Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్INDIA Alliance, its a past now: ఇండియా కూటమి ఇక గత చరిత్రే!

INDIA Alliance, its a past now: ఇండియా కూటమి ఇక గత చరిత్రే!

ఇండియా అలయెన్స్ తో విసిగిపోయిన నితీష్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ ప్లేటు ఫిరాయించారు. ఇండియా కూటమి ఏర్నడడానికి అహర్నిశలూ కృషి చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆ కూటమి నుంచి బయటపడి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మొత్తం మీద ఇండియా కూటమి క్రమంగా ఒక విగతజీవిగా మారిపోతోంది. ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసి, బీజేపీ ప్రభుత్వాన్ని నేల మట్టం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన అనేక మంది నాయకులను కలుసుకోవడం, అనేక ప్రాంతీయ పార్టీలతో సమావేశం కావడం, అనేక ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అయితే, ఇండియా కూటమి తీరుతెన్నులతో విసిగిపోయిన నితీశ్ కుమార్ ఇప్పుడు బీజేపీయే సరైన పార్టీగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బీహార్ కు చెందిన కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకుని నితీశ్ కుమార్ బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలని నితీశ్ కుమార్ 2006 నుంచి డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకు వచ్చారు కానీ, కాంగ్రెస్ ఆయనను పట్టించుకోలేదు.

- Advertisement -

కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండుతో పాటు బీహార్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తన ఇతర డిమాండ్లను కూడా కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం తనకుందని నితీశ్ కుమార్ ప్రకటించారు. ఇదంతా ఆయన బీజేపీతో చేతులు క‍లపడానికి నాందీ ప్రస్తావన అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆయన నాయకత్వంలోని జనతాదళ్ (యు) ఇప్పటికే తమ మిత్రపక్షాలైన రాష్ట్రీయ జనతాదళ్ ను, కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం ప్రారంభించింది. నితీశ్ కుమార్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదంటూ ఇంతవరకూ చెబుతూ వచ్చిన బీజేపీ కూడా ఆయనతో పొత్తు కుదిరే అవకాశం ఉందంటూ ఒక ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం గానీ, సీట్లు పంచుకోవడం గానీ జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఏడు నెలల క్రితం పాట్నాలో జీవం పోసుకున్న ఇండియా కూటమి రహస్య సమావేశాలు, పత్రికా విలేఖరుల సమావేశాలు నిర్వహించడం తప్ప ప్రజలకు చేరువ కావడానికి ఇంతవరకూ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ, సీట్ల పంపకం వ్యవహారంలో ఈ ఇండియా కూటమి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఇంతవరకూ దాని భవిష్య ప్రణాళిక ఏమిటన్నది కూడా మిస్టరీగానే ఉండిపోయింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి కార్యక్రమం చేపట్టాల్సిన సమయంలో ఇండియా కూటమి కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందులో ఉన్న 28 పార్టీలకు వేటి సిద్ధాంతాలు వాటికి ఉన్నాయి. వేటి రాజకీయ సమస్యలు వాటికి ఉన్నాయి. తమ రాష్ట్రాలలో తమకు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకోవడానికి అవి అంగీకరించడం లేదు. అంతేకాక, మొదట్లో లేని ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలన్నీ ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి.

గత జనవరి 13న ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ప్రత్యేక సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాలేదు. శివసేన పార్టీకి యచెందిన ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది కానీ, జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి పొత్తు ఏర్పడే అవకాశం మాత్రం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర స్థాయి పొత్తులు లేదా ఎన్నికల అనంతర పొత్తులు మాత్రమే సాధ్యమని ఇప్పటికే ఈ కూటమికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఈ కూటమి పట్ల భాగస్వామ్య పక్షాలలోనే ఆశలు, ఆసక్తులు, నమ్మకాలు సన్నగిలిపోయాయి. బీజేపీ మాత్రం ఇప్పటికే అన్ని విధాలుగానూ సమాయత్తమైపోయింది. ఎన్నికల్లో విజయాలు సాధించడానికే కాదు, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టేయడానికి కూడా అది సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News