Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Indian National Congress: తడబడుతున్న కాంగ్రెస్ అడుగులు.. ఎందుకిలా?!

Indian National Congress: తడబడుతున్న కాంగ్రెస్ అడుగులు.. ఎందుకిలా?!

Indian National Congress: జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయంగా కూడా దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు ఇప్పుడున్న శక్తి సామర్థ్యాలు సరిపోవనడంలో సందేహం లేదు. మరో ఏడాదిన్నరలో లోక్ సభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ మరింతగా కూడగట్టుకోవడంతో పాటు, కొత్త వ్యూహాలతో, సరికొత్త ప్రచారంతో దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. పార్టీ కొత్త సారథి మల్లికార్జుల ఖర్గేకు ఇది నిజంగా అగ్నిపరీక్షే. పార్టీ అధినేత సోనియా గాంధీని అనారోగ్యం పీడించడం, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను స్వీకరించడానికి ఊగిసలాట ధోరణిని అనుసరించడం వంటి పరిణామాల వల్ల, పార్టీ పరిస్థితి కూడా కొన్నేళ్లుగా అత్యున్నత స్థానం నుంచి అట్టడుగు స్థాయి వరకు అనారోగ్యంతోనూ, ఊగిసాట ధోరణితోనూ అవస్థలు పడింది. సారథ్యం కరువవడంతో నాలుగు రోడ్లకూడలిలో దిక్కుతోచక నిలబడిపోయింది. ఇదే అదనుగా బీజేపీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పాతుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో జవజీవాలు లభ్యమవుతాయా లేదా అన్నది వేచి చూడాలి. నిజానికి వేచి చూడడానికి కూడా సమయం లేదు. ఏడాదిన్నరలో పార్లమెంట్ కు, అనేక శాసనసభలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఖర్గే కార్యశూరత్వం ప్రదర్శించక తప్పదు. అది ఇప్పటి నుంచే ప్రారంభం కావాలి. పార్టీ అంతా ఒక్క తాటి మీద నిలబడి, పటిష్ఠంగా తయారై శత్రువును ఎదుర్కోవాలి. కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇది మోయలేని భారంతో కొండ ఎక్కడమే అవుతుంది.

- Advertisement -

రెండు రోజుల క్రితం మల్లికార్జున్ ఖర్గే పార్టీ సారథ్య సంఘం సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, పార్టీ నాయకుల ముందు పెద్ద అజెండానే ఉంచారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యు.సి.) రద్దయినందు వల్ల దాని స్థానంలో ఏర్పడిన సారథ్య సంఘం ఆయన నేతృత్వంలో సమావేశమైంది. 2023 ఫిబ్రవరిలో జరగబోయే పార్టీ ప్లీనరీ సమావేశం కొత్త సి.డబ్ల్యు.సి.ని ఎన్నుకుంటుంది. అది ఎన్నికయ్యే లోపల పార్టీ వ్యవహారాలను ముందుకు తీసుకు వెళ్లడానికి తాత్కాలిక ప్రాతిపదికన ఆయన కొన్ని నియామకాలు జరపాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నాయకులకు కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తామని, రాష్ట్రాలకు వెళ్లి, అక్కడే కొంత కాలం బస చేసి, ఈ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లకు కొత్త ముఖాలను పంపించారు. వారక్కడ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. అయితే, రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను సచిన్ పైలట్ కోసం పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, ఆయనను తన మంత్రి వర్గంలో చేర్చుకోవడానికి కూడా తాను సిద్ధంగా లేనని ఆయన కరాఖండీగా చెప్పేశారు. ఆయనను ఒప్పించి, పదవి నుంచి తప్పించి, సచిన్ పైలట్ ద్వారా తాను అనుకున్నది సాధించడం ఖర్గేకు అంత తేలిక కాదు. అక్కడికి ఇన్ ఛార్జిగా వెళ్లిన సచిన్ పైలట్ కు కూడా దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.

ఇక చత్తీస్ గడ్ వ్యవహారాలను చక్కదిద్దడానికి, అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఒక కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించారు. ఆయనను సారథ్య సంఘంలో కూడా సభ్యుడుగా తీసుకున్నారు. రద్దయిన సి.డబ్ల్యు.సి. సభ్యులను మాత్రమే సారథ్య సంఘంలోకి తీసుకుంటామని మొదట్లో చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధం. పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పది శాతం ఓట్లు సంపాదించిన శశిథరూర్ ను ఇదే కారణం మీద సారథ్య సంఘంలో నియమించలేదు. ఖర్గేకు సన్నిహితుడైన వ్యక్తిని సారథ్య సంఘంలో చేర్చుకోవడానికి మాత్రం ఈ నిబంధనను పాటించలేదు. ఇది ఇలా ఉండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ప్లీనరీ సమావేశం కోసం పార్టీ ఓ భారీ అజెండాను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఈ మూడు రాష్ట్రాలలోనూ అది బీజేపీ లాంటి ప్రబల శత్రువును ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. కానీ, ఇందులో మధ్యప్రదేశ్ మధ్య చేజారిపోయింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో అక్కడ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది.

పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జనాన్ని బాగానే ఆకట్టుకుంటోంది కానీ, అది ఎన్నికల్లో ఓట్లను ఆకట్టుకునే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఎన్నికల పోరాటానికి పార్టీని సిద్ధం చేయడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఈ మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కు శక్తివంతమైన, పట్టూ, పలుకుబడి కలిగిన నాయకులే ఉన్నారు. కానీ, వీరిని ఒక్క తాటి మీదకు తీసుకు రావడం ప్రస్తుతానికి అసాధ్యాల్లో కెల్లా అసాధ్యంగా కనిపిస్తోంది. ఇదొక పెద్ద సవాలుగా పరిణమించింది. ఈ రాష్ట్రాల్లో పార్టీల్లో ఐక్యత సాధ్యమైతే, పార్టీ సంఘటితంగా కృషి చేస్తే సునాయాసంగా విజయాలు సాధించగలుగుతుంది. రాష్ట్రాలకు ఇన్ ఛార్జిలుగా వ్యవహరిస్తున్న కేంద్ర నాయకులకు ఈ రాష్ట్రాలలో అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ, వివిధ వర్గాలను కూడగట్టడంలోనూ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సత్ఫలితాలు ఇవ్వగల మార్పులను చేపట్టడానికి కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. ఎన్నికల విజయాలను తమ ఖాతాలో వేసుకోవడానికి పెద్ద కసరత్తే అవసరమని నాయకత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News