Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Children literature: బాలల ఊహలకు రెక్కలు తొడిగే చిత్రకారులు

Children literature: బాలల ఊహలకు రెక్కలు తొడిగే చిత్రకారులు

బుక్స్ పైన బొమ్మలు బాగుంటేనే పిల్లలు కొంటారు లేకపోతే అంతే

ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో బాలల పత్రికలకు బొమ్మలు అంత అవసరం. కథాబలం ఉన్నా సంగీతం సరిగా లేకుంటే ఆడని చిత్రాలు మనకు తెలుసు. బాలసాహిత్యం ఎంత గొప్పగా రాసినా.. సరైన చిత్రాలు లేకుంటే బాలలను ఆకర్షించదు. బాలల కండ్ల ముందు పదిపుస్తకాలు పరిచి ఒక పుస్తకాన్ని తీసుకోమంటే మొదట అందంగా పంచరంగుల ముఖ చిత్రమున్న పుస్తకాన్నే చేతిలోకి తీసుకుంటారు. ఆ తరువాత లోపలి పేజీల్లో బొమ్మలున్నాయో లేవో తిప్పి చూస్తారు. ముఖ్యంగా బాలల కథల పుస్తకంలో బొమ్మలు లేకుంటే పిల్లలు ఆకథలు చదవటానికి ఆసక్తి చూపరు. బొమ్మలు చూస్తూ కథను చదవటానికి ప్రయత్నిస్తారు. తెలుగు చదవటం వస్తే సొంతగా చదవటమో, ఇక చదవటం రాకపోతే పెద్దలని చదివి వినిపించమనో కోరుతారు. అంతలా బొమ్మల ప్రాముఖ్యత బాలసాహిత్యంపై ఉంటుంది.
నాటి ప్రముఖ తెలుగు బాలల పత్రికలు చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు, బుజ్జాయి, చిన్నారి, వసంతబాల, చిన్నారిలోకం, బాలభారతి, బాలరంజని, బాలచంద్రిక లతోపాటు బాలభారతం వంటి పత్రికలు రంగు రంగుల ముఖచిత్రాలే కాకుండా ప్రతి పేజీని రంగులలో ముద్రించాయి. రచయిత పంపిన కథను పూర్తిగా చదివి తన దైన శైలిలో చిత్రాన్ని వేస్తాడు చిత్రకారుడు. ఐతే ఒక కథకు బొమ్మ వేయటం అంత సులువుకాదు. ఆ కథలోని పాత్రలను పూర్తిగా అర్ధం చేసుకోవాలి. పరిసరాలను, కాలాన్ని అవగాహన చేసుకోవాలి. అందుకు తగిన దుస్తులు, వస్తువులు చిత్రించాలి. ముఖ్యంగా చిత్రకారునికి అన్ని విషయాల మీద కనీస అవగాహన ఉండాలి. కథలోని పేదవాడికి ఖరీదైన బట్టలు వేసినా..రాజులు, జమీందారుల పాత్రలకు ప్యాంటు, షర్టు తొడిగినా ఆకథ బాలలను ఆకర్షించదు. అందుకే ఒక కథ చదివించాలంటే రచయితకన్నా, చిత్రకారుని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నిజానికి మనం చూడని దయ్యాన్ని, భూతాన్ని, రాక్షసిని, విక్రమార్కుడిని, బేతాళుడిని, దేవుల్లని, దేవతల రూపాలను పరిచయం చేసింది కూడా చిత్రకారులే. దెయ్యానికి తెల్లని రంగు అద్ది తోక పెట్టి చూపినా, చింపిరి జుట్టు రాక్షసిని.. కోరలతో కొమ్ములతో బానపొట్టతో నిప్పులు కక్కే

- Advertisement -

రాక్షసుడిని, కత్తి చేతపట్టిన ఉక్కు కండరాల రాజులని, అందాల రాణులని, గాలిలో ఎరిగిరే గుర్రాలని, వీరులతో పోట్లాడిన చేపలని, పాముల్ని..ఇంకా మనిషిలా నడిచే, మాట్లాడే జంతు, పక్షులని సృష్టించటం చిత్రకారులకే చెల్లింది. తెలుగు బాలల పత్రికలకు ఎందరో చిత్రకారులు తమ వంతు సహకారం అందించారు. దేశంలోని బాలల,పెద్దల అభిమానం సొంతం చేసుకున్నారు. ‘ చిత్రా ‘ గా అందరికీ పరిచయమైన చందమామ ప్రధాన చిత్రకారుడు టి.వి. రాఘవులు (తోడా వీర రాఘవన్) 12 మార్చి 1912న జన్మించాడు. వీరు మద్రాసుకు చెందిన తెలుగు వారు. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. చిత్ర లేఖనంలో శిక్షణ పొందలేదు. కేవలం చిత్రకళ పట్ల ఆసక్తితో, పట్దఉదలగా అభ్యాసం చేసి నేర్చుకుని చిత్ర కళలో నైపుణ్యం సంపాదించారు.
1947 జూన్ 2న చందమామ పత్రికలో చేరారు. 1947 జూలైలో వెలువడిన ‘చందమామ’ మొదటి సంచికకు ‘ చిత్రా ‘ నే ముఖచిత్రం వేశారు. ఇక ఎనిమిది యేండ్ల తర్వాత 1955 సెప్టెంబరులో వచ్చిన బేతాళ కథకు తొలి చిత్రమైన ‘ బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే విక్రమార్కుడి’ బొమ్మను కూడా మొదట ‘చిత్రా’నే వేయటం విశేషం.
కానీ, ఆతరువాత ఆబొమ్మలో కొన్ని మార్పులు జరిగాయి. చిత్రా వేసిన బొమ్మలు, కథలను చిత్రాల ద్వార చెప్పటమే కాకుండా, కథలో చెప్పని అనేక విషయాలను వ్యక్త పరిచేవి. బొమ్మ చూడగానే కథను చదివించే శక్తి, మన మనసులను ఆకర్షించి, మన ఊహా లోకాలలో ఆ కథా విషయం, కథా కాలం, ఆ కథలలో ఉన్న పాత్రల స్వభావ స్వరూపాలు వెంటనే మన మనసులకు హత్తుకు పొయేలా వేయటం వీరి ప్రత్యేకత. వీరు వేసిన బొమ్మలు చందమామను ఎంతో ప్రసిధ్ధ పత్రికగా నిలబెట్టినాయి.1978 మే 6న ‘ చిత్రా ‘ మద్రాసులో కన్నుమూశారు.
‘ వపా ‘ గా మనందరికీ పరిచయమైన వడ్డాది పాపయ్య ‘ చందమామ ‘ కు ప్రాణం పోసిన మరో చిత్రకారుడు. వీరు శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహాలక్ష్మి దంపతులకు 10 సెప్టెంబరు 1921 న జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చుకున్నారు . తండ్రి బొమ్మలు వేసే పద్ధతిని చాలా శ్రద్ధతో పరిశీలించేవారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. చిన్నతనంలో రవివర్మ చిత్రాలను కొనుక్కుని అటువంటి చిత్రాలను తాను కూడా గీయాలనుకునేది వపా.
తన 17 వయేట కుంచెపట్టి హనుమంతుడు, గోపికాకృష్ణుల రాసలీల దృశ్యం, శకుంతల, లక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతులు, గంగావతరణం మొదలైన పౌరాణిక ఊహాత్మక బొమ్మలను వేశారు.
కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్దం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దారు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. ఇంటి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి రూపం పాపయ్య గీసిన తొలి చిత్రం. ఇక అప్పటి నుండి ‘హనుమంతుడే’ ఆయన ఇష్ట దైవం. తన కలం పేరును ‘పావనం’గా పెట్టుకున్నారు. ఇంటిమీద ‘పవనపుత్రుని’ పతాకం ఎగురవేశారు.
బాల్యంలో ఇంటిదగ్గర నేర్పించిన భారత, భాగ వత, రామాయణ గాథలు వారి మనసులో నిలిచిపోయాయి.
ఆ పురాణాలలోని ఘట్టాలకు తన చిత్రాల ద్వారా జీవం పోశారు. అప్పట్లో ‘యువ’ దీపావళి ప్రత్యేక
సంచికలో ‘ వపా ‘ వేసే చిత్రాలకోసం పాఠకులు అసక్తిగా ఎదురుచూస్తుండేది . చందమామ, యువ పత్రికలకు కొన్ని వందల, వేల చిత్రాలు వేశారు. ఐతే రచయితల పుస్తకాలకు కవర్ పేజీలు వేయటానికి అంతగా ఆసక్తి చూపలేదు.30 డిశంబర్ 1992 ఉదయం వపా మరణించారు.
‘ శంకర్ ‘ గా మనందరికీ పరిచయమైన
కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (కె.సి.శివశంకరన్) చందమామలో ఎన్నో చిత్రాలు గీశారు. చందమామలో “విక్రం, భేతాళ” కథలకు చిత్రాలు వేయడం ద్వారా పాఠకులకు దగ్గరయ్యారు. చందమామ పత్రికను రూపొందించిన వ్యక్తులలో ‘శంకర్’ కూడా ముఖ్యులు. బేతాళ కథకు తొలి చిత్రం’ చిత్రా ‘ వేస్తే.. శంకర్ ఆ చిత్రానికి మెరుగులు దిద్దారు.విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చారు.
ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు. బేతాళ కథ చివరిపేజీలో శవంలోంచి మాయమై, చెట్టు మీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు ‘ శంకర్ ‘ ఎన్ని వందలు వేశారో ! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ… ! ఈ చిత్రాలు ఇంకా మన కండ్లముందు కదులుతూనే ఉంటాయి.
చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం. జానపద, పౌరాణిక చిత్రాలు గీసి మెప్పించారు. శివశంకర్ 2020, సెప్టెంబరు 29న చెన్నై సమీపంలోని ‘ పోరూర్‌ ‘ లోని స్వగృహంలో మరణించాడు. బాలల పత్రికలకు అద్భుతమైన చిత్రాలందిన శక్తిదాస్ గౌడ్ పాత్ర చాలా గొప్పది. శక్తిదాస్ 9 జనవరి 1948న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని అరట్లకట్ట గ్రామంలో శ్రీ పస్తుల ఆంజనేయుల గౌడ్ మరియు శ్రీమతి పస్తుల అన్నపూర్ణ దంపతులకు జన్మించారు.నాలుగు దశాబ్దాలుగా పిల్లల మ్యాగజైన్‌లు, కామిక్స్ మరియు వార్తాపత్రికల కోసం బొమ్మలు వేస్తున్న జాతీయ చిత్రకారుడు.
బొమ్మరిల్లు, ఎం.వి.ఎస్ నవలలు, బాలభారతి, రిషి పీఠం, బుజ్జాయి, చిన్నారి, బాలమిత్ర, చందమామ, రోటరీ న్యూస్, విజయ పబ్లికేషన్స్ మరియు ఒరియా విజయ్ వంటి అనేక భారతీయ పత్రికలకు అతను ఫ్రీలాన్స్ చేశారు. జె.పి.పబ్లికేషన్స్ వారి ‘ చందమామ కథలు ‘ పుస్తకాలకు ముఖ చిత్రాలు, లోపలి బొమ్మలు వేశారు. అంతర్జాతీయ ప్రచురణలు , కార్యాలయ మరియు పారిశ్రామిక సెట్టింగుల కోసం వేలకొద్దీ పెయింటింగ్స్ కూడా చేశారు. శక్తిదాస్ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 13 ఏళ్లలోపు పిల్లలకు పెయింటింగ్‌ నేర్పించే ఆర్ట్‌ ఇనిస్టిట్యూట్‌ కొంతకాలం నడిపారు. బాలల కోసం అనేక కధలు రాశారు కొంతకాలం ‘ చంద్రబాల’ బాలలపత్రికను నడిపారు. అప్పట్లో ప్రతిభావంతులైన రచయితలకు కళాకారులకు ‘ చంద్రబాల ‘ ఒక వేదికయింది. వీరు ‘ఆయుర్వేద సంజీవిని’ , ‘చంద్రబాల’ పత్రికలను ఇంగ్లీషు, తెలుగు భాషలలో ప్రచురించారు.
‘దేవీప్రసాద్’ గా మనందరికీ పరిచయమైన రామప్రసాదరావు చందమామ,బుజ్జాయి, బాలమిత్ర, బాలజ్యోతి, చిన్నారి, వసంతబాల, చిన్నారిలోకం పత్రికలలో తన ప్రత్యేక మద్రవేసిన చిత్రకారులు.వీరు డాక్టర్ శ్రీ శెనగశెట్టి నరసింహారావు, శ్రీమతి జవహారమ్మ దంపతులకు 1952లో ఏలూరు పట్టణంలో జన్మించారు. అక్కడే సర్ సి.ఆర్.రెడ్డి కళాశాలలో 1973లో బి. యస్సి., పట్టభద్రత పొందారు. చిత్రకళలో ఆసక్తితో చందమామ పత్రికలోని వ.పా, చిత్రా, శంకర్ వంటి చిత్రకారులకు ఏకలవ్య శిష్యుడిగా మారారు.
మొదట్లో ‘ శంకర్ ‘ శైలి దేవి చిత్రించిన బొమ్మలపై ఉండేది.తరువాత తనకంటూ ప్రత్యేక శైలి రూపొందించుకున్నారు.
ఇక ఆ ముగ్గురి బొమ్మలను సాధనచేస్తూ, 1974లో విజయవాడలోని సినీబ్యానర్ రంగంలోకి ఒక మిత్రుడి అఅసహాయంతో ఆరంగేట్రం చేశారు. ఆపై సినిమా పబ్లిసిటీ డిజైనరు, ప్రముఖ కార్టూనిస్టు శ్రీ గీతా సుబ్బారావు గారి గీతాఆర్ట్స్లో అప్రెంటీసుగా 6 నెలల శిక్షణ, ఉద్యోగం చేశారు. 1975లో రాజమండ్రి నుండి వెలువడిన ‘ బుజ్జాయి’ బాలల మాసపత్రికలో చిత్రకారుడిగా ఉద్యోగంలో చేరారు. 1976లో వివాహానంతరం చెన్నై చేరి పిక్చర్ ఫీల్డ్, కాగడా వంటి సినిమా పత్రికలు, వసంతబాల, బాలమిత్ర, బాలభారతి, బంగారుబొమ్మ వంటి బాలల పత్రికలలో ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా ఎన్నో బొమ్మలు వేసి బాలల, పెద్దల అభిమానం సంపాదించారు.
1986లో విజయవాడలో ఆంధ్రజ్యోతి సంస్థకు చెందిన బాలల పత్రిక ‘ బాలజ్యోతి ‘ లో చీఫ్ ఆర్టిస్ట్ గా సేవలందించారు. 1992 వరకూ ‘ బాలజ్యోతి’ లో పనిచేశారు. ఆ తరువాత ‘ బాలజ్యోతి ‘ కి ఉద్యోగ విరమణ చేసి విజయవాడ, గుంటూరులలోని ‘ బాలల విద్యా విషయక ప్రచురణకర్తలకు పుస్తకాల రూపకల్పనలో సహకరించారు. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. శ్రీశైల దేవస్థానంవారి శ్రీశైలప్రభకు ముఖచిత్రాలు, విజయవాడ జె.పీ. పబ్లికేషన్స్ వారి ‘ చందమామ కథలు ‘ వంటి పుస్తకాలకు ముఖ చిత్రాలు, లోపల కథలకు బొమ్మలు వేస్తున్నారు. తెలుగు బాలల పత్రికలకు ప్రత్యేక శైలిలో బొమ్మలు వేసి తనదైన ముద్రవేసిన వారు బాపు. వీరి అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు 15డిసెంబరు 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. 1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. బాల పత్రికకు అనేక బొమ్మలు వేశారు.
అందాల అ ఆ లు పుస్తకంలో అన్ని బొమ్మలు బాపు గీశారు. అన్ని పత్రికలు బాపు బొమ్మలు ప్రచురించాయి.అనేక ముఖ చిత్రాలు గీసి మెప్పించారు.బాపు పిల్లల పత్రికలకోసం చిత్రించిన, భావస్ఫోరకమైన అలవోక, రేఖావిన్యాసాలతో కూడిన చిత్రాలు, చిత్రకథలు మనమెన్నడూ మరువలేనివి.

                ' బాలి ' పేరుతో వేల బొమ్మలు చిత్రించిన మేడిశెట్టి శంకర రావు  29 సెప్టెంబరు  1941 న విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లిలో జన్మించారు

వీరు మొదట్లో ఎం.శంకరరావు అన్న పేరుతో కార్టూన్లు వేసేవారు. బొమ్మలను మంచి సమతూకంతో వెయ్యటం అలవడింది. కొంతకాలం పి.డబ్ల్యు.డి. లో గుమాస్తాగా పనిచేసినా, చిత్రకళ మీద ఉన్న మక్కువతో 1974 లో ఈనాడు దిన పత్రికలో కార్టూనిస్ట్ గా చేరి, రెండేళ్ళ తర్వాత 1976 లో ఆంధ్రజ్యోతి స్టాప్ ఆర్టిస్ట్ గా చేరారు.”అమ్మే కావాలి” అన్న నవల చిన్న పిల్లల కోసం వ్రాసి, తానే బొమ్మలు వేసి, ఆంధ్రజ్యోతి వారపత్రికకు పంపారు. ఈ నవల, ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడి పాఠకుల మన్నన పొందినది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరిని ఎంతగానో ప్రొత్సహించి కథలు వ్రాయించి, బొమ్మలు కూడా వేయించేవారు.
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరి పేరును ‘ బాలి’ గా మార్చి దీవించారు. అప్పటినుండి, అదే పేరుతో ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.బాలజ్యోతిలో ఎన్నో బొమ్మలు వేశారు.తోటి రచయితల గ్రంథాలకు ముఖ చిత్రాలు వేశారు.అనారోగ్యంతో
17 ఏప్రిల్ 2023 న మరణించారు.
నేటితరం యువ చిత్రకారుడు తుంబలి శివాజీ.బాలల చిత్రకారుడిగా, రచయితగా ప్రసిద్ధి చెందిన తుంబలి శివాజీ 4 జూన్ 1978 న పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ తుంబలి రాములు, శ్రీమతి నారాయణమ్మ దంపతులకు జన్మించారు.
బియ్యస్సీ డిగ్రీ అనంతరం హైదరాబాద్ లో స్వచ్ఛంద చిత్రకారుడిగా, రచయితగా 2000 లో జీవితాన్ని ఆరంభించారు.
ప్రజాశక్తి దినపత్రికలో 2001లో బాలల కోసం చిత్రకారుడిగా అనేక చిత్రాలు గీశారు.ప్రముఖ బాలసాహితీవేత్త శాఖమూరి శ్రీనివాస్ తో కలిసి చిత్రకథలు ప్రచురించి బాలల,పెద్దల మన్ననలు పొందారు. పిల్లల కోసం తాను రాసిన ‘ఆదర్శబాల్యం’ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌసు వారు ప్రచురించారు. ఆ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు పంపిణీ చేసింది. అందులో ఒక కథను మహారాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో 4వ తరగతికి పాఠ్యాంశంగా చేర్చింది.
పిల్లల కోసం ‘ఆనందబాల’ పత్రికను కొంతకాలం నడిపారు. ఆనందబాల బ్లాగ్ నడుపుతున్నారు.అనేక బాలసాహిత్య గ్రంధాలకు ముఖ చిత్రాలు వేశారు.లోపల కథలకు కూడా బొమ్మలు వేసి మెప్పించారు. వీరు చిత్రించిన బాలసాహిత్య గ్రంథాలకు కేంద్రసాహిత్య పురస్కారాలు కూడా లభించాయి.
ఇలా ఎందరో నాటితరం నుండి నేటితరం
చిత్రకారులు ఈ రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు. వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలతో పాటు దినపత్రికలు కూడా బాలసాహిత్యం
ప్రచురింటంతో ఆనాడు చిత్రకారులుగా చాలా మంది ఉపాది పొందారు.స్వచ్చంద చిత్రకారులుగా అనేక పత్రికలకు చిత్రాలు గీశారు. కేశవ, యం.గోఖలే,
గంగాధర్, ఎమ్మారెన్ ప్రసాదరావ్, చలం, ధర్మ, జె.యస్.రాజు, ఎమ్.కె.బి (రాజి), జయ, కేశి, ప్రభాకర్, దేవి, గాంధీ అయ్య, అకా గాంధీ, పి.మహేష్,
ప్రియతమ్, భద్రం, పి.ఎస్. బాబు, శ్రీకర్, పాణి, వీరా, మూర్తి, చంద్ర, బుజ్జాయి,సత్యమూర్తి,
సీతారామ్ , ఇంకా గోలి శివప్రసాద్, చందు, రాజేంద్ర, యం.కనకసూరి బాబు, గోపి. ఈశ్వర్, అమర్ మోహన్, ఉత్తమ్,
చదువుల్రావ్, విమ్మి, ఎ.వి.బి.ఎస్.ఆనంద్, నర్సింగ్, నివాస్, చైతన్య, రవినాగ్, కరుణాకర్ తదితరులు ఈరంగంలో కృషిచేసి, గుర్తింపు పొందారు.
ఇంకా నేడు పత్రికలలోని బాలసాహిత్య శీర్షికలకు, బాలసాహిత్య గ్రంధాలకు తమదైన ప్రత్యేక శైలిలో పంచరంగుల చిత్రాలు, బొమ్మలు వేసి మెప్పిస్తున్న
గోపాలకృష్ణ, నందు, చరణ్ పరిమి, జక్కుల వెంకటేష్, బి.శ్రీనివాస్, బీర శ్రీనివాస్, వెంటపల్లి సత్యనారాయణ, దుండ్రపెల్లి బాబు,ఎస్.సత్యం, చైతన్య, వడ్డేపల్లి వెంకటేశ్, మాధవ్, రాజు ఈపూరి,కొల్లోజు,కూరెళ్ల శ్రీనివాస్,అన్వర్,వాసు, ప్రేమ్, కె.వి.కృష్ణారావు, భూపతి, చెన్నూరి సుదర్శన్, హస్మతుల్లా,కె.వి.ద్వారకానాధ్, రుస్తుం, కిశోర్, మహేష్, , పరక యాదగిరి,రమేష్ మరిపెల్లి, కాసుగారి ఇజయ్, కాసుగారి రాములు, రాంకీ, నరేందర్, రాం కిషన్,
రాఘవాచారి,టి.వి ఇలా ఎందరో మొదటి, రెండో తరం చిత్రకారుల వారసులుగా చిత్రకళా రంగంలో నిలదొక్కకుని తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
—– పైడిమర్రి రామకృష్ణ
సెల్ : 92475 64699

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News