అగ్రరాజ్యాలతో సహా ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మెరుగ్గానే ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్), ప్రపంచ బ్యాంకుతో సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారతదేశం ‘ఆశాజనక పరిస్థితి’లో ఉన్నట్టు తమ నివేదికల్లో వెల్లడించాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలన్నిటి కన్నా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు వెడుతున్నట్టు కూడా అవి తెలిపాయి. 2022-23లో ఏడు శాతం జీడీపీని సాధించిన భారత్ ఈ ఏడాది ఆరు శాతం జీడీపీని ఆశిస్తోందని, దీనిని బట్టి, భారత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా ముందుకు వెడుతున్నట్టు అర్థమవుతోందని అవి పేర్కొన్నాయి.ద్రవ్యోల్బణం కూడా లక్ష్య స్థాయి 6 శాతంకన్నా కొద్దిగా మాత్రమే ఎక్కువగా ఉందని, విదేశీ మారక నిల్వలలో స్థిరత్వం నమోదు చేయడంతో పాటు, ఫైనాన్షియల్ మార్కెట్లలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తోందని ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. కోవిడ్ కాలంలో వెనుకపట్టు పట్టిన ఆర్థిక ప్రగతి ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహకారానికి సంబంధించిన ఆఫర్లు వస్తున్నా భారత్ వాటిని తిరస్కరిస్తూ క్రమంగా బలపడుతోందని వాటి నివేదికలు తెలియజేశాయి. కోవిడ్, ఆర్థిక మాంద్యం వంటి కష్ట సమయాల్లో కూడా భారత్ ఇతర దేశాల మీద ఆధారపడడం, వాటి సహాయ సహకారాలతో పునరుజ్జీవన పథకాలను ప్రవేశపెట్టడం వంటివి కూడా చేయకపోవడం గమనించాల్సిన విషయం.
కోవిడ్ సమయంలోనే కాక, ఆర్థిక మాంద్యంలో కూడా వివిధ అభివృద్ధి చెందిన దేశాలు, అదే సమయంలో భారత్ అనుసరించిన విధానాలు ఇక్కడ పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. 2008లో ప్రపంచంలో ఇటువంటి ఆర్థిక సంక్షోభమే తలెత్తినప్పుడు భారత్ ఎలావ్యవహరించిందీకూడాఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది.2008 సంక్షోభం తర్వాత భారత్ వ్యవహరించిన తీరుకూ, ఇప్పటి తీరుకూ ఎంతో తేడాఉంది.కోవిడ్ కాలంలో ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సరఫరా వ్యవస్థలను సజావుగా పనిచేయించడంవల్ల ధరలు చాలావరకు నియంత్రణలోకి వచ్చాయి. అంతేకాదు, డిమాండ్ వైపు నుంచి కూడా కొన్ని పటిష్ఠమైన చర్యలను తీసుకోవడం జరిగింది. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రధానంగా డిమాండ్ వైపు మాత్రమే చర్యలు తీసుకున్నందువల్ల ఆర్థిక వ్యవస్థ కొద్దిగా దెబ్బ తినవలసి వచ్చింది.సరఫరా వైపున చర్యలు తీసుకోకపోవడం వల్ల ద్రవ్యోల్బనం రెండంకెలకు చేరుకుంది. ఆ తర్వాత రెండేళ్ల పాటు భారత్ ఆర్థిక సమస్యల్లో మునిగి తేలింది.
కాగా, ఇటీవలి కాలంలో భారత్ కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో భారత్ వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. నిజానికి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం దేశీయ విధానాల కంటే అంతర్జాతీయ పరిస్థితులే చాలావరకు కారణం. విదేశీ మారక విలువలో తరుగుదల, చమురు ధరలు పెరగడం, అమెరికా తన వడ్డీ రేట్లు పెంచడంవంటివి దేశీయంగా ధరల పెరుగుదలకు చాలావరకు కారణమయ్యాయి. విచిత్రమేమిటంటే, అగ్ర రాజ్యాలతో సహా అనేక దేశాలు కేవలం పుస్తక విజ్ఞానం మీద ఆధారపడి కేవలం డిమాండ్‌కు సంబంధించిన విధానాల వైపే ఎక్కువగా మొగ్గు చూపడంతో ఆ తర్వాత అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడలేకపోయాయి. గత నాలుగు దశాబ్దాలకాలంలో అనుభవించని సమస్యలన్నిటినీ అవి ఎదుర్కోవడంజరిగింది. భారత్ మాత్రం 2008 నాటి సంక్షోభం నుంచి నేర్చుకున్న పాఠాలతో తన విధానాలను పూర్తిగా మార్చుకుని, సాంప్రదాయ విరుద్ధ పద్ధతుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాల మీదకు ఎక్కించగలిగింది.
అమెరికాతో సహా పలు అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించిన రొటీన్ విధానాల వల్ల ఆర్థిక మాంద్యసమయంలో వాటిఆర్థిక వ్యవస్థలు మరింతగా కుంగిపోవడంతో పాటు, కొన్నిదేశాలలో ప్రగతి అనేదే స్తంభించిపోయింది. ఆ దేశాలలో బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా చప్పగా చతికిలపడిపోవడం గమనించాల్సిన విషయం. ఆ దేశాలలో ఇప్పటికీ జీడీపీకి, ద్రవ్యోల్బణానికి మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదు. మరొక విశేషమేమిటంటే, సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాల మీద దుష్ప్రభావం కనిపిస్తూ ఉంటాయి. అయితే, వీటి ప్రభావం భారత్‌మీద మాత్రం అత్యల్ప స్థాయిలో ఉంది. విచిత్రమేమిటంటే, ప్రస్తుతం అమెరికా, మరికొన్ని ఐరోపా దేశాలు ‘భారత్ మోడల్’ను అనుసరించే ప్రయత్నంలో ఉన్నాయి. కోవిడ్‌కారణంగా భారత్‌లో వ్యవసాయ సంబంధమైన ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా వరకు దెబ్బతిన్నది. వాతావరణ మార్పులు, ఎల్‌నీనో ప్రభావం వల్ల కూడా వ్యవసాయ రంగంలో దిగుబడి తగ్గడం, సంక్షోభాలు పెరగడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు నాట్లు వేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందిగా తమ రైతులకు సూచించడం కూడా జరిగింది. నిజానికి, మూడేళ్లుగా వ్యవసాయ దిగుబడి బాగానే ఉన్నందువల్ల ఒక ఏడాది దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది.భారత్ ముందున్న మరో సవాలు ఏమిటంటే, ఈ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో ఎగుమతులు కొద్దిగా తగ్గడం సహజమే కానీ, దిగుమతులు కూడా తగ్గడం కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టి పెడుతోంది.