Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Indo-US bilateral relations: అమెరికాతో సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం

Indo-US bilateral relations: అమెరికాతో సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం

కొత్త స్థాయికి ద్వైపాక్షిక సంబంధాలు

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినంత వరకూ నిస్సందేహంగా ఈ రెండు దేశాల సంబంధాలను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. ఈ రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలపై సంతకాలు జరగాల్సి ఉంది కానీ, ఈ పర్యాయం మోదీ పర్యటన మాత్రం చరిత్ర గతిని ఒక కొత్త మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జి.ఇ) ఏరోస్పేస్‌తో కలిసి భారతదేశ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉత్పత్తి చేయాలనుకోవడం, అత్యంత ఎత్తులో ఎగురడమే కాకుండా, ఎంత కాలమన్నా తిరగగల దారుఢ్యం కలిగిన 31 ప్రిడేటర్‌ సాయుధ విమానాలను కొనుగోలు చేయడం వంటివి అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజానికి, ఇటీవలి కాలంలో భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు దృఢతరం అవుతున్నాయనడంలో సందేహం లేదు.
అమెరికా నుంచి భారతదేశం ఇటీవలే అత్యంత శక్తివంతమైన, అత్యంత వేగవంతమైన గ్లోబ్‌మాస్టర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది.యుద్ధ హెలికాప్టర్లను,అనేక రకాలుగా ఉపయోగపడగల హెలికాప్టర్లను, సముద్ర గస్తీ విమానాలను, అల్ట్రాలైట్‌ హోవిట్జర్లను కొనుగోలు చేయడం జరిగింది. భారత వైమానిక దళానికి, నౌకాదళానికి అవసరమైన ఫైటర్‌ జెట్స్‌ను అమెరికా సరఫరా చేసింది. కొద్ది సంవత్సరాల క్రితం ఈ రెండు దేశాలు కలిసి యుద్ధ విమానాలు, యుద్ధ పరికరాలను ఉత్పత్తి చేయడానికి ఒప్పందాలు కుదిరాయి కానీ, వాటిని ఆ తర్వాత రద్దు చేయడం జరిగింది. రక్షణ, భద్రతలకు సంబంధించి ఈ రెండు దేశాలకు కొన్ని ఉమ్మడి ఆందోళనలు, ప్రమాదాలు ఉన్నాయి. వాటిని ఉమ్మడిగానే ఎదుర్కోవడం కోసంఈ రెండు దేశాలు ఒక జెట్‌ ఇంజిన్‌ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య అనేక విషయాల్లో సామరస్యం, సయోధ్య లేనప్పటికీ, ఉమ్మడిగా పనిచేయడానికి వాటినన్నిటినీ పక్కన పెట్టడం జరిగింది.

- Advertisement -


ఈ రెండు దేశాల మధ్య ఉమ్మడిగా ఉన్న ఒక సమస్య చైనా. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సాగిస్తున్న కార్యకలాపాల పట్ల భారత, అమెరికా దేశాలు మొదటి నుంచి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. రష్యాతో భారత్‌కు ఉన్న రక్షణ సంబంధాల నుంచి దీర్ఘకాలంలో భారత్‌ను దూరం చేయాలని అమెరికా చాలా కాలం నుంచి భావిస్తోంది. సాంకేతికపరంగా ఆలోచిస్తే, జెట్‌ ఇంజన్లు, విమానాలు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేయడం వల్ల, సెమీ కండక్టర్లు, స్పేస్‌ టెక్నాలజీ వల్ల భారతదేశం ఇందుకు సంబంధించిన పరిశ్రమలు మరింతగా పెరగడం, విస్తరించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉత్తరోత్రా భారత్‌ రక్షణ పరికరాలకు సంబంధించిన పరిశ్రమలను సొంతగా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే భారతదేశ సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికత ఇతర అగ్ర దేశాలతో పోటీపడుతున్నాయి.
భారత, అమెరికా దేశాల మధ్య ఇదివరకే నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ఇవి భారతీయ రక్షణ పరిశ్రమలకు పునాది వేయడం జరుగుతుంది. అంతేకాక, ఉమ్మడి విన్యాసాలు చేపట్టాలని కూడా ఈ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికాతో ఒకపక్క దృఢమైన, సమగ్రమైన, పటిష్ఠమైన సంబంధాలను కొనసాగిస్తూనే భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ఆలోచనతో భారత్‌ మొదటి నుంచి ఏకీభవించడం లేదు. ఇతర దేశాల వ్యవహారాల్లో, ఇతర దేశాల తగాదాల్లో తలదూర్చకూడదని భారత్‌ భావిస్తోంది. భారత్‌ ఆలోచనల గురించి అమెరికాకు తెలియకపోలేదు. భారత్‌ తన సరిహద్దులను కాపాడుకోవడం మీదే దృష్టి పెట్టిందని కూడా అమెరికాకు తెలుసు. అందువల్ల ప్రస్తుతానికి భారత్‌తో రక్షణ ఒప్పందాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదర్చుకోవడం మీదే తప్ప ఇతర అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News