Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్India in UN: ఐక్యరాజ్య సమితి వ్యవహారశైలిపై భారత్ ఆక్షేపణ

India in UN: ఐక్యరాజ్య సమితి వ్యవహారశైలిపై భారత్ ఆక్షేపణ

మనదేశంపై ప్రపంచ దేశాల కుట్రలు

మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్ కు కొనసాగింపుగా 1945 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడానికి, ఆర్థిక, సామాజిక మరియు మానవతా సమస్యలపై దేశాల మధ్య సహకారాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా ఐక్య రాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ క్రింద జనవరి 17, 1946న స్థాపించబడిన ఆరు ప్రధాన విభాగాలలో ఒకటైన “భద్రతా మండలి” (Security Council) లో ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా మరియు ఫ్రాన్స్ లు “వీటో” అధికారం కలిగి ఉండగా రొటేషన్ పద్ధతిలో రెండు సంవత్సరాల కాల పరిమితితో ఎంపిక కాబడే మరో 10 దేశాలు అశాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. లండన్ లోని చర్చ్ హౌస్, వెస్ట్ మినిస్టర్ లో తొలి సమావేశం తరువాత అమెరికా లోని న్యూయార్క్ లో ఐక్య రాజ్య సమితి యొక్క శాశ్వత కార్యాలయం ఏర్పాటయ్యింది. ఆరు విభాగాలలోనే మరొకటైన “జనరల్ అసెంబ్లీ” అనేది ఐక్య రాజ్య సమితి యొక్క ప్రధాన విధాన రూపకల్పన సంస్థ. సమితి లోని మొత్తం 193 సభ్య దేశాలు జనరల్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగే జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలకు అనేక మంది దేశాధినేతలు హాజరై ప్రసంగిస్తారు. శాంతి భద్రతలు, కొత్త సభ్యుల ప్రవేశం మరియు బడ్జెట్ విషయాల వంటి ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలకు సాధారణ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఇతర అంశాలపై సాధారణ మెజారిటీతో నిర్ణయాలు తీసుకోబడతాయి. జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో ఒక సంవత్సరం పాటు కాల పరిమితి గల అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎన్నుకుంటారు.

- Advertisement -

శాశ్వత సభ్యత్వం:

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాటి ప్రాముఖ్యత ఆధారంగా కొన్నిసార్లు పి5 (P5 – Permanent 5) గా పిలువబడే ఐదు దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మంజూరు చేయబడింది. భద్రతా మండలిలో ఇతర సభ్యులకు లేని “వీటో విశేష అధికారం” శాశ్వత సభ్యులకు సంక్రమింపబడింది. ఐక్య రాజ్య సమితి యొక్క “ఓపెన్ హ్యామ్ అంతర్జాతీయ న్యాయ సూత్రం” (Oppenheim’s International Law) ప్రకారం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాటి ప్రాముఖ్యత ఆధారంగా కొన్నిసార్లు పి5 (P5 – Permanent 5) గా పిలువబడే ఐదు దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మంజూరు చేయబడింది. 1945 నాటి పరిస్థితుల ఆధారంగా “శాశ్వత సభ్యత్వం” కట్టబెట్టిన ఐదు దేశాలతోనే భద్రతా మండలి వ్యవహారాలను కొనసాగిస్తూ ప్రపంచంలోనే ఐదవ ఆర్ధిక వ్యవస్థగా, నూట నలభై కోట్ల పై చిలుకు జనాభాతో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిఢవిల్లుతున్న భారతదేశానికి ఇంకా ప్రాతినిథ్యం కల్పించకపోవడం అత్యంత ఆక్షేపణీయం. 1950 లో అమెరికా మరియు 1955 లో భారత్ కు ఐక్య రాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వజూపగా అప్పటి ప్రధాని నెహ్రూ అందుకు నిరాకరించి భారత్ కు పక్కలో బల్లెంలా నిరంతరం కాలు దువ్వే చైనా కు శాశ్వత సభ్యత్వం కట్టబెట్టేలా సహకరించారన్న అంశం అప్పుడప్పుడు చర్చకు రావడం మనకు తెలుసు. 1986లో రాజీవ్ గాంధీ మరియు భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా మార్చిన తరువాత వాజ్‌పేయిలు ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
భద్రతా మండలిపై పెల్లుబుకుతున్న అసంతృప్తి:
యు ఎన్ చార్టర్ ప్రకారం అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి భుజస్కంధాలపై ఉంది. మండలి లోని ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది. చార్టర్ ప్రకారం, అన్ని సభ్య దేశాలు కౌన్సిల్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు వాటి ఉనికిని గుర్తించడంలో భద్రతా మండలి ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇరు పక్షాలను గుర్తించి శాంతియుత మార్గాల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు సిఫార్సులను అందిస్తుంది. పరిస్థితులు విషమించిన సందర్భాలలో శాంతి పునరుద్ధరణకు భద్రతా మండలి ఆంక్షలు విధించడంతో పాటు అవసరమైతే తన నేతృత్వంలో పనిచేసే శాంతి భద్రతా బలగాలను (Peacekeeping Force) వినియోగించి విధ్వంసాన్ని అరికట్టవచ్చు. అయితే అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడే ప్రాథమిక బాధ్యతతో ఏర్పాటైన భద్రతా మండలి సమర్థతపై సంవత్సరం పైగా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా స్వయంప్రతిపత్తి కోసం ఇజ్రాయిల్-హమాస్ ల మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధం, లెబనాన్ స్థావరంగా ఇజ్రాయిల్ పై జరుగుతున్న హెజ్బుల్లా తీవ్రవాద దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, యెమెన్ లోని హౌతి తీవ్రవాదులు సూయెజ్ కాలువ గుండా ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై చేస్తున్న దాడులను అరికట్టడంలో ఐక్య రాజ్య సమితి వైఫల్యంచెందడం, నానాటికీ తీవ్రమవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలను (Global Warming) తగ్గించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రపంచ దేశాలను ఏకతాటిపై తీసుకురావడంలో చొరవ చూపకపోవడం నేపథ్యంలో సందేహాలు పెల్లుబుకుతున్నాయి. ఏప్రిల్ 2023 నాటికి 120 సభ్య దేశాల నుండి 97 వేల కంటే ఎక్కువ మంది సిబ్బంది ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు సేవలందిస్తుండగా గత 70 సంవత్సరాలలో భారతదేశం రెండు లక్షల సైనిక మరియు పోలీసు సిబ్బందిని అందించింది. నవంబర్ 30, 2023 నాటికి, 6,247 మంది సిబ్బందితో నేపాల్ మరియు 6,197 మంది సైనికులతో బంగ్లాదేశ్ తరువాత 6,073 మంది సిబ్బందితో ప్రపంచవ్యాప్తంగా ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక ప్రయత్నాలకు అత్యధిక దళాల సహకారాన్ని అందించిన మూడవ దేశంగా భారత్ నిలిచింది. 1948 నుండి ప్రపంచవ్యాప్తంగా ఐక్య రాజ్య సమితి నిర్వహించిన 71 శాంతి పరిరక్షక కార్యకలాపాలకు గాను 49 లో భారత దళాలు పాల్గొనడం భారత చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదిలా ఉంటే, 2019 సంవత్సరాంతంలో చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలను కుదేలు చేయడంతో పాటు లక్షలాది మందిని పొట్టనబెట్టుకుని ప్రపంచాన్నే వల్లకాడుగా మార్చిన సందర్భంలో సైతం నిర్లిప్త ధోరణి ప్రదర్శించడం, వివిధ దేశాలలో కొనసాగుతున్న విధ్వంసాలను అరికట్టడంలో విఫలం చెందడంపై ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ తన అసంతృప్తిని వెల్లడించే క్రమంలో భాగంగా ఐక్య రాజ్య సమితికి ప్రతి సంవత్సరం తాను చెల్లించే సొమ్ములో యాభై శాతం కోత విధించడంతో పాటు తన బలగాలలో సైతం యాభై శాతం కోత విధించింది.
పుంజుకుంటున్న జి-4 దేశాలు:
జపాన్ కొత్త విదేశాంగ మంత్రిగా నియమించబడిన యోకో కమికావా తో సహా G4 (భారతదేశం, జర్మనీ, జపాన్, బ్రెజిల్) విదేశాంగ మంత్రుల సమావేశం న్యూయార్క్‌లో సెప్టెంబర్ 21, 2023 న న్యూయార్క్‌లో జరిగింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పరస్పరం సహకరించుకుంటున్న ఈ దేశాలు సమావేశం తరువాత చేసిన సంయుక్త ప్రకటనలో “సమకాలీన భౌగోళిక రాజకీయ వాస్తవాలను మెరుగ్గా ప్రతిబింబించేలా భద్రతా మండలి శాశ్వత మరియు అశాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడంతో పాటు సమగ్ర సంస్కరణలను చేపట్టాల్సిన తక్షణ తరుణం ఆసన్నమైంది” అని ప్రకటించాయి. నిర్ణీత కాల వ్యవధిలో ఖచ్చితమైన ఫలితాలను సాధించే లక్ష్యంతో రాబోయే జనరల్ అసెంబ్లీలో సమస్యను లేవనెత్తడమే కాక దాని పరిష్కారానికి కూడా కట్టుబడి ఉన్నామని ప్రకటించడం గమనార్హం. 2025లో జరుగనున్న ఐక్య రాజ్య సమితి 80వ వార్షికోత్సవాలను వేదికగా చేసుకుని సంస్కరణల ఆచరణ కోసం నిర్దిష్ట చర్యలు రూపొందించేలా G4 దేశాలు అంతర్-ప్రభుత్వ చర్చలను వినియోగించుకోవాలని కమికావా అన్నారు. కమికావా U.N సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో కూడా సమావేశమై ఇతర సమస్యలతో పాటు ఐక్య రాజ్య సమితిలో చేపట్టాల్సిన సంస్కరణలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. “భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ, భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం లేకపోవడం అసంబద్ధం” “ఏదో ఒక సమయంలో, ఐక్య రాజ్య సమితి సంస్థల పునర్విమర్శ అవసరం. అయితే సమస్య ఏమిటంటే, అధిక శక్తి ఉన్నవారు అది చేయరు మరియు వారి శక్తిని వదులుకోవడానికి ముందుకు రారు” అని ఐక్య రాజ్య సమితి లో భారత్ కు శాశ్వత సభ్యత్వం పై టెస్లా ఎలక్ట్రిక్ కార్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) ల అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) లో పేర్కొనడం గమనార్హం.
మోకాలడ్డుతున్న చైనా:
భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్య 1965 నుండి నేటి వరకు విస్తరించబడక పోగా మన దేశ ప్రయత్నాలకు చైనా ఎప్పటికప్పుడు మొకాలడ్డుతోంది. అణుశక్తిగా విస్తరిస్తున్న భారత్ కు శాశ్వత సభ్యత్వం ద్వారా ఉపఖండంలో భౌగోళిక రాజకీయాలలో లబ్ది చేకూరుతుందని చైనా మరియు దాని మిత్రదేశమైన పాకిస్తాన్ లు భావించడం, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కరోనా కల్లోలం తరువాత కూడా దేశంలోని 140 కోట్ల ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ మరియు అల్పాదాయ వర్గాలకు ఉచిత రేషన్ అందించి ఆర్ధిక ప్రగతి వేగాన్ని సంరక్షించుకుంటూ ప్రపంచంలోనే ఆర్ధికంగా అత్యంత శక్తివంతమైన ఐదవ దేశంగా ఎదగడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది.

అయితే, ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు పాటుపడుతూ అన్ని దేశాలతో మైత్రీ సంబంధాన్ని కొనసాగిస్తూ వసుదైక కుటుంబ భావనతో చరిత్రలో ఏనాడూ కూడా ఇతర దేశాలపై దండెత్తని శాంతికాముకమైన భారతదేశానికి ఐక్య రాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడం సముచితమే కాక ఐక్య రాజ్య సమితి గౌరవాన్ని కూడా ఇనుమడింపచేస్తుంది.

  • యేచన్ చంద్ర శేఖర్
    మాజీ రాష్ట్ర కార్యదర్శి
    ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
    8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News