Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Jammu-Kashmir Assembly elections: నాలుగు రోడ్ల కూడలిలో జమ్మూ కాశ్మీర్‌

Jammu-Kashmir Assembly elections: నాలుగు రోడ్ల కూడలిలో జమ్మూ కాశ్మీర్‌

అంతు చిక్కని కశ్మీరీల మూడ్..

దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ, కాశ్మీర్‌ ఎన్నికల మీదే దేశ ప్రజలం దరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగే మొదటి ఎన్నికలు కావడంతో ప్రజలు, పార్టీల్లో ఉత్సుకత కాస్తంత ఎక్కువగానే ఉండడం సహజం. గత అయిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఉగ్రవాదులను, చొరబాటుదార్లను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వగైరాలన్నీ ఇప్పుడు ఎన్నికల రూపంలో పరీక్షకు గురికాబోతున్నాయి. దేశంలో ఎప్పుడు ఎక్కడా ఎన్నికలు జరిగినా విభిన్నంగానే ఉంటాయి. భావోద్వేగపరమైన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, చివరికి అభివృద్ధి విధానాలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేవు. ప్రజలు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నపక్షంలో అసమర్థ పార్టీలు, అవినీతి పార్టీలు కూడా తేలికగా అందలాలు ఎక్కుతాయి. ప్రజలు ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నారంటూ అత్యంత సమర్థవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వాలు సైతం కుప్పకూలిపోతాయి. ఇతర రాష్ట్రాల పరిస్థితే ఈ విధంగా ఉన్నప్పుడు ఇక జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల పరిస్థితి గురించి చెప్పేదేముంది? ఇక్కడ ప్రజల మూడ్‌ ఏమిటో మాత్రం అర్థం కావడం లేదు.
నిజానికి, గత అయిదేళ్ల కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా ఇక్కడి పరిస్థితుల్లో సమూలమైన మార్పులు జరిగాయి. ఈ భూతల స్వర్గంలో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడమన్నది ఒక చరిత్రా త్మక పరిణామం అనడంలో సందేహం లేదు. ఇక్కడి పరిస్థితులను చక్కబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తన సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశలవారీగా జమ్మూ కాశ్మీర్‌ పరిస్థితులను మారుస్తూ వస్తోంది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాజకీయ, సామాజిక పరిస్థితులను చాలావరకు చక్కబెట్టింది. ఇప్పుడు అక్కడ ఎన్నికలు నిర్వహించేవరకూ వచ్చింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌ కు మున్ముందు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ ప్రాంతం మిగిలిన దేశంతో పూర్తిగా కలిసిపోయేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
అభివృద్ధికి ఓటు వేస్తారా?
ఇక్కడ ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా అయిదు అంశాల మీద దృష్టి పెట్టింది. స్థానిక ప్రభుత్వంతో కలిసి ఇక్కడ ఉగ్రవాదాన్ని, చొరబాట్లను నిరోధించడం, బడుగు వర్గాలను ఉద్ధరించడం, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను, ప్రాథమిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటి మీద అహర్నిశలూ కృషి చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో ఉగ్రవాదాన్ని, సాయుధ పోరాటాల్ని చాలా వరకు నిరోధించ గలిగింది. ప్రతి రోజూ బిక్కు బిక్కుమంటూ బతికే స్థానిక పౌరుల్లో ఆ భయాందోళనలను దాదాపు పూర్తిగా తొలగించగలిగింది. గత ఏడాది జనవరి నాటికి సైనికులు, భద్రతా దళాలు కలిసి 750 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. స్థానిక యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరడాన్ని చాలా వరకు తగ్గించింది. స్థానికుల మీద ఉగ్రవాదులు దాడులు జరపడం కూడా దాదాపు పూర్తిగా తగ్గిపోయింది.
ప్రజల ఇళ్ల మీద, అధికారుల మీద రాళ్లు విసరడం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో భద్రత, సుస్థిరతలు పెరగడంతో స్థానికుల్లో కొత్త ఆశలు, ఆశయాలు చోటు చేసుకోవడం ప్రారంభం అయింది. గతంలో మౌలిక హక్కులు, అధికారాలు, సౌకర్యాలు కూడా లేని శరణార్థు లకు, వాల్మీకి కులానికి చెందిన వారికి ప్రభుత్వం అనేక విధాలుగా చేయూతనందిస్తోంది. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌ నుంచి వచ్చేసిన సుమారు 20 వేల హిందూ, సిక్కు కుటుంబాలకు పౌరసత్వంతో పాటు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు, ఓటింగ్‌ హక్కులను కల్పించింది. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంత ప్రజలకు దేశంలో మరెక్కడా లేని విధంగా 17 అతి పెద్ద సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోంది. ఇందులో ఆయుష్మాన్‌, జల జీవన్‌ మిషన్‌ వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వీటిని అర్హులకు చేర్చడానికి రోజుకు 18 గంటలు పని చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రతిపక్షాల పాత్ర ఏమిటి?
ఆర్థిక వ్యవస్థను, ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం భారీ మొత్తాల్లో నిధు లను ఖర్చు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన చీనాబ్‌ వంతెనను రికార్డు సమయంలో నిర్మించింది. జమ్మూ రింగ్‌ రోడ్‌ జోజిల్లా టనెల్‌ వంటివి రవాణా సౌకర్యాలను పెంచాయి. సాగల్దాన్‌, బారాముల్లాల మధ్య ఒక భయంకరమైన లోయ మీదుగా రైల్వే వంతెనను నిర్మించడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం న్యూ సెంట్రల్‌ కారిడార్‌ స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వం 28 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నప్పటి నుంచి ఇక్కడికి ప్రైవేట్‌ పెట్టుబడులు దాదాపు వరదలై పారుతున్నాయి. స్థానిక విద్యాధిక యువతీ యువకులకు ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. గత ఏడాది చివరి వరకూ ఈ ప్రాంతానికి సుమారు 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అందాయి. యువతలో నైపుణ్యాలు పెంచడానికి కూడా ప్రభుత్వం యూత్‌ మిషన్‌ పేరుతో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించింది. ఇక్కడి జనాభాలో 69 శాతం మంది యువతీ యువకులే అయినందు వల్ల ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ ప్రాంతానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న పర్యాటక రంగాన్ని ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది కూడా పర్యాటకుల సంఖ్య మూడు కోట్లు దాటడంతో పాటు, పర్యాటక ఆదాయం కూడా సుమారు 120 కోట్ల రూపాయలు దాటింది. గుల్మార్గ్‌, పత్రితోప్‌, శ్రీనగర్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో అనేక కొత్త హోటళ్లు వెలిశాయి. వాటితో పాటు పర్యాటకుల కోసం అనేక సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఈ ప్రాంతంలోని సినిమా థియేటర్లన్నీ తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇక్కడ మళ్లీ ఫిలిం షూటింగులు కూడా అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. అనేక చరిత్రాత్మక కట్టడాలను పునరుద్ధరించడంతో పాటు, హిందూ దేవాలయాల పునరుద్దరణ కూడా ప్రారంభమైంది. కుప్వారాలో శారదా దేవి ఆలయం, జమ్మూలో రఘునాథ ఆలయం, శ్రీనగర్‌ లో శీతల్నాథ్‌ దేవాలయం, అనంతనాగ్‌లో భగవతీ ఆలయం దేశవ్యాప్తంగానే కాక, అంతర్జాతీయంగా కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
ఎన్నికల ప్రచారంలో సరికొత్త అంశాలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటివి కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతం కొత్త ఆశలు, ఆశయాలతో కొత్త పుంతలు తొక్కబోతోంది. అందరికీ అభివృద్ది, సమానావకాశాలు, సంక్షేమ పథకాలు, రక్షణ, భద్రత, ప్రశాంతత వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతలు, ప్రశాంత పరిస్థితులను రుచి చూసిన స్థానిక ప్రజల్లో ఇక ఆశలు పెరుగుతున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దుతో ఉగ్రవాదం, దాడులు, భయాందోళనలు కూడా చాలావరకు వైదొలగిపోయినట్టు ప్రజల్లో ఇప్పటికే నమ్మకం ఏర్పడింది.

  • ఎం. కామేశ్వర రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News