కుల, మతాలకు వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమం సాగిన తమిళనాడులో కూడా కులాంతర వివాహాల మీద దాడులు జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యువతీ యువకులు, ముఖ్యంగా యువతులకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ రోజు రోజుకూ కరువవుతుండగా, ఈ లక్ష్మణ రేఖను ఉల్లంఘించినవారికి సామాజికంగా మరణ శిక్షకు తక్కువ కాకుండా శిక్షలు విధించడం జరుగుతోంది. ఇటీవల ఒక 19 ఏళ్ల అగ్రవర్ణ యువతి ఓ దళితుడిని ప్రేమించి పెళ్లాడి నందుకు తల్లితండ్రులు ఆమెను పరమ కిరాతకంగా హత్య చేయడం జరిగింది. పోలీసులు ఆ తల్లితండ్రులను అరెస్టు చేశారు. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే, కులాంతర వివాహం అనేసరికి దాదాపు 80 శాతం బాధితులు యువతులే అవుతున్నారు. సమాజంలో బాగా వేళ్లు పాతుకుపోయిన పురుషాధిక్యత, కుల విలువలను ద్రవిడ ఉద్యమం కూడా ఏమీ చేయలేక పోయిందనడానికి తమిళనాడులో ఇటువంటి దృష్టాంతాలు అడపా దడపా కనిపిస్తూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇటువంటి పురుషాధిక్యానికి, కుల విలువలకు ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి కూడా పరోక్షంగా మద్దతు లభిస్తోంది.
ఈ మధ్య తమిళనాడులో ఒక అగ్రవర్ణ యువతి ఓ దళితుడిని ప్రేమించి అతనితో వెళ్లి పోయింది. తల్లితండ్రులకు ఆమె పెళ్లి విషయం తెలిసినప్పటికీ, ఆమె అదృశ్యమైనట్టుగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ యువతిని వెతికి పట్టుకుని, స్టేషన్ కు తీసుకు వచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు ఆమెకే ‘బుద్ధి’ చెప్పి తల్లితండ్రులతో పంపిం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఆమె తల్లితండ్రుల వైపే మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసి, ఈ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ చేయడం జరిగింది. గత డిసెంబర్ నెలలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక అగ్రవర్ణ యువతి ఓ మదళితుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోయి వివాహం చేసుకుంది. తల్లితండ్రులు ఆమెను బెదిరించడం ప్రారంభించారు. ఆమె పోలీసులకు ఈ విషయం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను ఆమె తల్లితండ్రులకు అప్పగించారు. తల్లితండ్రులు ఆమెను దారుణంగా హతమార్చారు. పోలీసులు కూడా ఈ పురుషా ధిక్యత, కుల విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం, తల్లిదండ్రులను సమర్థించడం ఒక్క తమిళనాడు లోనే కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతోంది. మహిళల ఆత్మ గౌరవానికి, భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛకు విలువ లేకుండాపోతోంది.
సర్వసమానత్వ సమాజం ఏర్పడడానికి ఇంకా చాలా కాలమే పట్టవచ్చు. ఇటువంటి సమాజం ఏర్పడడం అనేది అనేక కష్టనష్టాలతో కూడుకున్న పరిణామమే కావచ్చు. అయితే, సాధారణ విషయాల్లోనైనా యువతీ యువకుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని తీసుకు రావడానికి ప్రభుత్వాలైనా సహకరించాల్సి ఉంటుంది. కులాంతర, మతాంతర వివా హాలకు రక్షణ కల్పించడానికి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని, అదే విధంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయడం అవసరం. విచిత్రమేమిటంటే, కులాంతర వివాహాలను సమర్థిస్తూ ఉద్యమాలు చేసిన తమిళనాడులో ఇందుకు సంబంధించిన హత్యలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. పైగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ రాష్ట్రంలో మచ్చుకైనా అమలు జరపకపోవడం సిగ్గుచేటైన విషయం. ఎవరు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నప్పటికీ, వారికి తగిన రక్షణ కల్పిస్తూ ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాల్సి ఉంటుంది. వీరిపై దాడులు చేయడం, వీరిని హత్యలు చేయడం సాధ్యం కాకుండా కఠిన శిక్షలను అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకు రావడం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
Interfaith marriages need protection: కులాంతర పెళ్లిళ్లకు రక్షణ అవసరం
ప్రభుత్వం, పోలీసుల నుంచి పరోక్ష మద్దతు