రైల్వేలను ఆధునీకరించడంలో, విస్తరించడంలో ఎదురయ్యే సవాళ్లకు ఇటీవల బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం అద్దం పడుతోంది. గత జూన్ 2న షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్సు రైలు ఢీకొన్న సంఘటనలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 900 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలుకావడం జరిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో కనీ వినీ ఎరుగని రైలు ప్రమాదం ఇది. నిజానికి ఇటీవలే ఇటువంటి ప్రమాదం ఒకటి రైల్వేలకు చెందిన మైసూర్ డివిజన్‌లో జరగబోయింది. అయితే, లోకో పైలట్ అప్రమత్తత వల్ల, రైలు మామూలు వేగంతో వెడుతుండడం వల్ల ఈ ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మానవ తప్పిదం ఈ ప్రమాదానికి కారణమయ్యేవి. ఈ ప్రమాదంపై అధికారులు ఒక నివేదికను సమర్పిస్తూ, “వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో లోపాలు ఉండడంతో పాటు, సిబ్బంది కూడా అడ్డదోవలు తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు” అని హెచ్చరించారు. బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో అధికారులు సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాంత్రిక లోపాలు, మానవ తప్పిదాలే ప్రస్తుత ప్రమాదానికి కారణంగా తేల్చారు.
కోవిడ్ విజృంభించడానికి ముందు దేశంలో రైళ్ల ద్వారా ప్రయాణించేవారి సంఖ్య 2.30 కోట్లు కాగా, ఇప్పుడు రోజుకు 1.50 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ఆధునీకరించాలని, వీటి సేవలను విస్తరించాలని కంకణం కట్టుకుని, ఆ దిశగా గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 2.4 లక్షల కోట్లను కేటాయించడం కూడా జరిగింది. నిజానికి గత దశాబ్ద కాలంలో దేశంలో రైలు ప్రమాదాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. అయితే, రైలు పట్టాల నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉండడం, సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడం వంటి సమస్యల వల్ల రైల్వేలలో అనేకానేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధునీకరణ, విస్తరణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో వీటి ప్రాధాన్యాన్ని విస్మరించడం జరుగుతోంది. కవచ్ లాంటి రక్షణ వ్యవస్థలు, రైలు ప్రమాదాలు జరగకుండా నిరోధించే వ్యవస్థలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది కానీ, ఇవి ఇంతవరకూ వేగం పుంజుకోలేదు. మరో 75 వారాలలో కొత్తగా 75 సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ 2021లోనే ప్రకటించారు.ఇప్పటికే కొత్తగా కొన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం కూడా జరిగింది. రైళ్లలో ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యాలు కూడా గణనీయంగా మెరుగుపడుతున్నాయి.రైల్వేల ఆధునీకరణ ప్రశంసనీయమైన విషయమే కానీ, రైళ్లు, ప్రయాణికుల భద్రతకు కూడా అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది.
బాలాసోర్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వేల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమాలను మరింత పటిష్ఠంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. బాలాసోర్ ప్రమాదంతో కుంగిపోకుండా, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో రైళ్ల వేగాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సరికొత్త యాప్‌లు ప్రవేశపెట్టి ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నారు. వీటన్నిటితో పాటే, రైళ్ల భద్రతకు కూడా ప్రాధాన్యం పెంచాల్సి ఉంటుంది. బాలాసోర్ ప్రమాదంలో కుట్ర కోణం ఉండే అవకాశం లేకపోలేదు. సిగ్నలింగ్ వ్యవస్థ విఫలం కావడానికి ఇది కూడా కారణం అయి ఉండవచ్చు అనే అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనపై సి.బి.ఐ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. ఏది ఏమైనప్పటికీ, రైల్వేలు రైళ్ల నిర్వహణ, ప్లానింగ్ స్థాయి వంటి విషయాల్లో తప్పకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దిద్దుబాటు చర్యలకు కూడా రైల్వేలు మొదటగా నిధులు సమీకరించడం, కేటాయించడం వంటివి చేయాల్సి ఉంది.
Indian railways: దిద్దుబాటు చర్యలకు అత్యంత ప్రాధాన్యం
ఆధునీకరణ, విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ రైలు పట్టాల నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉండడం, సిబ్బంది కొరతను విస్మరించటంతోనే ప్రమాదాలు