చారిత్రకంగా మానవ నాగరికతల నిర్మాణం సమిష్టి కార్యాచరణల ఫలితమే. ప్రజలే చరిత్ర నిర్మాతలు. భౌగోళిక రాజకీయ చిత్రపటాలు కేవలం కొద్దిమంది వ్యక్తుల కృషితో మాత్రమే అస్తిత్వంలోకి రావు. కొద్దిమంది వ్యక్తుల కృషి చరిత్రత్మాకంగా ఉండవచ్చు. వ్యక్తుల, సంఘాల భాగస్వా మ్యంతో అనేక సమూహాలు, రాజ్యాలు, ఆధునిక దేశాలు ఏర్పడ్డాయి. రాజ్య నిర్మాణం ఒక మనిషి జీవిత కాలంలో మాత్రమే రూపుదిద్దుకునేది కాదు. అనేక తరాల తదనంతరం ఒక నిర్దిష్ట రూపానికి వచ్చినప్పటికీ అది స్థిరంగా నిలిచిపోదు. నిత్య పరివర్తనే ఒక లక్షణంగా ఏ సమూహనికైనా ఉంటుంది. వ్యక్తుల అసమాన త్యాగాలు, జీవిత కాలాల కృషి ఏ సమాజపు ఆవిర్భా వంలో అయినా ఉంటాయి. భారత ఉపఖండం నుండి ఆంగ్లేయుల నిష్క్ర మణ దశబ్దాల త్యాగాల చరిత్ర ఫలితంగా సాధ్యమయింది.
భారత దేశంలోని రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ, 1956 నాటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఫలితంగా రెండు వేరు వేరు చారిత్రక ఆస్తిత్వా లున్న ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పర్చారు. అసమానతల, అంత రాల ప్రాంతాలను కలిపి ఉంచడం శాస్త్రీయమైన అంశం కాదని కలిసి ఉండటం సాధ్యం కాదని చరిత్ర తేల్చేసింది. తెలంగాణ తన ప్రత్యేక ఆస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడు పెనుగులాడుతూనే ఉన్నది. ఆ పెనుగులాటకు ప్రాణం పోసినవారు అనేక మంది ఉన్నారు. అనేక రూపాల్లో, తలాల్లో తమ తమ పద్ధతుల్లో రాష్ట్ర ఆకాంక్షను కుట్రలను, దాడు లను తట్టుకొని తుది దశకు చేర్చడంలో విరామం తీసుకున్నప్పటికీ విరమణ లేకుండా జీవితాలను అంకితం చేసిన వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. బుద్ది జీవులుగా, కళా జీవులుగా సమస్త రంగాలకు సంబంధించిన ప్రజలందిరితో ఉద్యమ నిర్మాణం జరిపి మరో వ్యాపకమే లేకుండా దానిలో మమేకమయిన మహా మనుషులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక పార్టీ, వ్యక్తి, సంఘం చేసిన కృషి వల్లనే జరగలేదు. సబ్బండ వర్ణాల సామూహిక స్వరంతో నినాదం పదునెక్కి రాష్ట్రం ఇవ్వడం మినహా మరో మార్గం లేని చారిత్రక మలుపును తీసుకున్నది. అలా అని అందరు వ్యక్తులను, పార్టీలను, సంఘా లను ఒకే గాటన కట్టలేము. మొత్తంగా ఒక్కరికే ఘనతను ఆపాదించనూ లేము.
అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ త్యాగమయులకు గౌరవం ఇవ్వలేకపోయింది. వారి వారసులుగా మిగిలిపోయినవారిని పెద్దగా ఆదుకోలేకపాయింది. ఉద్యమం అంటేనే ఒక సమిష్టి కార్యం. ఒక్క పార్టీనో, ఒక వ్యక్తి వల్లనో, ఒక సంస్థ వల్లనో చారిత్రక ప్రయోజనాలు, ఫలి తాలు ఒనగూడవు. ఉద్యమ క్రమంలో వ్యక్తులు, పార్టీలు, సంస్థలు తుదిదాకా నిలబడవచ్చు నిలిచిపోవచ్చు..ద్రోహమూ చేయవచ్చు. తెలంగాణ చారిత్రక ఉద్యమం అన్ని అనుభవాలను చూసింది. అదొక ప్రజా ఉద్యమం. పార్టీలు వ్యక్తులు వారి వారి వెసులుబాటును బట్టి కార్యాచరణలో ఉంటారు. కేసీఆర్ పక్వానికి వచ్చిన కాయను పండుగా మార్చుకొని ఆస్వాదించినవాడు. ఆయనేమీ తెలంగాణ ఉద్యమ పునాదికి రాల్లేసినవాడు కాదు. అన్నీ సిద్ధంగా ఉన్న సమయంలో జొరబడి మాటల గారడీ చేసినవాడు. అలా అని ఆయన పాత్ర చారిత్రకంగా ఏమీ లేదని ఏదో అక్కసుసుతో అన్నంత మాత్రాన చెదిరిపోయేది కాదు.
ఇక జాతి పితల చర్చ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రత్యేకించి దళిత బహుజన ప్రజాబాహుళ్యపు అభివృద్ధిని ముందుకు నెట్టే అంశమేమి కాకపోగా ఒక diversionary tactic గానే చూడాలి. అదొక బ్రాహ్మ ణీయ, భూస్వామ్య, పితృస్వామ్య భావన మాత్రమే. పౌర సమాజపు మనో భావన మాత్రమే. శాస్త్రీయమైన అంశమేమి కాదు. అధికారికమైనదో, రాజ్యాంగ బద్ధమైన అంశమో కానేకాదు. దేశంలో గాంధీని ఆధిపత్య కులాలు పితగా పీఠం మీద పెట్టుకున్నాయి. గాంధీ దేశ ప్రజల అసలైన ప్రతి నిధి కాదని, అంబేద్కర్ యే నిజమైన ప్రజల మనిషి అని చరిత్ర నిరూపిం చింది. ఒక రాష్ట్రం సాధించడానికి నిండు జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళున్నారు. ప్రాణాలను లెక్కచేయక జీవితమంతా అదే లక్ష్యంగా పని చేసిన వాళ్ళున్నారు. పిత ల భావన స్త్రీల కోణం నుండి ఆమోదనీయం కాదు గదా? అసలు చారిత్రకంగా ఆ భావన ఎప్పుడో ఆధునిక రాజ్యాలు రూపొం దనప్పుడు వచ్చినటువంటిది. నేటి కాలంలో దానికి పెద్దగా ప్రాసంగికత లేదు,ప్రాధాన్యమూ లేదు. అయితే అలాంటి వాదాన్ని ముందుకు తోసి రాజకీయ ప్రయోజనాలను పొందే కుట్ర ఉన్నపుడు ప్రతిఘటించాల్సిందే. ఆధిపత్య కులాల ఎజెండా ఉన్నా వ్యతిరేకించాల్సిందే. సరిగ్గా ఇక్కడే కేసీఆరే జాతి పిత భావనను నిర్ధాక్షిణ్యంగా కొట్టి పడేయాలి. మరి మరో కోణం లోంచి ఎవరిని పితగా చూడాలనుకున్నపుడు జీవితమంతా తెలంగాణే శ్వాసగా, ప్రాణంగా బ్రతికి దానికి చారిత్రక, తాత్విక, సైద్ధాంతిక పునాదిని వేసిన జయశంకరే అర్హుడు. ఆ పనిని తెలంగాణ సమాజం ఎప్పటి నుండో చేస్తూ ఉన్నది. దాని కొనసాగింపే ఆమోదయోగ్యమేమో.
గద్దర్ తెలంగాణ ఉద్యమ కొలిమిని రాజేసిన మహామనిషి. అందులో అనుమానమేమీ లేదు. అయన బహుముఖాలుగా నిలబడి జీవాన్ని, జవాన్ని అందించినవాడు. చారిత్రకంగా చూసినప్పుడు గద్దర్ పాత్ర మూడు దశబ్దాల వయస్సు కలిగి నదే. జయశంకర్1950ల నుండి అంతిమ క్షణాల వరకు ఇటు విప్లవ సంస్థల నుండి అటు పార్లమెంటరీ రాజకీయ పక్షాల వరకు సమన్వయం చేసిన మేధో జీవి. గద్దర్, జయశంకర్‌లు ఎవరికీ ఎవరు తీసిపోని మహా మనుషులు. పితగా గుర్తించడానికి ఏవైనా కొలబద్దలు, తూనికలు పెడితే తరాజు జయశంకర్ వైపు మొగ్గవచ్చు.నిజానికి గద్దర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఓ మేరకైనా గుర్తింపు, గౌరవం వచ్చింది. జయశంకర్ ని అప్పుడు బీఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెజారిటీ ప్రజల మొగ్గు జయశంకర్ వైపే ఉంటుంది. ఆయన మూడు కాలాల్లో జరి గిన ఉద్యమానికి వారధి అనే సత్యం తిరుగులేనిది. గద్దర్ ని తెలంగాణకే పరిమితం చేయడం ఏమిటి? ప్రపంచ ప్రజా కవులల్లో ఆయన ఒకరు. భారత విప్లవోద్యమ గాయకుడు. దళిత బహుజన ప్రజల విముక్తి స్వరం. తెలుగు నేలనే కాదు భారత దేశమంతా గుర్తించి, గౌరవించాల్సిన ప్రజల మనిషి కదా. జయశంకర్ తెలంగాణలోనే ఉండగలడు. గద్దర్ దేశమంతా ఉండాలే. పితగా కాకుండా దళిత పీడిత బహుజన విముక్తి స్వరంగా ప్రతిధ్వనించాలి.
-సతీష్ బైరెడ్డి

