Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Is it possible for reservations in Private?: ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ సాధ్యమా?

Is it possible for reservations in Private?: ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ సాధ్యమా?

కర్ణాటకలో సిద్దరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు కనిపిస్తోంది. ప్రైవేట్‌ పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన మంత్రివర్గం ప్రవేశపెట్టదలచుకున్న బిల్లుకు గట్టి ప్రతిఘటన ఎదురు కావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రైవేట్‌ పరిశ్రమలు, కర్మాగారాలు, వాణిజ్య సంస్థలు. ఇతర సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఆపేయాల్సి వచ్చింది. మంత్రివర్గంలో మరింత లోతుగా చర్చించిన తర్వాతే దీని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రైవేట్‌ సంస్థలో అయినా మేనేజ్మెంట్‌ కేటగిరీలో 50 శాతం పదవులు, నాన్‌-మేనేజ్మెంట్‌ కేటగిరీలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటా యించే విధంగా కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. అయితే, స్థానికంగా ప్రైవేట్‌ రంగంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, వాణిజ్య సంస్థలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకుంది.
కాగా, 2023లో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఇటువంటి బిల్లునే ఆమోదిం చింది. అయితే, పంజాబ్‌- హర్యానా హైకోర్టు దీన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొని కొట్టి వేయడం జరిగింది. ఈ బిల్లు అమల్లోకి వచ్చే పక్షంలో స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్‌ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చేది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 కింద సంస్థల అధిపతులు, యాజమాన్యాలకు తమకు కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకునే అధికారం ఉంటుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని, ఇది సంస్థల అధిపతులు, యజమానులు ప్రాథమిక హక్కు లకు భంగకరమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల హక్కులు, అధికారాలకు సంబంధించి ప్రభు త్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అవి తప్పకుండా రాజ్యాంగానికి అనుగుణం గానే ఉండాలి తప్ప, అత్యధిక సంఖ్యాక ప్రజల అభీష్టానికి తగ్గట్టుగా ఉండాలనుకోకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధిపతులు, యజమానుల మీద రుద్దడం సమంజసం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పైగా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల పట్ల వివక్ష చూపించడం భావ్యం కాదని, అందరినీ భారతీయ పౌరులుగానే పరిగణించాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. హర్యానా ప్రభుత్వం విషయంలో అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పు యథాతథంగా కర్ణాటక ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులేనన్న ఆర్టికల్‌ 14కు కూడా ఇది విరుద్ధమని, రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌరసత్వం ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల మధ్య విభజనకు దారితీసే నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కర్ణాటక ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవడం మంచిది. నిజానికి, ఈ బిల్లును ప్రవేశపెట్టే ముందు ప్రజల నాడిని పరీక్షించాలని కర్ణాటక ప్రభుత్వం భావించినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్‌ రంగంలోని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, ఇతర సంస్థలు, నాస్కామ్‌ వెంటనే ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించాయి. దీనివల్ల తమకు ప్రతిభావంతులను ఎంపిక చేసుకునే అవకాశాలు సన్నగిలుతాయని, ఈ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రావడం ఆగిపోతుందని. పైగా ఈ రాష్ట్రం నుంచే పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని నాస్కామ్‌ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే, ఈ సంస్థలలో భయాందోళనలు పోగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారం భించింది. బిల్లు ముసాయిదాను రూపొందించే ముందు ప్రభుత్వం ఈ సంస్థలతో ముందుగా సంప్రదించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులను, నిపుణు లను తీసుకు రావడానికి తమకు అభ్యంతరం లేదని, అవసరమైతే ఇందుకు మినహాయింపు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలకు సూచించింది. అయినప్పటికీ, ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడమే జరుగుతోంది. ఏ విధంగా, ఏ రూపంలో దీన్ని ప్రవేశపెట్టినా ఇది రాజ్యాంగ విరుద్ధమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులకు ఇది తాత్కాలికంగా ఓటు బ్యాంకులను పెంచడానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలోఇది ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. కర్ణాటక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును బుట్టదాఖలు చేయడం మంచిది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి సాహసం చేయకపోవడం అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News