Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్బడుగు వర్గాల మీద బడా నేతల దృష్టి

బడుగు వర్గాల మీద బడా నేతల దృష్టి

కులం కార్డు కొత్త పుంతలు

గత వారం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిమ్మిని బమ్మి బమ్మిని చేయగలిగిన మోదీ కొత్త మంత్రివర్గాన్ని ఎంపిక చేయడానికి మూడు రోజుల పాటు కసరత్తు చేయాల్సి వచ్చింది. మంత్రులను ఎంపిక చేయడంలో ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఆయనకు, ఆయన సలహాదార్లకు ఎక్కువ సమయం పట్టి ఉండకపోవచ్చు. ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి కూడా ఆయన పెద్దగా కసరత్తు చేసి ఉండ కపోవచ్చు. కానీ, వారి శక్తిసామర్థ్యాలకు కులాలను మేళ వించడంలో మాత్రం మూడు రాత్రులు నిద్రపట్టకపోయి ఉండవచ్చు. ఇందులో సందేహమేమీ లేదు. భారతదేశంలో సామాజిక వారసత్వానికి ఉన్నంత ప్రాధాన్యత ప్రతిభకు, అనుభవానికి లేదని, ఏ పార్టీలూ, ఏ నాయకులూ కులా లను విస్మరించడానికి సిద్ధంగా లేరని చెప్పడానికి గత ఎన్నికలు మరోసారి ఉదాహరణగా నిలిచాయి.
విచిత్రమేమిటంటే, కులాలను తీవ్రంగా వ్యతిరేకించిన, సంస్కరణ వాదులుగా పేరున్న, కుల రహిత సమాజం కోసం తమ జీవితాల్నే పణంగా పెట్టిన స్వామి వివేకా నంద, నారాయణ గురు, రాజా రామ్మోహన్‌ రాయ్‌, సుబ్రహ్మణ్య భారతి వంటి మహామహులు ఈ పార్టీకే కాదు, దేశంలోని అనేక పార్టీలకు ఆదర్శ పురుషులు. అయితే, అభ్యర్థుల ఎంపికలో ఇతర ప్రాధాన్యాలకు స్వస్తి చెప్పి బలహీనవర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని, కేంద్ర మంత్రుల ఎంపిక దగ్గర నుంచి సాధారణ ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు ప్రతినిధుల ఎంపికలో బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని మోదీ తన సన్నిహితులకు తెలియ జేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. కులాలకు ప్రాధాన్యమిస్తూనే, కింది స్థాయి కార్యకర్తలను అందలాలు ఎక్కించడం మీద మోదీ దృష్టి పెడుతున్నారు. దాదాపు ప్రతి రాజకీయ పార్టీ కులాలకు తమకు తోచిన, వీలైన విధంగా ప్రాధాన్యమిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో తమ పార్టీ మరింత బలపడడానికి వీలుగా ఎక్కువగా నిమ్న కులాల మీద దృష్టి పెట్టాలని బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెడుతోంది. నిజానికి, గత పదేళ్లుగా మోదీ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కూడా జరుగుతోంది.
దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మీద కూడా కుల ఛాయలే ఎక్కువగా పడుతుంటాయి. ఆధునిక భావాలలో కూడా కుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే, ఇది ఇదివరకటి మాదిరిగా ముతకగా కనిపించదు. శుద్ధి చేసి ప్రజల ముందుంచడం జరుగుతుంటుంది. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కుల ప్రాధాన్యం పెరుగుతూ ఉంటోంది తప్ప ఎక్కడా తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. పాలకులు అనే మాట వినిపిస్తే చాలు, కులం అనే మాట పడగ విప్పుతుంది. కేంద్ర మంత్రి వర్గమైనా, రాష్ట్ర మంత్రివర్గమైనా ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్నదే ముఖ్యం. ఎవరి ప్రతిభ ఏ స్థాయిలో ఉందన్నది ముఖ్యం కానే కాదు. అందరిలోనూ, అన్ని పార్టీల్లోనూ ఆధునిక భావాలు కనిపిస్తుంటాయి. 2047, 2050కి సం బంధించిన విజన్‌ కనిపిస్తూ ఉంటుంది. కానీ, అంతర్లీనంగా కుల ప్రమేయం స్పష్టంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇదే సామాజిక ప్రాధాన్యాన్ని మోదీ తమ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు
సరికొత్త వ్యూహం
గత వారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినా, భువనేశ్వర్‌, విజయవాడల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినా పాలకులు, పార్టీలు, ప్రజలు, నాయకులంతా కులాల గురించే ఎక్కువగా చర్చించుకున్నారనడంలో సందేహం లేదు. ప్రజా ప్రతినిధులుగా అభ్యర్థులు సాధించిన ఘనతలతో ఎవరికీ సంబంధం లేదు. అభ్యర్థులు ఏ కులానికి చెందినవారు, ఏ కులం వారికి ఎన్ని పదవులు లభించాయన్నదే ప్రధాన ప్రాతిపదికగా కనిపించింది. కొద్ది రోజుల క్రితం మూడవ పర్యాయం మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, వెనుకటి ప్రభుత్వ విధానాలు కొనసాగడంతో పాటు కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయనే సూచనలు వెలువడ్డాయి. ఏ మార్పులు జరిగినా కులాల జోలికి వెళ్లనంత కాలం ఏ మార్పులు జరిగినా పరవాలేదు. ఒకవేళ మార్పులు జరిగినా ఏ కులానికి ఎంత మేలు జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. మార్పులతో కులాలను కూడా మేళవించాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యులకు నివాసాలు, కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో కూడా దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. కులాలకు సంబంధించిన సిఫారసులు కులాల నాయకుల నుంచి, కులాల పార్టీల నుంచి వెల్లువెత్తాయి. మంత్రుల శక్తి సామర్థ్యాలకు, వారి అనుభవానికి ఎక్కడా ప్రాధాన్యం లేకుండా పోయింది.
భారతదేశంలో ప్రస్తుతం రోజు రోజుకూ విస్తరిస్తున్న రాజకీయ విపణిలో రాజకీయంగా ఎదగాలన్న పక్షంలో కులం కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఉదాహరణకు, సుమారు 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ రాష్ట్రంలో వర్గ, వర్ణ, ప్రాంతీయ విభేదాలను తమకు అనుకూలంగా వినియోగించుకుని లబ్ధి పొందింది. ఒడిశా అస్మిత (ఆత్మ గౌరవం) నినాదాన్ని చేపట్టింది. మోదీ నుంచి యోగీ వరకూ ప్రతి బీజేపీ నాయకుడు ఒడిశాలో తమిళ బాబుకు అధికారం అప్పగిస్తారా అంటూ ప్రశ్నించి ప్రజల ఆత్మ గౌరవాన్ని రెచ్చగొట్టడం జరిగింది. అక్కడ నవీన్‌ పట్నాయక్‌ కు ప్రధాన సలహాదారుగా పాండ్యన్‌ అనే తమిళ బ్యురాక్రాట్‌ పని చేయడం, ఆయనను నవీన్‌ పట్నాయక్‌ తన వారసుడుగా ప్రకటించడం బీజేపీకి రాజకీయంగా లాభించింది. అంతేకాదు, ఇక్కడ తమ పార్టీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే విషయంలో కూడా బీజేపీ ప్రతిభకు, అనుభవానికి కాకుండా కులానికి, తెగకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. పాలనా వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్న కె.పి.సింగ్‌ దేవ్‌ ను పక్కన పెట్టి, 52 ఏళ్ల ఆదివాసీ మోహన్‌ చరణ్‌ మాఝీని ఆ పదవికి ఎంపిక చేసింది. ఉప ముఖ్యమంత్రిగా సింగ్‌ దేవ్‌ తో పాటు ప్రవతి పావ్డాను ఎంపిక చేసింది కానీ, వారిద్దరినీ కూడా కుల ప్రాతిపదిక మీదే ఎంపిక చేయడం జరిగింది.
మారుతున్న భావాలు
మాఝీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం మీద సహజంగానే పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ అసం తృప్తి వ్యక్తమైంది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకపోవడం, మాజీ వంటి అనుభవం లేని వ్యక్తిని అందలాలు ఎక్కించడం మీద రుసరుసలు ప్రారంభమయ్యాయి. అయితే, ఆయన సాధారణ ఆదివాసీ కావడం, పైగా హిందుత్వ వాది కావడం ఆయనకు ప్రధాన అర్హతలుగా నిలిచాయి. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఆయనను ఎంపిక చేసిందనడంలో సందేహం లేదు. మోదీ కూడా వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తే అయినందు వల్ల ఆయన వెనుకుబాటుతనంలో మగ్గుతున్న అతి సాధారణ వర్గానికి చెందిన వ్యక్తిని ఈ పదవికి ఎంపిక చేయడం జరిగింది. రాజకీయంగా ఎంతో కాలంగా పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తున్నప్పటికీ, అట్టడుగు స్థాయిలోనే అనామకంగా ఉండిపోతున్న నాయకులను ఉన్నత పదవులకు ఎంపిక చేయడమన్నది మోదీ సిద్ధాంతంగా మారింది. అంతేకాక, ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయ నాయకులు తయారవాలన్నది కూడా మోదీ ఆశయం.
ముఖ్యమంత్రి పదవికి ఒక సీనియర్‌ నాయకుడిని లేదా ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడమనే ఆనవాయితీ మోదీ హయాంలో ఇక కనిపించకపోవచ్చు. 1980ల నుంచి పదవులు చేపట్టిన 54 మంది ముఖ్య మంత్రుల్లో 20 మందిని ప్రధాని ఆమోదంతోనే ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన ప్రతి ముఖ్యమంత్రీ మాజీ ముఖ్యమంత్రులందరి కంటే వయసులో చిన్నవారే. వీరిని సామాజిక ప్రాతిపదికనే ఎంపిక చేయడం మాత్రం విశేషం. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పార్టీ పార్ల మెంటరీ బోర్డు సమావేశం ద్వారా మంత్రులను, ముఖ్య మంత్రులను ఎంపిక చేయడమనే సంప్రదాయం వెనుక పట్టు పట్టింది. ముఖ్యమంత్రుల ఎంపిక వ్యవహారం ద్వారా పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని మోదీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఎటువంటి పదవినీ నిర్వహించకపోయినప్పటికీ, కేవలం బలహీనవర్గానికి చెందిన నాయకుడైతే చాలా ఆయనను ఉన్నత పదవులకు ఎంపిక చేయడమనే కొత్త సంప్రదాయానికి మోదీ చాలా కాలం క్రితమే శ్రీకారం చుట్టారు.
ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరాఖండ్, ఒడిశాలలో మోదీ తాను ఆశించిన మార్పులు తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో యోగీ అనే ఠాకూర్‌ను, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్‌ అనే బ్రాహ్మణుడిని మోదీ ముఖ్యమంత్రులుగా నియమిం చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రత్యామ్నాయ నాయకుడిని సృష్టించడం వల్ల భవిష్యత్తులో బీజేపీకి నాయకత్వ కొరత ఉండదని మోదీ భావిస్తున్నారు. మోదీ, అమిత్‌ షా ద్వయం దాదాపు ప్రతి బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోంది. దీన్ని కులాల ఆధారంగా కొంత, ఒక ప్రత్యేక రాజకీయ శక్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో కొంత ఆయన ఆచరణలో పెట్టారు. గత దశాబ్ద కాలం నుంచి కొత్త నాయకత్వం మీదే మోదీ దృష్టి పెట్టడం గమనించాల్సిన విషయం. అయితే, ఆయన ఇంతవరకూ మొత్తం 25 మంది ఉప ముఖ్యమంత్రుల్ని దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల నుంచే ఎంపిక చేయడం విశేషం. ఆయన ఎంపికల్లో, నియామకాల్లో ఎక్కువగా కుల ప్రాధాన్యమే కనిపిస్తున్నప్పటికీ, ప్రతిభకు, అనుభవానికి తక్కువ ప్రాధాన్యమే ఇస్తున్నప్పటికీ, కింది స్థాయి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలనే ఆయన తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన హయాంలో కులం కార్డు కొత్త పుంతలు తొక్కుతోంది.

  • వి. రాఘవేంద్ర
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News