Saturday, June 29, 2024
Homeఓపన్ పేజ్No drugs day: జూన్ 26, డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం

No drugs day: జూన్ 26, డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం

మానసిక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న మాదక ద్రవ్యాలు

యువతీ యువకులు విద్యావంతులై, ఆరోగ్యవంతులై సమాజానికి ఉపకరిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది. వ్యసన పరుల వలన సమాజం అధోగతి పాలవుతుంది. యువత నిర్మాణాత్మకమైన పాత్ర పోషించకపోతే దేశం అభివృద్దికి దూరమవుతుంది. దేశ భవితవ్యం యువత శక్తి సామర్ధ్యాలపై ఆధారపడి ఉంది. అందుకే యువతలో మార్పురావాలి. దురదృష్టవశాత్తూ నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి, మత్తులో తేలియాడి, జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్ధ్యాలను కోల్పోయి, నిర్వీర్యమై, నిస్తేజంగా మారడమే కాకుండా సమాజానికి భారంగా తయారవడం అత్యంత దురదృష్టకరం.

- Advertisement -

మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతున్నది. మద్యాన్ని, మాదక ద్రవ్యాలను సమాజం నుండి దూరం చేయకుండా పటిష్ఠమైన ప్రపంచ నిర్మాణం సాధ్యమా? యువతను మత్తులో ముంచి, చిత్తు చేసే మద్యానికి,డ్రగ్స్ అక్రమ వినియోగానికి, అడ్డుకట్ట వేయాలి. సకల అనర్ధాలకు, ఆరాచకాలకు, హత్యలకు ప్రేరణగా నిలిచే త్రాగుడు, డ్రగ్స్ వాడకం వంటి దరిద్ర వ్యసనాలను దూరం చేయకుండా సమాజం బాగుపడదు. మాదకద్రవ్యాల వినియోగం పెను శాపంలా దాపురించింది. డ్రగ్స్ మాఫియా సర్వత్రా శీఘ్రంగా వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించే విషయం.నేటి ప్రపంచాన్ని, యువతను, అభివృద్ధిని సర్వనాశనం చేస్తున్న డ్రగ్స్ వివిధ రూపాల్లో వివిధ దేశాల్లో విచ్చలవిడిగా లభ్యమౌతున్నది. ప్రపంచాన్ని విద్యతో,నైపుణ్యంతో, అభివృద్ధితో నూతన పుంతలు తొక్కించవలసిన యువత మత్తుపదార్ధాలకు అలవాటు పడి, తమ శక్తి యుక్తులను నిర్వీర్యం చేస్తున్నారు.

ప్రపంచం మారింది. మారిన కాలానికి అనుగణంగా మనం కూడా మార్పుకు సిద్ధం కావాలి. అయితే ఈ మార్పు సవ్యంగా ఉండాలి. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉండరాదు. అయితే నేటి ప్రపంచంలోని అనేక దేశాల్లో బాలలనుండి,యువకులు,వృద్దుల వరకు వ్యసనాలకు బానిసలై అభివృద్ధి కి ఆటంకంగా తయారౌతున్నారు.నాగరికత వెర్రి తలలు వేస్తున్నది. అసహజమైన రీతిలో వికృతంగా మారే వ్యక్తుల వలన సమాజంలో శాంతి భద్రతలు కరువై ఆటవిక ప్రవర్తన కు ఆజ్యం పోయడం అత్యంత దురదృష్టకరం. మత్తు కారకాల వలన విచక్షణ నశించి, ఆ మత్తులో జరగరాని ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు, హత్యలకు మత్తు పదార్థాలు ప్రభావితం చేస్తున్నాయి. డ్రగ్స్ భూతం పంజా విసిరి ప్రపంచ మహమ్మారిగా మారింది. వ్యసనపరులై, భ్రష్టులైన వారి వలన అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలా తయారౌతారో వేరే చెప్పనక్కరలేదు. బాధ్యత నేర్పని విద్యల వలన ప్రపంచమే నైతికంగా పతనమైపోతున్నది. యువశక్తి నిర్వీర్యమై పోతున్నది.

డ్రగ్స్ వలన ప్రపంచ యువత అనునిత్యం మత్తులో తూలుతున్నది. ఇది చాలదన్నట్టు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక మహమ్మారిలా మానవ సమాజంలో ప్రవేశించింది. అతి భయంకరమైన డ్రగ్స్ భూతానికి మానవ వనరులన్నీ నిర్వీర్యమై పోతున్నాయి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చేయలేని దుర్మార్గమంటూ ఏదీ లేదు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వలన కలిగే విపరీత పరిణామాలను అవగతం చేసుకున్న అంతర్జాతీయ సమాజం డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నప్పటికీ, డ్రగ్స్ మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదే తప్ప, సమసి పోవడం లేదు. 1987 వ సంవత్సరంలో వియన్నాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక సదస్సు జరిగింది. క్రమేపీ ప్రపంచంలోని అన్నిదేశాలు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడుతున్నాయి. 1987 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డ్రగ్స్ లేని అంతర్జాతీయ సమాజానికై పిలుపునిచ్చింది. 1989 లో జరిగిన ఐ.రా.స సదస్సు మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా పొరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగించాలని నిర్ణయించుకుని కార్యాచరణ ప్రణాళిక రచించినా, ఫలితం మాత్రం ఆశించిన రీతిలో లేదు.

నేటి ప్రపంచంలో ఇంకా చాలా మందికి తినడానికి తిండి లేదు. త్రాగడానికి సరైన నీరు లేదు. కూడు- గూడు-గుడ్డ- విద్య సమాజంలో ప్రతీ ఒక్కరికీ అవసరం. కనీస మౌలిక సదుపాయాలు కూడా నేటికీ ప్రపంచంలో చాలా మందికి అందడం లేదు. తరతరాలు తిన్నా చాలనంత సంపద ప్రపంచంలో కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. మధ్యతరగతి,దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాలు అస్తవ్యస్థంగా ఉన్నాయి. నిరక్షరాస్యులు,నిరుద్యోగులతో పాటు భద్రత, భరోసా లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. రెక్కాడితే గాని రెక్కాడని దుర్భర ఆర్దిక పరిస్థితుల మధ్య కన్నీటితో సహవాసం చేస్తూ, నిస్సహాయ జీవితాలు గడుపుతున్న నిజమైన నిరుపేదల బ్రతుకులను హృదయ నేత్రంతో వీక్షిస్తే వారి ఆర్ధిక నేపథ్యం అవగతమౌతుంది. తినడానికి తిండి, త్రాగడానికి సరైన నీరు లేక పోయినా మద్యం, మాదక ద్రవ్యాలు మాత్రం ప్రపంచంలో లోటు లేకుండా లభ్యమవుతున్నాయి. దిగజారిన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల మధ్య డ్రగ్స్ వంటి భయంకరమైన వ్యసనాలు వ్యక్తులను,కుటుంబాలను ఆర్ధికంగా కృంగదీస్తున్నాయి. మత్తులో పడి మానసిక రుగ్మతలకు గురై, యువశక్తి నిస్తేజమై ప్రపంచ అభివృద్ధిని మరింతగా కృంగదీస్తున్నది.

ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు దూసుకు పోవాలంటే ఆ దేశంలో యువత నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలి. అయితే ఇలాంటి యువత శక్తియుక్తులన్నీ మత్తు,మాదక ద్రవ్యాల వ్యసనాలతో నిర్వీర్యం కావడం అత్యంత దురదృష్టకరం. వివేకం, విచక్షణ, విలువలు అధః పాతాళానికి దిగజారిపోవడంలోను, నేరప్రవృత్తి విచ్చలవిడిగా పెరిగిపోవడంలోను మాదక ద్రవ్యాలు,మద్యపానం వంటి వ్యసనాలు అత్యంత క్రియాశీలకంగా తయారైనాయనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుచేత మత్తుకు ప్రజలంతా దూరంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా మాదకద్రవ్యాలను సమాజం నుండి తరిమి కొట్టడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు.ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. ప్రజల ఆరోగ్యమే నిజమైన ఆర్ధిక పరిపుష్టికి ఆలంబన.
1998 లో ఐ రా.స జనరల్ అసెంబ్లీ “గ్లోబల్ డ్రగ్స్” సమస్యపై ఒక తీర్మానం ఆమోదించింది.మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు జరిగినా, వీటి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్ధేశనం చేసినా, డ్రగ్స్ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. త్రాగుడు వ్యసనంతో పాటు డ్రగ్స్ వ్యసనం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది.ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని “యున్.ఓ.డి.సి” సంవత్సరాల తరబడి ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి, డ్రగ్స్ పై పోరాటానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తున్నది. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రరిణామాల వలన వివిధ దేశాల ప్రభుత్వాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మిలియన్ల సంఖ్యలో డ్రగ్స్ కు బానిసలని కొకైన్,మార్జువానా,మార్ఫిన్, చరస్,హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇతర దేశాల విషయం ప్రక్కన బెడితే భారత ప్రభుత్వం 1985 లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం “ఎన్.డి.పి.ఎస్” తీసుకురావడం, తర్వాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్ఠం చేసింది. అయితే చట్టాలెన్ని చేసినా ప్రజల దృక్పథంలో మార్పు రానంతకాలం ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాక తప్పదు. ప్రజల్లో వివేచన కలగాలి. గ్రామీణ ప్రాంతాలను కూడా గంజాయి వణికిస్తున్నది. మత్తు పదార్థాలను ప్రపంచం నుండి ఎంత త్వరగా దూరం చేస్తే అంతమంచిది. మానవ జన్మ సకల జీవరాశుల కంటే అత్యంత శ్రేష్ఠమైనది. అయితే ఇంతటి మహోన్నతమైన మానవ పుట్టుగడ మత్తుపదార్ధాల మాయలో చిక్కుకుని అతలాకుతలమౌతున్నది. వాస్తవంలో జీవించడం మాని, ఊహల్లో విహరించడం వలన ప్రపంచం ఆధునికం నుండి ఆటవికానికి పయనిస్తున్నది. ఇకనైనా మారాలి. కాలం మార్పును తీసుకు రాదు. కాలంతో పాటు మనం కూడా పరుగెత్తాలి.ఇలాంటి పరుగు అపసవ్యంగా మారకూడదు.నేటి ప్రపంచంలో ఇంకా ఎంతో మంది తినడానికి తిండిలేక, త్రాగడానికి పరిశుభ్రమైన నీరు లేక, విద్యకు నోచుకోక అభివృద్ధికి ఆవల నెట్టబడుతున్నారు.ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితులను చక్కబెట్టి యువతను, ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర వహించే విధంగా తీర్చిదిద్దాలి.

డ్రగ్స్ కు బానిసలైన యువతరం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరదు.భ్రమల్లో తేలియాడించి ఊహల పల్లకీలో ఊరేగించి, రంగుల ప్రపంచం చుట్టూ పరిభ్రమించేలా చేయగల శక్తి మాదక ద్రవ్యాలకుంది.ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన వారికి మానవ ప్రపంచంతో సంబంధాలుండవు. మంచి-చెడు విచక్షణ కనిపించదు. స్వప్నలోకాల్లో విహరిస్తూ, మత్తు వదలిన తర్వాత అనేక శారీరక, మానసిక బలహీనతలకు గురై, మళ్ళీ అదే మత్తుకోసం చేయకూడని అకృత్యాలన్నీ చేస్తారు. డ్రగ్స్ మాఫియా వలలో చిక్కి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి, చట్టవిరుద్దమైన డ్రగ్స్ రవాణాకు పాల్పడతారు. డ్రగ్స్ కు బానిసలై ఉగ్రవాదులుగా మారుతున్న వారెంతో మంది సమాజానికి చీడపురుగుల్లా తయారౌతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. వీరి వలన అభివృద్ధి ఆగిపోతున్నది. విద్య, వైద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వాలు సింహభాగం నిధులను అరాచకశక్తుల అణచివేతకోసం, బాహ్య, ఆంతరంగిక అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికే వెచ్చించవలసి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ప్రజోపయోగకరమైన కూడు, గూడు, గుడ్డ విద్య, వైద్య, ఆరోగ్యం వంటి అంశాలపై అధిక నిధులు వెచ్చించలేకపోవడం జరుగుతున్నది.

ఈ పరిస్థితులు మారాలి. ప్రజల్లో మార్పు రావాలి. మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుండి బయటకు తీసుకురావాలి. సకల అనర్ధాలకు,సమాజంలో చోటుచేసుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు “మత్తు” ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో మాదక ద్రవ్యాల ప్రభావం గురించి ప్రత్యేకంగా విశ్లేషించనక్కరలేదు. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్ ను యువత నుండి దూరం చేయాలి. డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి. డ్రగ్స్ మహమ్మారి ని పారద్రోలి వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలి.
-సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్) మొబైల్:9704903463.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News