మరణ శిక్షలను రద్దు చేయాలని, ఇవి అత్యంత అమానుషమైన, మానవత్వ రహితమైన శిక్షలని గగ్గోలు పెడుతున్న పౌర సమాజం ఒక్కోసారి స్వయంగా ఇంతకంటే అమానవీయమైన, జుగుప్సాకరమైన శిక్షలు విధిస్తూ ఉంటుంది. కర్ణాటకలోని ఒక గ్రామంలో ఓ మహిళను వివస్త్రను చేసి, రోడ్ల మీద ఊరేగించి, ఆ తర్వాత స్తంభానికి కట్టేసి, చిత్రహింసలు పెట్టిన సంఘటన రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఆమె కుమారుడిని తమ కుమార్తె ప్రేమించి, అతనితో వెళ్లిపోవడమే ఇంతటి శిక్ష విధించడానికి ప్రధాన కారణం. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆమెను కాపాడి, నిందితులను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన బెలగావిలో జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సహజంగానే ఈ సంఘటన ఆ రాష్ట్రాన్నే కాక, దేశాన్నే దిగ్భ్రాంతి పరచింది. ఏదైనా తప్పు చేసినప్పుడు మహిళలను వివస్త్రలను చేసి, బహిరంగంగా అవమానించడం అనేది దేశంలో చాలా చోట్ల జరుగుతూనే ఉంది. ఇందులో కర్ణాటక సంఘటన కూడా ఒకటి.
కొద్ది నెలల క్రితం మణిపూర్‌లో జాతి సంబంధమైన కలహాలు, కార్పణ్యాలు విజృంభించిన సమయంలో కుకీ జాతి మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గుర్తుండే ఉంటుంది. రాజస్థాన్ లో కొద్ది రోజుల క్రితం ఒక గర్భిణిని ఆమె కుటుంబ సభ్యులే వివస్త్రను చేసి, ఊరేగించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో కూడా ఒక మహిళను విపరీతంగా కొట్టి, వివస్త్రను చేసి, వీధుల్లో ఊరేగించి, సామూహికంగా అత్యాచారం జరిపి, తర్వాత ఆమెకు గుండు గీసిన సంఘటన కొద్ది కాలం క్రితం వార్తల్లోకి ఎక్కింది. విచిత్రమేమిటంటే, ఇటువంటి శిక్షలు విధించేది ఎక్కువగా మహిళలే కావడం జరుగుతోంది. సాటి మహిళను అవమానించడానికి మహిళలు ఇటువంటి పద్ధతుల్నే ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి మహిళలకు ఇటువంటి శిక్షలు విధించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు, ఆస్తి వివాదాలు, తక్కువ కులాలవారు తమ హద్దులు దాటడం వగైరాలు ఇందులో ముఖ్యమైనవి.
సమాజం విధించే శిక్షల్లో వివస్త్రలను చేయడం అనేది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పురుషులను శిక్షించడానికి కూడా సమాజం చాలావరకు ఇదే పద్ధతిని ఎంచుకుంటూ ఉంటుంది. పురుషులైతే వారిని వివస్త్రలను చేయడంతో పాటు, వారి మెడల్లో చెప్పుల దండలు వేసి, వారికి సున్నం బొట్లు పెట్టి, ఉమ్మేసి, వారి మీద మూత్ర విసర్జన చేసి ఊరేగించడం జరుగుతూ ఉంటుంది. కుల, మత, వర్గ, వర్ణ సమస్యలు తలెత్తినప్పుడు సాధారణంగా ఇటువంటి హేయమైన, నీచమైన శిక్షలు విధించడం ఆనవాయితీగా మారిపోయింది. తప్పు చేసినట్టు తెలియగానే వెనుకా ముందూ చూడకుండా ఇటువంటి శిక్షలను విధించడాన్ని బట్టి వారి మానసిక ధోరణి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాజంలో నెలకొని ఉన్న అరాచకత్వానికి ఇది అద్దం పడుతుంది. ఇదొక రకమైన ఆటవిక మనస్తత్వం అనడంలో సందేహం లేదు. నిజానికి, మహిళను వివస్త్రను చేసి ఊరేగించినవారికి చట్టాలు అయిదు నుంచి ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించడానికి అవకాశం ఉంది. అయినప్పటికి సమాజం సాటి వ్యక్తులకు ఇటువంటి వికృత, పైశాచిక శిక్షలు విధించడం అనేది ఏమాత్రం తగ్గలేదు. నిందితులను వెంటనే నిర్బంధంలోకి తీసుకుని, వారికి కఠిన శిక్షలు పడేలా చేయడానికి సరైన వ్యవస్థను సృష్టించడం అవసరం.
విషాదకరమైన విషయమేమిటంటే, ఇటువంటి సంఘటనలు కళ్ల ముందే జరుగుతున్నా సమాజం ఉలుకూ పలుకూ లేకుండా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉండిపోతుంది. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు వైరల్ అయినప్పుడు మాత్రం గుండెలు బాదుకోవడం, ఆ తర్వాత మరచిపోవడం సర్వసాధారణమైపోయింది. తమకు అనుకూలంగా ఉన్న సందర్భాలలో మాత్రమే రాజకీయ పార్టీలు ఈ వ్యవహరాల్లో కల్పించుకుంటాయన్నది జగమెరిగిన సత్యం. ఇటువంటి దౌర్భాగ్య, లజ్జాకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు సమాజమంతా ఒక్క తాటి మీద నిలిచి వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి ఇటువంటి సంఘటనలు దేశానికి తలవంపులు తీసుకు వస్తాయి. బాధిత మహిళలను కాపాడడంలో, నిందితులకు కఠిన శిక్షలు విధించడంలో అధికారులు ఏమాత్రం వెనుకంజ వేయకూడదు.
Brutal punishments by public: ఇటువంటి శిక్షలు సమంజసమేనా?
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెచ్చిపోతే..