“ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవన విధానం ప్రతిఫలి స్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఆ భాష ఆ జాతికి ప్రత్యేకమైన ఆచార వ్యవహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలధాతువులను జీర్ణించుకొని రససిద్ధి పొంది జాతీయాల్లో, పలుకుబళ్లలో, సామెతల్లో పొందుపడి ప్రభు త్వాన్ని నెరుపుతుంది. ఒక భాషలో ఒక నానుడి కానీ, సామెత కానీ, జాతీయం కానీ అలవోలకగా పుట్టదు. ఆయా జాతీయులు తలలు పండినవారి అనుభవ రాశిని కాచి, వడబోసి నిగ్గు దేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపుసొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి, ప్రాణధాతువుల వంటివి’’ – డాక్టర్ పి. యశోదారెడ్డి, ఎచ్చమ్మ కతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో మా జాతి వేరు, భాష వేరు అని తెలంగాణవాళ్లు ప్రకటించుకున్నారు. ఉద్యమ సమయంలో కొన్ని అతివాదాలు వుంటాయి. ఉద్వేగం కోసం అటువంటి అతివాద సూత్రీకరణలు సాగుతుంటాయి. నిజానికి, తెలంగాణ భాష వేరు, ఆంధ్ర భాష వేరు అని స్థూలంగా ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ రెండు కూడా తెలుగు భాషలేనా అని ప్రశ్నించుకుంటే అవుననే అనాల్సి వస్తుంది. రెండు కూడా తెలుగు భాషలే. ఆంధ్ర భాషనే ఉన్నతమైందని అంటూ తెలంగాణ భాషను కించపరచడం వల్ల తెలంగాణ ప్రజలు ఆత్మన్యూనతకు లోన య్యారు. ఈ ఆత్మన్యూనతను తొలగించుకోవడానికి మా భాష వేరు, మాది నిజమైన తెలుగు అని తెలంగాణవాళ్లు ప్రకటించు కున్నారు. ఆంధ్ర భాష మనకు అర్థం కానప్పుడు, తెలంగాణ భాష వాళ్లకు అర్థం కానప్పుడు రెండు వేర్వేరు భాషలు అవుతాయి తప్ప ఇరు ప్రాంతాలవారి భాషలు ఇరు ప్రాంతాలవారికి అర్థమవుతున్న ప్పుడు వేర్వేరు భాషలని చెప్పలేమని సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ లాంటివాళ్లు అంటున్నారు. దీన్ని అంగీకరించనివాళ్లు కూడా వున్నారు. వాస్తవానికి, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి భాషా శాస్త్రవేత్తలు తెలంగాణ భాషను ఒక మాండలికంగా వర్గీకరించారు. మిగతా తెలుగు ప్రాంతాల భాషలతో ఇది భిన్నత్వాన్ని సూచిస్తుంది. కానీ భాష మాత్రం వేరు కాదు.
డాక్టర్ యశోదారెడ్డి మాటల్లో చాలా విషయాలు ఇమిడి వున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు చాలా విషయాలను చర్చించాల్సి వుంటుంది. తెలంగాణను ఒక ప్రత్యేక మైన జాతిగా కూడా ఆమె భావించినట్లు అర్థం చేసుకోవచ్చు. ఆ జాతి సంస్కృతి భిన్నమైందని, అది భాషలో వ్యక్తమవుతుందని, ఆ రకంగా తెలంగాణ భాష ప్రత్యేకమైందని ఆమె తన అభిప్రాయంగా చెప్పారు. అయితే, అన్ని తెలుగు మాండలికాలు కూడా తెలుగు భాషనే అయినప్పుడు సమస్య ఎక్కడ వస్తున్నది? ఆమెనే మారో మాట కూడా అన్నారు. “… తెలుగు వారంద రేకమై విశాలాంధ్రగా రూపొందినారు. కాని ఈ రెండు ప్రాంతీయ భాషలకు సమన్వయం సరిగా కుదరలేదు. ఒకరాడు భాష మరొకరికి వింతగా తోచినది” (మా ఊరి ముచ్చట్లు). తమది ప్రత్యేకమైన భాష అని ప్రకటించుకోవడం వెనక ఆ రహస్యమే దాగి వుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్ర పాలకుల భాష, ఆంధ్ర ప్రముఖులు నిర్దేశించిన ప్రామాణీకరణ భాష తెలంగాణపై దాడి చేసింది. తమది గొప్ప భాష అని, తెలంగాణ భాష అల్ప మైందని ఆచరణలోనే కాదు, మాటల్లోనూ ఆంధ్ర ప్రాంతంవారు వ్యక్తం చేయడం వల్ల ఆ సమస్య వచ్చింది. రెండు భాషల మధ్య సమన్వయం కుదిరించి తెలంగాణ భాషకు సరైన స్థానం, గౌరవం కలిగించి వుంటే పరిస్థితి మరో రకంగా వుండేదేమో! ఇది భాషకు మాత్రమే కాదు, అన్ని రంగాలకూ వర్తిస్తుంది.
అసలు విషయానికి వస్తే, తెలంగాణ మాత్రం తనకు అవసరమైన ప్రామాణిక భాషను సృష్టించుకోవాల్సిందే. వాగ్రూ పమైన భాషకు నిలకడ వుండదు. అది మారుతూ వుంటుంది. ప్రామాణీకరించడం అంటే ఒక నిలకడైన, అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన భాషను రూపొందించుకోవాలి. క్రియారూపా లను తెలంగాణ యాసలో రాసినంత మాత్రాన అది తెలంగాణ భాష అనిపించుకోదు. వచ్చిండ్రు, పోయిండ్రు అనే క్రియారూపా లను వచ్చినాడు, పోయినాడు అనే పద్ధతిలో రాయడం సురవరం ప్రతాపరెడ్డి వంటివాళ్లు చేశారు. అదే సమయంలో తెలంగాణ సామెతలను, పలుకుబళ్లను, నానుడులను కూడా వాడారు. క్రియా రూపాలను మాత్రమే మార్చి ఇది తెలంగాణ భాష అని చెప్పడం సరైంది కాదు. మొత్తంగా భాషకే ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుని రావాల్సి వుంటుంది. ఆంధ్రవాళ్లు వస్తోంది అని రాస్తే అదే అర్థంలో తెలంగాణవాళ్లు వస్తున్నది అని రాస్తున్నారు. ఇది ఒక మౌలికమైన మార్పు. కానీ అది మాత్రమే సరిపోదు. తెలంగాణ పదజాలాన్ని వాడుకలో పెంచాలి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి వాళ్లు తెలంగాణ భాషలో వ్యాసాలు కూడా రాస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో వాడిన కొన్ని పదాలు ప్రజా బాహుళ్యంలోవాడుకలోకి వచ్చాయి. అలా ప్రజాబాహుళ్యం అంగీకరించే విధంగా ప్రామాణీకరణ జరగాలి. మరో మాట కూడా చెప్పుకోవాలి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల భాష ఒకే రకంగా వుందా? లేదు. జిల్లాలను బట్టి తేడాలున్నాయి. ఏకరూపత లేదు. ఈ ఏకరూపత సాధించాలంటే ఏం చేయాలి? తెలంగాణలోని ఎక్కువ ప్రాంతాల్లో వున్న పదాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాలేదు అని అనడానికి వచ్చి లేదు అని అంటారు. ఇక్కడ వచ్చి లేదు అనేది ఎక్కువ ప్రాంతాల్లో వాడుకలో లేదు కాబట్టి దాన్ని వదిలేయవచ్చు. యాసలు కూడా భిన్నంగా వున్నాయి. ప్రామాణీకరణకు ఈ యాసలను వదిలేసి ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.
తెలంగాణ పదజాలం వాడుక పెరగాలి. ఇది జర్నలిస్టులు, సాహిత్యకారులు చేయగలరు. కానీ చాలా మంది జర్నలిస్టులు ఆధిపత్య భావజాలం పరిధిలోనే ఇంకా చిక్కుకుని వున్నారు. గతేడాది అని రాస్తున్నారు. అది దుష్టసమాసమని కూడా చాలా మందికి తెలియదు. దానికి సరైన పదం తెలంగాణలో వుంది. చాలా అందంగా కూడా వుంటుంది. క్లుప్తంగా కూడా వుంటుంది. అది నిరుడు అనే పదం. ఆంధ్ర పత్రికలు ఈ పదాన్ని వాడడం ఇష్టం లేక గతేడాదిని సృష్టించాయి. తెలంగాణవాళ్లు చాలా మంది ఆ మాయా జాలంలోనే వున్నారు. మొదట ఆధిపత్యానికి సమ్మతం లేకుండానే, తెలియకుండానే లొంగిపోయే మనస్తత్వం తెలంగాణవాళ్లను ఇంకా వీడలేదు. మొదట దీన్ని వీడాలి. ముందు ప్రామాణికమైన పదకోశం రావాలి. ఈ దిశగా నలిమెల భాస్కర్ వంటి వారు కొంత కృషి చేశారు. కానీ అది సరిపోదు. మరింత విస్తృతంగా ఆ పని జరగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విరివిగా కవిత్వం వచ్చింది. ఈ కవిత్వంలో అనేక తెలంగాణ పదాలు, నానుడులు, పలుకుబళ్లు చోటు చేసుకు న్నాయి. తెలివిడితోనే కవులు ఆ పని చేశారు. తెలంగాణ భాషలో కథలు కూడా వచ్చాయి. అవి ప్రత్యేక పదజాలం ఎంపికకు ఉప యోగపడుతాయి. ఈ మధ్య సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ తెలంగాణ భాషా కథలు వేసే పనిలో ఉన్నారు కూడా. తెలంగాణ భాషపై విశ్వవిద్యాలయాల్లో విశేషమైన, విస్తృత మైన పరిశోధనలు జరగాలి. పరిశోధక విద్యార్థులను అధ్యాపకులు ఆ దిశగా నడిపించాలి. కానీ విశ్వవిద్యాలయాలకు ఆ చిత్తశుద్ధి వుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ సాహిత్యానికి తగిన ప్రాధాన్యం కల్పించడంలో అవి విఫలమవు తున్నాయి. భాష విషయంలో ఆ పని చేయగలవా అనేది సందే హమే. ఏమైనా కృషి మాత్రం జరగాల్సిందే.
కాసుల ప్రతాపరెడ్డి
రచయిత, సీనియర్ జర్నలిస్ట్

