Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: అక్షర ఆణిముత్యాలు - ముక్కామల ఆఫ్ లైన్ కథలు

Telugu literature: అక్షర ఆణిముత్యాలు – ముక్కామల ఆఫ్ లైన్ కథలు

కథకి కుతూహలం ఎక్కువ. కవితకి దాహం ఎక్కువ

ప్రతి వ్యక్తికి సామాజిక స్పృహ రాజకీయ స్పృహ లేకున్నా సాహిత్య స్పృహ ఉండాలంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. కథ ఎప్పుడు పుట్టింది అంటే అమ్మ ఎప్పుడు పుట్టిందో అప్పటినుంచి. అలాంటి అమృతప్రాయమైన అమ్మ కదిపితే కమ్మని కథ చెప్పి నిద్ర బుచ్చుతుండేది, ఆలోచనలను చైతన్యపరిచేది. నేడు నిద్రాణమైన వ్యవస్థలో అమ్మ పాత్ర ఆధునీకరించబడింది . అమ్మ బాధ్యత హాస్పిటల్లో కంటుంది, హాస్టల్లో పెంచుతుంది అని ఎత్తిచూపలేము గాని నీళ్లు తాగి నిలుచుండే తత్వం మాని పాలు తాగి పరిగెత్తే యాంత్రిక యుగంలోకి విసిరి వేయబడ్డాం అని చెప్పవచ్చు. కథకి కుతూహలం ఎక్కువ. కవితకి దాహం ఎక్కువ. కథ జాగ్రదవస్థ అయితే , కవిత్వం అనేది స్వప్నావస్థ. కథ అంక గణితమైతే, కవిత్వం బీజగణితం.

- Advertisement -

తొలి దశలో కవిత కధాత్మకంగా ఉండేదని చెప్పవచ్చు అందుకే భరతుడు నాట్య శాస్త్రంలో ఇతివృత్తమే శరీరం అన్నాడు. ఇతివృత్తం అంటే కథ నన్నయ్య ప్రసన్న కథకి ప్రథమ స్థానం ఇచ్చి అక్షర రమ్యత అనే కవితా గుణానికి ద్వితీయ స్థానమిచ్చారు. ఆధునిక కథా సాహిత్యం 1910 లో ప్రారంభమైంది. ఆధునిక తొలి కథానిక గురజాడ అప్పారావు రచించిన “దిద్దుబాటు”. ఇది ఆంధ్రభారతి పత్రికలో
ప్రచురించబడింది.
బాల సాహిత్యంలో పాటల కన్న కధలే ఎక్కువ. ఈ తరంలో బాల సాహిత్యాన్ని రచయితలు విస్మరిస్తున్నారు. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బుజ్జాయి, బాల భారతి, బాలజ్యోతి చిన్నారి లోకం, మొదలైన పత్రికలు పిల్లల కథలకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బంగారు భవిష్యత్తుకు కొండంత భరోసా ఇస్తూ బాల సాహిత్యంలో రివ్వున రాకెట్ వేగంతో దూసుకొస్తున్న కథా రచయిత ముక్కామల. జానకీరామ్ గారు. వారి కథలు చూస్తుంటే ఈ నవరచయిత పిడికిలెత్తి పిల్లలకు వాగ్దానం చేస్తున్నారు నేనున్నానంటూ….
వారు రచించిన ఆఫ్ లైన్ అనే కధాపుస్తకం ప్రేక్షకుల హృదయాలలో చెక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు ఆఫ్ లైన్ కధాపుస్తకం అనేది అంతర్జాలంలో online చర్చకు తెరలేపింది. తొలి రచన అయిన తొలకరి పూల జల్లుగా మురిపిస్తుంది.
మెతుకు వెలుగులు అనే కవిత పుస్తకం లో పద్మావతి రాంభక్త అనే రచయిత్రి ” వాడికి అన్నీ ఇచ్చాం ” అనే కవిత లో టెక్నాలజీ దుష్ప్రభావం గురించి , నవీకరించబడిన మనిషి యొక్క వింత మనస్తత్వాలు గురించి చక్కగా అభివ్యక్తి చేసింది .
” టెక్నాలజీ పక్షి పెట్టిన
సరికొత్త గుడ్లను పొదగడంలో నిమగ్నమై
వాడినసలు గమనించనేలేదు.
అరచేతిలో అమరిన
గాజు కోడిపెట్ట వెన్నును మునివేళ్ల తో
తడుముతూ
ఆనంద సాగరంలో మునిగిన మేము
వాడిపై ఏనాడు దృష్టి సారించలేదు
వర్చువల్ వరల్డ్
విన్యాసాల తీగపై అడుగులు వేస్తూ
ముఖపుస్తకపు స్తోత్రాలను
వల్ల వెయ్యటంలో తలమునకలై
వాడిని బడి అయిపోగానే
ప్రైవేట్ పంజరానికి పరిమితం చేసాం”
అంటూ తెచ్చి పెట్టుకున్న కంప్యూటరీకరణ పిల్లల చావులకు కారణమవుతోంది కలగనలేదు అంటూ తల్లి ఆక్రోశాన్ని వెల్లడిస్తుంది. అది గుర్తించిన ముక్కామల. జానకీరామ్ గారు పిల్లల ఆత్మహత్యలకు పరిష్కారం మార్గంగా ఆఫ్ లైన్ కధా పుస్తకాన్ని మన ముందు ఉంచారు. ఆఫ్ లైన్ అనే కధాపుస్తకం తో జానకిరామ్ అక్షరం మేళాను ఆనంద డోలికలలో ఊరేగించారు. ప్రతి కథ రమణీయంగా కంటికి కమనీయంగా ఉంటుంది. ప్రతి కథ దీర్ఘంగా కాక పొందికగా ఉదాత్తముగా ఉండి ఆనందాశ్చర్యాలకు గురిచేసి కరుణాద్భుత రసాలను పోషించి అమృతానందాన్ని కలిగిస్తుంది. శుభోదయం- జ్ఞానోదయం! అనే కథ అధ్యంతం ఆకట్టుకుంటుంది. ఈ కథ పల్లె పరిమళాలను మమతాను రాగాల మట్టి సువాసనలను తాత మనవడు మధ్య ఉన్న ఆత్మీయ అనిర్వచనీయమైన బంధాలను అక్షర ఫోటోగ్రఫీలో బంధించారు. ఈ కథ కొంత కవిత్వ ఆనవాళ్ళు రూపుదిద్దుకుంది. పల్లె తెల్లటి మంచు దుప్పటి కప్పుకుంది అని, పొలాలు నెత్తిన వజ్రాలు ధరించి స్వాగతం పలుకుతున్నట్టు అంటూ కవితాత్మక వచనాలు పలుకుతారు . పల్లెలు భారతీయ అభివృద్ధికి జీవనాడులు అన్నట్టు, సంస్కృతికి, సంప్రదాయాలకి నిలువెత్తు కొలమానాలు అన్నట్టు పాఠకులకు అర్థమయ్యే రీతిలో పదాలలో పలికించారు . కార్టూన్ చానళ్లకు అదుపు లేని యూట్యూబ్ వీడియోలకు అతుక్కుపోయిన మనుషులకు శుభోదయం, మంచి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. పల్లెలు కుప్పకూలిన వ్యవస్థ కాదు. కరోనాకాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది పల్లెలే అని గుర్తుంచుకోవలసిన విషయం. పల్లెలు కులాల బేధాలు లేని మతాల మచ్చలు లేని ఆది నాగరికతకు ఆనవాళ్లు.
ఈ కథ విస్తృతి లేని విసుగు పుట్టించని అచ్చమైన కధ. ఏకాంశవ్యగ్రత ఉండి ఒకే అంశం లక్ష్యంగా ఉంటుంది. సందర్భానుసారంగా, సమయానుకూలంగా నడిచే కథ ఈ కథలో ప్రతి పాత్ర సమగ్రంగా ఉంటుంది. తాతా మనవడి మధ్యసంవాదచాతుర్యంసందర్భానుసారంగా సాగుతుంది. వికాసానికి, వివరణకి తోడ్పడుతుంది.
ముక్కామల . జానకిరామ్ గారు చక్కని ఎఱుకతో ఈ కథను రచించి పాఠకులపై ప్రభావం చూపుతారు
అని ఖచ్చితంగా చెప్పవచ్చు. పాలు పాల ప్యాకెట్ లో దొరుకుతుందని, బియ్యం బజార్ కిరాణా షాపులో దొరుకుతుంది అనుకునే అర్జున్ అమాయకత్వాన్ని వదిలి కాసింత జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. సూర్యోదయం కంటే ముందే మేల్కొని ఉత్తమమైన క్రమశిక్షణ ను అడుగడుగునా నేర్చుకుంటాడు . కణకణంలో జీర్ణించుకుంటాడు రంగురంగుల కాకి అనే కథలో ముక్కామల. జానకీ రామ్ ప్రకృతి సత్యాలు ఎన్నో చెప్పే వేదాంతి లాగా కనపడతారు.ప్రకృతి లో ప్రతి అణువులో ప్రతి కణంలో సృజనాత్మకత ఉందని చెబుతారు .

ప్రకృతిలో వైవిధ్యత, సారూప్యత కలిసే ఉంటాయి. ప్రతి జీవి భిన్నమైనదే అన్ని జీవులలో ఏకాంశాంశములు కలిగి ఉంటాయి. అందుకే సృష్టిలో ప్రతిది ఉన్నతమైనది తేల్చి చెపుతారు.. ప్రకృతి వాదులను సమర్థిస్తూనే, పర్యావరణ వాదులతో చేతులు కలుపుతారు. వైజ్ఞానిక వాదులతో దోస్తీ చేస్తారు నేటి ఆధునిక సమాజంలో పెరిగిపోతున్న నిమ్నికరణను, నిరాశవాదంను వేలెత్తి చూపే అంశాలను కథనాత్మకంగా చెప్తారు. పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో లోపాలను చూసి కృంగిపోయే వాళ్లకు బ్రహ్మాండమైన భరోసా ఇస్తారు . ఆశావాదంతో ముందుకు వెళ్తే లోపాలు సైతం చైతన్య దీపాలుగా మారుతాయని చక్కని పాఠం చెప్తారు . తిరస్కరించబడిన చోటే పురస్కరించబడాలని మూర్తిమత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు ఎన్నో చెపుతారు . తన శరీర రంగు శాపంగా మారిందని బాధపడే కాకికి తన గొప్పతనం చెప్పే కథ ఇది. కాకి యొక్క క్షేమాలు అడిగి తెలుసుకునే ఆత్మబంధువు అని, తిని పారేసిన ఆహార పదార్థాలను తింటూ మన పరిసరాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచే ఒక పారిశుద్ధ్య కార్మికుడు అని మన ఆరోగ్యాన్ని సంరక్షించే వైద్యుడు అని గురు బోధను బోధిస్తారు. నేటి తరానికి విలువలతో కూడిన విద్య ను ఒక సబ్జెక్టుగా అందించాలని జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, కాని ఇలాంటి కథలు చదివితే ఆ ప్రయత్నం వృధా ప్రయత్నం అని చెప్పొచ్చు. కథలు వాటి స్థానాన్ని భర్తీ చేయొచ్చు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
అక్షరామృతాలు అందించిన ఆఫ్ లైన్ కధా పుస్తకానికి అపురూపమైన ముఖచిత్రాన్ని అందించినది జె.వెంకటేష్ గారు. డి.టి.పి పేజీ మేకింగ్ చేసినది శశికళ గారు. పుస్తక ముద్రణలో సహాయ సహకారాలు అందించింది పుప్పాల. కృష్ణమూర్తి గారు, గరిడేపల్లి.అశోక్ గారు. ముక్కామల జానకీరామ్ తల్లిదండ్రులైన అడిమయ్య, లచ్చువమ్మ గార్లు కి ఈ ఆఫ్ లైన్ పుస్తకాన్ని అంకితం చేసినాడు. ముత్యాల లాంటి ముందు మాటలు అందించిన పైడిమర్రి. రామకృష్ణ గారు, పుప్పాల కృష్ణమూర్తి గారు, బూర్లె. నాగేశ్వరావు గారు. నవతెలంగాణ పబ్లిక్ హౌస్ ముద్రించిన ఆఫ్ లైన్ పుస్తకం అందరి హృదయాల్మరలో ఉండవలసిన పుస్తకం.

                    సాదే.సురేష్
             9441692519
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News