Social justice: ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అదనపు ఆసరా పింఛన్ల మం జూరు, సంక్షేమ పథకాల విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్యాంక్ బాండ్‌పై మహాత్మా ఫూలే విగ్రహాన్ని ఆవిష్క రించినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంద న్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు కోసం మాత్రమే కాదు. అది దశా బ్దాలుగా అణచివేయబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవం, స్వయంపాలన సమగ్రాభి వృద్ధి కోసం జరిగిన చారిత్రక పోరాటం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధి దారులుగా మిగిలిపోవడం జరిగింది తప్ప, పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే స్థితి నుంచి విధాన నిర్ణయా లలో కీలక భాగస్వాములు కావడం వంటి గుణాత్మక మార్పులు పెద్దగా జరగలేదు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆసరా పింఛన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత వంటి ప్రత్యక్ష ప్రయోజన సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలులో ఉన్నప్పటికీ, రాజకీయ అధికారం, గుణాత్మక ప్రాతినిధ్యం విషయంలో బలహీన వర్గాలకు జరుగుతున్న నిరాకరణ తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అంది స్తున్న ఈ సంక్షేమ పథకాలు పేదలకు ఉపశమనం కలిగి స్తున్నప్పటికీ, కేవలం సంక్షేమ కేటాయింపుల పెంపుదలతో సరిపెట్టకుండా, అణగారిన వర్గాల ఆర్థిక స్వావలంబనకు, చట్టసభలలో గుణాత్మక ప్రాతినిధ్యానికి ఇవి ఎంతో దూ రంలో ఉన్నాయనే వాస్తవాన్ని ఈ సందర్భం మరోసారి గుర్తు చేస్తోంది. సంక్షేమం అనేది పంపిణీ సంస్కృతిగా కాకుండా, హక్కుల సాధన రూపంలో మారినప్పుడే అసలైన స్వాతం త్య్రం సాధ్యమవుతుంది. ఈ ధోరణిని అర్థం చేసుకోవడానికి, దీని వెనుక ఉన్న సామాజిక-రాజకీయ నిర్మాణాలను, భవిష్యత్తులో బహుజన సమాజం చేపట్టాల్సిన కర్తవ్యాలను సామర్థ్యాల దార్శనిక దృక్పథంతో పరిశీలించడం అవసరం.
రాజకీయ అధికారం- ఆధిపత్య ధోరణి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి ఇప్పటివరకు అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అయినా, ప్రస్తుత రేవంత్ రెడ్డి అయినా, విధానపరమైన, అత్యున్నత రాజకీయ నిర్ణ యాధికారాలు మాత్రం అగ్రకుల నాయకుల చేతుల్లోనే కేంద్రీ కృతమై ఉండటాన్ని గమనించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొదలుకొని నేటి వరకు చట్టసభలలో కేవలం రెడ్డి, వెలమ, కమ్మ ఆధిపత్య కులాల ప్రాతినిధ్యం జనాభా నిష్ణా తులకు ఎంతో దూరంగా, సుమారు 50 శాతానికి పైగా శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంటూ వస్తోంది. జనాభాలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు సంఖ్యాపరంగా ఓటర్లుగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప, నిర్ణయా ధికార పీఠాలపై వారి ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ఈ ధోరణి కేవలం వ్యక్తుల అనైతికత వల్ల ఏర్పడింది కాదు. ఇది దశాబ్దాలుగా వేళ్లూనుకు పోయిన నిర్మాణాత్మక కుల ఆధిపత్య వ్యవస్థ తాలూకు ఫలితం. రాజకీయ పార్టీల హైకమాండ్ సంస్కృతి, ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం, ఆర్థిక వనరులు పూర్తిగా సంపన్న వర్గాల గుప్పిట్లో ఉండటం వల్ల బలహీన వర్గాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేయబడుతున్నారు. అమర్త్య సేన్, జీన్ డ్రేజ్ వంటి ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, సంక్షేమం అనేది పౌరుల ‘సామర్థ్యాల పెంపుదల’ ఆధారంగా జరగాలి గానీ, కేవలం ఎన్నికల లబ్ధిని ఆశించే పంపిణీ సంస్కృతిగా మారకూడదు. ఆర్థిక సంక్షేమం అనేది మానవుడికి భద్రతనిస్తుంది కానీ, మానవ హక్కుల కింద లభించాల్సిన గౌరవాన్ని, స్వయం సమృద్ధిని అది భర్తీ చేయలేదు.
తత్వవేత్తల దృక్పథం, -రాజ్యాంగ ఆశయాలు
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్నట్లు రాజ్యాంగం సాక్షిగా ‘రాజకీయంగా మనకు ఒక వ్యక్తి – ఒక ఓటు, ఒక ఓటుకు సమాన విలువ అనే సూత్రం లభించింది. కానీ ఆర్థిక, సామాజిక జీవితంలో అసమానతలు కొనసాగితే, రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.’ బౌద్ధ తత్వశాస్త్రం మానవ సమాజం సమానత్వం, కరుణ, సహేతుకత ఆధా రంగా నడవాలి. మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామిల ప్రకారం, విద్య, భూమి, రాజ్యాధికారంలో వాటా దక్కనంత వరకు ఏ సమాజమూ నిజమైన స్వేచ్ఛను సాధించలేదు. ప్రస్తుత పాలనలో కొంతమేరకు పేదలకు, బలహీన వర్గాలకు ఆర్థిక సంక్షేమం అందుతున్నప్పటికీ, విద్య, వైద్యం, చట్ట సభలలో తగినంత గుణాత్మక రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం రాజ్యాంగ ఆశయాలకు విఘాతకరమే.
ఆధారపడటం నుండి స్వావలంబన వైపు
అభివృద్ధికి మానవ కోణం ఉండాలనే డిమాండ్ కేవలం ఉచిత పథకాల కేటాయింపులను పెంచడం కాదు. అది ప్రజలను లబ్ధిదారులు నుండి సృష్టికర్తలుగా మార్చడం. అంతర్జాతీయ అభివృద్ధి సూచీల ప్రకారం, పేదరిక నిర్మూలన అనేది ప్రత్యక్ష నగదు బదిలీల వల్ల కంటే నాణ్యమైన విద్య, పబ్లిక్ హెల్త్‍కేర్, భూ సంస్కరణలు, ఉపాధి కల్పన ద్వారానే స్థిరంగా సాధించబడుతుంది. దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు వారిని ఆర్థిక స్వయంప్రతిపత్తికి దూరం చేయడం ఒక రకమైన పరోక్ష ఆధారపడే ధోరణిని పెంచుతుంది. సమాజంలో అణగారిన కులాలు గౌరవప్రదంగా బతకాలంటే ఉచితాల కన్నా ఈక్విటీ పునాదిగా అవకాశాల సమానత్వం అత్యవసరం.
ఎస్సీ, ఎస్టీ, బీసీల భవిష్యత్ కార్యాచరణ
సమాజంలో గౌరవప్రదమైన, సామాజిక న్యాయంతో కూడిన మానవీయ తెలంగాణను నిర్మించడానికి బలహీన వర్గాలు భవిష్యత్తులో ఈ క్రింది మార్గాలను అనుసరించడం అనివార్యం.
1) కేవలం సంప్రదాయ రాజకీయ పార్టీల దయపై ఆధారపడకుండా, అణగారిన వర్గాలు తమ సొంత రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. ఓటు హక్కును కేవలం పథకాల కోసం కాకుండా, శాసన సభలలో తమ గొంతుకను గట్టిగా వినిపించే రాజకీయ అధికార సాధనంగా మలచు కోవాలి. 2) కేవలం ఉచిత పథకాలు కాకుండా, గ్రామీణ స్థాయిలో అసమాన భూ యాజమాన్య హక్కులను సరిదిద్దే సమగ్ర భూసంస్కరణలు, ఉపాధి అవకాశాల కోసం బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. 3) పేద విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన గుణాత్మక విద్యను, శాస్త్ర సాంకేతిక రంగాలలో సముచిత స్థానం దక్కేలా ప్రభుత్వ రంగ విద్యను పటిష్టం చేయాలని డిమాండ్ చేయాలి.
4) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తమలోని అంతర్గత మిత్ర వైరుధ్యాలను పక్కన పెట్టి, సామాజిక న్యాయం, రాజ్యాధికార లక్ష్యంగా ఐక్యవేదికగా ఏర్పడి భవిష్యత్ రాజకీయ మార్పులకు పునాది వేయాలి.
డా.నాగం కుమారస్వామి
అసిస్టెంట్ ప్రొఫెసర్
పాలమూరు యూనివర్సిటీ

