Wednesday, February 11, 2026
Homeఎడిటోరియల్ / బహుళIndia GDP Growth Rate 2026: మార్కెట్‌ భారతం.. తెలుగు రాష్ట్రాలు వృద్ధికి ఇంజిన్లు

India GDP Growth Rate 2026: మార్కెట్‌ భారతం.. తెలుగు రాష్ట్రాలు వృద్ధికి ఇంజిన్లు

Union Budget 2025-26 Impact: భారతదేశం నేడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న వినియోగ మార్కెట్‌గా నిలుస్తోంది. 2023-24లో దేశ తలసరి ఆదాయం రూ.2.12 లక్షలకు చేరగా, జీడీపీ వృద్ధిరేటు 7 శాతానికి పైగా కొనసాగుతోంది. 2025-26 యూనియన్‌ బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతి ఖర్చు శక్తిని పెంచింది. మూలధన వ్యయాన్ని 24%కి పైగా పెంచడంతో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల్లో పోర్టులు, జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు, ఫార్మా-ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాకినాడలో రూ.18 వేల కోట్ల గ్రీన్‌ అమోనియా ప్రాజెక్ట్‍, హైదరాబాద్‌ పరిసర పారిశ్రామిక విస్తరణ వేలాది ఉద్యోగాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. కేంద్ర-రాష్ట్ర విధానాల సమన్వయంతో తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక వృద్ధికి కీలక ఇంజిన్లుగా మారుతున్నాయి.

145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం, కొనుగోలు శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుండడంతో మన ఆర్థిక వ్యవస్థ దినదిన ప్రవర్ధమానం అవుతూ క్రమంగా ఇప్పటికే ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇటీవలే ప్రపంచబ్యాంకు విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే, 30.50 ట్రిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో అమెరికా నిలిచింది. 19.24 ట్రిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. 4.74 ట్రిలియన్‌ డాలర్లతో జర్మనీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత 4.19 ట్రిలియన్‌ డాలర్లతో భారతదేశం ఉంది.

మన తర్వాతి స్థానాల్లో వరుసగా జపాన్‌, యూకే, ఫ్రాన్స్‍, ఇటలీ, కెనడా, బ్రెజిల్‌ ఉన్నాయి. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన ఇంగ్లండ్‌ కూడా ఇప్పుడు మనకంటే దిగువ స్థాయిలో నిలిచింది. సరిగ్గా మనకంటే పైన ఉన్న జర్మనీ 4.74 ట్రిలియన్‌ డాలర్లే కాబట్టి.. 0.55 ట్రిలియన్‌ డాలర్ల మేర ఎదగడం పెద్ద కష్టం కాదు కాబట్టి.. అతి త్వరలో మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. దీనంతటికీ ప్రధాన కారణం… మన సువిశాల భారతదేశంలో ఉన్న అపారమైన కొనుగోలు శక్తి, ఉత్పాదక శక్తి. మన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2025 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసికంతో పోలిస్తే 2026 ప్రారంభానికి 7.8% వృద్ధిరేటు సాధించింది. ఇది మార్కెట్‌ అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండడంతో పాటు ఇదే కాలానికి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ.

దీనికి ప్రభుత్వ విధానాలు కొంతవరకు దోహదం చేస్తుంటే.. ప్రధానంగా భారతీయ సంస్కృతి కూడా మార్కెట్‌ పెరగడానికి, కొనుగోళ్లు విస్తృతం అవ్వడానికి కారణం అవుతోంది. ఇంగ్లండ్‌, అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే క్రిస్టియన్లు చేసుకునే ఏకైక ప్రధాన పండగ.. క్రిస్మస్. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, టర్కీ లాంటి కొన్ని దేశాల్లో అత్యధిక సంఖ్యలో ఉండే ముస్లింలు చేసుకునే ఏకైక ప్రధాన పండగ.. రంజాన్‌. అదే మన దేశం విషయానికొస్తే అత్యధిక సంఖ్యలో ఉండే హిందువులకు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, దీపావళి…

ఇలా ఎన్నో పెద్ద పండగలు ఉంటాయి. అయితే, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన విషయం ఒకటి ఉంది. పండగ ఎవరిదైనా సరే, మన దేశంలో అది అందరికీ పండగే అవుతోంది. ఎందుకంటే.. దాదాపు ప్రతి పండగకూ భారీగా కొనుగోళ్లు ఉంటాయి. స్వీట్లు చేసుకోవడానికి అవసరమైన సామాన్ల దగ్గర నుంచి కొత్త బట్టలు, దీపావళికి కాల్చే బాణసంచా, అలంకరణ కోసం ఉపయోగించే పూలు, దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే కొబ్బరికాయలు, పండ్లు.. ఇలాంటివి కేవలం హిందువులు మాత్రమే అమ్ముతారనుకుంటే పప్పులో కాలేసినట్లే. అన్ని మతాల వారూ ఈ అమ్మకాలు సాగిస్తారు. అందరి దగ్గరా అందరూ కొంటారు. దీనివల్ల ఆయా పర్వదినాల్లో కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతాయి. అవి అందరికీ మేలు చేస్తాయి. ఆయా ఉత్పత్తులను తయారుచేసే ఎన్నో లక్షల మందికి దీనివల్ల ఉపాధి లభిస్తుంది. వినాయకచవితి కోసం విగ్రహాల తయారీ, వాటి అలంకరణ, ఊరేగింపు, నిమజ్జనం.. ఇలాంటి అన్నింటిలోనూ అన్ని మతాల వాళ్లూ పాల్గొంటారు. ఇదే మన దేశంలో ఉన్న అత్యంత వైవిధ్యభరితమైన మార్కెట్‌ సూత్రం.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు మన దేశంలో ఎక్కువగా ఖర్చుపెట్టడానికి అవకాశం ఉండేది కాదు. వచ్చే జీతాలు తక్కువ కావడం, ఖర్చులు పెరుగుతుండడంతో వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే చిన్న మొత్తాల పొదుపు అప్పట్లో పెద్ద ఉద్యమంగా మారింది. ఇందిరా వికాస పత్రాల లాంటివి కొంటే, ఐదేళ్లలో ఆ సొమ్ము రెట్టింపు అవుతుందన్న ప్రచారం ఉధృతంగా సాగింది అయితే.. 1986 నుంచి పరిస్థితి కొంత మారింది. అప్పట్లో వినియోగదారుల రక్షణ చట్టం తీసుకురావడం పెద్ద మైలురాయి అయ్యింది. ఇక 1991 తర్వాత ఆర్థిక సరళీకరణ విధానాలు ఒక్కసారిగా వినియోగదారుల తీరుతెన్నులనే గణనీయంగా మార్చేశాయి. అప్పుడే మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుని, విదేశీ బ్రాండ్లు.. వస్తువులు అన్నీ మన దేశంలోనే లభ్యం కావడం మొదలైంది.

అంతకు ముందు చరిత్ర చూసుకుంటే, బ్రిటిష్‌ వాళ్లు మన దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. వాళ్లు మొదట ఇక్కడకు వచ్చినది వ్యాపారం కోసమే. మన దేశంలో లభ్యమయ్యే వస్తువులను కొనుగోలు చేసి తమ దేశంలో అమ్ముకోవడం, అక్కడి వస్తువులను ఇక్కడ అమ్ముకోవడం వాళ్లు చేసిన మొదటి పని. అంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో అమ్మకాలు కొనుగోళ్లు జరిగేవని అర్థమవుతుంది. అలాగే దానికి ముందు వేర్వేరు జాతుల వాళ్లు కూడా మన దేశానికి వచ్చి ఇక్కడ యుద్ధాలు చేసినా, ఆక్రమణ ప్రయత్నాలు చేసినా అదంతా ఇక్కడ లభించే అపారమైన వనరులు, సంపదను కొల్లగొట్టడానికే. భారతదేశంలో ముందునుంచే అత్యంత వైవిధ్యభరితమైన ఉత్పత్తులు ఉండేవి. వాటిని మన దేశీయులు ఎప్పటినుంచో వినియోగించేవారు. వస్తుమార్పిడి వ్యవస్థ లాంటి అద్భుతమైన విధానాలు ఇక్కడ కొనసాగాయి. వాటినుంచి క్రమంగా ధనం చలామణిలోకి రావడం, వస్తుమార్పిడికి బదులుగా డబ్బులు వినియోగించడం కూడా మొదలైంది. సమాజంలో అన్ని వర్గాల వాళ్లూ సామరస్యంతో కలిసి మెలిసి ఉండడం, అందరినీ కలుపుకొని వెళ్లడం, తద్వారా సంపూర్ణ వినియోగ విధానాలు అవలంబించడం మన దేశానికి వెన్నతో పెట్టిన విద్య.

ఇక ఆధునిక కాలానికి మళ్లీ వస్తే.. 1980లు, 1990లలో పొదుపు మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. ఆ తర్వాత నుంచి క్రమంగా ఇన్‌స్టాల్‌మెంట్లు.. అంటే వాయిదాల్లో చెల్లించే విధానాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టినప్పటి నుంచి మన వినియోగ తీరుతెన్నులు సమూలంగా మారిపోయాయి. అంటే జేబులో పది రూపాయలు ఉంటే చాలు, వంద రూపాయల విలువ చేసే వస్తువును ఇంటికి తెచ్చేసుకోవచ్చు. తర్వాత నెలకు 10 రూపాయల చొప్పున మరో తొమ్మిది నెలలో, పది నెలలో కడితే ఆ వస్తువు పూర్తిగా మన సొంతం అయిపోతుంది. అది ఇంట్లో వాడుకునే రెఫ్రిజిరేటర్‌ కావచ్చు, ప్రతిరోజూ తిరిగే వాహనం కావచ్చు, వినోదం కోసం కుటుంబసభ్యులంతా చూసే టెలివిజన్‌ కావచ్చు.. ఏదైనా ఈఎంఐ అంటే సులభ వాయిదాల్లో చెల్లించే విధానం మన దేశానికి పెనుతుపానులా వచ్చింది.

2000 తొలినాళ్లలో ఇది అన్నిరకాల వస్తువులకూ వ్యాపించింది. అప్పటి నుంచి భారతీయుల కొనుగోళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. 2010 తర్వాతి నుంచి జీరో కాస్ట్‍ ఈఎంఐ అనేది కూడా రంగప్రవేశం చేసింది. అందులో భాగంగా వాయిదాల్లో వస్తువు అసలు ధర చెల్లిస్తే చాలు, ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టక్కర్లేదని చెప్పడం మొదలుపెట్టారు. అయితే, సరైన సమయానికి ఈఎంఐ చెల్లించాలన్న ఒక్క నిబంధన మాత్రం పెట్టారు. ఆలస్యమైతే అపరాధ రుసుము పేరుతో భారీగా వడ్డీలు వేయసాగారు. ఇక ఈఎంఐ అనేది ఒక సర్వసాధారణ జీవనశైలిలా మారిపోయింది. నెలకు కొంత చొప్పున కట్టే వెసులుబాటు ఉన్నప్పుడు జేబులో డబ్బంతా ఒక్కసారే ఖర్చుపెట్టేయడం ఎందుకు?

అది వేరే అవసరానికి వాడుకోవచ్చు కదా అనే ఆలోచన రావడంతో కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. ఇలా వినియోగదారులు కొనుగోలు చేసిన సొమ్ము మార్కెట్‌లోకి వెళ్లడం, దాన్నుంచే వాణిజ్య పన్నుల రూపంలోనో.. ప్రస్తుతం ఉన్న వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలోనో ప్రభుత్వానికి చేరడం, ఆ డబ్బులనే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలకు వెచ్చించడం.. ఇలాంటివన్నీ ఒక చక్రంలా జరిగిపోతుంటాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా సరే, వాళ్లు తప్పనిసరిగా చెల్లించే ఆదాయపన్ను కూడా ప్రభుత్వానికి వెళ్తుంది.

ఆదాయపన్ను, జీఎస్టీ సహా పలు రకాల పన్నులను ఇటీవలి కాలంలో ప్రభుత్వం తగ్గించడంతో ప్రైవేటు వినియోగం ఒక్కసారిగా ఏడు శాతం పెరిగిందని మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి. చెల్లించే పన్నులు తగ్గడంతో సహజంగానే వినియోగదారుల దగ్గర ఖర్చుపెట్టడానికి వీలయ్యే డబ్బులు తగినన్ని మిగలడం మొదలైంది. గత సంవత్సరం జులై తర్వాత రీటైల్‌ అమ్మకాలు ఏకంగా 6.8% పెరిగాయి. 2025 రెండో త్రైమాసికంలో ఫాస్ట్‍ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‍.. అంటే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకం ఒకేసారి 13.9% పెరిగింది. వీటన్నింటి ఫలితంగా ప్రభుత్వం చేసే ఖర్చులు కూడా అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.5% పెరిగాయి. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మరింత ఎక్కువగా, త్వరగా విడుదల చేయడం మొదలైంది. వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడుల వెల్లువ చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ పెట్టుబడులను ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దాదాపు రూ.18వేల కోట్లతో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంటుకు శనివారమే శంకుస్థాపన జరిగింది. అక్కడినుంచి జర్మనీ, జపాన్‌, సింగపూర్‌ లాంటి దేశాలకు గ్రీన్‌ అమ్మోనియా ఎగుమతులు జరుగుతాయని అంటున్నారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో కావల్సినంత ఆదాయం లభిస్తుంది, మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా పెద్దమొత్తంలోనే సమకూరుతుంది. దానికితోడు ఆ ప్రాంతంలో కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇలాంటి గ్రాస్ ఫిక్స్‍డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ 7.8% పెరిగింది. ప్రభుత్వం చేసే పెట్టుబడి వ్యయం లేదా మూలధన వ్యయం కూడా గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 16.3% ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అది ఏకంగా 24.5%కు పెరిగింది. దీనివల్ల మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి పరుగులు తీయడం ఖాయమన్న విశ్వాసం పెట్టుబడిదారుల్లో కలిగింది. జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవుల్లాంటి సదుపాయాలు పెరిగితే సహజంగానే ఆయా ప్రాంతాల్లో తమ కర్మాగారాలు ఏర్పాటుచేసేందుకు చాలామంది ముందుకొస్తారు.

విదేశాలకు ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా లాంటి దేశాలు సుంకాల పేరుతో అతి చేస్తున్నా కూడా అక్కడినుంచి కూడా డిమాండు ఏమాత్రం తగ్గడం లేదు. వివిధ దేశాలకు మనం చేసే ఎగుమతులు గత సంవత్సరం కంటే 6.3% పెరిగాయి. గడిచిన 14 సంవత్సరాల్లో ఎగుమతి ఆర్డర్ల వేగం ఇప్పుడే బాగా ఎక్కువగా ఉందని మార్కెట్‌ పండితులు చెబుతున్నారు.

2026లో మరింత పైపైకి…

ప్రపంచంలో అన్ని దేశాలూ ఇప్పుడు మనవైపే చూస్తున్నాయి. ఒకవైపు ఈశాన్య రాష్ట్రాల భూభాగం మీద కన్నేసిన చైనా కూడా ఇప్పుడు మనతో సత్సంబంధాలు నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. అగ్రరాజ్యాల్లో ఒకటైన జర్మనీ సైతం మనకు స్నేహహస్తం అందిస్తోంది. సుంకాల పేరుతో హడావుడి చేస్తున్న ట్రంప్‌ సైతం అమెరికాలో మన ఉత్పత్తులకు ఉన్న డిమాండును కాదనలేకపోతున్నారు. ఇంకా అనేక చిన్న, పెద్ద దేశాలు సైతం మన దేశంతో వాణిజ్యానికి తహతహలాడుతున్నాయి. దానంతటికీ ప్రధాన కారణం..

మనదేశంలో చాలా పెద్దసంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారులు. మన దేశం నుంచి ఉత్పత్తి అవుతున్న అనేకానేక వస్తువులు, సరుకులు విదేశాల్లో ఉన్నవారికి కావాలి. అలాగే అక్కడ ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు మార్కెట్‌ రూపంలో భారతీయులు కావాలి. ఈ సూత్రం ఇటీవలి కాలంలో చాలా బాగా పనిచేస్తోంది. మన దేశంలో కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వారికి వేతనాలు గణనీయంగా పెరగడంతో వినిమయతత్వం ఎక్కువైంది. అందుకు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్న విదేశీ ప్రయాణాలే ప్రత్యక్ష నిదర్శనం. స్వదేశంలో కూడా ఒకప్పుడు ఎంత దూరమైనా రెండు మూడు రోజుల పాటు రైళ్లలో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు 10-12 గంటల ప్రయాణం చేయడం కంటే విమానంలో గంటలో వెళ్లిపోవచ్చు కదా అనే ఆలోచన కనిపిస్తోంది.

వీటన్నింటి కారణంగానే మన ఆర్థిక వ్యవస్థ రేసుగుర్రంలా పరుగులు పెడుతోంది. జీడీపీ వృద్ధి రేటు 6.5-7.4% వరకు ఉంటోంది. ఇది ప్రపంచంలోని మొత్తం వృద్ధిరేటుకు దాదాపు రెట్టింపు కంటే కూడా ఎక్కువ. 2027-28 నాటికల్లా జర్మనీనిసైతం అధిగమించి.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సంసిద్ధమవుతోంది.

యువభారతం.. సాంకేతిక ఊతం

ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలోని మొత్తం జనాభాలో యువత శాతం ఎక్కువ. మన దేశ పౌరుల సగటు వయస్సు.. కేవలం 28 సంవత్సరాలు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పనిచేయగలిగే వయసులో ఉన్నవారు మన దేశంలోనే ఉన్నారు. దానికితోడు సాంకేతిక నైపుణ్యం విషయంలోనూ మనం అందరికంటే అగ్రగణ్యులం అనడంలో సందేహం లేదు. అందుకు అతిపెద్ద నిదర్శనం.. యూపీఐ. ఐదు రూపాయలు పెట్టి కొత్తిమీర కొనాలన్నా కూడా వెంటనే జేబులోంచి ఫోన్‌ తీసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లిస్తున్నాం. లక్ష రూపాయలు పెట్టి నగలు కొనాలన్నా కూడా అదే యూపీఐని వినియోగించగలుగుతున్నాం. అగ్రరాజ్యంగా గొప్పలు చెప్పుకొనే అమెరికాలో కూడా ఇంత సులభమైన వ్యవస్థ లేదు. ఆధార్‌ లాంటి గుర్తింపు చాలా వ్యవస్థలకు అనుసంధానం కావడంతో ప్రజల జీవనం సులభతరమైంది.

145 కోట్ల జనాభా ఉన్నా కూడా అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చేలా బ్యాంకుఖాతాలు, వాటికి అనుబంధంగా యూపీఐ ఉండడం మన దేశంలోనే సాధ్యమైంది. మన యువతరం సాంకేతిక నైపుణ్యం ఆధారంగా వివిధ దేశాలకు వెళ్లడమే కాదు.. అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీలకు సారథ్యం కూడా వహిస్తున్నారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్‌ లాంటి వాళ్ల పేర్లు చెప్పాలంటే ఈ పేజీ మొత్తం రాసినా సరిపోదు. మన దేశంలో ఉన్న 145 కోట్ల మందిలో దాదాపు 50 కోట్ల మంది మధ్య లేదా అధికాదాయ వర్గాలలోకి వస్తుండడంతో వివిధ రంగాల్లో డిమాండు అపరిమితంగా పెరుగుతూనే ఉంది. ఇదే మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ఊతంగా నిలుస్తోంది.

తలసరి ఆదాయం పెరుగుదల – కేంద్ర విధానాలు, తెలుగు రాష్ట్రాల అవకాశాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహక విధానాల ప్రభావంతో దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం స్థిరంగా పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ తలసరి ఆదాయం సుమారు రూ.2.12 లక్షలకు చేరింది. ఇదే ధోరణి కొనసాగితే 2047 నాటికి అది రూ.14.9 లక్షల స్థాయికి చేరే అవకాశముందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఈ దిశగా 2025-26 యూనియన్‌ బడ్జెట్‌ కీలక మైలురాయిగా నిలుస్తోంది. మధ్యతరగతి వర్గానికి ఊరటనిస్తూ రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిస్థాయి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తిదారుల వద్ద ఖర్చు చేయగలిగే ఆదాయం గణనీయంగా పెరిగింది.

తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే, కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై 24%కి పైగా పెంచిన మూలధన వ్యయం ప్రత్యక్షంగా లాభం చేకూర్చుతోంది. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టులు, రైల్వే లాజిస్టిక్స్‍ అభివృద్ధి వల్ల విశాఖపట్నం-కాకినాడ తీరప్రాంతం, హైదరాబాద్‌ పరిసర పారిశ్రామిక మండలాల్లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడలో రూ.18 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ అమోనియా ప్లాంట్‌, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్‍, డిఫెన్స్‍ తయారీ రంగాల్లోని పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టించనున్నాయి. అలాగే ఎంఎస్ఎంఈలకు క్రెడిట్‌ గ్యారంటీ పరిమితి పెంపుతో వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల రుణ ప్రవాహం తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరిగి, తలసరి ఆదాయం వృద్ధికి బలమైన పునాది పడింది.

అదే సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు, పీఎల్‌ఐ పథకాలు, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాల విస్తరణ వల్ల తెలుగు యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ విధానాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌లుగా మారుస్తూ, రాబోయే సంవత్సరాల్లో తలసరి ఆదాయం మరింత వేగంగా పెరగడానికి దోహదపడనున్నాయి.

తలసరి ఆదాయం పెరుగుదలలో సవాళ్లు – పరిష్కార మార్గాలు

ఆర్థిక వృద్ధి వేగంగా కొనసాగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం సమానంగా పెరగడంలో కొన్ని ప్రధాన సవాళ్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై అధికంగా ఆధారపడటం, వాతావరణ మార్పుల ప్రభావం, ఉపాధి అవకాశాల అసమాన పంపిణీ ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో ఐటీ, సేవారంగాల్లో వృద్ధి ఉన్నప్పటికీ, తయారీ రంగం ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేకపోతోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాల లభ్యత, భూమి కేటాయింపు, నియంత్రణ ప్రక్రియల్లో జాప్యం ఇంకా సమస్యగానే ఉంది. ఈ సవాళ్లను అధిగమించాలంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవసాయాన్ని విలువ ఆధారిత రంగంగా మార్చడం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ, లాజిస్టిక్స్‍, డిఫెన్స్‍ తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులను వేగవంతం చేయాలి. అదే సమయంలో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అందించడం, ఎంఎస్ఎంఈలకు తక్షణ రుణాలు, సులభమైన అనుమతుల వ్యవస్థ అమలు చేయడం ద్వారా ఉపాధి, ఆదాయాల వృద్ధిని సమతుల్యంగా సాధించవచ్చు. వృద్ధి వేగంతో పాటు వృద్ధి నాణ్యతపై దృష్టి పెట్టినప్పుడే తలసరి ఆదాయం నిజమైన అర్థంలో పెరుగుతుంది.

అప్రమత్తత అవసరం

అయితే, ఇంతగా ఎదిగిపోతున్నామని మనం విర్రవీగడానికి కూడా లేదు. ఎందుకంటే, మన దేశంలో ఇప్పటికీ తలసరి ఆదాయం చాలా దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. అందుకు కారణం కూడా మళ్లీ మన జనాభానే. దానికితోడు ఏవైనా కొత్త వ్యాపారాలు, సంస్థలు ఏర్పాటుచేయాలంటే కొన్ని నియంత్రణలు, నిబంధనలు ఇంకా అడ్డంకిగానే ఉంటున్నాయి. కొన్ని రంగాల్లో ఈక్విటీ ఉల్లంఘనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పెరిగేకొద్దీ ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు, కార్పొరేషన్లు, విధాన నిర్ణేతలకు మన దేశం దీర్ఘకాలంలో బాగానే కనపడుతోంది. మన బలం వేగంలో కాదు.. పనితీరులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి.

సమయమంత్రి చంద్రశేఖరశర్మ
(తెలుగుప్రభ ఎడిటర్‌)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News