Homeఎడిటోరియల్ / బహుళకులగణన - ఆసక్తికర అంశాలు

కులగణన – ఆసక్తికర అంశాలు

తెలంగాణ ప్రభుత్వం కుల గణన వివరాలు వెల్లడించింది. ఈ విషయంలో ప్రభుత్వ చర్యను  ప్రశంసించి తీరాల్సిందే.   ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని  ప్రజలకు అందిచింది. ఈ లెక్కలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయి.  మారుతున్న సమాజ పోకడను చెప్తున్నాయి. అంతేకాదు మారాల్సిన విషయాలనూ తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎవరి కేంద్రంగా సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేయాలో కూడా  స్పష్టం చేస్తున్నాయి.  అంతేకాదు గత ప్రభుత్వం తాను వెచ్చించిన లక్షలాది కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు చేసిందో కూడా  ప్రజలకు అర్థమైంది. దాంతోపాటు  సాగు నీటి సౌకర్యాలు, రైతు బంధు,  రైతు భరోసా వంటి ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలు ఏయే సామాజికవర్గాలకు ప్రయోజనం కలిగించాయో కూడా వివరించాయి.  మన దగ్గర పెరిగిన మధ్యతరగతి ఏయే సామాజికవర్గాల నుంచి వచ్చిందో కూడా  తెలిసింది.

ఒక్క రాష్ట్రం – వందల కులాలు
ఈ లెక్కలపై కొన్ని సందేహాలు కూడా వ్యక్తమతున్నాయి. బీసీల జనాభాను తగ్గించి చూపించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ స్పష్టత నివాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఏయే సామాజికవర్గాల జనాభా ఎంతో కూడా  తేలింది. ఆయా జనాభా ఎక్కువగా ఉన్న సామాజికవర్గాల్లో ఉన్న పేదరికమూ  తెలిసింది. మొత్తం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వారు డక్కలి వారని  ఈ లెక్కలు చెప్తున్నాయి. వీరి కోసం ప్రత్యేక శ్రద్ద వహించాల్సిన  అనివార్యతనూ చెప్పాయి.  మరో ఆసక్తికరమైన  విషయమూ తేలింది. 240కి పైగా కులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో కొన్ని కులాల పేర్లు తప్ప  మిగతా వాటి గురించి మనలో చాలామందికి తెలియదు. కుల పీడన కారణంగా తమ  కులం గురించి బయటికి చెప్పుకోవడానికి కూడా కొందరు ఇబ్బందిపడి ఉంటారు. సంచార జాతులు, గిరిజనులు, ఆదివాసీలు, ద్విజులు,  శూద్రులు, అతిశూద్రులు, అంటరానివారు  అందరూ  కలిపి మూడున్నర కోట్లకుపైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.

- Advertisement -

జన సంఖ్యే కాదు -పేదరికమూ ఎక్కువే
మన దేశంలో కులమే  అన్నింటికీ మూలం అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి  ఈ లెక్కలు.  కులం ఆధారంగానే సంపద కేంద్రీకృతమవుతున్నది. దాని ఆధారంగా సమాజంలో హోదా, గౌరవం దక్కుతున్నాయి.  కార్లు, ఫ్రీజ్ వంటివి  ద్విజులు, ఓసీ  సామాజిక వర్గాల దగ్గరే ఉన్నాయి.  అంతే కాదు ఉన్నత విద్య,  ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసిస్తున్న  పిల్లల్లో ఉన్నత కులాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.   ఓసీల కంటే బీసీలు ఎక్కువమంది  పేదరికంలో ఉన్నారు. వీరి కంటే ఎస్టీలు పేదరికంలో ఉన్నారు. వీరి కంటే మరింత ఎక్కువ మంది ఎస్సీలే పేదరికంలో ఉన్నారు.  అంటే కులాన్ని బట్టే ఆర్థిక స్థితిగతులున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఈరోజుల్లో కులం ఎక్కడుంది అనే వారికి మంచి సమాధానం ఇస్తున్నదీ సర్వే  రిపోర్టు.  అంతేకాదు కులం ఆధారంగానే భూమిపై  హక్కు కొన్ని సామాజికవర్గాలకే దక్కిందనే విషయం  రూఢీ  అవుతున్నది.  ఏడు సామాజికవర్గాల చేతిలో యాభై శాతం వరకు సాగు భూమి ఉన్నది. అందులో రెడ్డీ  సామాజికవర్గం వారి వద్దనే ఎక్కువగా ఉన్నది. భూ కమతాల్లో వచ్చిన మార్పు, కుటుంబాలు పెరిగిన నేపథ్యంలో భూ కమతాల విస్తీర్ణంలో తగ్గుదల ఉన్నది. ప్రభుత్వాల చొరవ వలన,  మారిన ఆర్థిక స్థితిగతుల వలన ఎస్సీలు తమ జనాభా శాతాని కంటే తక్కువే అయినా కొంతవరకు భూమిపై హక్కును దఖలు పరుచుకున్నారు.  కలాల వారీగా పెరుగుతున్న ఆర్థిక అంతరాల గురించి చాలా  సమగ్రమైన  సమాచారం కూడా తెలిసింది.

ఏ కులానికీ చెందిన వారు ఇన్ని లక్షల మందా
కుల పట్టింపు ఎంత ఎక్కువగా ఉన్నదో అదే సందర్భంలో ఓసీ జనాభాలో 12 లక్షల మంది వరకు  తమది ఏ కులమో చెప్ప లేదు. బహుషా వీరికి కులం గురించిన  చైతన్యం వచ్చినందు వల్ల  తమ సామాజికవర్గం గురించి చెప్పలేదని కొందరు భావిస్తున్నారు.  అదీ కాదంటే  జాతీయవాద దృక్ఫథం కారణంతో కూడా కూలాన్ని వెల్లడి చేయలేకపోవచ్చునే అభిప్రాయం కూడా ఉన్నది. అంతే కాదు కమ్యూనిస్టు,  ఫూలే, అంబేద్కర్ ఆలోచనాత్మక ఆచరణ కలిగిన వారు కూడా  తమ కులం గురించి చెప్పకపోచ్చు. ఇదే సందర్భంలో కులాంతర  వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది, అందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే  కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ద్విజులున్నారు.  రావాల్సినంతగా మార్పు రాలేదు. కానీ  మార్పు అనివార్యం అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి ఈ కులాంతర, మతాంతర వివాహాలు.  కుల వివక్ష విషయంలో నిచ్చెన మెట్ల  ప్రభావం ఉంది. తరం మారుతున్న కొద్దీ అందులోనూ మార్పు రావొచ్చు. ఇప్పటివరకు వచ్చిన మార్పునకు ఇది సంకేతంగా భావించొచ్చు.
ముందు దీన్ని అర్థం చేసుకోండి

కులం ఆధారంగానే మనుష్యుల ఆలోచనా విధానం, చైతన్యం రూపు దిద్దకుంటుంది. వందలాది కులాలున్న మన  రాష్ట్రంలో  వేలాది కులాలున్న మన దేశంలో ప్రజల ఆలోచనా, ఆచరణ విధానాలు భిన్నంగా ఉంటాయి.  భారతీయ సమాజంలో మార్పు తీసుకురావాలని భావించే వారు ముందీ విషయాన్నిగమనంలోకి తీసుకోవాలి. కులమే ఇక్కడ ప్రధానాంశంగా ఉంది. మనుషుల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నది.  ఇన్నాళ్లు కులం గురించిన పట్టింపు లేని పార్టీలు,  లేదా సంస్థలు కులం గురించి ఇప్పటికైనా ఆలోచించాల్సిన  అనివార్యతను, ప్రజల్లో కుల చైతన్యం తీసుకు రావాల్సిన అవసరతను ఈ లెక్కలు  చెప్తున్నాయి. కులం ఉండాలని ఇంకా వాదించే వారు కొందరున్నారు. అది ఉంటే సమాజం ఎట్లా ఉంటుందో ఇన్నాళ్లైనా, ప్రభుత్వాలు  ఇన్ని పథకాలు పెడుతున్నా ఇంకా లక్షలాదిమంది పేదరికంలో ఎందుకున్నారనే విషయాలను అలాంటి తెలుపుతున్నా గణాంకాలు. అంతేకాదు  అలాంటి వారు మనస్సు పెట్టి  సమాజాన్ని అర్థం చేసుకోవాలనే సూచనను కూడా  చేస్తున్నాయి ఈ లెక్కలు.  గత ప్రభుత్వం ప్రజల ముందు కుల గణన లెక్కలు పెట్టలేదని, తాము పెట్టామని ఈ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాన్ని, నేటి విపక్షాన్ని ఇరుకునపెట్టొచ్చు. కానీ తాము కూడా ఆయా సామాజికవర్గాల జీవితాల్లో మార్పులకు బాధ్యత వహించాల్సి  ఉంటుంది. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి  మేధో వర్గానికి, మీడియాకు ఈ లెక్కలు ఉపయోగపడ్తాయి.

కాలమ్‌ : భిన్నస్వరం
గోర్ల బుచ్చన్న, జర్నలిస్టు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News