దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార ధాన్యాలకు, ఇంధనానికి తీవ్ర కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధంతోనే అవస్థలు పడుతుండగా గోరు చుట్టు మీద రోకటి పోటు లాగా ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం వచ్చిపడింది. ప్రపంచ దేశాలన్నీ మరో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గాజా యుద్ధం ఇక్కడితో ఆగే అవకాశం లేదు. అనేక దేశాలు ఈ యుద్ధంలో భాగం పంచుకుంటున్నందువల్ల ఈ యుద్ధం విస్తరించే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ యుద్ధంలో భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటుండగా, ఈ మరణాలతో పాటు, ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులకు కొరత వంటి పరిణామాలతో ప్రపంచం మరింత గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్ధం ముదురుతున్న కొద్దీ ధరలు పెరగడం ఎక్కువవుతోంది. మేలి రకం బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 3.44 శాతం పెరిగి, బ్యారెల్ ధర 87.49 డాలర్లకు చేరుకుంది.అమెరికా ముడి చమురు ధర కూడా 3.85 శాతం పెరిగి, బ్యారెల్ ధర 85.98 డాలర్లకు చేరుకుంది.ఇటీవలే అయిదారు డాలర్లు తగ్గిన పెట్రోల్ ధర కొరతల భయం కారణంగా ఇప్పుడు భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు సడలించినప్పటి నుంచి ఆ ప్రధాన పెట్రోల్ ఉత్పత్తి దేశం మరింతగా పెట్రోల్ సరఫరాలను పెంచింది. అయితే, ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడిన హమాస్‌కు ఇరాన్ మద్దతు ఇస్తోందనే కారణంపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించే పక్షంలో సరఫరాలలో కోతపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ కూడా ఈయుద్ధంలో ప్రత్యక్షంగా భాగస్వామురాలైతే, సముద్ర మార్గం ద్వారా చమురును సరఫరా చేయడానికి కూడా విఘాతం ఏర్పడుతుంది. ఇరాన్ దేశానికి దక్షిణంగా ఉన్న హార్ముజ్ జల సంధి నుంచి వివిధ దేశాలకు సరఫరా అవుతున్న పెట్రోలు ఇక సరఫరా అయ్యే అవకాశమే ఉండదు. సుమారు 85 శాతం పెట్రోలును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్ ప్రస్తుతానికి ద్రవ్యోల్బణాన్ని ఏదో విధంగా అదుపులో ఉంచుతోందికానీ, యుద్ధం వల్ల బ్యారెల్ పెట్రోల్ ధర 100 డాలర్లకు చేరే పక్షంలో ఆర్థికంగా అతలాకుతలం కావడం ఖాయమని చెప్పవచ్చు.చమురు ధరలుఏ కొద్దిగా పెరిగినా భారత్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పేట్రేగిపోయే అవకాశం ఉంది.
మరొక ప్రమాదం ఏమిటంటే, ఈ యుద్ధాల వల్ల భారత్-మధ్య ప్రాచ్యం-ఐరోపా దేశాల ఆర్థిక నడవా కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమానికి పోటీగా సౌదీ అరేబియా మీదుగా భారత్, ఐరోపా దేశాల మధ్య చోటు చేసుకున్న ఆర్థికాభివృద్ధి కార్యక్రమం కుంటుపడే ప్రమాదం ఉంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండడంతో ఈ దేశాల మధ్య వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం లేదు. సంబంధాలు మళ్లీ సజావుగాసాగడానికి మరి కొంత కాలంపట్టవచ్చు. అంతేకాదు, భారత్‌కు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో కూడాసంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ నుంచి భద్రతా సంబంధమైన టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్ భద్రతా సంబంధమైన టెక్నాలజీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. హమాస్ హఠాత్తుగా దాడి చేసినప్పుడు ఈ భద్రతా వ్యవస్థ ఘోరంగా విఫలం కావడంతో భారత్ కూడా ఈ వ్యవస్థ గురించి పునరాలోచించాల్సిన అగత్యం ఏర్పడింది. ముడి చమురు ధర పెరిగే అవకాశాలున్నప్పటికీభారత్‌తన చిల్లర చమురు ధరలను అదుపులో ఉంచలేకపోయిన పక్షంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. భారత్ ఈ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది.
Inflation: ముంచుకొస్తున ద్రవ్యోల్బణ ప్రమాదం
ప్రపంచ యుద్ధాలతో ధరాఘాతం సమస్యలు