ఒక విద్యార్థి తన సమస్యను చెప్పుకోవడానికి భయపడే విశ్వవిద్యాలయం తన పేరుకు తగినది కాదు. ఫిర్యాదు చేస్తే వసతిగృహం పోతుందేమో, పరిశోధన మార్గదర్శి ముఖం చాటేస్తాడేమో, ఉపకార వేతనం ఆగిపోతుందేమో అనే భయం ఉన్నచోట రాజ్యాంగ హామీలు అక్షరాలుగానే మిగులుతాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు-2026’ను చూడాలి.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అక్టోబర్ 16న ముసాయిదాను మూడు నెలల్లో సిద్ధం చేయాలని ఆదేశిం చారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నేతృత్వంలో న్యాయ, విద్య, హోం శాఖలు, విశ్వవిద్యాలయాల నియంత్రణ సంస్థ లు, న్యాయ నిపుణులు కలిసి ఈ పని చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. నల్సార్ సహకారం తీసుకునే అంశాన్నీ పరిశీలిం చారు. విద్యార్థులు, అధ్యాపకులు, పౌరసమాజంతో సంప్రదిం పులు జరుపుతామని చెప్పారు. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇది ఇప్పటికీ ప్రతిపాదన మాత్రమే. ముసా యిదా రావాలి, మంత్రివర్గం ఆమోదించాలి, శాసనసభ ఒప్పుకోవాలి, ఆ తర్వాతే అమలు. శిక్షలేమిటి, ఏ సంస్థలకు వర్తిస్తుంది, విచారణ ఎలా జరుగుతుందనేవి ఇంకా తేలలేదు. వాటిని ఖరారైన నిబంధనలుగా చెప్పడం తొందరపాటే అవుతుంది.
ఈ బిల్లుకు ఈ పేరు ఎందుకు? 2016 జనవరి 17న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మరణించారు. ఆ మరణం దేశ వ్యాప్తంగా నిరసనలకు, క్యాంపస్లలో కుల వివక్షపై లోతైన చర్చకు కారణమైంది. ఆ ఘటన చుట్టూ ఉన్న కొన్ని వాస్త వాలు, ఆయన సామాజిక నేపథ్యంపై అధికారులు చేసిన వ్యాఖ్యలు, వాటిని కుటుంబం ప్రశ్నించిన తీరు ఇప్పటికీ వివాదాస్పదమే. అందువల్ల ఎవరి మీదా ముందే తీర్పు చెప్ప నవసరం లేదు. కానీ ఒక ప్రశ్నను మాత్రం తప్పించుకోలేం. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యార్థికి వ్యవస్థ నిష్పాక్షిక విచార ణనూ, గౌరవాన్నీ, అవసరమైన సహాయాన్నీ ఇవ్వగలిగిందా?
చట్టాలే లేవా అని అడిగేవారికి సమాధానం.. ఉన్నాయి, కానీ అవి చాలటం లేదు. 14వ అధికరణం చట్టం ముందు సమానత్వాన్నీ, చట్టాల సమాన రక్షణనూ ఇస్తుంది. 15వ అధికరణం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధా రంగా వివక్షను నిషేధిస్తుంది. 17వ అధికరణం అంటరాని తనాన్ని రద్దు చేసింది. 46వ అధికరణం ఎస్సీ, ఎస్టీల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వంపై ఉంచింది. ర్యాగింగ్ నిరోధక నిబంధనలు, ఎస్సీ, ఎస్టీ అత్యా చార నిరోధక చట్టం, విశ్వవిద్యాలయ మంజూరు సంఘం నియమాలు అదనం. అయినా క్యాంపస్లో ఒక విద్యార్థికి ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఆరోపణలు ఎదుర్కొనే వారే విచారణ పరిధిలో ఉంటే నిష్పాక్షికత ఎక్కడ? ప్రతీకార చర్యల నుంచి ఎవరు రక్షిస్తారు? విచారణకు గడువు ఎక్కడ? అప్పీలు ఎక్కడ? హక్కు ఉండటం వేరు, అది చేతికి అందటం వేరు.
కొత్త చట్టం విలువ దాని వివరాల్లోనే ఉంది. వివక్ష అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాలి. అవకాశాల నిరాకరణ, ఉద్దేశపూర్వక ఒంటరితనం, ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారం వంటివి దీని పరిధిలోకి రావాలి. అదే సమయంలో హాజరు, పరిశోధన నాణ్యత, క్రమశిక్షణపై తీసుకునే న్యాయమైన నిర్ణయాలన్నింటికీ వివక్ష ముద్ర వేయకూడదు. స్వతంత్ర ఫిర్యాదుల వ్యవస్థ, సభ్యుల ఎంపికలో పారదర్శకత, ప్రయో జనాల సంఘర్షణ ప్రకటన అవసరం. ఫిర్యాదుదారులకూ సాక్షులకూ రక్షణ, గడువుతో కూడిన విచారణ, తాత్కాలిక రక్షణ చర్యలు ఉండాలి. స్వచ్ఛంద కౌన్సెలింగ్, సమాన అవ కాశాల కేంద్రాలు, వ్యక్తిగత వివరాలు బయటపెట్టని వార్షిక గణాంకాలు కూడా కావాలి.
ఫిర్యాదులు పెరిగితే వివక్ష పెరిగిందనుకోవడం పొరపాటు కావచ్చు, వ్యవస్థపై నమ్మకం పెరిగిందనీ అర్థం కావచ్చు. ఆరోపణ ఎదుర్కొనే వ్యక్తి హక్కు లనూ కాపాడాలి. ఫిర్యాదు చేయడమే నేరనిర్ధారణ కాదు. అలాగే ఆధారాలు సేకరించడం కష్టమని ఫిర్యాదును మొద ట్లోనే తిరస్కరించడమూ తగదు. నిజాయితీగా చేసినా నిరూ పించలేని ఫిర్యాదును దురుద్దేశపూర్వకమని ముద్ర వేయ కూడదు. పారదర్శక విచారణ, సాక్ష్యాల పరిశీలన, అప్పీలు అవకాశం మాత్రమే ఈ రెండు ఆందోళనలకూ సమాధానం.
ఇతర రాష్ట్రాల అనుభవం కూడా పాఠం చెబుతోంది. కర్ణాటకలో ఇదే పేరుతో జరిగిన చర్చ తెలంగాణకు ఉపయోగ పడుతుంది, కానీ అక్కడి నిబంధనలను యథాతథంగా తెచ్చుకోవడం పరిష్కారం కాదు. విశ్వవిద్యాలయ మంజూరు సంఘం తెచ్చిన ‘ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహ నిబంధనలు-2026’ను రాజ్యాంగపరమైన అభ్యంతరాల కారణంగా సుప్రీంకోర్టు 2026 జనవరి 29న తాత్కాలికంగా నిలిపివేసి, 2012 నిబంధనలే కొనసాగాలని ఆదేశించింది. వాటిని పునఃపరిశీలిస్తున్నట్లు కేంద్రం ఆగస్టులో కోర్టుకు తెలిపింది. లక్ష్యం ఎంత గొప్పదైనా, నిర్వచనాలు అస్పష్టంగా, అధికారాలు అపరిమితంగా ఉంటే చట్టం కోర్టుల్లో నిలవదని దీని సారాంశం. అలాగని దుర్వినియోగ భయంతో బాధితుల రక్షణను పక్కన పెట్టడమూ సరికాదు.
మూడు నెలల గడువు ఒక ఆరంభం మాత్రమే. విద్యా ర్థుల మాటకు ముసాయిదాలో చోటు దక్కుతుందా? స్వతంత్ర వ్యవస్థ నిజంగా ఏర్పడుతుందా? సిబ్బందికి, నిధు లకు కేటాయింపులు ఉంటాయా? ఈ ప్రశ్నలకు ఇచ్చే సమా ధానాలే బిల్లు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సమానత్వం అంటే అందరికీ ఒకే నియమం చెప్పడం కాదు, చారిత్రక అసమాన తల వల్ల కొందరు ఎదుర్కొనే అడ్డంకులను గుర్తించి న్యాయంగా తొలగించడం. ఆ విలువలు తరగతి గదిలో, వసతిగృహంలో, ప్రయోగశాలలో, పరిపాలనా భవనంలో కనిపించినప్పుడే రోహిత్ వేముల పేరుకు సార్థకత.
కాలగిరి శ్రీనివాస్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
9010128884

