Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Indus water: సింధు నదీ జలాలపై నిజమైన హక్కెవరిది?

Indus water: సింధు నదీ జలాలపై నిజమైన హక్కెవరిది?

భారతదేశం శాంతికాముక దేశం గా పేరుగాంచిన మాట వాస్తవం. శాంతి, సహనం, మానవీయ విలువలు భారతీయ సమాజంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. హింసతో సాధించేదేమీ లేదనే సత్యం మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ధర్మం దారి తప్పిన నాడు హింస చెలరేగి మానవ జాతి అంతమవుతుందని ఎన్నో ధర్మ ప్రవచనాలు చాటి చెబుతున్నాయి. అహింసను నమ్మిన ఎంతో మంది రాజులు రక్తం పాతం లేని ద్వంద్వ యుద్ధాలతో రాజ్యాలను కైవసం చేసుకునేవారు. యుద్ధానికి భారత దేశం ఎప్పుడూ వ్యతిరేకమే. అశోకుని ధర్మ పథం, బుద్దుని శాంతి వచనాలు భారత ప్రజల,పాలకుల నరనరాన జీర్ణించుకు పోయాయి. ఈ విధమైన ధోరణి అఖండ భారతాన్ని చిన్నాభిన్నం చేసింది.
మన మీద దండెత్తి,మన దేశాన్ని ఆక్రమించుకుని,శతాబ్ధాల తరబడి భారత ప్రజలను హింసించినా, శాంతి మంత్రం పఠించిన ఫలితంగానే ఇతర దేశాలు భారత్ చేష్టలను అసమర్థతగా భావించాయి. చైనాతో యుద్ధం, పాక్ తో యుద్ధం, బంగ్లా దేశ్ విమోచనకోసం యుద్దం, ఉగ్రవాదంతో యుద్దం… ఇలా అనేక రకాల అలజడులతో,అశాంతితో భారత్ అన్ని రకాలుగా నష్ట పోయింది.మన శాంతి ప్రవచనాలు దేశాన్ని సుదీర్ఘ కాలం అతలాకుతలం చేసాయి. భారతదేశం అనేక దండయాత్రలకు గురైనది. పంచశీల సూత్రాలను తుంగలో తొక్కి చైనా భారత్ పై యుద్దానికి దిగి, భారత్ కు చెందిన భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పటికీ భారత్ పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది. భౌగోళిక చిత్ర పటాలను మార్చడం, అరుణా చల్ ప్రదేశ్ లోని కొన్ని గ్రామాల పేర్లు మార్చడం, ఈశాన్య రాష్ట్రాల్లో అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించడం చైనా కు పరిపాటిగా మారింది. భారత్ తో వేలాది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న చైనా మన దాయాది దేశమైన పాక్ ను మచ్చిక చేసుకుని, ఎకనామిక్ కారిడార్ నిర్మించడం, ఈ క్రమంలో సింధునదిపై ఆనకట్టలను పాక్ కు చైనా సహకరించడం భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. భారత దేశ రక్షణకు ముప్పు వాటిల్లుతుంది. ఇది ముమ్మాటికీ భారతదేశ సమగ్రతకు భంగకరం. సింధు నదీ జలాల ఒప్పందం భారత్- పాక్ ల మధ్య 1960 లో కుదిరిన నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ లు సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందంపై ఇప్పటి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్న అప్పటి “ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కాన్స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్ (ఐ.ఆర్.బి.డి) మధ్యవర్తిగా వ్యవహరించింది. “ఇంటర్ వాటర్ ట్రీటీ” నిబంధనలకు అనుగుణంగా భారత్ నిరాటంకంగా పాకిస్థాన్ కు గత 63 సంవత్సరాలకు పైగా నీటిని సరఫరా చేస్తున్నది. సింధునది చైనా ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న టిబెట్ లోని మానస సరోవరం వద్ద పుట్టి,కేవలం 8 శాతం చైనా లో ప్రవహిస్తూ, అత్యధిక శాతం పాక్ కు తరలి పోతున్నది. భారత ఉపఖండంలో అత్యంత పొడవైన నది సింధు. సింధునది పాక్ ప్రజల జీవనాడిగా ప్రసిద్ధి గాంచింది. పాకిస్తాన్ లో సుమారు 90 శాతం సాగునీరు,విద్యుత్ అవసరాలను సింధునది తీరుస్తున్నది. సింధు నది నాగరికతకు చిహ్నం. గంగానది కంటే సింధునది పొడవైనది.అయితే దీనిలో అత్యధిక భాగం పాక్ లో ఉండడం వలన పాక్ లో అతి పొడవైన నదిగా సింధునది స్థానం సంపాదించింది.భారత్ లో అతి పొడవైన నదిగా “గంగానది” ప్రసిద్ధి చెందింది.”ఇండియా”కు ఆ పేరు రావడానికి సింధునది(ఇండస్) కారణం. నాగరికతకు సంకేతమై, “ఇండియా” అనే పేరుకు మూలాధారమైన సింధునది దేశ విభజన తర్వాత అత్యధికభాగం దాయాది దేశానికి ధారాదత్తం చేయబడింది.ప్రపంచం లోని అతి పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపబడింది.సింధు నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారత్ లోని జమ్ము కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. పాక్ లోని అత్యధిక భూభాగం సింధునది ఆయకట్టు కావడం విశేషం.పాకిస్థాన్ లోని పలు ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే కావడం విశేషం. అప్పట్లో భారత్,పాక్ మధ్య జరిగిన సింధు నదీ జలాల ఒప్పందం నేటికీ అమలు కావడం భారత దేశ విశ్వసనీయతకు నిదర్శనం.అయితే పాకిస్తాన్ మాత్రం ఏరు దాటిన తర్వాత తెప్ప తగ
లేసిన చందంగా భారత్ వలన మేలు పొంది, తిన్నింటి వాసాలు లెక్క బెడుతూ, భారత్ కు పక్కలో బల్లెంలా తయారైనది.పాక్ దుశ్చర్యలను అరికట్టడానికి, భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మారుతున్న పరిణామాల నేపథ్యంలో పాక్ ను కట్టడి చేయడంలో ప్రపంచ దేశాల సహకారాన్ని తీసుకుంటూనే, మరో వైపు పాక్ తెంపరితనాన్ని ఆణచడానికి భారత్ తనకున్న మార్గాలను అన్వేషించాలి. సింధు నదీ జలాల పంపిణీ పై గతంలో జరిగిన ఒప్పందాన్ని సమీక్షించాలి. భారత్ గుండా ప్రవహిస్తూ, పాకిస్తాన్ భూభాగాలను సశ్యశ్యామలం చేస్తూ, పాక్ కు బహు విధాలుగా ఉయయోగపడే సింధు నదీ జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోతుంది. విద్యుచ్ఛక్తి నిలిచి పోతుంది. యావత్ పాకిస్తాన్ అల్లకల్లోలమై పోతుంది. అయితే ఇప్పటి వరకు పాక్ తో ఎన్ని యుద్ధాలు జరిగినా, ఉగ్రవాదుల ఊచకోతకు భారత పౌరులు,జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయినా, భారత్ మాత్రం తన భూభాగం నుండి పాక్ వైపు ప్రవహిస్తున్న సింధు నదీ ప్రవాహాన్ని నిలువరించ లేదు. ఇది భారత్ దేశం ప్రదర్శిస్తున్న మానవత్వానికి, సహనానికి మచ్చుతునక. అయితే సహనం హద్దులు దాటినప్పుడు దండోపాయమే శరణ్యం.సింధు నదీ జలాల ఒప్పందానికి భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడలేదనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అంతర్జాతీయ న్యాయ స్థానం అంగీకరిస్తుందా? అనే అనుమానం ఉంది. పాక్, చైనాలు భారత్ తో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడంలో లేని అభ్యంతరం ఇండియా ఉల్లంఘిస్తే తప్పేమిటి? అగ్రదేశాలు అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడే ఉంటున్నాయా? అంతర్జాతీయ న్యాయ స్థానం అగ్ర రాజ్యాలను అదుపులో ఉంచగలుగుతుందా? భారత్ తన దేశ శ్రేయస్సును ఆశించి సింధు జలాల పంపిణీ పై పునరాలోచన చేస్తే తప్పేంటి? పాక్ కు సింధు నదీ జలాల పంపిణీ నిలుపుదల గురించి సాధ్యాసాధ్యాలను భారత్ కూలంకషంగా అధ్యయనం చేయాలి.
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటి వేషనల్ స్పీకర్,కాలమిస్ట్)

మొ:9704903463

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News