Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్International Day of Older persons: వృద్ధులను జాతి సంపదగా గుర్తించాలి

International Day of Older persons: వృద్ధులను జాతి సంపదగా గుర్తించాలి

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

బాల్య, కౌమార్య, యవ్వన, వృద్ధాప్యాలు జీవితంలో ఏ ప్రాణికయినా తప్పనిసరిగా సంభవించే జీవన రేఖలు. ’ఎండుటాకును చూసి పచ్చటాకు నవ్వింది’ అని తెలుగులో ఒక సామెత ఉంది. పండిపోయి చెట్టు నుంచి రాలే ఎండుటాకును చూసి చెట్టు రెమ్మలకు వేలాడే పచ్చటాకు నవ్విందట. అది గమనించిన ఎండుటాకు పిచ్చిమొహమా రేపు నీకు కూడా నా గతే కదే.. అని పకపకమంటూ ఆ ఎండుటాకు రాలిపోయిందట. మనిషి జీవిత చక్రంలో వచ్చే మార్పులు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అయితే మనిషిగా పుట్టిన ప్రతివ్యక్తీ తుదిశ్వాస ఉన్నంత వరకు, ప్రతి దశలోనూ ఎంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు.
వృద్దాప్యము లేదా ముసలితనము మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము రోగనిరోధక శక్తిని క్రమక్రమముగా కోల్పోయి చివరకు మరణించే స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. నేడు పిల్లలుగా, యువజనులుగా, నడివయస్కులుగా పాత్రలు పోషిస్తున్న అందరూ వృద్ధుల బృందంలోకి అడుగు పెట్టే పరిస్థితి తప్పక వస్తుంది. యవ్వన దశలో వారు సమాజానికి అవసరమైన సమస్త ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొని రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు తమ వంతు కృషి చేసి ఉంటారు. పనులు మాని, లక్ష్యాలు పూర్తి చేసుకుని ఉత్పత్తికి దూరమై విశ్రాంతి తీసుకుంటూ జీవన చరమ దశను ముగిద్దామని దీర్ఘ సెలవులో ఉన్న జాతి నిర్మాతలే వృద్ధులు. అందుకే వారికీ ఓ రోజును కేటాయించి సమాజానికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా అక్టోబర్‌ 1న అంతర్జాతీయ వృద్ధాప్య దినాన్ని జరుపుకుంటున్నారు. 1990లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రతి ఏటా అక్టోబర్‌ 1ని అంతర్జాతీయ వృద్ధాప్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. దీనినే అంతర్జాతీయ వయోవృద్ధుల దినంగా కూడా పిలుస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఇప్పుడు 60 ఏళ్ల వయసును కలిగి ఉన్నారు. 2050 నాటికి ప్రపంచంలోని ప్రతి అయిదుమందిలో ఒకరు 60 ఏళ్లు ఆ పైబడి వయసు కలిగి ఉంటారట. 2150వ సంవత్సరానికి ప్రపంచంలో ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ముదుసలిగా ఉంటారట.
సీనియర్‌ సిటిజన్లుగా పేరు పడిన ఈ వయోవృద్ధుల అవసరాలు తీర్చే కృషిలో వ్యక్తులూ, సమాజమూ పునరంకింతం అయేందుకు గాను ప్రపంచం వ్యాప్తంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ వృద్ధాప్య దినాన్ని జరుపుతున్నాయి. తన కుమారులకు, కుమార్తెలకు, మనుమళ్ళకు, మునిమనుమలకు సలహాలు ఇచ్చే వయస్సు కూడా ఇదే. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా వృద్ధుల సంక్షేమానికి కొన్ని జాతీయ ప్రణాళికను, కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా గత 2007లో వృద్ధుల కోసం పోషణ, సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టాలు అమలుకు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదన్నది తెలిసిన సత్యమే. వృద్ధుల సమస్యల పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి. వేధింపులు, ఆరోగ్య సమస్యల నుంచి వృద్ధులను దూరంగా ఉంచేలా కుటుంబ సభ్యులంతా చొరవ చూపాలి. జీవితంలో వృద్ధాప్యం అనేది చివరి దశ కావడంతో- వారిలో శారీరక మార్పులను ఆపడం ఎవరితరం కాదు. వృద్ధాప్యం అన్నది శరీరానికే కానీ మనసుకు కాదని ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రస్తుతం అరవయ్యేళ్ల వయసు దాటిన వారు దేశంలో 15 కోట్ల మేరకు ఉంటారని అంచనా. వీరిలో సుమారు కోటిన్నర మందికిపైగా ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు, ఔషధాలు అందుబాటులోకి రావడంతో ఆయుర్ధాయం పెరుగుతోంది. దీంతో వృద్ధుల సంఖ్య అదే స్థాయిలో అధికమవుతోంది. ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 60 ఏళ్లకు పైబడినవారు 16.7 కోట్ల మంది, 80 ఏళ్లకు పైబడిన వారు పది లక్షల మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన వారి ‘సూపర్‌ సీనియర్‌ సిటిజన్స్‌’ అంటారు. జపాన్‌లో నూటికి 30 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 2050 నాటికి 64 దేశాలు 30 శాతం వృద్ధులతో నిండి పోతాయట! అంటే వృద్ధుల జనాభా 120 కోట్లకు చేరుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 80 శాతం వృద్ధులుంటారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. 2050 నాటికి మన దేశంలో వృద్ధుల జనాభా 30 కోట్లపైనే ఉండే అవకాశముంది. మన దేశంలో ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. ముగ్గురిలో ఒకరు వేధింపులకు గురవుతున్నారు. ‘హెల్పేజ్‌ ఇండియా’ అధ్యయనం నిగ్గుతేల్చిన విషయమిది. వృద్ధుల సంరక్షణ వారి పిల్లల కనీస బాధ్యత. వయసుడిగిన దశలో తమ వారసుల నుంచి వారు కోరుకునేది ప్రేమ పూర్వక పలకరింపు, ఆదరణ, అభిమానాలే తప్ప- ఆడంబరాలు, విలాసాలు కాదు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలే కాదు, ఆర్థిక, సామాజిక సమస్యలు వారిని చుట్టు ముడుతాయి. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సి ఉండాలి. 60 ఏళ్లు పైబడిన అనుభవజ్ఞుల శక్తిని, అనుభవ సారాన్ని ఉపయోగం చేసుకుంటే తప్పకుండా ఏ దేశమైనా పురోగమిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
పేద, మధ్యతరగతి కుటుంబాల వారే కాదు, సంపన్న కుటుంబాలలోనూ వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించి తమ పని పూర్తయిందనుకుంటున్నారు. రేపు తమదీ ఇదే బతుకని వారు మరచి పోతున్నారు. సంతానం ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా పిల్లలు కళ్లముందున్నప్పటికీ కొందరు వృద్ధులు అనాథలుగా మారుతున్నారు. ఆవేదనతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. సంపాదన అనే వ్యామోహంలో పడి కొందరు యువకులు తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుంటున్నారు. మరికొంత మంది బంధాలను దూరం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో వృద్ధుల స్థితిగతులపై ‘హెల్పేజ్‌ ఇండియా’ వెలువరించిన నివేదికలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సొంత కుటుంబ సభ్యుల నుంచే నిరాదరణ ఎదురవుతోందంటూ 56 శాతం వృద్ధులు స్పందించారు. కుమారుల్లో 57 శాతం, కోడళ్లలో 38 శాతం పెద్దవారిని ఆదరించడం లేదట. తమ హక్కుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలపై వృద్ధుల్లో కొంతవరకు అవగాహన ఉన్నప్పటికీ, కుటుంబ గౌరవం మంటగలుస్తుందన్న భయంతో పోలీసులను ఆశ్రయించటం లేదన్నది 52 శాతం వృద్ధుల స్పందన. వృద్ధులపై వేధింపుల నిరోధానికి కేంద్రం ఒక చట్టం చేసింది. ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ నిర్వహణ చట్టం’గా వ్యవహరించే దీని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు.
గ్రామీణ వృద్ధుల్లో 45 శాతం మంది దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారని జాతీయ నమూనా సర్వే తెలిపింది. ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నా నోరువిప్పని వృద్ధులు ఢిల్లీలో 92 శాతం వరకు ఉంటారని హెల్ప్‌ ఏజ్‌ ఇండియా అధ్యయనం తెలిపింది. నేటి ఆధునిక కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధులు ప్రశాంతంగా కాలం గడపడానికి అవసరమైన చేయూత అందచేయడం కుటుంబ సభ్యులందరి కనీస బాధ్యత. వృద్ధాప్యంలో ఉన్నవారితో ప్రతిరోజూ కాసేపైనా గడపాలి. వారి అనుభవాల్ని తెలుసుకోవాలి. ఈరోజు మనం వృద్ధులకు ప్రేమను పంచితే- రేపు మన వృద్ధాప్యంలో మనం కూడా ప్రేమను పొందగలుగుతాం అని యువత గుర్తించాలి. వృద్ధులను మన జాతి సంపదగా గుర్తించాలి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నందున వయోధికులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పూర్వ వైభవం వచ్చినపుడే వృద్ధులకు గౌరవం పెరుగుతుంది. అన్నింటికన్నా కుటుంబ సభ్యుల ఆదరణే వారికి కొండంత అండ అన్న సంగతిని విస్మరించరాదు.

  • రామకిష్టయ్య సంగన భట్ల
    9440595494
    (నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News