Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Decoding Modi is tough: అంతబట్టని మోదీ రాజకీయం!

Decoding Modi is tough: అంతబట్టని మోదీ రాజకీయం!

ఎన్నికల నినాదంగా "మోదీ హైతో ముంకిన్ హై"

పార్లమెంటు చివరి సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఏ విధంగా చూసినా ఎన్నికల ప్రచారమేననడంలో సందేహం లేదు. అయితే, ఆయన మాటల్లోని, ఆయన విమర్శల్లోని, ఆయన విజన్ లోని ఆంతర్యం మాత్రం ఎవరికీ కొరుకుడు పడడం లేదు. మూడవ పర్యాయం తాము అధికారం చేపట్టిన తర్వాత వెయ్యేళ్ల భారతావనికి అతి బలమైన పునాదులు పడతాయంటూ పార్లమెంట్ చివరి సమావేశాల్లో నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జనవరి 22వ తేదీ జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠను కేవలం ఒక సంఘటనగా తీసుకోకూడదని, అది సరికొత్త కాల చక్రానికి నాంది పలకబోతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి సరికొత్త, ఆధునిక భారతదేశానికి పునాదులు పడడం ప్రారంభం అవుతుందంటూ ఆయన పార్లమెంటు సాక్షిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఇది భారత్ సమయం. భారతదేశం ముందుకు సాగబోతోంది. దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రగతి ఇక రూపుదిద్దుకోబోతోంంది’’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

మోదీ మొదటి నుంచి ఒక అంతుబట్టని వ్యక్తిగా, ఒక ప్రత్యేక వ్యక్తిగానే కొనసాగుతున్నారు. ఆయనను ప్రతిపక్షాలే కాదు, ఇటు సొంత పార్టీవారే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు ఏ ప్రకటన చేసినా దానిని అనేక విధాలుగా అర్థం చేసుకోవడం, అనేక విధాలైన భాష్యాలు చెప్పడం ఆనవాయితీగా జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ధోరణి మరింతగా విజృంభిస్తోంది. మోదీని ఏ గాటన కట్టాలన్నది అటు ప్రతిపక్షాలకే కాదు, ఇటు పాలక పక్షానికి కూడా అంతు చిక్కడం లేదు. ఆయన వచ్చే అయిదేళ్ల కోసం వాగ్దానాలు చేయడం లేదు. ఏకంగా వెయ్యేళ్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తాను మూడవ పర్యాయం అధికారంలోకి రాబోతున్నానని, ఇక భారతదేశాన్ని కొత్త పుంతులు తొక్కించడం ప్రారంభం అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఈసారి తాను చేపట్టబోయే విధానాలు అనేక వేల సంవత్సరాల పాటు చరిత్రలో సుస్థిరంగా ఉండిపోతాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘‘శ్రీరాముడు తన స్వస్థలానికి వచ్చేశాడు. ఆయన రాకతో భారతదేశ చరిత్రను పునర్లిఖించడం ప్రారంభం అయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ సవరణలు
రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన దాదాపు ఇటువంటి ప్రసంగమే చేశారు. ఆయన ప్రతిసారీ రాముడిని, భారతీయ సంస్కృతినీ తలచుకోవడం వెనుక హిందుత్వ భావనను బలోపేతం చేస్తున్న సూచనలే కనిపిస్తున్నాయి. ఆయన వాగ్దానం చేసిన వీక్షిత్ భారత్ కళ్లకు కడుతోంది. ఈ వెయ్యేళ్ల వ్యవహారమేమిటి? ఆయన మనసులో ఏముందో ప్రజలకు, ప్రతిపక్షాలకు అంతుబట్టని విషయం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఓ అంతుబట్టని మనిషే. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఆయన చేపట్టే నినాదాలు కూడా అదే విధంగా ఉంటాయి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’, ‘ఓకల్ ఫర్ లోకల్’ వంటివి ఇందులో కొన్ని. ఆధునిక భారతదేశం గురించి ఆయన కలలు కనడం చాలా కాలం క్రితమే ప్రారంభం అయింది. నిజంగా ఆయన ఊహించినట్టు ఆయన పార్టీకి 340కి పైగా లోక్ సభ స్థానాలు దక్కే పక్షంలో దేశానికి సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పునరుజ్జీవనం కల్పించడానికి ఆయన ఏ అవకాశాన్నీ జారవిడుచుకునేలా లేరు.

మోదీ గనుక పార్లమెంటు ఉభయ సభల్లో రెండింట మూడు వంతుల మెజారిటీని సాధించగలిగితే, రాజ్యాంగంలో మార్పులు, చేర్పులు చేయడం ఖాయం. ఇందులో సందేహమేమీ లేదు. రాజ్యాంగం మీదున్న నెహ్రూ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం పోయి, మోదీ ప్రభావం పడుతుందనడంలో కూడా ఎటువంటి సందేహమూ లేదు. రాజ్యాంగ ఉపోద్ఘాత పీఠికను తిరగ రాయడం జరుగుతుంది. రాష్ట్రాల మీద కేంద్రానికి మరిన్ని అధికారాలు ఉండే విధంగా రాజ్యాంగంలో సవరణలు తీసుకు రావడం కూడా జరుగుతుంది. కొత్త పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో పార్లమెంటు సభ్యులకు అందజేసిన రాజ్యాంగ ప్రతులను బట్టి ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజున ప్రభుత్వం అందజేసిన ప్రతులలో ఉపోద్ఘాత పీఠికలో సామ్యవాదం, లౌకికవాదం అనే మాటలు లేకపోవడం గమనార్హం. ఈ రెండు మాటలను ఇందిరా గాంధీ అత్యవసర సమయంలో పీఠికలో కలపడం జరిగింది. ఈ రెండు మాటలు రాజ్యాంగ ప్రతుల్లో లేకపోవడంపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా మోదీ పట్టించుకోలేదు. మోదీ ఉద్దేశంలోనే కాదు, కోట్లాది మంది భారతీయులు ఉద్దేశంలో లౌకికవాదం అనే మాట అర్థ రహితమైన మాట. దీని అవసరమూ లేదు, అగత్యమూ లేదని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఈ రెండు మాటలను తొలగించి జాతీయవాద భారత్ కు మోదీ కొత్త అర్థం చెప్పే అవకాశం ఉంది. రాజ్యాంగంలో ఇక ఇండియా అనే మాటను తొలగించి, భారత్ అనే మాటనే చేర్చే అవకాశం ఉంది.

సాంస్కృతిక వారసత్వం
పురాతన భారతీయ కట్టడాలు, ఆలయాలు, వారసత్వ సంపద విషయంలో మోదీ పట్టుదలను గమనించినవారు ఆయన చేపట్టబోయే కార్యక్రమాల గురించి తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యాసంస్థలో కూడా విద్యార్థులకు మొగలుల ముందునాటి చరిత్ర గురించి, మొగలులకు సంబంధించిన వాస్తవాల గురించి చరిత్ర పుస్తకాలు వక్రీకరించి చెప్పడం జరుగుతోంది. అనేక దేవాలయాలను, కట్టడాలను కూల్చేసిన మొగలులను ఘనంగా కీర్తిస్తూ పాఠాలు చెప్పడం అనేది బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకం. ప్రధానమంత్రి అయిన తర్వాత దక్షిణాదిలో రామాలయాలనే కాక, ఇతర ఆలయాలను దర్శించిన మోదీకి వీటికి సరైన ఆదరణ లేదనే విషయం అర్థమైంది. ఆయన ఈసారి హిందూ ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వాల అధీనం నుంచి తొలగించి అయోధ్య రామాలయం మాదిరిగానే ప్రైవేట్ ట్రస్టులకు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ట్రస్టులు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండడం జరుగుతుంది. హిందూ చారిత్రక కట్టడాల స్థానంలో ఇస్లామిక్ కట్టడాలను పునరుద్ధరించడానికి కొన్ని ఎన్.జి.ఒలకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి నిధులు సమకూరుతుండడాన్నికూడా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

ఇండియా స్థానంలో భారత్ అనే పేరును ప్రవేశపెట్టినట్టుగానే, దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాల పేర్లను మార్చే అవకాశం కూడా ఉంది. వీటికి ప్రస్తుతం ఉన్న ఇస్లామిక్ రాజుల పేర్లు, బ్రిటిష్ పాలకుల పేర్ల స్థానంలో భారతీయ పేర్లను పెట్టడం ఖాయంగా జరుగుతుంది. నిజానికి ఈ పేర్లను మార్చాలంటూ ఒక బీజేపీ నాయకుడు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఉత్తరప్రదేశ్ తో సహా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పేర్ల మార్పు వ్యవహారం చురుకుగా కొనసాగుతోంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి దేశంలో చొరబడుతున్న వ్యక్తులకు కూడా పౌరసత్వ హక్కులు కల్పించడంపై బీజేపీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వ్యవహారాల నిరోధానికి బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి బీజేపీ హయాంలో ఉమ్మడి పౌరస్మృతి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. ఓటర్ల జాబితాలో విదేశీయులకు అవకాశం లేకుండా చేస్తూ, పౌరసత్వ సవరణ చట్టాలు, నేషనల్ రిజిస్టర్ చట్టాలు అమలులోకి రావడం జరుగుతుంది.

అంతేకాక, ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే సూత్రం కింద జమిలి ఎన్నికలు జరపడానికి కూడా ఏర్పాట్లు జరగవచ్చు. కేంద్రానికి అధికారాలను పెంచడం, రాష్ట్రాల్లో గవర్నర్లకు అధికారాలు పెంచడం వంటివి కూడా జరిగే సూచనలున్నాయి. భవిష్యత్తులో అన్ని మతాల వారికీ, అన్ని వర్గాల వారికీ సమాన హక్కులు ఉండడమే తప్ప కొన్ని మతాలకు ప్రత్యేక హక్కులు ఉండే అవకాశం లేదు. శతాబ్దాల నాటి మొగలుల చిహ్నాలు, బ్రిటిష్ పాలకుల చిహ్నాలు ఇక చెరిగిపోవడం ఖాయమని చెప్పవచ్చు. “మోదీ హైతో ముంకిన్ హై” అనే నినాదం ఆయన ఎన్నికల నినాదం కాబోతోంది. హైటెక్, ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థలకు భారతీయతను జోడించే సమయం ఎంతో దూరంలో లేదు. ఆయన విజన్ తో పోలిస్తే కాంగ్రెస్ విజన్ ఎక్కడ ఉందో, ఏ స్థాయిలో ఉందో ఎక్కడా అంతుబట్టడం లేదు.

– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News