Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్International mother tongue day: అమ్మ భాషకు ఆయువు పోద్దాం

International mother tongue day: అమ్మ భాషకు ఆయువు పోద్దాం

మాతృ భాష లేని ఉద్యమాలే లేవు

సృష్టిలో ఎన్నో జీవరాశులు, ప్రతీ జీవిది ఒక ప్రత్యేకమైన భాష.వాటి భాషకు ఒక ప్రత్యేకత. బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలు ఎంత అవసరమో, ఆ బిడ్డ వికాసానికి మాతృ భాష కూడా అంతే అవసరం. వ్యక్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడేది మాతృ భాష ఒక్కటే. తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే సాహిత్య వారసత్వ సంపదకు జాతి మనగడకు మాతృభాష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మాతృభాషను మనం మన పెద్దల ద్వారా సమాజం ద్వారా అప్రయత్నంగా నేర్చుకుంటాం. తేనెలూరే తెలుగు మన తేట తెలుగు.
ఉగ్గు పాలతో రంగరించి అమ్మ నేర్పిన భాష నేడు విషపు కోరల్లో చిక్కుకుంది. మాతృభాషను అమ్మ భాష అమృత భాష అని ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహాసభలు పెట్టి గొంతెత్తి చాటి చెప్పిన అమలు పరచడంలో మాత్రం ఆమడ దూరంలో ఉంది. మాతృభాష అమ్మ పాల కంటే మధురమైనది పవిత్రమైనది. బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అందుకే ప్రతి ఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి. పర భాష మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడమే కాకుండా మాట్లాడానికి సైతం నామోషీగా సిగ్గుగా భావిస్తున్న నేటి తరాన్ని ఏమి భాషరా నీది ఏమి వేషము రా ఈ భాష ఈ వేషం ఎవరికోసం రా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సఖిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని నేటి సమాజాన్ని మన కాళన్న ఉతికి ఆరేసిన కూడా మాతృ భాష వినియోగం లో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. అవసరమైన మేరకు ఇతర భాషలు నేర్చుకోవడం తప్పుకాదు కానీ మాతృభాష నిర్లక్ష్యం చేయడం మాత్రం నేరమే.
అన్నింటికీ అమ్మ భాష అవసరానికి అన్య భాష
బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించి 1947 లో స్వాతంత్రం ప్రకటించాకా విశాలమైన బెంగాల్ ప్రాంతం మన భారత దేశంలో కలిసిపోయింది. తూర్పు బెంగాల్ ప్రాంతం ముస్లింలు ఎక్కువగా ఉన్న పాకిస్థాన్ లో కలిసిపోయింది. పాకిస్తాన్ అధికార భాష ఉర్దూ. పాకిస్తాన్ ప్రభుత్వం తమ బెంగాలీ భాషను పట్టించుకోవట్లేదని నిరాదరణకు గురౌవుతుందని బెంగాలీ ప్రజల్లో ఆవేదన మొదలైంది. తన మాతృభాష బంగ్లాను రెండవ జాతీయ భాషగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోరాటం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా ఆ పోరాటం పెరిగి పెద్దదయింది. భాష కోసం పోరాటం చేస్తున్న బెంగాలీల పైన పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో కొంతమంది బెంగాలీ ప్రజలు మరణించారు.మాతృ భాష కోసం వారు చేసిన ప్రాణ త్యాగానికి గుర్తుగా యునెస్కో ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవంగా జరపాలని 1999లో ప్రకటన చేసింది. అప్పటినుండి అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు అన్ని భాషలవారు వారి వారి మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను ఇచ్చి గౌరవించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలుగు భాషను మాట్లాడే ప్రజలు యానాం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒరిస్సా ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఉద్యమానికి ఊపిరి పోసింది మాతృభాషే భాష లేకుండా ఏ ఉద్యమం రాలేదు. భాష ఉద్యమాలకు ప్రేరణను స్ఫూర్తినిచ్చింది. ఇతర భాషల్లో నేర్చుకున్న విషయం మెదడులో ముద్రింపబడితే మాతృభాషలో నేర్చుకున్న విషయం మనసులో ముద్రింపబడుతుంది అది ఎప్పటికీ చెరిగిపోదు. పోతన, సోమన, కవి సామ్రాట్ విశ్వనాథ, సినారే, గురజాడ, రాయప్రోలు, నండూరి, కృష్ణశాస్త్రి, వట్టికోట, సురవరం, దాశరధి, శ్రీశ్రీ, కాళోజి మొదలగు కవులు మాతృభాష ఔన్నత్యాన్ని దాని ఆవశ్యకతను వారి రచనల ద్వారా చాటి చెప్పారు. సినీ కవి చంద్రబోసు గారు మాతృభాష గొప్పతనాన్ని కీర్తిస్తూ తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష రా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా ఉగ్గుపాల భాష మాట్లాడేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గ మాకు రా అంటూ పరభాష వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రజానీకానికి సుతిమెత్తగా చురకలు అంటించారు. చైతన్యాన్ని కలిగించారు .తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి మాతృభాష వైభవాన్ని చాటి చెప్పినా వినియోగం లో మాత్రం మార్పేమీ లేదు. ప్రపంచంలో 5000 పైచిలుకు భాషలు ఉన్నాయని అందులో సుమారు రెండు వేల పైగా భాషలు అంతరించిపోతున్నాయని కొన్ని భాషలకు లిపి కూడా లేదని ఇంకొన్ని భాషలు అంతరించిపోవడానికి సిద్ధంగా ప్రమాదపు అంచున ఉన్నాయని యునెస్కో గతంలో చేసిన సర్వేలో వెల్లడించింది. అందులో మన మాతృభాషయైన తెలుగు మొదటి వరుసలో ఉందని చెప్పింది ఏ భాషైనా కొంతకాలం మాట్లాడకపోతే అది కనుమరుగైపోతుంది జాతి యెక్క సంస్కృతి అంత భాషలోనే ఇమిడి ఉంటుంది.ఒక భాష నశిస్తే ఆ భాషలో ఉన్న అపారమైన విలువలు జ్ఞాన సంపద సంస్కృతి అంతా నాశనమవుతుంది.
అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పినట్టు ఐదవ తరగతి వరకు విద్యాబోధన మాతృభాషలోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. పిల్లల్లో బాల్యం నుండే మాతృభాషపై మమకారం కలగాలంటే బాల సాహిత్యం అభివృద్ధి చెందాలి. చందమామ కథలు బుజ్జాయి బొమ్మరిల్లు బాలమిత్రు వంటి పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉండేలా చూడాలి.పాఠశాల స్థాయిలోనూ పాఠ్యాంశాలుగా చదివించాలి.మాతృభాష మాధ్యమం లో చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించాలి.
మాతృభాష తల్లిపాల వంటిది పరాయి భాషలు పోత పాల వంటివి – కొమర్రాజు లక్ష్మణ్ రావు
మనం మన మాతృభాషను కాపాడుకోవడం సాహిత్య సౌందర్యాలను మన తర్వాతి తరాలకు అందించడం మన బాధ్యత. మానవునికి జనని, జన్మభూమి, మాతృభాష ఎంతో గొప్పనైనది. తెలుగువారు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి ప్రదర్శిస్తే దృఢ సంకల్పం పునితే రాష్ట్రంలో ప్రతి ఇంటి పూదోటలో తెలుగు పూలే విరబూస్తాయి.

- Advertisement -


కొమ్మాల సంధ్య
తెలుగు ఉపన్యాసకులు
ప్రభుత్వ జూనియర్ కళాశాల
సమ్మక్క సారక్క తాడ్వాయి
ములుగు జిల్లా.
9154068272.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News