దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహకాలు చాలా సీరియస్ గా చేస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ వంటి పథకాలు ఎలాగూ ఓవైపు సాగుతుంటాయి. మరోవైపు ప్రజలను ఆకట్టుకోగలిగే విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులను ఎన్నికల బరిలోకి లాగేందుకు చిన్నా-పెద్దా రాజకీయ పార్టీలన్నీ సెలబ్రిటీల ఇళ్ల ముందు క్యూ కట్టేస్తున్నాయి.
ప్రజాకర్షణ ఉన్న ముఖాలతో నిజంగా ఓట్లు పడతాయా? ఇలాంటి స్టార్లంతా కలిసి ఎన్నికల ర్యాలీలకైతే ప్రజలను రప్పించగలరు కానీ అలా సభలకు, రోడ్ షోలకు వచ్చిన వారంతా తమ పార్టీకే ఓటు వేసేలా వీళ్లైతే మంత్రం వేయలేరు. ఇది రాజకీయ పార్టీల అధినేతలకు బాగా తెలుసు, కానీ ప్రచార సభల్లో జనం కిక్కిరిసినట్టు కనిపించాలంటే ఈమాత్రం సందడి చేసి, రప్పించక తప్పదన్నది వారి ఉద్దేశం.
ఇతర పార్టీల నుంచి తమ పార్టీల్లోకి వచ్చిన వారికి పార్టీ పదవులు బ్రహ్మాండంగా ఇచ్చి, కూర్చోబెట్టిన బీజేపీ ఇప్పుడు అందరి కంటే ముందే ఈర్యాలీలో దూసుకుపోయే కసరత్తు చేస్తోంది. అటు గుజరాత్ ఎన్నికలకు తెర పడిందో లేదో ఇటు మెగా మీట్ కు తెర తీసింది. బీజేపీ హైకమాండ్ కు క్షణం తీరిక లేకుండా ఎలక్షన్ మారథాన్ కు శ్రీకారం చుట్టింది. రేయింబవళ్లు పొలిటికల్ ఫీట్లను చేసేస్తోంది. ఇది ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి. బీజేపీ హడావిడి, వేగం చూసి తామెక్కడ వెనుకబడిపోతున్నామోనని కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీలకు ఒకటే దడ పుట్టుకొస్తోంది.
దేశంలోని ఎన్డీఏ ఏతర పార్టీల మెడలకు సీబీఐ, ఈడీ, ఐటీ..ఇలా వివిధ టెన్షన్లు చుట్టేసి, తాను మాత్రం పద్ధతిగా ఎన్నికల వ్యూహాలు రచిస్తూ, అమలు చేస్తూ కమలనాథులు దూసుకుపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. ఈనెల 5, 6 తేదీల్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్స్ తో కీలక భేటీ సాగనుంది. 2024 సాధారణ ఎన్నికల్లో అవలంభించాల్సిన అతిముఖ్యమైన రోడ్ మ్యాప్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా చర్చిస్తారు. మోడీ కూడా ఈ భేటీకి వర్చువల్ గా హాజరవుతారు.
2023లో కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండగా ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాన్ని అవలంభించాలో కూడా ఈ భేటీలో చర్చిస్తారు. బీజేపీ నేషనల్ ఆఫీస్ బేరర్స్, అన్ని రాష్ట్రాల ఇంఛార్జులు, కో-ఇన్-ఛార్జులు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జీ-20 శిఖరాగ్ర సదస్సు మనదేశం జరుగుతుండటం ఈనేపథ్యంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందనే చర్చ ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లతో పార్టీకి మరింత ఇమేజ్ పెరిగేలా ప్రచార కార్యక్రమాలను ఊదరగొట్టడం ఎలా అన్న విషయంపై కూడా సుదీర్ఘ మంతనాలు జరుగనున్నాయి.
ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర అంటూ ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల వేడిని రాజేసింది. ఇందులో భాగంగా మరో మూడు నెలల్లో ఏఐసీసీని బలోపేతం చేసి పార్టీని జనాల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే వ్యూహాలు జోరుగా సాగుతున్నాయి. ఖర్గేకు పార్టీ బాధ్యతలు అప్పగించి, పాదయాత్ర ద్వారా జనాల్లో తిరుగుతున్న రాహుల్ పార్టీ ఇమేజ్ ను, తన వ్యక్తిగత ఇమేజ్ గ్రాఫ్ ను బాగానే పెంచుకుంటున్నారు.
కేసులు, కోర్టులు, బెయిలు, వాయిదాలు అంటూ మిగతా పార్టీలన్నీ బిజీగా తలమునకలైపోతున్నాయి. కొత్తగా వచ్చి చేరిన ఆమ్ ఆద్మీ పార్టీతో సహా, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ, టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం ఇలా మీరు ఎన్డీయే ఏతర పార్టీలు వేటి పేర్లు చెప్పినా అన్ని పార్టీల్లోని లీడర్ల చుట్టూ ఉచ్చు బిగించేసింది బీజేపీ.
ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిపై సమానంగా దృష్టిసారిస్తున్న బీజేపీ తమ వ్యూహాలను ప్రత్యర్థులకు అంతుచిక్కకుండా రచిస్తోంది. ఉదాహరణకు కాశీ-తమిళ లింకునే చెప్పుకోవచ్చు. కాశీకి రామేశ్వరానికి విడదీయరాని సంబంధం ఉందని, తమిళులపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వారణాసిలో చెన్నై సంగమం అనే కనివినీ ఎరుగని ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ప్రాణం పోసి ద్రవిడ పార్టీలకు ఝలక్ ఇస్తోంది బీజేపీ. ఎలాగైనా కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారం చేపట్టి, హ్యాట్రిక్ కొట్టాలనే తాపత్రయం కాషాయపార్టీలో మెండుగా కనిపిస్తోంది.
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహించుకుంటూ, తమ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు పొత్తులు, ఎత్తులు, సరికొత్త సమీకరణాలను తెరపైకి తెచ్చేందుకు అందరూ తమతమ ఎన్నికల వ్యూహకర్తలతో సంప్రదింపులు జరిపేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్టే అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలతో సర్వసన్నద్ధం అవుతుండటం విశేషం. 2023 రెండవ భాగంలో సాధారణ ఎన్నికలకు సర్వం సమాయత్తం అయ్యేలా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండటం చూస్తుంటే అప్పుడే ఎన్నికల సెగ రాజుకున్నట్టు స్పష్టమవుతోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో అన్ని పార్టీలు అజెండా-2024ను దాదాపు ప్రకటించేసాయి. ప్రజలకు కూడా పార్టీల ఆలోచనా విధానాలు అర్థమయ్యాయి.