Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Kerala: కేరళలో పేట్రేగిన బాధ్యతారాహిత్యం

Kerala: కేరళలో పేట్రేగిన బాధ్యతారాహిత్యం

హద్దులు దాటుతున్న హింసాకాండ, తగ్గనంటున్న సీఎం

కేరళ రాష్ట్రంలో పాలక పక్షం సైతం బాధ్యతారాహిత్యానికి పాల్పడుతుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇప్పుడు దేశ ప్రజలందరి కళ్లూ కేరళ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. కేరళలో ఎప్పుడు ఏ సమస్య తలెత్తినా అది తప్పకుండా హింసా విధ్వంసకాండలకు దారితీయడ మన్నది ఆనవాయితీగా మారి పోయింది. అంతేకాదు, ఎక్కడ ఎటువంటి నిరసనలు వ్యక్తమైనా, వాటిని ఉక్కుపాదంతో అణచివేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం, పాలకపక్ష నాయకులు సైతం రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు చేయడం కూడా ప్రస్తుతం ఇక్కడ సర్వసాధారణ విషయమైపోయింది. కేరళ రాజకీయ వాతావరణం పూర్తిగా వైరాలు, వైషమ్యాలతో నిండిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో ఒక విధమైన రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకుంటోంది. సాధారణ ప్రజానీకం వీధి పోరాటాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చూసి ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకడం జరుగుతోంది.
కేరళ రాజకీయాల్లో నిరసనలు, హింసాకాండ చాలాకాలం నుంచి కొనసాగుతున్న మాట నిజమే కానీ, ఇటీవల ఇది మరింత అధ్వానస్థితికి చేరుకుంది. పాలక ఎల్‌.డి.ఎఫ్‌ ప్రభుత్వం గత నెల 36 రోజుల నవ కేరళ సదస్‌ యాత్ర చేపట్టడం, మంత్రివర్గ సభ్యులంతా ఈ సదస్సులో భాగంగా ఒక బస్సులో రాష్ట్ర పర్యటన ప్రారంభించడం, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కేరళ కాంగ్రెస్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల కార్యకర్తలు ప్రతి చోటా నల్లజెండాల ప్రదర్శన నిర్వహిస్తూ, ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల బస్సు యాత్రకు నిరసన వ్యక్తం చేస్తుండగా, దాన్ని పట్టించుకోకుండా ఉండాల్సింది పోయి, ప్రభుత్వం వారిపై లాఠీ ప్రయోగాలు, దమనకాండ సాగిస్తోంది. ఈ ఎదురుదాడుల్లో డి.వై.ఎఫ్‌.ఐ, ఎస్‌.ఎఫ్‌.ఐ కార్యకర్తలు కూడా పాల్గొంటుండడంతో ప్రతిచోటా హింసాకాండ చోటుచేసుకుంటోంది.

- Advertisement -

ఇందుకు సంబంధించిన వీడియోలు చూసినవారికి ప్రభుత్వం ఎంత కఠినంగా, నిర్దయగా వ్యవహరిస్తోందో, రాష్ట్రంలో ఏ స్థాయిలో వైషమ్యాలు పెరిగిపోయాయో తేలికగా అర్థం అవుతుంది. పోలీసులు పూల తొట్టెలను, లాఠీలను, రాళ్లను, హెల్మెట్లను, ఇనుప చువ్వలను కూడా నిరసనకారులపై ప్రయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఈ తతంగాన్నంతా ఆత్మరక్షణ చర్యలుగా అభివర్ణించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకు ఎస్కార్టుగా వస్తున్న సిబ్బంది కూడా నిరసనకారులపై దాడికి దిగుతున్నారు. తిరువనంతపురంలో అంతకు ముందు పోలీసులు అరెస్టు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలను డి.వై.ఎఫ్‌.ఐ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్లో చొరబడి కొట్టడం కూడా జరుగుతోంది. గత శనివారంతో ఈ యాత్ర ముగుస్తున్న సమయంలో ఈ హింసాకాండ పరాకాష్టకు చేరుకుంది. పాలకపక్ష కార్యకర్తల చేతుల్లోనూ, పోలీసుల చేతుల్లోనూ దెబ్బలు తిన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో సైతం వీధి పోరాటాలు మిన్నంట్టాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
హింసాకాండకు తోడు పాలకపక్ష నాయకులు, మంత్రులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తమకు ఎదురు దాడులు సాగించే శక్తి సామర్థ్యాలు న్నాయని, అవసరమైతే శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోగలమని కాంగ్రెస్‌ నాయకుడు వి.డి. సతీశన్‌ హెచ్చరికలు జారీ చేస్తుండగా, తమను ఎవరూ ఏమీ చేయలేరని, తాము గతంలో అనేక పర్యాయాలు తుపాకులను, ఆయుధాలను ఎదుర్కోవడం జరిగిందని, తాము ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పినరయి విజయన్‌ తనవంతుగా హెచ్చరించడం ప్రారంభించారు. ఇక రాష్ట్రంలోని ఇతర పార్టీలు చెరోవైపూ చేరిపోవడంతో హింసాకాండ హద్దులు దాటిపోతోంది. ఉభయ పక్షాలు తమ దూకుడుతనాన్ని, దౌర్జన్య వైఖరిని తగ్గించుకుని, ప్రజల భద్రత గురించి ఆలోచించడం ప్రారంభిస్తే తప్ప ఈ హింసాకాండ ఆగేటట్టు కనిపించడం లేదు. వీధిపోరాటాల ద్వారా పార్టీలు తమ సత్తా నిరూపించుకోవాలంటే అది సాధ్యపడే విషయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సైద్ధాంతిక పోరాటాలను ఆయుధాల ద్వారా తేల్చుకునే అవకాశం లేదు. పరిస్థితి చేయి దాటిపోక ముందే ప్రభుత్వం కాస్తంత తగ్గి, రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పే ప్రయత్నం చేయడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News