ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా భవితవ్యంపై వెలువరించిన నివేదిక ప్రపంచ దేశాల న్నిటికీ మార్గదర్శకం కావాల్సిన అవసరం ఉంది. జనాభాకు తగ్గట్టుగా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏ దేశ అవసరాలు ఆ దేశ జనాభాను బట్టి మారుతూ ఉండడమనేది సహజం. ఈ నివేదికను బట్టి, 2080 వరకూ ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గడం ప్రారంభి స్తుంది. మొత్తం మీద ప్రపంచ జనాభా ప్రస్తుత ఎనిమిది వేల కోట్ల నుంచి 2080 నాటికి పది వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. వివిధ దేశాల మధ్య జనాభా పెరుగుదలలో హెచ్చుతగ్గులున్నట్టే, అది తగ్గడంలో కూడా హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది. 2050 తర్వాత నుంచి ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో జనాభా పెరుగుదల మరీ ఎక్కువగా ఉంటుంది. జనాభా విపరీతంగా పెరగడం వల్ల పేద దేశాల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు విషమంగా మారే ప్రమాదం ఉంది.
ఇక భారతదేశ జనాభా 2060 నాటికి గరిష్ఠంగా 170 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి 12 శాతం వరకూ తగ్గడం మొదలవుతుంది. ఈ శతాబ్దం పూర్తయ్యే నాటికి భారతదేశ జనాభా 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి భారతదేశం జనాభాపరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడం జరుగుతుంది. అప్పటికి చైనా జనాభా 63.30 కోట్లకు తగ్గిపోతుంది. కాగా, 39.90 కోట్ల జనాభాతో పాకిస్థాన్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, 2062 తర్వాత నుంచి భారతదేశ జనాభాలో తగ్గుదల ప్రారంభం అవుతుంది. అంటే, ప్రపంచ జనాభా గరిష్ఠంగా పది వేల కోట్లకు చేరుకోవడానికి రెండు దశాబ్దాల ముందు నుంచే భారతదేశ జనాభా తగ్గడం ప్రారంభిస్తుందన్న మాట. ఏ దేశానికైనా ఈ గణాంకాలు అతి ముఖ్యమైనవనడంలో సందేహం లేదు. దేశాల ముందున్న సవాళ్లు, బాధ్యతలతో పాటు అవకాశాలకు కూడా ఈ గణాంకాలు అద్దం పడతాయి.
ప్రపంచ జనాభా తగ్గడానికి ఒక దశాబ్దం ముందు జనాభా పెరుగుదల కంటే వేగంగా కార్మిక జనాభా పెరగడం ఆగిపోతుంది. అంటే, అప్పటికి కార్మికుల మీద పిల్లలు, వృద్ధులు ఆధారపడడం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, తలసరి ఆదాయం తగ్గి, తలసరి వ్యయం పెరుగుతూ ఉంటుంది. అంటే, భారతదేశం అప్పటి తన జనాభాను ఆదుకోవడానికి ఇంకా మూడు దశాబ్దాల కాలం మాత్రమే మిగిలి ఉంది. ఈ విషయంలో భారతదేశం విఫలమయ్యే పక్షంలో జనాభా పెరుగుదల అనేది దేశానికి ఒక పెద్ద గుదిబండగా మారి, అనేక సంక్షో భాలను సృష్టిస్తుంది. ఇది ఇలా ఉండగా, 2050 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు దాటినవారి జనాభా రెట్టింపయి, 34.60 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా వృద్ధుల జనాభా పెరుగుతూనే ఉంటుంది. వారందరికీ ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇది వ్యక్తిగత, సమష్టి, సంస్థాగత స్థాయుల్లో జరగాల్సి ఉంటుంది.
ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలన్న పక్షంలో ప్రతి దేశమూ ఇప్పటి నుంచే విద్య, ఆరోగ్యం, ప్రాథమిక సదుపాయాల మీద పెట్టుబడులు పెంచాలని, జనాభా పెరుగుదలను ఒక సదవకాశంగా మార్చుకోవడానికి వీలుగా, ఉద్యోగాలు సృష్టించడం, నైపుణ్యాలను పెంచడం వంటి సంస్కరణలను భారీ స్థాయిలో చేపట్టాలని ‘ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా భవితవ్యం’ నివేదిక ప్రపంచ దేశాలకు సూచించింది. ఇటువంటివి అమలు జరగని పక్షంలో భారతదేశం వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అది హెచ్చరించింది. దురదృష్టవశాత్తూ, భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రభుత్వాలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ ఈ ప్రమాదకర పరిస్థితి అర్థమైనట్టు కనిపించడం లేదు.