Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Cancer day: మహిళల్లో అధిక శాతం గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌ వ్యాధులు

Cancer day: మహిళల్లో అధిక శాతం గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌ వ్యాధులు

04 ఫిబ్రవరి‌ ‘ప్రపంచ క్యాన్సర్‌ దినం”


శరీరంలోని ఏదైన ఒక అవయవ భాగంలోని కణజాలం అపరిమితంగా, నియంత్రణ లేకుండా పెరగడంతో పాటు ఇతర కణజాలాలకు వ్యాపించడం వల్ల గడ్డలు (ట్యూమర్స్‌) ఏర్పడే అనారోగ్య స్థితిని క్యాన్సర్‌ వ్యాధిగా పిలుస్తారు. అతి ప్రమాదకర ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధికి పూర్తి చికిత్స నేటికీ అందుబాటులో లేదు. క్యాన్సర్‌ రాకుండా నివారణ చర్యలు, తొలి దశలో గుర్తించుట వల్ల చికిత్సతో నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి క్యాన్సర్‌ వ్యాధి పట్ల కనీస అవగాహన, రాకుండా ఉండానికి తీసుకోవలసిన నివారణ చర్యలు, తొలి దశలో గుర్తించే పద్దతులు లాంటి మౌళిక అంశాలను వివరించే సదుద్దేశంతో ‘యూనియన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ క్యాన్సర్‌ కంట్రోల్’‌ వారి చొరవతో ప్రతియేటా 04 ఫిబ్రవరి‌ రోజున “ప్రపంచ కాన్సర్‌ దినం” పాటిస్తున్నాం. 2022 నుండి 2024 వరకు మూడు ఏండ్ల పాటు ‘క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌’ నినాదంతో క్యాన్సర్‌ పట్ల అవసర ప్రచారాన్ని కల్పించే ఏర్పాట్లు చేశారు. కరోనా వలె క్యాన్సర్‌ వ్యాధి కూడా ఒకే రకమైన శ్వాసకోశ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్థారణ పరీక్షలు, చికిత్స లాంటి అంశాలను కలిగి ఉంటాయి. 07 నవంబర్‌న ప్రతి ఏట భారత్‌లో ‘జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం’ పాటించుట (2014 నుంచి) ఆనవాయితీగా మారిందని మనకు తెలుసు.
క్యాన్సర్‌ రకాలు: క్యాన్సర్‌లలో 100కు పైగా రకాలు ఉన్నాయి. వీటిలో రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి, చర్మ, గర్భాశయ, పాంక్రియాస్‌, ప్రోస్టేట్‌, ఎముకలు‌ లాంటి అవయవాలకు క్యాన్సర్‌ వస్తుంది. క్యాన్సర్‌లలో కార్సినోమా (చర్మ, రొమ్ము, ప్యాంక్రియాస్‌, ఇతర గ్రంధులకు), సర్కోమా (రక్తనాళాలు, ఎముకలు, కార్టిలేజ్‌, కొవ్వు, కండరాలకు), మెలనోమా (చర్మ పిగ్మెంట్‌ కణాలు), లింఫోమా (లింఫోసైట్స్) మరియు ల్యుకేమియా (రక్తం) వర్గాలు ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లలో ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ అతి ప్రమాదకరమైందిగా గుర్తించబడింది. మన దేశంలో ప్రతి రోజు 1300 మంది క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులు మరణిస్తున్నారని తేలింది. ఇండియాలో పురుషులకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌, స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్‌లు ప్రాణాంతకంగా మారాయి. క్యాన్సర్‌ కట్టడికి సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే 2030 నాటి ప్రతి ఏట 5.4 మిలియన్ల ప్రజలు కాన్సర్‌ వ్యాధిగ్రస్తులు, 2.5 మిలియన్ల రోగులు మరణిస్తారని అంచనా వేస్తున్నారు.
భారత్‌లో క్యాన్సర్‌ విజృంభన: ప్రపంచవ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులతో 71 శాతం మరణాలు నమోదు అవుతున్నాయి. ఇండియాలో అసంక్రమిత వ్యాధులతో 63 శాతం మరణాలు జరుగుతుండగా, 9 శాతం మంది క్యాన్సర్‌ వ్యాధులతో చనిపోతున్నారు. 1975లో ప్రారంభించిన జాతీయ క్యాన్సర్‌ నియంత్రణ ప్రోగ్రామ్‌ (నేషనల్‌ క్యాన్సర్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌) ద్వారా క్యాన్సర్‌కు వైద్య సదుపాయాలను దేశవ్యాప్తంగా నెలకొల్పడం, 1984-85 నుంచి నివారణ చర్యలు, తొలి దశలో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హంగేరీ, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఐర్లాండ్‌, యూయస్‌ లాంటి దేశాలలో క్యాన్సర్ బారిన పడిన‌ వ్యాధిగ్రస్థుల శాతం ఎక్కువగా ఉంది. ప్రపంచ క్యాన్సర్‌ రోగుల్లో 8.17 శాతం వ్యాధిగ్రస్థులు ఇండియాలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. భారత్‌లో 2.25 మిలియన్ల క్యాన్సర్‌ రోగులు ఉండగా, ప్రతియేటా 1.1 మిలియన్ల క్యాన్సర్‌ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో దాదాపు 66 శాతం కేసులు క్యాన్సర్‌ ముదిరిన తరువాతనే బయట పడడంతో వ్యాధిగ్రస్తుల ప్రాణం కాపాడడం కష్టం అవుతున్నది. ఇండియాలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణించడం విచారకరం. భారతీయుల్లో ప్రతి పది మందిలో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని, చనిపోయిన ప్రతి 15 మందిలో ఒకరు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారని అంచనా‌. 2018లో దేశవ్యాప్తంగా 3.18 లక్షల మరణాలు పోగాకు ఉత్పత్తుల అలవాటు కారణ క్యాన్సర్‌తో జరిగాయని తేలింది. పురుషుల్లో 25 శాతం క్యాన్సర్‌ మరణాలు నోటి/ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో జరగడం, 25 శాతం క్యాన్సర్‌ మహిళా మరణాలు రొమ్ము/నోటి క్యాన్సర్‌తో జరుగుతున్నాయి. పొగాకు వాడకంతో 14 రకాల క్యాన్సర్‌లు రావడం గమనించారు. దీనికి తోడుగా ఆల్కహాల్‌ సేవనం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆహారలేమి, పోషకాహారలోపం, అసురక్షిత లైంగిక సంబంధాలు, గాలి కాలుష్యం లాంటి కారణాలతో క్యాన్సర్‌ వ్యాధి రావచ్చనే కనీస అవగాహన కలిగి ఉండాలి.
వ్యాధి లక్షణాలు, చికిత్స మార్గాలు:
క్యాన్సర్‌ వ్యాధికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించని కారణంగా రోగ నిర్థారణ చేయడం కష్టం అవుతున్నది. ఒక వేళ ముందుగా వ్యాధి నిర్థారణ జరిగితే, చాలా సందర్భాలలో వైద్యంతో నయం చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి‌ లక్షణాలుగా విరోచనాలు, దగ్గు, చర్మంపై మచ్చలు ఏర్పడడం, ఉమ్మితో రక్తం పడడం, రక్తహీనత, రొమ్ములో గడ్డలు, మూత్ర సంబంధ మార్పులు, మలంలో రక్తం పడడం, బీజాలలో గడ్డలు లాంటివి గుర్తించబడతాయి. ఇండియాలో రొమ్ము, గర్భాశయ, ఊపిరితిత్తులు, జీర్ణకోశ, పెద్ద ప్రేగు క్యాన్సర్‌లు మాత్రమే దాదాపు 50 శాతం కనిపిస్తాయి. క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో ఇమ్యునోథేరపీ, కీమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ, హార్మోన్‌ థెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, స్టెమ్‌ సెల్‌ మార్పిడి, శస్త్రచికిత్స, ప్రిసిషన్‌ మెడిసిన్‌ లాంటి విధానాలు వాడతారు. శరీర బరువు నియంత్రణ, మంచి పోషకాహార అలవాటు, శారీరక శ్రమ, టీకాలు వేయించుకోవడం, తీవ్రమైన ఎండ పడకుండా జాగ్రత్తలు, పొగాకు ఉత్పత్తులకు అలవాటుకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా చెకప్‌ చేయించుకోవడం, శరీరంలో గడ్డలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించడం వంటి సత్వర జాగ్రత్తలు తీసుకోవడం లాంటి జాగ్రత్తల వల్ల క్యాన్సర్‌ వ్యాధి నివారించబడుతుంది. ప్రాణాంతర క్యాన్సర్‌ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కలిగి, క్రమశిక్షణ గల జీవనశైలితో ఆరోగ్యకర సమాజ స్థాపనలో భాగస్వాములం అవుదాం. క్యాన్సర్‌ను సమాజం నుంచి తరిమి కొడదాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

- Advertisement -

9949700037

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News