Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Investigative agencies: పాలకుల చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలు అయ్యాయా?

Investigative agencies: పాలకుల చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలు అయ్యాయా?

గత ఐదు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ.డీ నమోదు చేసిన కేసులను , జరిపిన దాడులను పరిశీలిస్తే సామాన్యులకు సైతం అర్థమయ్యేది ఒకటే, ఈడీ ఆర్ధిక నేరస్తుల కంటే ప్రతిపక్ష నాయకులను, సానుభూతి పరు లనే టార్గెట్‌ చేస్తున్నది అని. గత నాలుగు సంవత్సరాలు గా అదేపనిగా ఈడీ ఫరిదిని, అధికారాన్ని పెంచుకుంటూ పోతున్నది కేంద్రప్రభుత్వం, అదేసమయంలో సీనియర్లను కాదని జూనియర్లను దర్యాప్తు సంస్థల డైరెక్టర్లుగా నియ మిస్తూ, రిటైరైనా కుడా పదవీకాలాన్ని పెంచుకుంటూ అన్యోపదేషంగా దర్యాప్తు సంస్థలన్నీ మా కనుసన్నల్లో నడుస్తున్నాయని డిల్లీ పెద్దలు ప్రతిపక్షాలకు తాఖీదులు పంపుతూనే ఉన్నారు. కేసులు నమోదు చేయడం, దాడులు చేయడం, మీడియాలో హల్చల్‌ చేయడం ఆ తరువాత జరిగే పార్టీ ఫిరాయింపులు, విచారణ లో ఆర్ధాంతరంగా అలసత్వం చోటుచేసుకోవడం భారత రాజకీయాల్లో షరా మామూలు అయింది. ఆంధ్రాలో పోర్టుల బదిలీ వెనుక, సుజనా చౌదరీ లాంటి నేతల పార్టీ ఫిరాయింపు వెనుక, మహారాష్ట్రా రాజకీయ సమీకరణాల్లో మార్పుల వెనుక, బీ.ఎస్‌.పీ లాంటి జాతీయ పార్టీల మౌనం వెనుక దాగున్న సత్యం ఈడీ అడుగుల సవ్వడి అని లోకం కోడై కూస్తున్నది. శతాబ్దీ ఎక్ష్ప్రెస్స్‌ వేగంతో మొదలయ్యే దర్యాప్తులు జనతా ఎక్ష్ప్రెస్‌ లా నత్తనడకలు చూస్తుంటే లోకుల గుసగుసలు సత్యదూరం కాదేమో అనిపిస్తున్నది.
ఢిల్లీ మద్యం కుంబకోణం పేరుతొ అప్పుడెప్పుడో ఆరు నెలల ముందు మొదలై డిల్లీ ముఖ్యమంత్రి మొదలుకుని తెలంగాణా జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత వరకూ కొనసాగుతూ సాగిపోతున్న ఈడీ దర్యాప్తును చూస్తుంటే ఆర్ధిక నేరాలు వాటి మూలాలను వెతుకు తున్నట్లు అగుపించడం లేదు, ప్రతిపక్ష నాయకులు రాబోయే ఎన్నికల్లో వారి పనితీరు, ప్రభావం ఆదారంగా జరుగుతున్నట్లు అనుమానించాల్సి వస్తున్నది. విచారణ పేరుతొ గంటల తరబడి ప్రశ్నించడం, రోజుల తరబడి తిప్పించుకోవడం, నిందితుల, సాక్షుల వాంగ్ములాలను మీడియాకు లీకు చేయడం, ఇహ ఇప్పుడో , రేపో అరెష్టు తప్పదంటూ తమ అనుకూల మీడియాలో కథలు కథలుగా కథనాలు, బ్రేకింగు న్యూసులు చూస్తుంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థల నిస్పక్షపాతం మీద అనుమానపు నీడలు పడుతున్నాయి. నాడేప్పుడో డిల్లీ ప్రభుత్వానికి 600 కోట్లు నష్టం అంటూ మొదలైన దర్యాప్తు ఇప్పుడు 2873 కోట్లు అంటూ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చరిత్రను పరికించి చుస్తే ఇప్పటివరకు ఈడీ నమోదు చేసిన కేసుల్లో చార్జ్‌ షీట్‌ దాఖలు చేసిన కేసులు 1142 కానీ కోర్టుల్లో విచారణ పూర్తయిన కేసుల సమాఖ్య మాత్రం కేవలం 25 మాత్రమే.దర్యాప్తుల్లో చూపుతున్న ఉత్సాహం ఆ తరువాత ఎందుకు కొనసాగించడం లేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మోడీ అంటే ఈడీ అన్నట్టు తయారయ్యింది, భారత దేశ ప్రతిష్ట మసకబారుతున్నది అంటూ స్వయంగా తెలంగాణా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు అంటే పరిస్తితి ఎంత భయంకరంగా తయా రయ్యిందో ఉహించుకోవచ్చు. ఈడీ దర్యాప్తును ఎదుర్కొం టున్న రాజాకీయ నాయకులలో 95% మంది ప్రతిపక్ష పార్టీల నాయకులే ఉండటం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపణలకు ఉతమిస్తున్నది. డిల్లీ మద్యం వేడి చల్లారకముందే చత్తీస్‌ ఘ్‌డలో కొత్తగా సందడి మొదలయ్యింది. 2024 ఎన్నికల లోపు ఇంకెన్ని దాడులుంటాయో, జంపు జిలానీలను చూస్తామో కదా!?.
దర్యాప్తు సంస్థలను ఇందిరాగాంధీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదీ అని దుమ్మెత్తి పోసిన అటల్‌ బిహారీ వాజ్పాయ్‌ , అద్వానీ, దీనదయాళ్‌ ఉపాద్యాయ లాంటి మహామహులు సారద్యం వహించిన పార్టీ నేడు అదే ఆయుదాన్ని ఆదునిక పద్దతులలో ఉపయో గించడం ఆత్మవంచన కాదా? చట్టబద్దంగా విచారణ జరిపి శిక్షలు పడేలా చూడాల్సిన దర్యాప్తు సంస్థలు దాడులు, ప్రశ్నలు, నోటీసుల వంకతో వ్యక్తులను ముందస్తుగా అప్రదిష్టపాలు చేయడం, మానసిక క్షోభకు గురిచేయడం నేరాన్ని విచారించాకుండానే, నిరూపించకుండానే శిక్షించడం కాదా? 2014 ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు ఆరోపణలు గానే మిగిలిపోయాయి, ఒక్కటికుడా రుజువు కాలేదు, గత 8 సంవత్సరాల కాలంలో నమోదైన కేసుల్లో శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. అతిపెద్ద ప్రజాస్వామ్యం పదికాలాల పాటు చల్లగా ఉండాలంటే సి.బీ.ఐ , ఈ.డీ లాంటి దర్యాప్తు సంస్థలు, ఎన్నికల కమిషన్‌ లాంటి నిర్ణాయక సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పాలకుల కనుసన్నల్లో కాదు, రాజ్యంగపు అదుపాజ్ఞలలో అధికారులు పనిచేయగలిగే వాతావరణం ఉండాలి. అలా కానిరోజు పాకిస్తాన్‌, శ్రీలంక లాంటి దేశాల్లో జరిగిన, జరుగుతున్న అనర్థాలు రేపటిరోజు మనకు కుడా ఎదురయ్యే ప్రమాదమున్నది.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి.
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News