అవినీతి, అక్రమాలకు సంబంధించి రాజకీయ నాయకుల, మీద, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపణలు చేసి, కేసులు పెడుతున్నప్పుడు దర్యాప్తు సంస్థలు మరింతగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి కేసుల్లో దర్యాప్తు చేయడం అన్నది ఈ సంస్థలకు అగ్ని పరీక్షగానో, కత్తి మీద సాముగానో పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల పనితీరు మరీ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పాలక వై.ఎస్.ఆర్.సి.పి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. ఇవి రాజకీయ పార్టీలుగా కాక, శత్రు పక్షాలుగా, వైరి పక్షాలుగా వ్యవహరిస్తూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని నైపుణ్యాల అభివృద్ధి సంస్థలో 2014లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ రాష్ట్ర సి.ఐ.డి విభాగం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత అయిన ఎన్. చంద్రబాబు నాయుడుపై అభియోగాలు మోపడం అన్నది చిన్నవిషయమేమీ కాదు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టి.డి.పి) ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ఒక నైపుణ్యాల అభివృద్ధి పథకానికి నిధులు విడుదల చేసిందని, అయితే ఇందుకు సంబంధించిన నిథులను కొన్ని డొల్ల కంపెనీలకు మళ్లించిందని, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ సంస్థలు తమ వంతు నిధులు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపణ చేసి, కేసులు పెట్టడం జరిగింది.
ఈ పథకానికి సంబంధించి ఇతరత్రా కూడా అనేక విధాలుగా నిబంధనల అతిక్రమణ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 2021లో ఏ.పి సి.ఐ.డి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను ఆధారం చేసుకుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) కూడా మరో మార్గంలో దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ నిధుల మళ్లింపు వల్ల లబ్ధి పొందినవారిని అరెస్టులు చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే సి.ఐ.డి విభాగం చంద్రబాబు నాయుడును ఇందులో ప్రధాన నిందితుడుగా అరెస్టు చేయడం జరిగింది. సి.ఐ.డిలోని ఆర్థిక నేరాల విభాగం ఆయనకు, ప్రైవేట్ సంస్థలకు మధ్య ఉన్న లింకు గురించి ప్రస్తుతం ఆరా తీస్తోంది.
ఈ కేసు తీరుతెన్నులను పరిశీలించినవారికి, చంద్రబాబును ఇటీవల ప్రధాన నిందితుడుగా పరిగణించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఆరోపణలు, దర్యాప్తుల వెనుక రాజకీయ కక్ష సాధింపు ధోరణి కూడా ఏదైనా ఉందా అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. ఈ కేసులోని మంచి చెడులను పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకోవడం జరుగుతోందనే అనుమానం కూడా కలుగుతుంది.
పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ సాక్ష్యాలు లేకుండానే సి.ఐ.డి విభాగం అత్యుత్సాహంతో చంద్రబాబును అరెస్టు చేయడం సామాన్య జనానికి సైతం కొరుకుడు పడడం లేదు. ఈ నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అవినీతి, అక్రమాలకు, చంద్రబాబుకు ఉన్న సంబంధాన్ని నిర్ధారించే బాధ్యత సి.ఐ.డి మీద ఉంది. అయితే, రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలను రుజువు చేయడం దర్యాప్తు సంస్థలకు అంత తేలికైన విషయం కాదు. అవి నిజంగా పాలనలో అక్రమాలు, అవినీతి జరగకుండా నిరోధించాలనుకున్న పక్షంలో పాలక పక్ష విధేయులుగా వ్యవహరించడం మానుకోవాలి. అది జరగని పక్షంలో అవినీతి నిర్మూలన కార్యక్రమం అన్నది అపహాస్యం పాలవుతుంది. దీని మీదే కాక, పాలన మీద కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. దర్యాప్తు సంస్థల మీదా, అవినీతి నిరోధక శాఖ మీదా ఇప్పటికే ప్రజల్లో అపనమ్మకాలు పెరుగుతున్న విషయాన్ని గమనించాలి.
Investigative agencies: దర్యాప్తు సంస్థలకు కత్తి మీద సాము
అపహాస్యం అవుతూ, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్న సంస్థలు