పొరుగు దేశమైన శ్రీలంకతో మైత్రీ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత్ మార్గం సుగమం చేసింది. గతవారం శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పుడు స్నేహానికి సంబంధించిన పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు కనిపించింది. ఈ రెండు దేశాల అధినేతలు సమావేశం పూర్తయిన తర్వాత జారీ చేసిన సంయుక్త ప్రకటన ఆర్థిక సహకారం, మైత్రీ సంబంధాల పటిష్టత విషయంలో స్పష్టతను వ్యక్తం చేసింది. ఉభయ దేశాల మధ్య కనెక్టివిటీని ప్రోత్సహించడం, అభివృద్ధికి దోహదం చేయడం, భారత, శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని పరిపూర్ణంగా అమలు చేయడం ఈ సంయుక్త ప్రకటనలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాక, ముఖ్యంగా అయిదు అంశాల మీద వీరి దృష్టి కేంద్రీకృతమైంది. అవి: నౌకాయానం-సముద్రతీర వ్యాపారాలు, విమానయానం, ఎనర్జీ, వాణిజ్యం, పరస్పరం వ్యక్తుల మార్పిళ్లు.
ఈ రెండు దేశాల మధ్య సముద్రయానం, సాగరతీర వ్యాపారాలు, విమానయానం అభివృద్ధి చెందడమంటే కొత్తగా విమానాశ్రయాలను, రేవు పట్టణాలను నిర్మించాల్సి ఉంటుంది. శ్రీలంకలో భారత్ కు చేరువుగా ఉన్న ప్రాంతాలకు తమిళనాడు నుంచి కూడా ప్రజలు తేలికగా వెళ్లగలిగే ఏర్పాట్లు చేయాలి. ఫెర్రీ సేవలను, విమాన సర్వీసులను పొడిగించాల్సి ఉంటుంది. ఇక ఆ దేశంలో వాయు విద్యుత్తు, సౌర విద్యుత్తుల ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్లను నెలకొల్పవలసి ఉంటుంది. గత ఏడాది కుప్పకూలిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యత భారత్ మీద పడింది. ఈ ఆర్థిక సంబంధాలను చాలా కాలంపాటు కొనసాగించాల్సి ఉంటుంది.
ఇతర దేశాలకే కాకుండా, భారత్ కు కూడా రుణపడిన శ్రీలంకను ఈ దుస్థితి నుంచి పైకి తీసుకు రావడానికి భారత్ ఈ రుణాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. శ్రీలంకలో యు.పి.ఐ డిజిటల్ కార్యకలాపాలు చేపట్టడానికి, వాణిజ్యానికి భారతదేశ కరెన్సీని ఉపయోగించడానికి సంబంధించి ఉభయ దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. టూరిజాన్ని, సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి, విద్యావిషయిక బంధాలను పెంపొందించుకోవడానికి కూడా ఉభయ దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య మైత్రీ సంబంధాలను పటిష్టం చేసుకునే విషయంలో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు అధికారాలను బదలాయించడానికి సంబంధించిన 13వ సవరణను ఆ దేశం ఎంత వరకూ అమలు చేస్తుందన్నది స్పష్టంగా వెల్లడి కాలేదు. అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారులను ఎప్పుడు విడుదల చేసేదీ చెప్పలేదు. ప్రొవిన్షియల్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించాలని, అక్కడి తమిళులకు భద్రత కల్పించడంతో పాటు, వారికి గౌరవమర్యాదలు కల్పించాలని ఆ తర్వాత మోదీ తన ప్రసంగంలో కోరారు.
అయితే, విక్రమసింఘేకు మద్దతునిస్తున్న పాలక శ్రీలంక పీపుల్స్ పార్టీ మాత్రం ఇటువంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం విక్రమసింఘేకు లేదని స్పష్టం చేసింది. నిజానికి, ఈ కీలక అంశాలే భారత, శ్రీలంక దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణంగా ఉన్నాయి. విచిత్రమేమిటంటే, అనేక విధాలుగా భారత్ పై శ్రీలంక ఆధారపడుతున్నప్పటికీ, ద్వైపాక్షిక చర్చల్లో ఈ కీలక అంశాలను మాత్రం భారత్ ప్రస్తావించలేకపోయింది. ఈ చారిత్రాత్మక అంశం పరిష్కారం అయ్యే వరకూ ఏ ఒప్పందం కుదిరినా అది అసంపూర్తిగానే అమలు జరుగుతుందని భావించాలి.
Indo-Lanka relations: లంకతో మైత్రి సాగేనా?
భారత్ పై లంక ఆధారపడుతున్నా, చర్చల్లో కీలక అంశాలను భారత్ ప్రస్తావించలేదు