Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్INDIA Alliance: తప్పించుకు తిరుగుతున్న ‘ఇండియా’ కూటమి

INDIA Alliance: తప్పించుకు తిరుగుతున్న ‘ఇండియా’ కూటమి

అందరూ ప్రధాని అభ్యర్థులే, మరి సమస్య తేలెదెట్టా!

కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేసరికి ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వేడి రాజుకోవడం మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించడం ఖాయమని, వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీజేపీ ఇప్పటి నుంచే సంబరాలు జరుపుకుంటుండగా, ప్రతిపక్ష కూటమి శిబిరంలో ఎక్కడా ఉలుకూ పలుకూ లేదు. శిబిరమంతా బోసిపోయి ఉంది. ఎక్కడ కకావికలైపోతామోనన్న భయం ఒక పక్క, ’ఇండియా‘ కూటమి అనే పెద్ద పేరు పెట్టుకుని తప్పు చేశామేమోనన్న ఆందోళక మరొక పక్క ప్రతిపక్ష కూటమిని నిద్ర పోనివ్వడం లేదు. ఒక్క చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఇండియా కూటమి కునారిల్లుతోంది. సీట్ల పంపకం సంగతి ఏమయింది, ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలను తప్పించుకోవడానికి ఈ కూటమిలోని ప్రతి ప్రధాన ప్రతిపక్షమూ తిప్పలు పడుతోంది.

- Advertisement -

బీజేపీ వంటి రారాజును ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల కూటమికి ఒక ధీరోదాత్తుడైన నాయకుడు ఉండాలి కదా? ఆ నాయకుడెవరు? ప్రతిపక్షాలు ఎవరిని తమ నాయకుడిగా ఎంపిక చేసుకోబో తున్నాయి? ఈ ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానం దొరకలేదు. ప్రజలకే కాదు, ప్రతిపక్షాల కూటమికి కూడా ఈ ప్రశ్నలకు సమాధానం అంతుబట్టడం లేదు. సీట్ల పంపిణీ కంటే నాయకుడి ఎంపికే ఇక్కడ అత్యంత ప్రధాన అంశంగా కనిపిస్తోంది. స్వప్రయోజనాలు ఏమాత్రం లేని అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు ఎవరన్నది తేలాలి. ఆ నాయకుడే సీట్ల పంపకం సమస్యను కూడా పరిష్కరించగలగాలి. ఆ తర్వాత పార్టీని ఎన్నికల కదన రంగంలో ముందుకు నడిపించాలి. ఈ విషయంలో 28 పార్టీల ఇండియా కూటమిలో ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. డిసెంబర్ 19వ తేదీన ప్రతిపక్ష కూటమి కీలక సమావేశం జరిగినప్పుడు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ హఠాత్తుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపక్ష కూటమి నాయకుడుగా ప్రతిపాదించారు. ఆయన పేరును ప్రతిపాదించే ముందు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇతర పార్టీలనే కాదు, కనీసం మల్లికార్జున్ ఖర్గేను కూడా సంప్రదించలేదు.

అంతర్గత విభేదాలు
భారత రాజకీయాల్లో ఎవరి పేరు బాగా చెలామణీలో ఉంటుందో, వారి పేరుకే ముందుగా అడ్డంకులు రావడం ప్రారంభమవుతాయి. ఖర్గే పేరు విషయానికి వస్తే, ఎంత అకస్మాత్తుగా, ఎంత సంచలనాత్మకంగా ఆయన పేరు బయటికి వచ్చిందో, అంతే సంచలనాత్మకంగా ఆయన పేరు మాయమైపోయింది. అయితే, అది కాంగ్రెస్ పార్టీలో మాత్రం తేనెతుట్టెను కదిపింది. ఆయన పేరును ప్రతిపాదించడంలో మమత, అరవింద్ కేజ్రీవాల్ ల ముఖ్యమైన ఉద్దేశం రాహుల్ గాంధీ పేరును తాము ఆమోదించేది లేదు. రాహుల్ గాంధీ అర్హతను వారు ప్రశ్నించడమో, సందేహించడమో జరిగిందని దీని అంతరార్థం. సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ ఖర్గేను కాదనలేరని ఆయన పేరు ప్రతిపాదించినవారికి బాగా తెలుసు. ఆయన తమ పార్టీకి అధ్యక్షుడు. పైగా దళిత వర్గానికి చెందినవాడు. ఆయన పేరును బహిరంగంగా తోచిపుచ్చితే,
పార్టీకి దేశంలోని దళితులంతా దూరమయ్యే ప్రమాదం ఉంది. కొద్ది రోజుల తర్వాత ఖర్గే అత్యంత ఆప్తుడైన కర్ణాటక నాయకుడు సిద్దరామయ్య తాము రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లకు సమాధానం వచ్చేసింది. పార్టీ వారికే నచ్చని ప్రధాని అభ్యర్థి దేశ ప్రజలందరికీ నచ్చే అవకాశం లేదు.

ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దళితులంతా మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటు వేస్తారన్న నమ్మకమేమీ లేదు. అంతేకాక, దళితుల్లో అనేక ఉప కులాలు న్నాయి. అనేక వర్గాలున్నాయి. అనేక దృక్పథాలున్నాయి. విభిన్న పార్టీలకు చెందినవారు న్నారు. ఇక దళిత వర్గాల్లో మల్లికార్జున్ ఖర్గే అంతగా పేరున్న వ్యక్తేమీ కాదు. పైగా, దళితులందరితో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించగల సత్తా కూడా ఆయనకు లేదు. ఆయన నెహ్రూ-గాంథీ కుటుంబానికి విధేయుడు. ఆయన ఆ కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడు. ఆయనను పార్టీ అధ్యక్షుడుగా నియమించినంత మాత్రాన దళితులందరి ఓట్లూ కాంగ్రెస్ పార్టీకే పడతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లు తన పేరును ప్రతిపాదించడం ఖర్గేను కూడా ఇరకాటంలో పెట్టింది. అందుకనే ఆయన ‘ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు’ అంటూ ఒక ప్రకటన జారీ
చేశారు. ఆయన ప్రధాని అభ్యర్థి కారని చెప్పడానికి కాంగ్రెస్ కూడా అనేక మార్గాలలో ప్రయత్నాలు చేసింది.

రాహుల్ గాంధీకి ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి నొక్కి చెబుతూ, పార్టీ అధిష్ఠానం త్వరలో ఆయన మణిపూర్ నుంచి ముంబైకి భారత్ న్యాయ యాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించింది. ఆయన 14 రాష్ట్రాలను చుట్టి వస్తూ 6,200 కిలోమీటర్ల యాత్ర జరుపుతారని అది వివరించింది. ఆయనే పార్టీ తరఫున
ప్రధాని అభ్యర్థి అని, ఎప్పటికైనా ఆయనే తమ ప్రధాన ప్రచార సారథి అని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. 2024 తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబం కొనసాగే అవకాశం లేదంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈసారి రాహుల్ గాంధీ చేసే యాత్ర ప్రజాభిమానం కూడగట్టుకోవడానికో, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికో కాదు. రాహుల్ గాంధీయే తమకు ప్రధాన ప్రచార సారథి అని, ఆయనే ప్రధాని అభ్యర్థిని ప్రజలకు తేటతెల్లం చేయడానికే దీనిని ఉద్దేశించడం జరుగుతోంది. ప్రతిపక్ష కూటమికి కూడా ఈ యాత్రతో అంతా స్పష్టంగా అర్థమైపోయేలా చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. నిజానికి, 28 పార్టీల ఇండియా కూటమిలో ఎక్కువ భాగం పార్టీలు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు మమతా బెనర్జీ సన్నిహితులు ఇప్పటికే అనేక పర్యాయాలు అన్యాపదేశంగా చెప్పడం జరిగింది.

ఖర్గే పేరును మమత ప్రస్తావించడం వెనుక ఏదో పెద్ద ఆలోచనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ప్రభావితం చేయడంతో పాటు, సీట్ల పంపకం, ప్రధాని అభ్యర్థి నిర్ణయం వంటి విషయాల్లో పార్టీలో ఆలోచన వేగం పుంజుకోవడం కూడా ఆమె లక్ష్యం అయి ఉండాలి. అసలు విషయం బయటకు రావాలన్నది ఆమె ఉద్దేశం కావచ్చు. లేక ఆమె దృష్టిలో మరెవరి పేరైనా ఉండి ఉండాలి. ఆ పేరు ఆమె పేరు మాత్రం కాదు. శరద్ పవార్ పేరు అసలే కాదు. అయితే గియితే నితీశ్ కుమార్ అయి ఉండాలి. ఆయన మోదీ మీద గెలవకపోవచ్చు. కనీసం గట్టి పోటీ అయినా ఇస్తారని మమత భావిస్తూ ఉండాలి. ఇది ఇలా ఉండగా, రాహుల్ గాంధీ యాత్ర గురించి కాంగ్రెస్ అకస్మాత్తుగా ప్రకటించడంతో ప్రతిపక్షాల వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఆలోచనలు, నిర్ణయాలకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. ఈ యాత్ర విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఇండియా కూటమితో మాట వరసకైనా సంప్రదించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని కలుపుకుని వెడుతుందా లేక ఒంటరి ప్రయాణం సాగిస్తుందా అన్న చర్చ ఇప్పుడు ప్రతిపక్షాల్లో మొదలైంది. నిజానికి, ఇండియా కూటమి అనేక ర్యాలీలు, బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ యాత్రతో ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఏమవుతాయన్న ప్రశ్న తలెత్తుతోంది. వీటన్నిటి దృష్ట్యా ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నాలను, ఇతర నిర్ణయాలను ఎన్నికల తర్వాత కాలానికి వాయిదా వేయడం మంచిదా అన్న ఆలోచన కూడా ప్రారంభమైంది.

పునరుద్ధరణ ప్రయత్నాలు
సీట్ల పంపకంలో ఇతర పక్షాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం వంటి ఇరకాట పరిస్థితులను, తమకు దేశంలో ఎక్కడా పట్టూ పలుకుబడీ లేదన్న ప్రతిపక్షాల భావనను దూరం పెట్టడానికి కాంగ్రెస్ ఈ యాత్రను ప్రకటించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనను తాను పునరుద్ధరించుకునే ఆలోచనలో ఉంది. మోదీ ప్రాభవాన్ని స్వయంగా ఎదుర్కోవడం, మోదీ ప్రాభవం తగ్గిన తర్వాత విజృంభించడం ఈ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. తమ అస్తిత్వం గురించి, తమ ప్రాభవం గురించి అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలతో తాము చేతులు కలపడం వల్ల చరిత్రలో ఒక నిరుపయోగ, నిష్ఫల పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉందని కూడా పార్టీ సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా, ప్రతిపక్షాలకు ఒక ముఖమంటూ అవసరం లేదని శరద్ పవార్ ప్రకటించడం అటు మమతా బెనర్జీని, ఇటు నితీశ్ కుమార్ నూ ఇరకాటంలో పెట్టింది. అంతేకాక, ఆయన ప్రకటన కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలించింది. 1977లో ప్రతిపక్షాల కూటమి ఏర్పడినప్పుడు మొరార్జీ దేశాయ్ పేరు ఎక్కడా వినిపించలేదని కూడా ఆయన ఉదాహరణగా చెప్పారు. అయితే, అప్పట్లో ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటి మీద నిలిచి కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయగలిగాయి. ఇప్పుడు అందుకు అవకాశం కనిపించడం లేదు. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ ప్రతిపక్ష కూటమికి నాయకుడుగా కనిపించారు.

ఇది ఇలా ఉండగా, జనతా దళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ ప్లేటు ఫిరాయించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రతిపక్షాలను ఒక్క తాటి మీదకు తెచ్చే ప్రయత్నాలను కట్టిపెట్టి, బీజేపీతో మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉందంటూ వదంతులు వ్యాపించాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు తన కుమారుడే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని లాలూ ప్రసాద్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇండియా కూటమికి ఈ వార్తలన్నీ తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇంకా ఎటువంటి వార్తలు రాబోతున్నాయో అన్న ఆలోచన కూడా లేకపోలేదు.

– వి. వెంకటేశ్వరరావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News