దురభిప్రాయం కలిగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నాయకులలో ఇంత అస హనం పెరిగిపోవడానికి ఇప్పుడు కాదు.. దాదాపు దశాబ్ద కాలం ముందు నుంచే పునాదులు పడ్డాయి.
2014-19 మధ్య కాలంలో మొదట్లో హైదరాబాద్, ఆ తర్వాత విజయవాడ కేంద్రంగా ఏపీ రాజకీయాలు సాగేవి. 2009 -14 మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, యాత్రలు, కేసులు, రాజకీయంగా పట్టు నిలబెట్టుకునేందుకు పార్టీలు చేసిన వివిధ ప్రయత్నాలు పోటాపోటీగా సాగాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతీయవాదం నడుమ, పార్టీల రాజకీయ విభేదాలు బాహాటంగా చూపించుకునే అవకాశం అన్ని పార్టీలకు రాలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మాత్రం పార్టీల ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి.
2014కు ముందు ఎవరిని ఎవరు నిషేధించారు అనేది ఖచ్చితంగా చెప్పలేం గానీ, ఎన్టీఆర్ భవన్ లో కార్యక్రమాలకు సాక్షి ప్రతినిధులను 2012 నుంచి అనుమతించలేదు. అదే సమయంలో వైసీపీ ఆవిర్భావం తర్వాత చాలాకాలం పాటు అన్ని పత్రికలు, టీవీలను ఆ పార్టీ తమ కార్యక్రమాలకు, విలేకరుల సమావేశాలకు అనుమతించింది. సొంత మీడియా ఉన్నందున ప్రత్యేకంగా తమకు ఎవరి మద్దతు అవసరం లేదనే భావన ఉండేది. ఫలానా వారు తమకు సైద్ధాంతిక శత్రు వర్గం అనే ధోరణి ఉండేది. మీడియా స్వేచ్ఛ పేరుతో ఎవరిపైనా బహిరంగ ఆంక్షలు విధించిన దాఖ లాలు మాత్రం లేవు. 2010 తర్వాత సాక్షి టీవీ ప్రసారాలకు అంత రాయాలు కలిగించడం, 2014 తర్వాత కొన్ని టీవీ ఛానళ్లపై అప్రకటిత నిషేధాలు అమలు అయ్యాయి.
2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో చంద్రబాబు అందరికి సమాన అవకాశం ఇచ్చారు. అంతకుముందు తమ పార్టీ వార్తలు, పార్టీ ప్రచారంలో సాక్షి ప్రమేయం అవసరం లేదని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికి అవకాశం ఉండేది. ఉండవల్లిలో ఉన్న ప్రజావేదికలో జరి గిన శ్వేత పత్రాల విడుదలకు కూడా సాక్షిని చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. అప్పట్లో సాక్షి ప్రతినిధుల ప్రశ్నలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినా ఆంక్షలు పెట్టలేదు. ఈ విషయంలో చంద్ర బాబు వ్యవహరించిన తీరు కొంతవరకు అభినందనీయమనే చెప్పాలి. ప్రజా వేదికలో జరిగిన కార్యక్రమాల్లో సాక్షి ప్రతినిధులతో సీఎంకు చాలాసార్లు వాగ్వాదాలు జరిగాయి.
2019 ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఆంక్షలు మొదలయ్యాయి. ఎవరి సలహాలు, సూచనలతో వాటిని అమలు చేశారో తెలీదు కానీ ప్రభుత్వ వ్యతిరేక మీడియా పేరుతో మీడియా ప్రతినిధులపై వేటు వేయడం మొదలైంది. ఆ పార్టీ ప్రచార బాధ్యతలు చూసే మాజీ జర్నలిస్ట్ అధికారిక గ్రూపుల్లో ఎవరిని చేర్చాలి, ఎవరిని చేర్చకూడదు అనే విషయంలో పరిధికి మించి ఆంక్షలు విధించారు. దీనిని ఏ జర్నలిస్ట్ సంఘం అప్పట్లో తప్పు పట్టలేదు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఏపీలో మీడియా బహిరంగంగా ముద్రలు వేసుకుని ఉండటంతో పాలక పార్టీ తీసుకున్న నిర్ణయం సమంజసమే అని అంతా నోళ్లకు తాళాలు వేసుకున్నారు. విచిత్రంగా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అలాంటి సలహాలు ఇచ్చిన వారంతా తాడేపల్లి నుంచి మటుమాయం అయ్యారు. మీడియా విషయంలో జగన్ ను ఎవరు తప్పుదోవ పట్టించారనేది ఇప్పటికీ స్పష్టత లేదు.
2019-24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలను స్వీకరించలేకపోవడం, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించడాన్ని ప్రజలు గుర్తించారు. తాను సంక్షేమం అందిస్తున్నాను కాబట్టి ప్రజలు తనకు రుణపడి ఉంటారనుకున్న ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రజల్లో అసహనాన్ని నాటి ముఖ్యమంత్రికి కళ్లు, చెవు లుగా వ్యవహరించినవాళ్లు సైతం పసిగట్ట లేకపోయారు. అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్, వై నాట్ 175 అనే భ్రమల్ని కల్పించి ఓటమికి కారణం అయ్యారు.
2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ.. ఈ మూడు పార్టీ లూ ఏకమై ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విచిత్రంగా మునుపటి వైసీపీ ప్రభుత్వాన్ని అనుకరించడం మొదలుపెట్టింది. తాము కూడా ప్రశ్నలకు అతీతం అనుకోవడం మొదలైంది. గత ఐదేళ్లలో ఎవరూ ఎదురు మాట్లాడలేదు కాబట్టి తమను కూడా ఎవరూ ప్రశ్నించకూడదనే వాళ్లు బలంగా అనుకుంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏదైనా నిర్ణయం తీసు కుంటే గతంలో దాని మీద మీడియాకు ముందస్తుగానే లీకులు వదిలి, ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుని అవసరమైతే అసలు అలాంటి నిర్ణయం తీసుకోకుండానే వెనక్కి వెళ్లేవారు. ప్రస్తుతం అలాంటి తీరు కనిపించడం లేదు. తీవ్రమైన అసహన ధోరణి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ముసుగు ముఖాలు అత్యంత దారుణమైన భాషలో కొట్లాడు కుంటున్నాయి.
ఎవరైనా ప్రశ్నిస్తే గత ఐదేళ్లలో ఏం చేశారు, ఎవరిని ప్రశ్నిం చారు, మమ్మల్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారనే ఎదురు ప్రశ్నలు వస్తు న్నాయి. మునుపటి ఐదేళ్లలో ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడం, ఏకపక్ష వ్యవహారం ప్రజలు గుర్తించారు కాబట్టే వైసీపీని తిరస్క రించి.. కూటమికి భారీ మెజార్టీ కట్టబెట్టారనే విషయాన్ని ప్రస్తుతం చంద్రబాబు, ఆయన అనుచరులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎజెం డా సెట్టింగ్, సెలెక్టివ్ మీడియా విధానాలతో ముందుకు పోతున్నారు.
ప్రస్తుతం సాంప్రదాయక మీడియాకు కాలం చెల్లింది. తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు పత్రికల్లో వచ్చినదే ప్రజాభి ప్రాయం అనుకుని దాంతోనే సంతృప్తిపడిపోవడం కూటమి నాయ కులకు బాగా అలవాటుగా మారింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. సోషల్ మీడియాతో పాటు.. కొన్ని పత్రికలు ప్రజల్లోకి పలు విధాలుగా వెళ్తూ.. ఈ మొత్తం ధోరణి ఎలా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. అధికారపక్షంలో ఉన్నవారి కంటే ప్రతిపక్షంలో ఉన్నవారికి సోషల్ మీడియా టూల్స్ చాలా ఎక్కువగా ఉపయో గపడతాయి. వైసీపీ అధికారంలో కొనసాగిన ఐదేళ్లలో ప్రభుత్వ వ్యతిరేకతను సంపాదించడంలో ప్రతిపక్షాలు అలాగే విజయం సాధించాయి. చేసింది చెప్పుకోవడం ఒక ఎత్తైతే విమర్శల్ని తిప్పికొ ట్టడం మరో ఎత్తు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రశ్నిం చకూడదనే తీరు మరింత ప్రమాదకరం.
జర్నలిస్ట్‍కు ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుంది, ప్రశ్నలో తప్పుంటే తప్పని చెప్పాలి కానీ అసలు ప్రశ్నించడమే తప్పు అనడం మాత్రం సరికాదు. ప్రస్తుతం అదే ధోరణి కొనసాగుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే నష్టపోయే ది ప్రభుత్వం, అధికార పార్టీ మాత్రమే. రాజకీయ పార్టీ సానుభూతి పరులు ఎవరైనా సరే, వాళ్లు ప్రభుత్వానికి మేలు చేసేలా వ్యవహ రించాలి. కానీ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ రాజు కొంప ముంచేలా వ్యవహరించేవారితోనే పార్టీలకు చేటు కలుగుతుంది. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా జనసేన అయినా ఇదే వర్తిస్తుంది.
మా పార్టీ అధికారంలో ఉంటే మేము చెప్పినట్టే నడవాలి అనుకోవడం ఖచ్చితంగా చేటు చేస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీల కంటే రెడ్ బుక్ ఎక్కువ పాపులర్ అయ్యిందంటే ఇదే కారణం. ప్రజలకు చేసిన మేలు కంటే అనవసర వివాదాలు ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి. అతి వినయం, అవివేకంతో తప్పుడు నిర్ణయాలకు కారణమయ్యేవారిని గుర్తించకపోతే చేసిన మేలు చెప్పుకోలేక చతికిలపడాల్సి వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. ఇంకా మూస పద్దతుల్లో నడిస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నష్ట పోవడం సహజం అయినపుడు ఎవరి ఇష్టం వారిది.
–
కాలమ్ : సమయం
సమయమంత్రి చంద్రశేఖర శర్మ

