ఈ వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం విజయవంతంగా ముగిసిందనే భావించవచ్చు. ఉభయ దేశాల దౌత్యవర్గాల ప్రకారం, ఈ పర్యటన ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీకి చెందిన ఆంథొని ఆల్బనీస్ ప్రధానిగా ఎన్నికైన సందర్భం కూడా ఈ పర్యటనకు కలిసివచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన ఎంతగానో మెరుగుపరచిందని దౌత్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి ‘క్వాడ్’ సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని ఆస్ట్రేలియా వెళ్లడంజరిగింది. అయితే, స్వదేశంలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చివరి నిమిషంలో తన ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవడంతో మోదీ పర్యటన కేవలం ఎక్కువగా ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకే పరిమితం అయింది. జపాన్ ప్రధానమంత్రి ఫూమియో కిషీదో కూడా క్వాడ్ సమావేశాలకు రాలేకపోవడంతో చివరికి ఈ సమావేశ స్థలాన్ని జపాన్‌లోని హీరోషిమాకు మార్చడం జరిగింది. ఈ సమావేశాలు కూడా తక్కువ కాలం జరగడంతో మోదీ ఎక్కువ సమయం ఆస్ట్రేలియాలో గడపడానికి వీలైంది. ఆస్ట్రేలియాలోనిసిడ్నీ నగరంలోమోదీ భారతీయ సంతతివారినిఉద్దేశించి ప్రసంగించడం, ఈ సమావేశంలో ఆల్బనీస్ కూడా పాల్గొనడం, ఆ తర్వాత అక్కడి వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి కూడా మోదీ ప్రసంగించడం వంటివి చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఘన విజయం సాధించాయి.
కాగా, ఆల్బనీస్‌తో సమావేశంలో కుదిరిన ఒప్పందాలు ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరచడమే కాకుండా, భారతీయులకు వృత్తి, ఉద్యోగాలు, విద్యావకాశాల విషయంలో ఎన్నో వెసులుబాట్లను కల్పించడం జరిగింది. బెంగళూరులో ఆస్ట్రేలియా దౌత్య కార్యాలయాన్ని, బ్రిస్బేన్‌లో భారతీయ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. భారత్ నుంచి వృత్తి ఉద్యోగాలకు వెళ్లే వారికి మార్గం సుగమం అయింది. ఉభయ దేశాల మధ్య గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒప్పందం కుదిరింది. రక్షణ, భద్రత, రెన్యూవబుల్ ఎనర్జీ, ఖనిజాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా చోటు చేసుకున్నాయి. డిసెంబర్‌లో ఈ రెండు దేశాల మధ్య ఒక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక అంతర్జాతీయ సమస్యల విషయానికి వస్తే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో, రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో ఆస్ట్రేలియా, భారత దేశాల మధ్య విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, స్వేచ్ఛగా, సజావుగా, పారదర్శకంగా ఇండో పసిఫిక్ విషయాల్లో వ్యవహరించడానికి, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి సుముఖత వ్యక్తమయింది.
మోదీ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయుల నుంచి వ్యక్తమైన స్పందన, వారు జరుపుకున్న వేడుకలు మిగిలిన అన్ని కార్యక్రమాలను మించిపోయాయి. సిడ్నీ బహిరంగ సభకు హాజరైన ప్రజా సందోహాన్ని చూసి మోదీతో పాటు ఆల్బనీస్ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, ఈ ద్వైపాక్షిక సంబంధాల వెనుక, ఈ శక్తి వెనుక ఉన్న అసలైన బలం ఇక్కడ ఉన్న భారతీయులదేనని అన్నారు. అయితే, అక్కడి భారతీయులపై జరుగుతున్న దాడులు, దేవాలయాలలోని విగ్రహాల విధ్వంసం, ఖలిస్థానీ వాదులు మోదీ బొమ్మలను దగ్ధంచేయడం వంటి విధ్వంసకాండలను ఉభయ దేశాల ప్రధానులు చర్చించడం జరిగింది. గత మార్చిలో ఆల్బనీస్‌భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వీటిపై చర్చ జరిగింది. ఆస్ట్రేలియాలోని భారతీయ దౌత్య కార్యాలయంపై దుండగులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఈ ప్రధానులు, ఆస్ట్రేలియాలోని భారతీయ ఆస్తులను తమ సొంత ఆస్తుల కింద పరిగణిస్తామని ఆల్బనీస్ హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందారు. తమ పర్యటనల సందర్భంగా ఇటువంటి సంఘటనలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదని కూడా వారు భావించారు. తాము మూడు ‘డి’లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన మోదీ ఈ మూడు ‘డి’లను డెమొక్రసీ, డయస్పోరా, దోస్తీలుగా అభివర్ణించారు.