Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Final phase of polling: నేడే చివరి విడత లోక్‌సభ ఎన్నికల సమరం

Final phase of polling: నేడే చివరి విడత లోక్‌సభ ఎన్నికల సమరం

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్

లోక్‌సభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. చివరి విడతలో భాగంగా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ కలిపి మొత్తం 57 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. వారణాసితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరో పన్నెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2022లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న తొలి లోక్ సభ ఎన్నికలు ఇవి. సిమ్లా, మండీ, కాంగ్డా, హమీర్ పూర్ మొత్తం నాలుగు స్థానాలకు జూన్ ఒకటో తేదీన ఎన్నికలున్నాయి. వీటితోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక నియోజకవర్గంలో కూడా ఎన్నిక జరుగుతుంది.

- Advertisement -

చివరి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 57 నియోజకవర్గాల్లో జూన్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని మరో 13 నియోజకవర్గాలకు జూన్ ఒకటో తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ జరగనున్న 13 నియోజకవర్గాల్లో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. వారణాసిలో నరేంద్ర మోడీ పోటీ చేయడంతో ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపైనా పడనుంది. నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్‌, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, శాంతి భద్రతలు ఈ 13 నియోజకవర్గాల్లో కీలకాంశాలుగా మారాయి. మొత్తం 13 నియోజకవర్గాలకు కలిపి 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారణాసి…ప్రపంచవ్యాప్తంగా హిందువులకు పవిత్ర స్థలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ విశ్వేశ్వరుడిని సందర్శించుకోవడానికి వారణాసికి వస్తుంటారు. వారణాసి నుంచి 2014లో తొలిసారి నరేంద్ర మోడీ పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత ఐదేళ్లకు వచ్చిన 2019లోనూ నరేంద్ర మోడీ మరోసారి గెలిచారు. వారణాసి నుంచి నరేంద్ర మోడీ పోటీ చేయడం ఇది మూడోసారి.
కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున అజయ్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు మరో ఐదుగురు అభ్యర్థులు వారణాసి బరిలో ఉన్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు నరేంద్ర మోడీకి కనీసం గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారణాసిలో ప్రతిపక్షాలు లేవు. దీంతో ప్రస్తుతం నరేంద్రుడికి ఎంత మెజారిటీ వస్తుందనే అంశంపైనే చర్చ నడుస్తోంది.
మహరాజ్‌గంజ్‌….ఇది ఉత్తరప్రదేశ్‌లోని మరో నియోజకవర్గం. మహరాజ్‌గంజ్‌ బాగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి దొరక్క యువకులు ఉద్యోగాలు వెతుక్కుంటూ మెట్రో నగరాలకు వలస వెళ్తున్నారు. మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గంలో రాజ్‌పుత్‌, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాన్ని ఈ రెండు సామాజికవర్గాలే నిర్దేశించనున్నాయి. 2014,2019 ఎన్నికల్లో మహరాజ్‌గంజ్‌ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు తమదే అంటున్నారు కమలనాథులు. బీజేపీ టికెట్‌పై పంకజ్ చౌధరి, కాంగ్రెస్ తరఫున వీరేంద్ర చౌధరి పోటీ పడుతున్నారు. మహరాజ్‌గంజ్‌ సెగ్మెంట్‌లో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గోరఖ్‌పూర్‌ …రాప్తీ, రోహనీ నదులు తీరంలో ఉన్న నియోజకవర్గం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వంతం ప్రాంతం గోరఖ్‌పూర్‌. మౌలికంగా గోరఖ్‌పూర్‌ ఆధ్యాత్మిక ప్రాంతం. భారతీయ జనతా పార్టీకి బాగా పట్టున్న ప్రాంతం ఇది. గోరఖ్‌పూర్‌ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదుసార్లు ఎన్నికయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో గోరఖ్‌పూర్ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ మరోసారి గోరఖ్‌పూర్‌ సెగ్మెంట్‌ నుంచి పోటీలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కాజల్ నిషాద్‌ రంగంలో ఉన్నారు. గోరఖ్‌పూర్‌ సెగ్మెంట్లో నిషాద్ సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువ. దీంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు కాజల్ నిషాద్‌.దేవరియా…ఇది మరో నియోజకవర్గం. దేవరియా అంటే అనేక ఆలయాలున్న ప్రాంతం అని అర్థం. 2014, 2019 ఎన్నికల్లో దేవరియా నుంచి బీజేపీ విజయం సాధించింది. దేవరియా సెగ్మెంట్‌లో హ్యాట్రిక్ సాధిస్తామంటున్నారు కమలనాథులు. ఈసారి బీజేపీ తరఫున శశాంక్ మణి త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి అఖిలేశ్ సింగ్ పోటీలో ఉన్నారు. శశాంక్ కుటుంబానికి రాజకీయ నేపథ్యముంది. అయితే అఖిలేశ్ సింగ్‌కు క్షేత్రస్థాయిలో గట్టి పట్టుంది. దీంతో దేవరియాలో పోటీ రసవత్తరంగా మారింది. గంగా, సరయూ నదుల తీరాన ఉన్న నియోజకవర్గం బలియా. మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఈ ప్రాంతం వారే. బలియాలో బ్రాహ్మణులు, యాదవులు, రాజ్‌పుత్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2014,2019 ఎన్నికల్లో బలియా నుంచి కమలం పార్టీ విజయం సాధించింది. ఈసారి మాజీ ప్రధాని చంద్రశేఖర్ తనయుడు నీరజ్ శేఖర్ బీజేపీ టికెట్‌పై పోటీలో ఉన్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున సనాతన్ పాండే బరిలో నిలిచారు. బ్రాహ్మణ ఓటర్లపై సమాజ్‌వాదీ పార్టీ ఆధారపడుతోంది. కాగా అయోధ్య అంశంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోనే సారవంతమైన భూములున్న నియోజకవర్గం చందౌలీ. ఈ సెగ్మెంట్‌ లో దాదాపు ఐదు లక్షలమంది దళితులున్నారు. అలాగే రాజ్‌భర్లు, యాదవులు, నిషాద్‌లు , కుర్మీలు, కుశ్వాహా లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2014 అలాగే 2019 ఎన్నికల్లో చందౌలీ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత మహేంద్ర నాథ్ పాండే విజయం సాధించారు. ఈసారి కూడా మహేంద్ర నాథ్‌యే బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీరేంద్ర సింగ్ పోటీలో ఉన్నారు. గంగాఘాట్లు పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గం మీర్జాపూర్. రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ సింగ్ వంటి రాజకీయ దిగ్గజాలు గతంలో మీర్జాపూర్ నుంచే విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అప్నాదళ్ సోనే లాల్ వర్గం నేత, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ విజయం సాధించారు. మూడోసారి కూడా అనుప్రియ పటేలే పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సెగ్మెంట్‌లో సమాజ్‌వాదీ పార్టీ కి చెందిన రమేశ్ చంద్ బింద్ పోటీలో ఉన్నారు. అయితే హ్యాట్రిక్‌పై అనుప్రియ పటేల్ ధీమాగా ఉన్నారు.

పంజాబ్‌లో 13 సెగ్మెంట్లకు పోలింగ్
పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటికి చివరి విడతలో భాగంగా జూన్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదల్ కీలక పార్టీలుగా ఉన్నాయి. అయితే పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య నే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే కావడం విశేషం. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.అమృత్‌సర్ …పంజాబ్‌లోని ఒక కీలక నియోజకవర్గం. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం ఉన్న ప్రాంతమే అమృత్‌సర్. వాస్తవానికి అమృత్‌సర్‌ను కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గంగా చెబుతారు. 2014,2019 లలో అమృత్‌సర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గుర్జీత్ ఔజాలా పోటీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ధలీవాల్ బరిలో ఉన్నారు. కాగా బీజేపీ తరఫున తరణ్‌జిత్ సింగ్ సంథూ బరిలో ఉన్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌….ఇది మరో కీలక నియోజకవర్గం. సిక్కుల పవిత్ర నగరాల్లో ఇదొకటి. ఆనంద్‌పూర్ సాహిబ్‌ నగరం శివాలిక్ పర్వత ప్రాంత సమీపాన ఉంటుంది. ఇక్కడ్నుంచి 2014లో అకాలీదళ్ గెలిచింది. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి అకాలీదళ్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాగా అకాలీదళ్ తరఫున ప్రేమ్‌ సింగ్, కాంగ్రెస్ తరఫున విజయ్ ఇందర్ సింగ్లా పోటీలో ఉన్నారు. బఠిండా….అకాలీదళ్‌ కు ఈ నియోజకవర్గం కంచుకోట. బఠిండాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. అలాగే సైనిక కంటోన్మెంట్ కూడా ఉంది. 2014, 2019 లలో బఠిండా నియోజకవర్గం నుంచి అకాలీదళ్ విజయం సాధించింది. అకాలీదళ్ తరఫున హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఈసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్దు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై గుర్మిత్ సింగ్ బరిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఫరీద్‌కోట్‌. ఒకప్పుడు ఫరీద్‌కోట్‌ సెగ్మెంట్ అకాలీదళ్‌కు కంచుకోట. అయితే కాలక్రమంలో ఇక్కడ అకాలీదళ్‌ పట్టు కోల్పోయింది. 2019లో ఫరీద్‌కోట్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఫరీద్‌కోట్‌ నుంచి ఈసారి ఇద్దరు కళాకారులు పోటీ పడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై నటుడు, గాయకుడు కరంజీత్ అన్మోల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ లో ఉన్నారు.కాగా ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. వాఘా సరిహద్దు ఇక్కడే ఉంది. ఈ నియోజకవర్గంలో మొదట్నుంచి అకాలీదళ్‌కు మంచి పట్టుంది. 2014,2019 లో ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం నుంచి అకాలీదళ్ విజయం సాధించింది. ఈసారి అకాలీదళ్‌ తరఫున నర్దేవ్ సింగ్ బాబీ పోటీలో ఉన్నారు.
హోషియార్‌పూర్ …..మహాభారత కాలానికి సంబంధించిన నగరమని ప్రతీతి. ఈ ప్రాంతాన్ని పాండవుల వారసులు పాలించారని చెబుతారు. 2014 నుంచి ఇక్కడ బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది. 2019 లో హోషియార్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు. బీజేపీ టికెట్‌పై అనితా సోం ప్రకాశ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై యామినీ గోమర్ పోటీలో ఉన్నారు. మొత్తంమీద హోషియార్‌పూర్లో బీజేపీ దూకుడు మీద ఉంది. సంగ్రూర్ నియోజకవర్గాన్ని ఆయుధాల మ్యూజియంగా చెబుతారు. జింద్ రాజుల కాలం నాటి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఉన్న మ్యూజియం…సంగ్రూర్ నియోజకవర్గ ప్రత్యేకత. 2014 అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయం సాధించారు. దీంతో ఈసారి ఇక్కడ ఆప్‌ను గెలిపించే బాధ్యత భగవంత్ మాన్‌పై పడింది. కాగా కాంగ్రెస్ నుంచి సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, బీజేపీ టికెట్‌పై అరవింద్ ఖన్నా, అకాలీదళ్ అభ్యర్థిగా ఇక్బాల్ సింగ్ పోటీలో ఉన్నారు.
ఫతేగఢ్ సాహిబ్‌ను గురుద్వారాలకు నిలయంగా చెప్పుకోవచ్చు. ఫతేగఢ్ సాహిబ్‌ ను హస్తం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. 2019లో ఫతేగఢ్ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ తరఫున అమర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై గురుప్రీత్‌ సింగ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. జలంధర్‌….దేశవ్యాప్తంగా పేరున్న నియోజకవర్గం. క్రీడా సామగ్రి తయారీకి జలంధర్ ఫేమస్. పురాణాల్లోని జలంధరుడి పేరుతో ఈ నియోజకవర్గం ఏర్పాటైందని చెబుతారు. 2014 అలాగే 2019 ల్లో జలంధర్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జలంధర్‌ నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉంది కాంగ్రెస్‌. కాగా హస్తం పార్టీ తరఫున చరణ్‌ జిత్ సింగ్ చన్నీ, ఆప్ అభ్యర్థిగా పవన్ కుమార్ బరిలో ఉన్నారు.
ఖదూర్ సాహిబ్ నియోజకవర్గానికి సిక్కు సామాజికవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎనిమిది మంది సిక్కు గురువులు సందర్శించిన స్థలంగా ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖదూర్ సాహిబ్ ను పవిత్ర స్థలంగా భావిస్తారు సిక్కు మతస్తులు. ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌ నుంచి 2014లో అకాలీదళ్ గెలిచింది. కాగా 2019 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి కుల్బీర్ సింగ్ జీరా, ఆప్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లార్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న సిక్కు మత గురువు అమృత్‌పాల్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. దీంతో ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది.లూథియానా నియోజకవర్గం….పారిశ్రామిక హబ్‌గా మారింది. గ్రామీణ పంజాబీ సంస్కృతికి కేంద్రస్థానం లూథియానా సెగ్మెంట్. కాగా లూథియానా నియోజకవర్గం నుంచి 2014 లో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే 2019 లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఈసారి కాంగ్రెస్ నుంచి అమరీందర్ సింగ్ రజా వారింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశోక్ ప్రసాద్ పప్పీ బరిలో ఉన్నారు.
పటియాలా…పంజాబ్‌లోని మరో కీలక నియోజకవర్గం ఇది. విభిన్న జీవనశైలికి పెట్టింది పేరు పటియాలా. రాజ్‌పుత్‌, మొఘల్, పంజాబీ సంస్కృతులు పటియాలా ప్రాంతంలో కనిపిస్తాయి. పటియాలా నుంచి 2014 లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాగా 2019 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి ఆప్‌, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బల్బీర్ సింగ్ పోటీలో ఉండగా కాంగ్రెస్ టికెట్‌పై ధరంవీర గాంధీ బరిలో నిలిచారు. గతంలో అకాలీదళ్‌, బీజేపీ కలిసి పోటి చేసినప్పుడు ఆ కూటమికి భారీ విజయాలు నమోదయ్యాయి. అయితే వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల మహోద్యమం నేపథ్యంలో బీజేపీతో అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. దీంతో ఈ రెండు పార్టీలు ప్రస్తుతం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా కొన్ని చోట్ల బరిలో ఉంది. అయితే ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడానికే బీఎస్పీ పరిమితం అయ్యేలా ఉంది. కాగా పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పనితీరుకు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు పరీక్షగా మారాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

చండీగఢ్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ !
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో జూన్‌ ఒకటిన ఎన్నికలు జరగబోతున్నాయి. చండీగఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ టికెట్‌పై సీనియర్ నేత మనీశ్ తివారీ పోటీలో ఉన్నారు. కాగా భారతీయ జనతా పార్టీ తరఫున సంజయ్‌ టాండన్‌ బరిలో ఉన్నారు. చండీగఢ్‌ నియోజకవర్గానికి మనీశ్‌ తివారీ బయటివ్యక్తి అంటూ కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతల ప్రచారాన్ని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ తిప్పికొడుతున్నారు. స్థానిక సమస్యలు సహా ఏ అంశంపైన అయినా కమలం పార్టీ నేతలతో చర్చకు తాను సిద్దమేనని సవాల్ విసిరారు మనీశ్ తివారీ. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలతో చండీగఢ్‌ ఎన్నికల సమరం వేడెక్కింది.

                                    - ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News