Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్India that is Bharath: పేరు మార్పులోనే అసలైన పెన్నిధి!

India that is Bharath: పేరు మార్పులోనే అసలైన పెన్నిధి!

ప్రతిపక్షాలు అతిగా ఉలిక్కిపడుతున్నాయేమో

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత కొద్ది కాలంగా వలస రాజ్యానికి చెందిన పేర్లన్నిటినీ మారుస్తూ వస్తోంది. ఢిల్లీలోని రోడ్ల పేర్లను మార్చడం జరిగింది. అదేవిధంగా కొన్ని చిహ్నాలను, మిలిటరీ బ్యాండ్ గీతాన్ని కూడా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌ అని మార్చాలని కూడా భావించింది. అయితే, ప్రతిపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరుపెట్టుకున్న వేళ, బీజేపీ ప్రభుత్వం దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌ గా మార్చబోవడం విమర్శలకు దారితీస్తోంది. బ్రిటిష్‌ పాలకుల వ్యవహారశైలి పట్ల, వారి ‘విభజించి పాలించు’ విధానం పట్ల తీవ్రస్థాయి ఏవగింపు ఉన్న బీజేపీ పాలకుల ప్రయత్నాలు హర్షించదగ్గవే. బ్రిటిష్‌ పాలకుల కారణంగా దేశం ఇప్పటికీ పడుతున్న కొన్ని కష్టనష్టాలు, సమస్యలు ఏమాత్రం సహనీయం కానివి. ఇందులో సందేహమే లేదు.
సహజంగానే ఇండియా అనే పేరును భారత్‌ గా మార్చడంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. భావోద్వేగపరంగా ఈ రెండు పేర్లలో పెద్దగా తేడా ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజ్యాంగంలోనే ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అని ఉంది కదా అనేది కొందరి అభిప్రాయం. గత ఏడున్నర దశాబ్దాలుగా ఈ రెండు పేర్లూ కలిసే ఉన్నందువల్ల ఈ పేరు మార్పు ప్రభావం పెద్దగా ఉండబోదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. భారత్‌ అనే పేరు దేశ సాంస్కృతిక విలువలకు ప్రతీకగా కనిపిస్తే కనిపించవచ్చు. కానీ, ‘ఇండియా’ వల్ల ఇంతవరకూ జరగని నష్టం ఇప్పుడు కొత్తగా జరుగుతుందా అన్నది అంతుబట్టడం లేదని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జాతి నిర్మాణ మార్గంలో ఇండియా అనేది ఇంతవరకూ అడ్డంకిగా నిలబడలేదు. ఇది కేవలం వలస పాలకులను ఉడికించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీని వల్ల సాధించబోయేదేమీ లేదనేది ప్రతిపక్షాల విమర్శ.
నిజానికి, బీజేపీ ప్రభుత్వానికి ఈ పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఎన్నికల సమయంలో కానీ, ఇతరత్రా కానీ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం కూడా ఉండదు. అనేక పేర్ల మార్పుల్లో భాగంగా ఇది కూడా రొటీన్‌ గా చోటు చేసుకుంటున్న వ్యవహారమే. అయితే, ప్రతిపక్షాలు ఇందులో పాలక పక్షానికి రాజకీయ లబ్ధిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు చోటు చేసుకుంటున్నతరుణంలో ఈ పేరును మార్చడం వెనుక దేశ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ఆలోచన ఏదో ఉందని అవి శంకిస్తున్నాయి. ఆ మనోభావాలను కప్పి పుచ్చుకుంటూ అవి తమ ఇండియా కూటమిని చూసి భయపడిన బీజేపీ ప్రభుత్వం దేశం పేరునే మార్చడానికి సమకట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పేరును మార్చడం వెనుక ఉన్న తమ ఉద్దేశాన్ని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. దీనివల్ల ప్రజల్లో ఎటువంటి భావోద్వేగాలూ చెలరేగవన్న సంగతి ప్రతిపక్షాల కంటే బీజేపీకి బాగా తెలుసు.
బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి తమవంతుగా చేస్తున్న కృషి మీద మాత్రమే ఆధారపడి ఉందని ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్పడం జరుగుతోంది. నిజానికి, భారత్‌ లేదా భారతదేశం అనే పేరును అటు సంస్కృతీపరంగానూ, ఇటు సాహిత్యపరంగానే కాకుండా చారిత్రకంగా ఎక్కువగానే ఉపయోగించడం జరుగుతోంది. ఇండియా అనే పేరును ఎక్కువగా రాజకీయంగా ఉపయోగించడంతో పాటు, ఇతర దేశాల్లో వాడడం జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం ఈ పేరును మార్చడంపై ప్రతిపక్షాలు అతిగా ఉలిక్కిపడుతున్నాయేమో ఆనిపిస్తోంది. అత్యధిక సంఖ్యాక ప్రజల్లో దీని గురించి స్పందనేమీ కనిపించడం లేదు. రాజ్యాంగంలో ఈ రెండు పేర్లనూ వాడడం బదులుగా ఒక్క పేరునే వాడడం మంచిదని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇండియాగానే ఈ పేరును కొనసాగించడానికి బీజేపీ ప్రభుత్వం అభ్యంతరమేమీ చెప్పడం లేదు. ప్రభుత్వ రికార్డులలోనూ, అధికారిక డాక్యుమెంట్లలో మాత్రమే భారత్‌ అనే పేరు వాడకంలోకి వస్తుంది. ఇది పాలక పక్షానికి అస్త్రం కాబోదు, ప్రతిపక్షాలకూ ఆయుధం కాబోదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News