భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సంస్థలు ప్రభు త్వ కార్యాలయాలుగా మాత్రమే మిగిలిపోవు. దేశ చరిత్రలో సమగ్రతకు, స్వయంసమృద్ధికి, ప్రగతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తా యి. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అగ్రతాంబూలం భారత అంతరిక్ష పరిశోధ నా సంస్థ (ఇస్రో)ది. అంతటి ప్రతిష్టాత్మక సంస్థ ఇప్పుడు ప్రైవేట్ పరం అవుతుందా? ప్రభుత్వమే నిర్వహిస్తుందా చర్చ సాగుతున్న నేపథ్యంలో జరుగుతు న్న పరిణామాలను పరిశీలిస్తే ఇస్రో కార్యకలాపాలను మూడు విభాగాలుగా విభజించి రెండు విభాగాలను ప్రైవేట్ పరం చేసి ఒక విభాగాన్ని మాత్రమే ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంటున్నది. మూడింట రెండు వంతుల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రైవేట్ పరం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం మేం ప్రైవేటు పరం చేయటం లేదు అంటున్నది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఇస్రో ప్రభుత్వ పరిశోధనా సంస్థగా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందనే కొనసాగుతుంది. దీని ఆస్తులు, ల్యాబ్‌లు, లాంచ్ పాడ్లు లేదా సంస్థాగత నిర్మాణం ఏ ప్రైవేట్ సంస్థ కూ విక్రయించబడటం లేదు. కానీ అవి ప్రైవేట్ కంపెనీలు ఆపరేట్ చేసుకోవడానికి ఇచ్చేస్తారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో జరుగుతున్న మార్పులను ప్రైవేటీకరణ కాదు, ఇది ప్రధానంగా కార్యకలాపాల విభజన నమూనా అని చెబుతున్నది. ఈ విధానంలో ఇస్రో, ప్రైవేట్ సంస్థల బాధ్యతలను స్పష్టంగా విభజించారు. లక్ష్యాల పరం గా చూస్తే, ఇస్రో తన దృష్టిని లోతైన సైన్స్ పరిశోధనలు, దేశానికి అవసరమైన వ్యూహాత్మక మిషన్లపై కేంద్రీకరిస్తుండగా, ప్రైవేట్ రంగం వాణిజ్యపరమైన ఉత్పత్తి,అంతరిక్ష సేవలను అందించే బాధ్యతను తీసుకుంటుంది. ప్రాజెక్టుల విషయానికొస్తే, మనుషులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్, 2035 నాటికి నిర్మించతలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్, అలాగే చంద్రయాన్, మంగళ్ యాన్ లాంటి సుదూర గ్రహాంతర పరిశోధనలపై ఇస్రో పూర్తిగా దృష్టి సారిస్తుంది. మరోవైపు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల తయారీ, వాణిజ్య అవసరాల కోసం రాకెట్ల భారీ ఉత్పత్తి వంటి కార్యక్రమాలను ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తాయి. ఈ కార్యకలాపాల కోసం ఇస్రో చేపట్టే పరిశోధనలకు పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు సమకూరుతాయి. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలు తమ సొంత పెట్టుబడులు లేదా వెంచర్ క్యాపిటల్ ద్వారా నిధులను సమీకరించుకొని తమ వాణిజ్య ప్రాజెక్టులను నిర్వహిస్తాయని ఇస్రో చైర్మన్ స్పష్టం చేశారు. దీని అర్థం పరమార్థం మాత్రం రాకెట్ తయారుచేసే పరిజ్ఞానాన్ని, అవకాశాలను ప్రైవేట్ సంస్థలకు పూర్తిస్థాయిలో అప్పగించడమే.
1963లో తుంబా వద్ద సైకిళ్లు, ఎద్దుల బండ్లపై సాధారణంగా ప్రారంభమైన ఇస్రో, చంద్రుడిపై నీటి ఉనికిని కనుగొని, తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి అడుగుపెట్టి అపూర్వ విజయం సాధించింది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల దిశానిర్దేశంలో రూపుదిద్దుకున్న ఈ సంస్థ, 1969 నుంచి కేంద్ర ప్రభుత్వ వ్యోమగామి శాఖ పరిధిలో నిబద్ధత గల ప్రజాసేవా సంస్థగా సేవలందించింది. వ్యాపార లాభాపేక్ష లేకుండా ఆత్మనిర్భరత, సామాజిక శ్రేయస్సు ప్రాథమిక సూత్రాలుగా పనిచేస్తూ సాంకేతిక సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలిచింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఈ ప్రముఖ విజ్ఞాన సంస్థ, ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు తన నిర్వహణ స్వరూపాన్ని మార్చుకునే కీలకమైన సంస్కరణల మలుపు వద్ద నిలబడింది.
1975లో ఆర్యభట్ట, 1980లో ఎస్.ఎల్.వి – 3 ద్వారా రోహి ణి ప్రయోగాలతో మొదలైన ఇస్రో ప్రస్థానం, ఎస్.ఐ.టి.ఈ, ఎస్.టి.ఈ.పి ప్రాజెక్టులతో అంతరిక్ష సాంకేతికతను సామాజిక వికాసానికి మళ్లించింది. ఇన్సాట్, ఐఆర్ఎస్ వ్యవస్థలు కమ్యూనికేషన్, వాతావరణం, విపత్తు నిర్వహణలో విప్లవం తేగా, పి.ఎస్.ఎల్.వి, స్వదేశీ క్రయోజెనిక్ జి.ఎస్.ఎల్.వి లు సంస్థ సామర్థ్యాన్ని చాటాయి. చంద్రయాన్ – 1, మంగళ్ యాన్, నావిక్ , ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగం భారత్‌ను అంతరిక్ష మహాశక్తిగా నిలబెట్టాయి. గతంలో హెచ్.ఏ.ఎల్, ఎల్ అండ్ టీ, గోద్రేజ్ వంటి కంపెనీలు ఇస్రో పర్యవేక్షణలోనే కాంట్రాక్టర్లుగా పనిచేశాయి. లాభార్జన కంటే ప్రజాక్షేమమే ధ్యేయంగా టెలీ – మెడిసిన్, వ్యవసాయం, తుపాను హెచ్చరికలతో లక్షలాది ప్రాణాలను కాపాడాయి. అయితే, ఈ రికార్డు సాధించిన కొద్దికాలానికే సంస్థ పనితీరుపై అసత్య ప్రచారాలు మొదలయ్యాయి. వేగవంతమైన పురోగతి పేరుతో ఇస్రోను ప్రైవేటీకరణ వైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభమై, దాని స్వతంత్ర ఉనికిని బలహీనపరిచే దిశగా అడుగులు పడ్డాయి. మరింత వేగంగా అంతరిక్ష విజ్ఞానంలో ముందుకు సాగాలంటే ఈ సంస్థను ప్రైవేటీకరణ వైపుగా మళ్ళించాలనే వాదన ముందు పెట్టి ఆ వైపు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇస్రో శాస్త్రవేత్తలు తమ సమయం, శ్రమలో 60 – 70 శాతా న్ని మారిన రాకెట్ల అసెంబ్లింగ్, తయారీ పనులకే కేటాయించాల్సి రావడం వల్ల వారి విలువైన సమయం వృథా అవుతుందనే సాకుతో ఆ పనులన్నింటిని ప్రైవేటు పరం చేయాలని సూత్రీకరణ మొదలు పెట్టారు. దీనివల్ల గగన్‌యాన్, పునర్వినియోగ రాకెట్లు (ఆర్ఎల్వీ) లోతైన అంతరిక్ష పరిశోధనల వంటి భవిష్యత్ ఆవిష్కరణలకు ఆలస్యము అవుతున్నాయనేది వీరి వాదన.
ప్రైవేటీకరణ ప్రయత్నాలలో భాగంగా 2019 మార్చిలో వాణి జ్య విభాగంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎస్.ఐ.ఎల్) ఆవిర్భవించింది. ఆ తర్వాత జూన్ 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రభుత్వేతర సంస్థలకు (ఎన్.జి.ఇఎస్) అందుబాటులోకి తెస్తూ విప్లవాత్మక ప్రకటన చేశారు. ప్రైవేట్ రంగానికి అనుమతులు ఇవ్వడానికి, ఇస్రో మౌలిక వసతులను వారికి కల్పించడానికి ఇన్ – స్పేస్ అనే సింగిల్ విండో స్వతంత్ర నియంత్రణ మండలిని ఏర్పాటు చేశా రు. దీనికనుగుణంగానే భారత అంతరిక్ష విధానం 2023 రూపుదిద్దుకుంది. దీని ప్రకారం ఇస్రో కేవలం అధునాతన పరిశోధనాభివృద్ది, ఆర్ అండ్ డీ, మానవసహిత యాత్రలకే పరిమితమవ్వాలి. రాకెట్ల తయారీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఎన్ఎస్ఐఎల్ వాణి జ్య ప్రయోగాలను చూడాలి.ఇన్ – స్పేస్ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలి. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లలో ప్రైవేటీకరణ చేయడానికి అవసరమైన పరిపాలన నిర్ణయాలు జరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అంతరిక్ష పరిశోధన డిపార్ట్మెంట్ సంస్థలు మూడు విభాగాలుగా విభజించినారు.
ప్రస్తుతం తొమ్మిది ఉద్యోగ సంఘాలు సంస్థకు నోటీసులు ఇవ్వడానికి కారణం 2026 ఆగస్టు 21న నిర్వహించిన ఇండియా @100 ఎకానమీ సమిట్‌లో ఇన్ – స్పేస్ ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు. భవిష్యత్తులో ఇస్రో ఇకపై ఎలాంటి ప్రయోగ నౌకలను (రాకెట్లను) తయారు చేయదు, ఆ బాధ్యతలన్నీ పూర్తిగా ప్రైవేట్ రంగానికి లేదా పిఎస్యులకే బదిలీ అవుతాయి అని ఆయన తేల్చిచెప్పడం ఆందోళన కలిగించింది. ఈ విధానపరమైన మార్పులు సున్నితంగా జరగాల్సి ఉండగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిలో అతిపెద్ద సమస్య కేంద్ర ప్రభు త్వం ప్రజల డబ్బుతో దశాబ్దాలుగా నిర్మించుకున్న నమ్మకమైన టెక్నాలజీతో పాటు ఇస్రోకో ఉన్న మెజారిటీ ఆస్తులు ప్రైవేట్ కంపెనీల ఆపరేషన్లకు వెళ్లిపోతాయి. పిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, ఎల్విఎమ్3 రాకెట్ల తయారీని ప్రైవేట్ పరం చేయడం, తమిళనాడులోని నూతన కులశేఖరపట్టణం లాంచ్ ప్యాడ్ నిర్వహణను సైతం ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తారనే వార్తలు ఇస్రో అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలాన్ని సృష్టించాయి. దీనికి నిరసనగా 2026 సెప్టెంబర్ 4న ఇస్రోలోని తొమ్మిది కీలక ఉద్యోగ సంఘాలు (శాస్త్రవేత్తలు, సాంకేతిక, పరిపాలనా సిబ్బంది) ఏకమై ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ కు సమర్పించిన ఉమ్మడి వినతిపత్రం, సంస్థలో నెలకొన్న తీవ్రమైన అపనమ్మకాన్ని కళ్ళకు కడుతోంది. ఉద్యోగులు లేవనెత్తిన ప్రధాన అంశాలు సమంజసమైనవి.
ప్రైవేటీకరణపై ఇన్ – స్పేస్ ఛైర్మన్ చేసిన హడావుడి ప్రకటనలకు అనుగుణంగా అంతరిక్ష శాఖ నుంచి ఎలాంటి స్పష్టమైన చట్టబద్ధమైన ఆదేశాలు రాకపోవడం విధానపరమైన సందిగ్ధతను పెంచుతోంది.
ఐదు దశాబ్దాలుగా ప్రజాధనంతో, శాస్త్రవేత్తల త్యాగాలతో నిర్మించిన రాకెట్ అసెంబ్లింగ్, క్వాలిటీ చెకింగ్, లాంచ్ ప్యాడ్ ఆపరేషన్లను కేవలం కాంట్రాక్ట్ తయారీ గా జమకట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జాతీయ భద్రతకు, సామర్థ్యానికి ముప్పు. రాకెట్ల తయారీ బాధ్యతల నుంచి ఇస్రో తప్పుకుంటే, వేలాది మంది నిపుణులైన సాంకేతిక సిబ్బంది దీర్ఘకాలంగా సంస్థలో పనిచేస్తూ భవిష్యత్తులో ప్రమోషన్లు పొందుదామని కష్టపడి పనిచేసిన వారికి నిరాశ మిగులనుంది. ఇస్రోను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగి తమ భవిష్యత్తు విషయంలో సందేహంలో పడిపోయినారు.
ప్రస్తుత పరిణామాలు ఒక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ అంతరిక్ష సంస్కరణలు నిజంగా భారతదేశ ప్రయోజనాల కోసమా, లేక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ప్రజాధనంతో నిర్మించిన సంపదను పళ్లెంలో పెట్టి అందించడానికా? ప్రపంచవ్యాప్తంగా నాసా,స్పేస్ – ఎక్స్ వంటి ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించిన మాట వాస్తవమే. అయితే, అమెరికా నమూనా వేరు, భారత సామాజిక,ఆర్థిక పరిస్థితులు వేరు.
ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఉపగ్రహాలను, మిషన్లను (ఉదాహరణకు మంగళయాన్, చంద్రయాన్) ప్రయోగించే సామ ర్థ్యం ఇస్రోకు ఉంది. ఇంత సమర్థవంతంగా పనిచేసే సంస్థను ప్రైవేటుపరం చేయడం దశాబ్దాల భారత సాంకేతిక,శాస్త్రీయ వారసత్వ సంపదను ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా అప్పజెప్పడమే. ప్రైవేట్ కంపెనీల ప్రాథమిక సూత్రం లాభార్జన. అవి పెట్టుబడులు పెట్టేది, ప్రయోగాలు చేసేది లాభాల కోసమే గానీ, ఆపదలో ఉన్న మత్స్యకారులకు ఉచితంగా సమాచారం అందించడానికో, లేక గ్రామీణ విద్యార్థులకు టెలి ఎడ్యుకేషన్ ఇవ్వడానికో కాదు. ఇస్రోను కేవలం ఒక పరిశోధనాశాల గా పరిమితం చేసి, సిద్ధంగా ఉన్న రాకెట్ సాంకేతికతలను, లాంచ్ ప్యాడ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అంటే, ప్రభుత్వ ఖర్చుతో పండిన పంటను ప్రైవేట్ వ్యక్తులు కోత కోసుకోవడానికి అనుమతించడమే. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే, అందులో సందేహం లేదు. కొత్త అంతరిక్ష స్టార్టప్‌లు (స్కైరూ ట్, అగ్నికుల్ వంటివి) సొంతంగా సాంకేతికతను పెంచుకోవడానికి, విదేశీ మార్కెట్‌ను ఆకర్షించడానికి ఇన్ – స్పేస్ తోడ్పడాలి. కానీ, ఆ ప్రోత్సాహం ఇస్రోను ఆత్మరక్షణలో పడేసి, దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉండకూడదు.
ఇస్రో కేవలం రాకెట్లను తయారుచేసే సంస్థ మాత్రమే కాదు. అది భారతీయుల సాంకేతిక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇంతకాలం నిలబడ్డది. ప్రైవేటీకరణ పేరిట దశాబ్దాల కాలంగా నిర్మించుకున్న జాతీయ వ్యూహాత్మక సంపదను, అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల భవిష్యత్తును పణంగా పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వం కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, ఉద్యోగ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఇస్రో – ప్రైవేట్ రంగాల మధ్య సహజీవన విధానాన్ని రూపొందించాలి. ఇస్రో తన స్వతంత్రతను, తయారీ సామర్థ్యాన్ని కాపాడుకుంటూనే, ప్రైవేట్ రంగానికి మార్గదర్శకుడిగా నిలిచినప్పుడే భారత అంతరిక్ష రంగానికి నిజమైన సమగ్ర వికాసం సాధ్యమవుతుంది.
డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్
తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అధ్యక్షులు

