దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడు గడ్డపై ద్రవిడ సిద్ధాంతం అనేది ఒక అజేయమైన శక్తిగా దశాబ్దాల పాటు వెలుగొందింది. పెరియార్ ఇ.వి. రామస్వామి నాటిన ఆత్మగౌరవ బీజం, సి.ఎన్. అన్నాదురై చేతుల్లో రాజకీయ రూపం దాల్చి, అగ్ర వర్ణ, ఆర్య బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన తాత్విక గొంతుకగా మారింది. అయితే, నేడు తమిళ రాజకీయ ముఖ చిత్రంపై ఒక కొత్త చర్చ మొదలైంది. ద్రవిడ సిద్ధాంతం తన అసలు రంగును కోల్పోతోందా? ఎంజీఆర్ ప్రారంభించిన ‘సిద్ధాంత హీనత’ నేడు విజయ్ (టీవీకే) రూపంలో ద్రవిడ వ్యతిరేక లేదా ద్రవిడ-నైరూప్య రాజకీయాలకు దారి తీస్తోందా? ఈ పరిణామాల వెనుక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పరోక్ష వ్యూహాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు అత్యంత కీలకాంశం.
తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలించినప్పుడు, ద్రవిడ ఉద్యమం కేవలం ఒక రాజకీయ ప్రవాహం మాత్రమే కాదని; అది భారత ఉపఖండంలో సామాజిక న్యాయం, భాషా స్వాభిమానం, కులాధిపత్య, సాంస్కృతికాధిపత్య వ్యతిరేకత, ప్రాంతీయ ఆత్మగౌర వానికి సంబంధించిన అత్యంత ప్రభావవంతమైన సామాజిక-రాజకీయ ఉద్యమాలలో ఒకటి. పెరియార్ రామస్వామి ప్రారంభిం చిన స్వీయగౌరవ ఉద్యమం బ్రాహ్మణీయ సామాజిక ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, హేతువాదం, నాస్తికత్వం, సామాజిక సమానత్వం వంటి భావజాలాలను తమిళ సమాజంలో బలంగా నాటింది. ఆ ఉద్యమానికి రాజకీయ రూపం ఇచ్చింది అన్నాదురై నాయకత్వం లోని ద్రావిడ మున్నేట్ర ఖజగం. 1967లో డీఎంకే అధికారంలోకి రావడం కేవలం ప్రభుత్వ మార్పు కాదు; అది తమిళ సమాజంలోని శక్తి సంబంధాల పునర్వ్యవస్థీకరణ. అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయా లకు వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాలు, మధ్యతరగతి తమిళ యువత, భాషా జాతీయవాద భావజాలం ఒక రాజకీయ శక్తిగా మారిన క్షణం. ముఖ్యంగా 1965 హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళ రాజకీయ చైతన్యాన్ని తిరిగి నిర్వచించింది. హిందీని జాతీయ భాషగా రుద్దే కేంద్ర విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు వీధుల్లోకి రావడం, ఆత్మాహుతులు జరగడం, రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉప్పొంగడం- ఇవన్నీ ద్రవిడ రాజకీయాలను కేవలం పార్టీ రాజకీయాల స్థాయిని దాటి, ఒక సామాజిక ఆత్మగౌరవ ఉద్య మంగా మలిచాయి.
ద్రవిడ ఉద్యమం మూలాలు మూలనివాసీ వాదం, హేతు వాదం, ఆర్య బ్రాహ్మణ వలసవాద సంస్కృతి, నాస్తికత్వం, హిందీ, సంస్కృత భాషా వ్యతిరేకతపై ఆధారపడి ఉన్నాయి. కానీ 1972లో ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) డీఎంకే నుండి విడిపోయి ఏఐఏడీఎంకే స్థాపించినప్పుడు, ద్రవిడ సిద్ధాంతంలో తొలిసారిగా ఒక ‘సైద్ధాంతిక సడలింపు’ మొదలైంది. పెరియార్ నాస్తికత్వాన్ని ప్రబోధిస్తే, ఎంజీఆర్ తనను తాను ఒక ఆస్తికుడిగా ప్రదర్శించు కున్నారు. ఇది ద్రవిడ సిద్ధాంతంలోని హేతువాద కోణాన్ని మొద్దు బార్చింది. ఎంజీఆర్ రాజకీయాలను సిద్ధాంతం నుండి వ్యక్తి ఆరా ధన దశకు దిగజార్చారు. కేవలం మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రజాకర్షక పథకాలతో ఆయన ప్రజల మనసు మళ్లించారు, సామా జిక విప్లవాన్ని విస్మరించారు. 1998, 1999లో ఏఐఏడీఎంకే, డీఎంకే వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక చారిత్రక మలుపు. ద్రవిడ పార్టీలు జాతీయ పార్టీలతో, ముఖ్యంగా మనువాద పార్టీలతో చేతులు కలపడం అనేది ద్రవిడ సిద్ధాంతపు ‘మౌలిక వ్యతిరేకత’ను నీరుగార్చడమే. ద్రవిడ ఉద్యమంలోని వర్గ-కుల ఆధిపత్య విమర్శ క్రమంగా పలుచనైంది. ప్రజలు ఉద్యమాన్ని, సిద్ధాంతాన్ని అనుసరించడం కన్నా నాయకుడిని ఆరాధించే దశ ప్రారంభమైంది. ఎంజీఆర్ ద్రవిడ సిద్ధాంతంపై పడ్డ తొలి క్రీనీడ.
ఎంజీఆర్ తరువాత జయలలిత కూడా అదే ప్రజాకర్షక నమూనాను, ద్రవిడ రాజకీయాల కనీస సిద్ధాంతాత్మక పరిమితిని కొనసాగించింది. ఆమె కేంద్ర ప్రభుత్వంతో రాజకీయ సంబంధాలు కొనసాగించినప్పటికీ, తమిళ హక్కుల ప్రశ్నపై ఒక ప్రత్యేక ద్రావిడ విశ్లేషణను విస్మరిస్తూండేది. కానీ జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకెలో ఏర్పడిన సంక్షోభం తమిళ రాజకీయాల్లో ఒక శూన్యతను సృష్టించింది. అదే సమయంలో బీజేపీ తమిళనాడులో ప్రత్యక్షంగా బలపడలేకపోతున్నందున, ద్రవిడ రాజకీయాల సిద్ధాం తాత్మక బలాన్ని బలహీనపరిచే మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలో ఎడప్పడి పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకే బీజేపీతో ఏర్పరచుకున్న రాజకీయ అనుబంధం ఒక చారిత్రక మార్పుగా పరిగణించబడుతోంది. ద్రవిడ ఉద్యమం మూలసారం ఉత్తర భారత కేంద్రాధిపత్య వ్యతిరేకత. కానీ ఏఐఏడీఎంకే క్రమంగా కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది అనే విమర్శ బలపడింది. ముఖ్యంగా NEET పరీక్ష విషయంలో తమిళ సమా జం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ, ఏఐఏడీఎంకే ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రతిఘటన చూపలేకపోయింది. అనిత అనే గ్రామీణ దళిత విద్యార్థిని ఆత్మహత్య ఘటన తమిళ సమాజాన్ని కుదిపేసింది. ఆ ఘటన ద్రవిడ ఉద్యమం నిర్మించిన “విద్యా సమానత్వం” భావనపై జరిగిన దాడిగా పరిగణించబడింది. అయినప్పటికీ కేంద్ర విధానాల పట్ల ఏఐఏడీఎంకే చూపిన రాజకీయ మౌనం ద్రవిడ సిద్ధాంత బలహీనతకు సూచనగా విశ్లేషించబడింది.
సినీ నటుడు జోసెఫ్ విజయ్ తమిళగ వెట్టిరి ఖజగం (టీవీకే) పేరుతో చేసిన రాజకీయ అరంగేట్రం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. టీవీకే పార్టీ అవినీతి వ్యతిరేకత, యువత రాజకీయ భాగస్వామ్యం, పరిపాలనా సంస్కరణల వంటి అంశా లను ముందుకు తెస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే: టీవీకే నిజంగా ద్రవిడ రాజకీయాల కొనసాగింపా? లేక ద్రవిడ భావజాలాన్ని సాఫీగా పక్కకు నెట్టే “పోస్ట్-ద్రవిడియన్” రాజకీయ నమూననా? విజయ్ తన ప్రసం గాల్లో పెరియార్, అంబేద్కర్, కామరాజ్ పేర్లను ప్రస్తావిస్తున్న ప్పటికీ, ద్రవిడ ఉద్యమంలోని కుల నిర్మూలన, హేతువాదం, బ్రాహ్మణీయ ఆధిపత్య విమర్శ వంటి కఠినమైన సిద్ధాంత అంశా లపై స్పష్టతతో మాట్లాడటం లేదు. ఇది ఒక వ్యూహాత్మక రాజకీయ మౌనమా? ముఖ్యంగా మధ్యతరగతి యువతలో “సిద్ధాంతాల కంటే పరిపాలన ముఖ్యం” అనే భావనను టీవీకే బలపరుస్తోందనే విమర్శ ఉంది. టీవీకే కొత్త ముసుగు ధరించిన పాత వ్యూహమే. ఎంజీఆర్ వేసిన బాటలోనే ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విక్రవాండిలో జరిగిన తన తొలి రాజకీయ బహిరంగ సభలో విజయ్ చేసిన ప్రసంగం కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే కాదు, ద్రవిడ సిద్ధాంతాన్ని ఒక నిరపాయకరమైన సాంస్కృతిక చిహ్నంగా మార్చే ప్రయత్నం. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, ఒకప్పుడు అజేయంగా కనిపించిన ద్రవిడ సిద్ధాంతం “పోస్ట్-ద్రవిడియన్” దశలోకి ప్రవేశిస్తోందనే చర్చ బలపడుతోంది. విజయ్ నాయకత్వంలోని టీవీకే రాజకీయ శైలి, ద్రవిడ ఉద్యమపు సంప్రదాయ భావజాలం నుండి భిన్నంగా కనిపిస్తోంది. “ఆధ్యాత్మిక గౌరవం”, “పరిపాలనా సామర్థ్యం”, “తమిళ జాతీయవాదం” వంటి కొత్త రాజకీయ భాష ముందుకు వస్తోంది. “ద్రవిడ అస్తిత్వం” కంటే “తమిళ గుర్తింపు”పై ఎక్కువ దృష్టి పెట్టడం, ద్రవిడ రాజకీయాల విశాల దక్షిణాది భావనను సంకుచితం చేస్తోందనే అభిప్రాయం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ రాజకీయాల కన్నా “సహకార సమాఖ్యవాదం” వైపు టీవీకే మొగ్గు చూపడం కూడా గమనార్హం. ఈ మార్పులు తమిళ రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం క్రమంగా తన చారిత్రక తీవ్రతను కోల్పోతుందా అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.
ఒక ఉద్యమం ఒక్కసారిగా అంతరించిపోదు. ముందుగా అది తన సిద్ధాంత భాషను కోల్పోతుంది. తరువాత తన చారిత్రక శత్రువులను మరచిపోతుంది. చివరకు తన సామాజిక లక్ష్యాలను ప్రజాకర్షక నినాదాల కోసం త్యాగం చేస్తుంది. తమిళనాడులో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిణామాలు: ఏఐఏడీఎంకే కేంద్రా నుకూల రాజకీయాలు, టీవీకే సైద్ధాంతిక అస్పష్టత, బీజేపీ సాం స్కృతిక జాతీయవాద వ్యూహం, ఇవన్నీ కలిసి ద్రవిడ రాజకీయాల భవిష్యత్తుపై ఒక గంభీరమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. పాలక వర్గాలు కేవలం బలప్రయోగం ద్వారా కాదు, సంస్కృతి, భాష, సామాజిక విలువలు, “సాధారణ బుద్ధి” (common sense) మీద ఆధిపత్యం సాధించడం ద్వారా తమ అధికారాన్ని నిలబెట్టు కుంటాయి. గ్రామ్షీ దృష్టిలో ఒక విప్లవాత్మక ఉద్యమం బలహీన పడటం మొదట దాని “భాష”లోనే కనిపిస్తుంది. ఉద్యమం తన అసలు సిద్ధాంత పదజాలాన్ని కోల్పోయి, శత్రువుల భాషను మాట్లా డటం ప్రారంభించినప్పుడు, అది సాంస్కృతికంగా ఓడిపోవడం ప్రారంభమవుతుంది. ఈ భావనను ద్రవిడ ఉద్యమ పరిణామానికి అన్వయిస్తే- సామాజిక న్యాయం, కుల నిర్మూలన, హేతువాదం, బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యతిరేకత వంటి పదాలు క్రమంగా పరి పాలన, అభివృద్ధి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక జాతీయత వంటి మృదువైన రాజకీయ భాషకు మారిపోతుందని Herbert Marcuse, Frantz Fanon, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నిరూపణలతో చెప్పారు.
తమిళనాడు ‘పోస్ట్-ద్రవిడియన్’ యుగానికి దారితీస్తుంది. పాత ద్రవిడ సిద్ధాంతాలను కాలం చెల్లినవిగా చిత్రీకరిస్తూ, అభివృద్ధి, జాతీయవాద ముసుగులో సాగుతున్న ఈ ప్రయాణం, భవిష్యత్తులో ద్రవిడ కోటను పూర్తిగా కూల్చివేసే ప్రమాదం ఉంది. బీజేపీ తన ద్రవిడ వ్యతిరేక ఎజెండాను విజయ్ భుజం మీద పెట్టి నడిపిస్తోందనే వాదనలోని వాస్తవం క్రమంగా బలపడుతుంది. రాజకీయాల్లోకి విజయ్ రాకడే ద్రవిడ వాదానికి ఇక దండం అనే అర్థంలో విశ్లేషి స్తున్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఈ మార్పు కేవలం ఒక రాష్ట్ర రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక సామాజిక ఉద్యమ పతనం అని చెప్పవచ్చు.
—
డా. సుదర్శన్ బాలబోయిన
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ

