ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు తమ ఉత్తమ నైపుణ్యాలను, అపార విజ్ఞానాన్ని, అపూర్వ అనుభవాలను, అమూల్య సమయాన్ని వెచ్చించి మానవ జీవన సరళికి, సమగ్ర సమాజాభివృద్ధికి ఎంతగానో తపన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్వచ్ఛంద కార్యకర్తల నిస్వార్థ సేవలను గుర్తించిన ఐరాస 1985లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఏట 05 డిసెంబర్‌న “అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినం” పాటించనట ఆనవాయితీగా మారింది.
అంతర్జాతీయ వాలంటీర్ల దినం-2023 నినాదం:
ప్రపంచాభివృద్ధి లక్ష్యాల సాధనకు వాలంటీర్ల పాత్రను గమనించి వారి కృషిని ప్రోత్సహించడం, శాంతి స్థాపనలో వారి చేయూతను అందుకోవడానికి, స్వచ్ఛంద కార్యకర్తలను కృతజ్ఞతా భావంతో సత్కరించుకోవడానికి ఈ వేదికను వినియోగిస్తారు. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న పలు విపత్తులు, సంక్షోభాలు, సవాళ్ల సమయంలో వాలంటీర్ల సేవలు అనన్యసామాన్యమే కాదు అభినందనీయం కూడా. కరోనా విపత్తు కల్లోల సమయాన వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం, పారిశుధ్య సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ప్రాణాలకు తెగించి విశ్వ మానవాళికి సేవలు అందించారు. అంతర్జాతీయ వాలంటీర్ల దినం-2023 నినాదంగా “సమిష్టి చర్యలు మహా శక్తివంతం (ది పవర్ ఆఫ్ కలెక్టివ్ ఆక్షన్)” అనే అంశాన్ని తీసుకున్నారు.
అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థలు:
ప్రపంచవ్యాప్తంగా 109 మిలియన్ల వాలంటీర్లు అనునిత్యం సేవలు అందిస్తూనే ఉన్నారు. ఐరాస వాలంటీర్లలో 51 శాతం మహిళలు, 29 శాతం యువత ఉన్నారు. సంక్షోభ సమయాలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర వేళల్లో అందరి కన్న ముందు వాలంటీర్లు చేరి, తమ జీవితాలను పణంగా పెట్టి మానవీయతను ప్రదర్శించుట ప్రశంసనీయం. అంతర్జాతీయ రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్బులు, రోటరీ క్లబ్బులు, పలు స్వచ్ఛంద సంస్థలు వెలకట్టలేని సేవలను అందిస్తున్నారు. పేదరికం వేళ్లూనిన భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల సహాయం అన్ని వర్గాల ప్రజలకు అర్హతను బట్టి అందడం లేదు. ఈ విషమ సమయాల్లో వాలంటీర్ల కృషి వాంఛనీయం, అత్యవసరమని నమ్మాలి. యువతలో నిస్వార్థ సేవాభావాన్ని జాగృతం చేయడానికి యన్‌సిసి, యన్‌యస్‌యస్ లాంటి విభాగాలు కృషి చేస్తున్నాయి. అంతర్జాతీయ వీలంటీర్ల దినం వేదికగా కార్యకర్తలను సన్మానించడం, వారి సేవలను గుర్తించడం, యంజీఓలతో కలిసి సేవలు చేయడం, వాలంటీర్ వ్యవస్థలకు చేయూత ఇవ్వడం చేయాలి. ఈ వేదికగా ర్యాలీలు, ప్రదర్శనలు, పరెడ్లు, రక్తదాన శిబిరాలు, సదస్సులు, నిధుల సేకరణ, కార్యశాలలు, విద్యా సంస్థల్లో యువతతో సేవా కార్యక్రమాలను నిర్వహించడం, యంజీఓలను కొనియాడడం లాంటి కార్యక్రమాలు చేయాలి.
సర్వప్రాణి సేవయే మాధవ సేవ:
ఇతరులకు సేవ చేస్తూ మన మానవీతను ప్రదర్శిద్దాం. స్వచ్ఛంద సేవకులను సమయం దొరుకుతుంది. మన జత చేతుల్లో ఒకటి మన కోసం, మరోటి సమాజం కోసం అని నమ్మాలి. మన నిత్యజీవితంలో ఇతరులకు ఎంత సమయం వెచ్చిస్తున్నామనే విషయాన్ని గుర్తించాలి. సర్వప్రాణి సేవలో దైవత్వాన్ని దర్శిద్దాం. నవ్వుతూ ఉందాం, నవ్వులను పంచుదాం అనే నినాదాన్ని జీవన సూత్రంగా తీసుకుందాం. వాలంటీర్ల సేవలకు ఖరీదు కట్టలేం, అవి అమూల్యమైనవి. ప్రతి చిన్న చేయూత ప్రపంచ శాంతికి తోడవుతుంది. మాట్లాడే పెదవుల కన్న చేయూతనిచ్చే చేతులే మిన్నయని మరువరాదు. మన జీవితాలు మన కోసమే కాదు, మన సమాజం కోసం కూడా అని నమ్మాలి. విద్యార్థుల్లో స్వచ్ఛంద సేవల పట్ల అవగాహన పెంచుదాం. అత్యవసర సమయంలో గుక్కెడు నీళ్లు కూడా ప్రాణాలను నిలుపుతాయి.
బిందువు, బిందువు కలిస్తేనే మహా సముద్రం అవుతుంది. చిన్న చిన్ని సేవలే పెద్ద మార్పులకు పుణాది అని తెలుసుకోవాలి. మనందరం టైమ్, టాలెంట్, ట్రెజర్లను కొంత సమాజ హితానికి వెచ్చిద్దాం. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 సాధనకు స్వచ్ఛంద సేవకులుగా మారి సుందర ప్రపంచాన్ని నిర్మాణంలో మనదైన పాత్రను నిర్వహిద్దాం. స్వార్థమే తెలియని రేపటి శాంతియుత సమాజాన్ని స్థాపిద్దాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037